• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ కోర్సు వివరాలివిగో..

పది తర్వాత ఉన్నత విద్యకు అడుగులు

పదో తరగతి తర్వాత ఉన్నత విద్య దిశగా అడుగులేయడానికి ఇంటర్మీడియట్‌ కోర్సులు దారి చూపుతాయి. మెడిసిన్, ఇంజినీరింగ్, టీచింగ్, లా, ఫార్మా, మేనేజ్‌మెంట్‌.. ఇలా ఏ వృత్తిలోకి వెళ్లాలన్నా ఇంటర్‌ కూడలి లాంటిది. విద్యార్థులు ఏ రంగంలో ఉన్నత విద్య ఆశిస్తున్నారో నిర్ణయించుకుని, తమ ఆసక్తి, ప్రావీణ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్‌లో గ్రూపు ఎంచుకోవాలి. 

దేశవ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులు పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్‌లోనే చేరుతున్నారు. భవిష్యత్తులో ఏ వృత్తి/ రంగం దిశగా అడుగులేయాలన్నా ఇంటర్మీడియట్‌ కీలకం కావడమే ఇందుకు కారణం. జాతీయ స్థాయిలో నిర్వహించే ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్‌; రాష్ట్ర స్థాయిలోని ఎంసెట్, డైట్‌సెట్, లాసెట్‌ వీటన్నింటికీ ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియట్‌ చదవాలి. 

తెలుగు రాష్ట్రాల్లో సుమారు 85 గ్రూపు కాంబినేషన్లతో ఇంటర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే మ్యాథ్స్, ఫిజిక్స్‌; బోటనీ, జువాలజీ; హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్‌.. వీటినే ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకుంటున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ పాపులర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పరిమిత సంస్థల్లో.. లాజిక్, మ్యూజిక్, సైకాలజీ, సోషియాలజీ.. సబ్జెక్టులనూ బోధిస్తున్నారు. 

ఎంచుకోండిలా..

ఏ సబ్జెక్టుపై ఎక్కువ ఆసక్తికరంగా ఉంది, ఏ అంశాలను బాగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు, ఏ సబ్జెక్టు ఆనందాన్నిస్తుంది, ఏ సబ్జెక్టును చాలా సౌకర్యవంతంగా భావిస్తున్నారో గుర్తించి, అటు వైపు మొగ్గు చూపవచ్చు. 

కెరియర్‌ లక్ష్యం ఏమిటి? అందుకు ఏ కోర్సులు (సబ్జెక్టులు) చదవాలి. ఆ సబ్జెక్టులపై ఆసక్తి ఉందా/లేదా? విశ్లేషించుకోవాలి. సంబంధిత సబ్జెక్టులపై ఆసక్తి లేకపోతే లక్ష్యాన్ని మార్చుకోవాలి లేదా ఆ సబ్జెక్టుల్లో ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలి. 

వైద్యులు కావాలనుకున్నవారికి  బోటనీ, జువాలజీ అంటే ఇష్టం లేకపోతే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అందువల్ల ఏ మాత్రం ఇష్టంలేని సబ్జెక్టుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఆ సబ్జెక్టుల్లో పట్టు లేకపోయినప్పటికీ వాటిని నేర్చుకోవాలనే ఆసక్తి, తపన ఉంటే మాత్రం బైపీసీ గ్రూపు ఎంచుకోవచ్చు.  

మ్యాథ్స్, ఫిజిక్స్‌ రెండు సబ్జెక్టులపైనా ఆసక్తి, ఎంతో కొంత ప్రావీణ్యం ఉన్నవారు ఇంటర్‌ ఎంపీసీ గ్రూపు ఎంచుకోవచ్చు. 

మొక్కలు, జంతువులు, వైద్యరంగం వీటిలో దేనిపై ఆసక్తి ఉన్నా బైపీసీ బాగు.

అంకెలు, వర్తకరంగం, మదింపు.. తదితర అంశాలు ఇష్టమైతే అకౌంట్స్‌ దిశగా అడుగులేయాలి.

చరిత్ర, సమకాలీన సంఘటనల గురించి తెలుసుకోవాలనుకున్నవారు ఆర్ట్స్‌ కోర్సులు తీసుకోవాలి.  

ప్రధాన గ్రూపుల్లో..

ఇంటర్మీడియట్‌లో విద్యార్థి చేరిన గ్రూపు ప్రకారం 3- 4 సబ్జెక్టులుంటాయి. వీటితోపాటు ఆంగ్లం, మరో భాష ఎంచుకోవడం తప్పనిసరి. ఇంటర్మీడియట్‌ గ్రూపుల వారీ ఉన్న అవకాశాలు, ప్రత్యేకతలు తెలుసుకుంటే ఎందులో చేరాలో నిర్ణయం తీసుకోవడం తేలిక.   

ఎంపీసీ: భవిష్యత్తులో బీఈ/ బీటెక్, బీఆర్క్‌ కోర్సులు చదవాలని ఆశించేవారు ఇంటర్‌లో ఎంపీసీ తీసుకోవడం తప్పనిసరి. అలాగే పైలట్‌ కావాలన్నా ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదవాలి. ఫ్యాషన్‌ టెక్నాలజీ దిశగా అడుగులేయడానికీ గణిత నేపథ్యం ఉండాల్సిందే. ఎంపీసీ గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు బీఎస్సీలో.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల కాంబినేషన్‌ ఎంచుకోవచ్చు లేదా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్, జియాలజీ.. ఇలా కొత్త సబ్జెక్టులూ తీసుకోవచ్చు. బీసీఏ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్, బీఎస్‌-ఎంఎస్, డీఎడ్, లా, డిజైన్, బీ ఫార్మసీ.. ఇలా ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఎంపీసీ విద్యార్హతతోనే కొన్ని ఉద్యోగాలూ ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో పలు మేటి ఉద్యోగాలకు ఇంటర్‌ ఎంపీసీతో పోటీ పడవచ్చు. ఆర్మీ, నేవీల్లో 10+2 టెక్‌ ఎంట్రీతో ఉచితంగా బీటెక్‌ పూర్తిచేసి, లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగాన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్‌లో మ్యాథ్స్‌పై ఆసక్తి తగ్గితే బీఏ, బీకాం, బీబీఏ, బీబీఎం, బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్, సీఏ, సీఎస్, సీఎంఏ...మొదలైనవాటిలోనూ చేరవచ్చు. 

బైపీసీ: వైద్యం, అనుబంధ విభాగాల్లో సేవలు అందించడానికి ఇంటర్‌లో బయాలజీ (బోటనీ, జువాలజీ), ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి. అలాగే బీఎస్సీ అగ్రి, బీఎస్సీ నర్సింగ్, కొన్ని పారామెడికల్‌ కోర్సుల్లో చేరడానికి బైపీసీ గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేయాలి. ఫిషరీ సైన్స్, ఆక్వా, మైక్రో బయాలజీ మొదలైనవాటికీ బైపీసీ తప్పనిసరి. వీరు ఫిజిక్స్‌ మినహాయించి ఇంటర్‌లో చదివిన సబ్జెక్టులతోనే బీఎస్సీలో చేరవచ్చు లేదా మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్‌ సైన్స్‌...తదితర కొత్త సబ్జెక్టులను డిగ్రీలో ఎంచుకోవచ్చు. బైపీసీ విద్యార్థులు ఫార్మసీ, ఆప్టోమెట్రీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, డీఎడ్, లా, డిజైన్, హోటల్‌ మేనేజ్‌మెంట్‌.. తదితర కోర్సుల్లోనూ చేరవచ్చు. ఇంటర్‌ తర్వాత డిప్లొమా, బ్యాచిలర్‌ కోర్సులుచేసి సొంతంగా రాణించవచ్చు. 

ఎంఈసీ: గణాంకం, వర్తక, వాణిజ్య రంగాల్లో రాణించాలనే తపన ఉన్నవారికి ఎంఈసీ మేటి కోర్సు. ఈ గ్రూపు విద్యార్థులకే అంటూ ప్రత్యేకమైన చదువులు ఏమీ లేనప్పటికీ సీఏ, సీఎంఏ, సీఎస్‌ కోర్సుల్లో రాణించడానికి ఎంఈసీ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదవాలనుకునేవాళ్లూ ఎంఈసీని పరిగణనలోకి తీసుకోవచ్చు. బిజినెస్‌ అనలిస్ట్, స్టాటిస్టీషియన్, మార్కెట్‌ నిపుణులు...మొదలైన రంగాలకు మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్‌ సబ్జెక్టుల నేపథ్యం ఉపయోగపడుతుంది. వీరు ఉన్నత విద్య (డిగ్రీ)లో భాగంగా మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుల కాంబినేషన్‌ ఎంచుకోవచ్చు లేదా బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, డీఎడ్, లా, హోటల్‌ మేనేజ్‌మెంట్‌...కోర్సుల్లోనూ చేరిపోవచ్చు. ఎకనామిక్స్‌లో రాణిస్తే మ్యాథ్స్, సైన్స్‌ విద్యార్థులతో సమానంగా అవకాశాలు అందుకోవచ్చు. 

సీఈసీ: ఎకనామిక్స్, కామర్స్‌ కలయికతో ఈ కోర్సులు చదివినవాళ్లు అకౌంటింగ్‌లో రాణించగలరు. వీరు భవిష్యత్తులో సీఏ, సీఎంఏ, సీఎస్, బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోర్సుల్లో చేరి ప్రయోజనం పొందవచ్చు. న్యాయవిద్య, టీచింగ్, హోటల్‌ మేనేజ్‌మెంట్, టూరిజం స్టడీస్‌ అభ్యసించవచ్చు. బీఏ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, డీఎడ్, ఇంటిగ్రేటెడ్‌ బీఏఎడ్, ఇంటిగ్రేటెడ్‌ బీఏఎల్‌ఎల్‌బీ కోర్సులూ ఈ గ్రూపు విద్యార్థులకు అనువైనవే. 

హెచ్‌ఈసీ: గ్రూప్స్, సివిల్స్, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్‌ సబ్జెక్టుల కాంబినేషన్‌ పనికొస్తుంది. వీరు ఇంటర్‌ తర్వాత బీఏలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్, సోషియాలజీ, సోషల్‌ వర్క్, ఆంత్రొపాలజీ, సైకాలజీ, జాగ్రఫీ, విదేశీ భాషలు... ఇలా నచ్చిన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. టూరిజం స్టడీస్, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ వీరికి అనువైనవి. న్యాయవాద వృత్తి, బోధన రంగంలోనూ హెచ్‌ఈసీ వాళ్లు రాణించగలరు. అందువల్ల ఇంటర్‌ తర్వాత డీఎడ్‌ లేదా ఇంటిగ్రేటెడ్‌ బీఏబీఎడ్‌; బీఏ బీఎల్‌ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యమివ్వవచ్చు. ఈ గ్రూపు విద్యార్థులు సెంట్రల్‌ వర్సిటీలు అందించే ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సుల్లో చేరితే మేటి అవకాశాలు దక్కుతాయి.   

వృత్తులు/ కెరియర్ల ప్రకారం..

పైలట్‌: మ్యాథ్స్, ఫిజిక్స్‌తో ఇంటర్‌  

లాయర్‌: ఇంటర్‌ అన్ని గ్రూపులూ 

ఇంజినీర్‌: ఇంటర్‌ ఎంపీసీ 

డాక్టర్‌: ఇంటర్‌ బైపీసీ 

టీచర్‌: ఏ గ్రూపుతోనైనా ఇంటర్‌ 

చార్టర్డ్‌ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ: ఏ గ్రూపుతోనైనా ఇంటర్‌. 

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ హాస్పిటాలిటీ, డిజైన్, టూరిజం అండ్‌ ట్రావెల్, యానిమేషన్, బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, ఫైన్‌ ఆర్ట్స్‌.. ఇలా పలు కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపుల విద్యార్థులకూ సమాన అవకాశం ఉంది. 

సీఏ, సీఎస్, సీఎంఏ: ఇవి లక్ష్యంగా ఉన్నవాళ్లు.. ఎంపీసీ బదులు ఎంఈసీ లేదా సీఈసీ గ్రూపులో చేరడమే బాగు. వీటిలోని మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్‌ పాఠ్యాంశాలు సీఏ, సీఎస్, సీఎంఏ ఫౌండేషన్‌లో పనికొస్తాయి.  

కాలేజీకి వెళ్లి ఇంటర్మీడియట్‌ చదవడం వీలుకానివాళ్లు నేషనల్‌ /స్టేట్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరవచ్చు. రెగ్యులర్‌ విధానంలో ఉన్నట్లుగానే పలు సబ్జెక్టు కాంబినేషన్లు వీటిలోనూ అందుబాటులో ఉన్నాయి. వీటికి ఇంటర్‌తో సమాన గుర్తింపు లభిస్తోంది.    
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ వృత్తివిద్యా పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు

‣ బెస్ట్‌ కెరియర్.. బ్యాంకింగ్‌ టెక్నాలజీ

‣ జనరేషన్‌ ‘జడ్‌’ జాబ్స్‌తో నయా ట్రెండ్‌!

‣ ’జీఆర్‌ఈ’లో ముఖ్య మార్పులివే..

‣ ఆన్‌లైన్‌లో ముఖ్యం.. పాజిటివిటీ

Posted Date: 14-06-2023


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌