• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?

అవకాశాలు, ప్రత్యేకతలూ
 



పదో తరగతి తర్వాత భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవ డానికి ఇంటర్మీడియట్‌ కోర్సులు వారధిగా నిలుస్తాయి. మెడిసిన్, ఇంజినీరింగ్, టీచింగ్, లా, ఫార్మా, మేనేజ్‌మెంట్‌... ఇలా ఏ వృత్తిలోకి వెళ్లాలన్నా కూడలి లాంటిది ఇంటర్‌. భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నారో నిర్ణయం తీసుకుని, అందుకుతగ్గ గ్రూపును ఎంచుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 


     10 తర్వాత   

దేశవ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులు పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్‌ లేదా ప్లస్‌ వన్‌లోనే చేరుతున్నారు. భవిష్యత్తులో ఏ దిశగా అడుగులేయాలన్నా ఇంటర్మీడియట్‌ కీలకం కావడమే ఇందుకు కారణం. జాతీయ స్థాయిలో నిర్వహించే ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్‌; రాష్ట్ర స్థాయిలోని ఎంసెట్, డైట్‌సెట్, లాసెట్‌ వీటన్నింటికీ ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియట్‌ తప్పనిసరి. తెలుగు రాష్ట్రాల్లో 80కి పైగా గ్రూపు కాంబినేషన్లతో ఇంటర్‌ ఉన్నప్పటికీ, ఎక్కువమంది.. మ్యాథ్స్, ఫిజిక్స్‌; బోటనీ, జువాలజీ; హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్‌.. వీటినే ఎంచుకుంటున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ పాపులర్‌ కోర్సులు బోధిస్తున్నారు. పరిమిత సంస్థల్లో.. లాజిక్, మ్యూజిక్, సైకాలజీ, సోషియాలజీ.. సబ్జెక్టులూ అందిస్తున్నారు.


ఇంటర్మీడియట్‌లో విద్యార్థి చేరిన గ్రూపు ప్రకారం 3 లేదా 4 సబ్జెక్టులు ఉంటాయి. వీటితోపాటు ఆంగ్లం ఓ పేపర్‌. ద్వితీయ భాషగా తెలుగు/ హిందీ/ ఉర్దూ/ సంస్కృతం ఎంచుకోవాలి. గ్రూపుల వారీ ఉన్న అవకాశాలు, ప్రత్యేకతలు తెలుసుకుంటే ఎందులో చేరాలో నిర్ణయం తీసుకోవడం తేలికవుతుంది. 



       అవకాశాలూ.. ప్రత్యేకతలూ    


ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)


భవిష్యత్తులో బీఈ/ బీటెక్, బీఆర్క్‌ కోర్సులు చదవాలనుకునేవారు ఎంపీసీలో చేరడం తప్పనిసరి. పైలట్‌గా రూపొందడానికీ మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరి. ఫ్యాషన్‌ టెక్నాలజీ దిశగా అడుగులేయడానికీ గణిత నేపథ్యం ఉండాల్సిందే. ఎంపీసీ గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు బీఎస్సీలో.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల కాంబినేషన్‌ ఎంచుకోవచ్చు లేదా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్, జియాలజీ...ఇలా కొత్త సబ్జెక్టులూ తీసుకోవచ్చు. బీసీఏ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్, బీఎస్‌-ఎంఎస్, డీఎడ్, లా, డిజైన్, బీ ఫార్మసీ.. ఇలా ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఎంపీసీ విద్యార్హతతోనే కొన్ని ఉద్యోగాలూ ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో పలు మేటి ఉద్యోగాలకు ఇంటర్‌ ఎంపీసీతో పోటీ పడవచ్చు. ఆర్మీ, నేవీల్లో 10+2 టెక్‌ ఎంట్రీతో ఉచితంగా బీటెక్‌ పూర్తిచేసి, లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగాన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్‌లో మ్యాథ్స్‌పై ఆసక్తి తగ్గితే కోర్సు పూర్తయిన తర్వాత.. బీఏ, బీకాం, బీబీఏ, బీబీఎం, బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్, సీఏ, సీఎస్, సీఎంఏ...మొదలైనవాటిలోనూ చేరవచ్చు. 


బైపీసీ (బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)


వైద్యం, అనుబంధ విభాగాల్లో సేవలు అందించడానికి ఇంటర్‌లో బయాలజీ (బోటనీ, జువాలజీ), ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ సెరీ కల్చర్, బీఎస్సీ నర్సింగ్, కొన్ని పారామెడికల్‌ కోర్సులకు బైపీసీ గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేయాలి. ఫిషరీ సైన్స్, ఆక్వా, మైక్రో బయాలజీ మొదలైనవాటికీ బైపీసీ తప్పనిసరి. వీరు ఫిజిక్స్‌ మినహాయించి ఇంటర్‌లో చదివిన సబ్జెక్టులతోనే బీఎస్సీలో చేరవచ్చు లేదా మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్‌ సైన్స్‌...తదితర కొత్త సబ్జెక్టులను డిగ్రీలో ఎంచుకోవచ్చు. బైపీసీ విద్యార్థులు ఫార్మసీ, ఆప్టోమెట్రీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, డీఎడ్, లా, డిజైన్, హోటల్‌ మేనేజ్‌మెంట్‌.. తదితర కోర్సుల్లోనూ చేరవచ్చు. ఇంటర్‌ తర్వాత కొన్ని డిప్లొమా, బ్యాచిలర్‌ కోర్సులు పూర్తిచేసుకుని సొంతంగా రాణించవచ్చు.


సీఈసీ (కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్‌) 


ఈ కోర్సు చదివినవాళ్లు అకౌంటింగ్‌ రంగంలో రాణించగలరు. వీరు భవిష్యత్తులో సీఏ, సీఎంఏ, సీఎస్, బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సుల్లో చేరి ప్రయోజనం పొందవచ్చు. అలాగే న్యాయవిద్య, ఉపాధ్యాయ విద్య, హోటల్‌ మేనేజ్‌మెంట్, టూరిజం స్టడీస్‌ అభ్యసించవచ్చు. బీఏ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, డీఎడ్, ఇంటిగ్రేటెడ్‌ బీఏఎడ్, ఇంటిగ్రేటెడ్‌ బీఏఎల్‌ఎల్‌బీ కోర్సులూ ఈ గ్రూపు విద్యార్థులకు అనువైనవే.


ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్‌)


గణాంకం, వర్తక, వాణిజ్య రంగాల్లో రాణించాలనే తపన ఉన్నవారికి ఎంఈసీ మేటి కోర్సు. ఈ గ్రూపు విద్యార్థులకే అంటూ ప్రత్యేకమైన యూజీ కోర్సులు ఏమీ లేనప్పటికీ సీఏ, సీఎంఏ, సీఎస్‌ కోర్సుల్లో రాణించడానికి ఎంఈసీ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదవాలనుకునేవాళ్లూ ఎంఈసీని పరిగణనలోకి తీసుకోవచ్చు. బిజినెస్‌ అనలిస్ట్, స్టాటిస్టీషియన్, మార్కెట్‌ నిపుణులు...మొదలైన రంగాలకు మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్‌ సబ్జెక్టుల నేపథ్యం బాగా ఉపయోగపడుతుంది. వీరు ఉన్నత విద్య (డిగ్రీ)లో భాగంగా మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుల కాంబినేషన్‌ ఎంచుకోవచ్చు లేదా బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, డీఎడ్, లా, హోటల్‌ మేనేజ్‌మెంట్‌...మొదలైన కోర్సుల్లోనూ చేరిపోవచ్చు. ఎకనామిక్స్‌లో రాణించగలిగితే మ్యాథ్స్, సైన్స్‌ విద్యార్థులతో సమానంగా అవకాశాలు అందుకోవచ్చు


హెచ్‌ఈసీ (హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్‌) 

గ్రూప్స్, సివిల్స్, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్‌ సబ్జెక్టుల కాంబినేషన్‌ ఉపయోగం. వీరు ఇంటర్‌ తర్వాత బీఏలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్, సోషియాలజీ, సోషల్‌ వర్క్, ఆంత్రొపాలజీ, సైకాలజీ, జాగ్రఫీ, విదేశీ భాషలు... ఇలా నచ్చిన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. టూరిజం స్టడీస్, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ వీరికి అనువైనవి. 

 న్యాయవాద వృత్తి, బోధన రంగంలోనూ హెచ్‌ఈసీ వాళ్లు రాణించగలరు. అందువల్ల ఇంటర్‌ తర్వాత డీఎడ్‌ లేదా ఇంటిగ్రేటెడ్‌ బీఏబీఎడ్‌; బీఏ బీఎల్‌ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యమివ్వవచ్చు. ఈ గ్రూపు విద్యార్థులు సెంట్రల్‌ యూనివర్సిటీల ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సుల్లో చేరితే మేటి అవకాశాలు దక్కుతాయి



      ఇలా ఎంచుకోవచ్చు     

ఇప్పటికే విద్యార్థులు ఒక అంచనాకు వచ్చేసి ఉంటారు. అయితే ఎటువైపో నిర్ణయం తీసుకోలేనివాళ్లు స్వీయ సమీక్షకు ప్రాధాన్యమివ్వాలి. తల్లిదండ్రులు లేదా తెలిసినవారు చెప్పారని గ్రూపు ఎంచుకుంటే అందులో ఆసక్తి లేకపోతే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. చదవాల్సింది విద్యార్థే కాబట్టి స్వీయ నిర్ణయమే శ్రేయస్కరం.

ఏ సబ్జెక్టుపై ఎక్కువ ఆసక్తి ఉంది, ఏ అంశాలను బాగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు, ఏ సబ్జెక్టు ఆనందాన్నిస్తుంది, ఏ సబ్జెక్టును చాలా సౌకర్యవంతంగా భావిస్తున్నారో గుర్తించి, అటువైపు మొగ్గు చూపవచ్చు. కెరియర్‌ లక్ష్యం ఏమిటి? అందుకు ఏ కోర్సులు (సబ్జెక్టులు) చదవాలి. ఆ సబ్జెక్టులపై ఆసక్తి ఉందా/లేదా?విశ్లేషించుకోవాలి. సంబంధిత సబ్జెక్టులపై ఆసక్తి లేకపోతే లక్ష్యాన్ని మార్చుకోవాలి లేదా ఆ సబ్జెక్టుల్లో ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలి. ఉదాహరణకు.. వైద్యులు కావాలనుకున్నవారు బోటనీ, జువాలజీ అంటే ఇష్టం లేకపోతే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అందువల్ల ఏ మాత్రం ఇష్టంలేని సబ్జెక్టుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఆ సబ్జెక్టుల్లో పట్టు లేకపోయినా వాటిని నేర్చుకోవాలనే ఆసక్తి, తపన ఉంటే మాత్రం వాటి దిశగా అడుగులేయవచ్చు.

మ్యాథ్స్, ఫిజిక్స్‌ రెండు సబ్జెక్టులపైనా ఆసక్తి, ఎంతో కొంత ప్రావీణ్యం ఉన్నవారు ఇంటర్‌ ఎంపీసీ గ్రూపు ఎంచుకోవచ్చు.

మొక్కలు, జంతువులు, వైద్యరంగం వీటిలో దేనిపై ఆసక్తి ఉన్నా బైపీసీ మేలు

అంకెలు, వర్తక రంగం, మదింపు...తదితర అంశాలు ఇష్టమైతే అకౌంట్స్‌ దిశగా అడుగులేయాలి.

చరిత్ర, సమకాలీన సంఘటనల గురించి తెలుసుకోవాలనుకున్నవారు ఆర్ట్స్‌ కోర్సులు తీసుకోవాలి.


ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?  

పైలట్, ఇంజినీర్‌: ఎంపీసీ  

డాక్టర్‌: బైపీసీ 

టీచర్, లాయర్, చార్టర్డ్‌ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ: అన్ని గ్రూపులూ 

సీఏ, సీఎస్, సీఎంఏ.. వీటిని లక్ష్యంగా నిర్దేశించుకున్నవారు ఎంఈసీ లేదా సీఈసీ ఎంచుకోవచ్చు. వీటిలోని పాఠ్యాంశాలు ఫౌండేషన్‌ కోసం ఉపయోగపడతాయి. 

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ హాస్పిటాలిటీ, డిజైన్, టూరిజం అండ్‌ ట్రావెల్, యానిమేషన్, బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, ఫైన్‌ ఆర్ట్స్‌...ఇలా వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపుల విద్యార్థులకూ సమాన అవకాశం ఉంది.



      అవసరమైతే బోర్డులూ మారొచ్చు    

పది వరకు స్టేట్‌ బోర్డులో చదివినవాళ్లు కావాలనుకుంటే సీబీఎస్‌ఈ ప్లస్‌1లో చేరవచ్చు. ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ (ఐఎస్‌సీ) కోర్సులూ ఎంచుకోవచ్చు.

 యూజీ కోర్సులు విదేశాల్లో చదవాలనే నిర్ణయానికి వచ్చినవాళ్లు ఇంటర్మీడియట్‌ బోర్డులో చేరే బదులు దీనితో సమాన స్థాయి కోర్సులైన ఐబీ డిప్లొమా లేదా కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌- ఎ లెవెల్‌లో చేరితే ఎక్కువ ప్రయోజనం. ఈ కోర్సులు అందించే విద్యాసంస్థలు మాత్రం ప్రముఖ నగరాల్లోనే ఉన్నాయి. 

ఇంటర్‌తోపాటు ఐఐటీ-జేఈఈ, నీట్‌కు కార్పొరేట్‌ కళాశాలలు శిక్షణ ఇస్తున్నట్లుగానే ఇప్పుడు చాలా కళాశాలలు జాతీయ సంస్థల్లో న్యాయవిద్య కోసం క్లాట్, ఐఐఎంల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏకు ఐపీఎం, కేంద్రంలో, రాష్ట్రంలో మేటి ప్రభుత్వ ఉద్యోగాల నిమిత్తం సివిల్స్‌ పేరుతో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాయి. ఆసక్తి ఉంటే వీటిలోనూ చేరవచ్చు.

కాలేజీకి వెళ్లి ఇంటర్మీడియట్‌ చదవడం వీలుకానివాళ్లు నేషనల్‌ / స్టేట్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరవచ్చు. రెగ్యులర్‌ విధానంలో ఉన్నట్లుగానే వివిధ సబ్జెక్టు కాంబినేషన్లు వీటిలోనూ అందుబాటులో ఉన్నాయి. వీటికి ఇంటర్‌తో సమాన గుర్తింపు లభిస్తోంది. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ మెలకువలు

‣ నలుగురితో కలిసిపోవాలంటే...

‣ బృందంతో నడుస్తూ..!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

Posted Date: 30-05-2024


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌