• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జనరేషన్‌ ‘జడ్‌’ జాబ్స్‌లో నయా ట్రెండ్‌!

కొత్త తరాన్ని ఆకర్షిస్తుంచేందుకు సంస్థల విశ్వప్రయత్నాలు

నిరుద్యోగులు తమ విద్యార్హతలనూ నైపుణ్యాలనూ పేర్కొంటూ దరఖాస్తు రాసి ఉద్యోగానికి ప్రయత్నించడం ఆనవాయితీ. అలా కాకుండా కంపెనీలే ‘మేం మీకోసం మా విధానాలను మార్చుకుంటున్నాం... ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. నిస్సంకోచంగా మా సంస్థలో ఉద్యోగం చేయొచ్చు’ అని లింక్డ్‌ఇన్‌ లాంటి వేదికలమీద రాసుకుంటున్నాయంటే- తరం మారిందని అర్థం. అవును... ప్రపంచవ్యాప్తంగా జనరేషన్‌ జడ్‌ ఉద్యోగాల్లో చేరుతున్న వేళ ఇది. ఇంటర్నెట్టూ మొబైల్‌ఫోన్లతో పాటూ పెరిగిన ఈ తరం ఆఫీసులో ఏం కోరుకుంటోందీ... ఎందుకు సంస్థలన్నీ వారికి అంత ప్రాధాన్యమిస్తున్నాయీ... అన్నది ఆసక్తికరం.

‘మేము మార్పుని స్వాగతిస్తున్నాం. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే సంస్థల్లో ముందు వరసలో ఉంటాం. మా ప్రొఫెషనల్‌ పార్ట్‌నర్స్‌ (సిబ్బందినే ఇప్పుడు భాగస్వాములని అంటున్నారు)కి వారంలో ఎక్కువ రోజులు హైబ్రిడ్‌, రిమోట్‌ వర్క్‌కి అవకాశం కల్పిస్తాం. కొన్ని ఉద్యోగాల్లో మాత్రమే తప్పనిసరిగా కార్యాలయంలో ఉండి పనిచేయాల్సి ఉంటుంది. అవేమిటో ఉద్యోగావకాశాల ప్రకటనలో స్పష్టంగా చెబుతాం...’ లింక్డ్‌ఇన్‌లో ఓ కంపెనీ పోస్ట్‌ ఇది.

ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని... అదీ యువతరాన్ని ఆకట్టుకోవడమూ, మరో సంస్థకి వెళ్లిపోకుండా తమ దగ్గరే అట్టి పెట్టుకోవడమూ... ఇప్పుడు సంస్థలకి కత్తిమీద సాములా తయారైంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న అబ్బాయిలూ అమ్మాయిలూ ఏడాది తిరక్కుండానే మానేసి మరో ఉద్యోగం వెతుక్కుంటున్నారట. గత రెండుమూడేళ్లలో ఉద్యోగంలో చేరినవారిలో 53 శాతం అప్పుడే ఉద్యోగాలు మారారని డెలాయిట్‌ నివేదిక చెబుతోంది. అందుకే తమ సంస్థల్లో పనితీరు గురించీ తాము అనుసరించే విలువల గురించీ ఉద్యోగుల సౌకర్యానికి తామిచ్చే ప్రాధాన్యం గురించీ సంస్థలు సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి పోస్టులు పెడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకీ పరిస్థితి వచ్చిందీ అంటే- ‘తరాల అంతరం’ అంటున్నాయి అధ్యయనాలు.

పరిశ్రమలూ, వ్యాపార, ఆర్థిక సంస్థలూ- దశాబ్దాలుగా కొనసాగుతున్నవి ఉన్నాయి. అనునిత్యం అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక రంగాల పుణ్యమా అని ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా అంకుర సంస్థలూ పుట్టుకొస్తున్నాయి. వీటన్నిటిలోనూ పనిచేయడానికి ఉద్యోగులు కావాలి. అందుకని అవసరానికి తగినట్లుగా ఆయా సంస్థలన్నీ తమవైన విధివిధానాలను రూపొందించుకుని ఉద్యోగులను భర్తీ చేసుకుంటూ ఉంటాయి. గత యాభై ఏళ్లలో అలా ఉద్యోగాల్లో చేరినవారిని పరిశీలిస్తే ఇప్పటికి మూడు తరాలవారు చేరారనీ ఇప్పుడు చేరుతున్నది నాలుగోతరమనీ అంటున్నారు నిపుణులు. పాతికేళ్లకు అటూఇటూగా ఉండి ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నవారినే ‘జనరేషన్‌ జడ్‌’ అంటున్నారు. వచ్చే ఐదారేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో మూడో వంతు వీళ్లే ఉంటారట. దాంతో సంస్థలన్నీ అందుకు తగినట్లుగా మారడం మొదలెట్టాయి.

మార్పు అనివార్యం

ఒకప్పుడు ప్రతి దానికీ ఓపిగ్గా వేచిచూడాల్సి వచ్చేది. పరీక్ష ఫలితాలను ఇవాళ ప్రకటిస్తే మర్నాడు పొద్దున్న పేపరు వస్తేనే పాసయిందీ లేనిదీ తెలిసేది. పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు తీయించుకుంటే మూడు రోజుల తర్వాత చేతికొచ్చేవి. ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే పోస్టులో ఇంటర్వ్యూకి కార్డు వచ్చేవరకూ ఎదురుచూపులే. బ్యాంకుకెళ్లినా, రైలు టికెట్‌ కొనాలన్నా, సినిమాకెళ్లాలన్నా... ఓపిగ్గా వరసలో నిలబడి మన వంతు వచ్చేవరకూ వేచిచూడాల్సి వచ్చేది.

ఇప్పుడలా కాదు... ఇది ఇన్‌స్టంట్‌ కాలం. పరీక్ష రాసిన మర్నాడే సమాధానాల ‘కీ’ విడుదలైపోతుంది. ఎన్ని మార్కులు వస్తాయో, ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశముందో తెలిసిపోతోంది. షాపుకెళ్లకుండానే కోరుకున్నవి ఇంటికొచ్చి వాలుతున్నాయి. వేచి చూడడం అంటే ఏమిటో ఈ తరానికి తెలియదు. ఇది చూడటానికి చిన్న విషయంగానే ఉన్నా మొత్తంగా వ్యక్తిత్వాలనీ ఆలోచనాధోరణుల్నీ పనిచేసే విధానాన్నీ మార్చేస్తోంది. అందుకే తరాల అంతరాల్ని నిశితంగా అధ్యయనం చేయడం మొదలెట్టాయి పరిశోధనా సంస్థలు. యువత వ్యక్తిత్వాల్లో అభిప్రాయాల్లో ఇష్టాయిష్టాల్లో వస్తున్న మార్పులు తెలుసుకుంటే తదనుగుణంగా అన్ని రంగాల్లోనూ మార్పులు చేసుకోవచ్చన్నది వారి ఉద్దేశం.

మిలెనియల్స్‌ మార్చేశారు!

ప్రభుత్వ ఉద్యోగాలకి గౌరవమూ హోదా ఉంటాయి, అన్నిటినీ మించి స్థిరత్వం ఉంటుంది, ప్రైవేటు ఉద్యోగాలకు గ్యారంటీ ఉండదు. అందుకని కష్టమైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి... ఇలా ఉండేది ఒకప్పటి యువత ఆలోచనాధోరణి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రైవేటు ఉద్యోగాలవైపు వెళ్లేవారు. ఆ ధోరణిని మార్చి విభిన్న రంగాలవైపు చూపు సారించడం మొదలెట్టిన ‘జనరేషన్‌ ఎక్స్‌’ సరికొత్త రంగాల్లో ప్రవేశించి నిబద్ధతతో పనిచేసింది. ఆ తర్వాత ఉద్యోగరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది ‘మిలెనియల్స్‌’ తరం. తల్లిదండ్రులు క్రమశిక్షణతో రేయింబగళ్లు కష్టపడటాన్ని చూసిన ఈ తరమే ‘వ్యక్తిగత- వృత్తిగత జీవితాలమధ్య సమతూకం- ‘వర్క్‌ లైఫ్‌ బ్యాలన్స్‌’ అన్న అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. నేరుగా నాయకత్వ పదవుల్లో చేరడానికీ వీరే దారివేశారు. నిర్ణీత పనిగంటలు కాక పని పూర్తయ్యేవరకూ పనిచేయడమనే పద్ధతీ వీళ్లే ప్రారంభించారు. టీమ్‌వర్క్‌ని ఇష్టపడతారు. విద్యావంతులైన తల్లిదండ్రులు ఎక్కువగా ఉన్న తరం కావడంతో స్వేచ్ఛగానూ బాధ్యతాయుతంగానూ పెరగడం వల్ల ఉద్యోగంలోనూ ఆ లక్షణాలు చూపిస్తారు. సొంత వ్యాపారాల వైపు మొగ్గు చూపడంలోనూ వీరే ముందున్నారు. తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే మరింత మంచి అవకాశం కోసం నిరంతరం అన్వేషిస్తుంటారు. ప్రస్తుతం ఉద్యోగ వ్యాపార ప్రపంచాల్లో కీలకపాత్ర నిర్వహిస్తున్నది వీరే. ఈ మిలెనియల్స్‌ స్ఫూర్తిని కొనసాగిస్తూ మరో అడుగు ముందుకేసింది ‘జనరేషన్‌ జడ్‌’.

మాకు నచ్చాలి!

‘ఆ మధ్య ఒక పాతికేళ్ల కుర్రాడు ఉద్యోగంలో చేరి రెండు నెలలకే మానేశాడు. వెళ్లిపోయేటప్పుడు కారణం చెప్పమంటే- తనకి ఉద్యోగం ఆశించిన ‘కిక్‌’ని ఇవ్వలేదన్నాడు. కానీ ఇలా రెండునెలలకే జాబ్‌ మారిన విషయాన్ని సీవీలో రాసుకుంటే బాగోదు కదా అనడిగితే అదేమంత పెద్ద విషయం కాదన్నాడు. ఈ తరం వాళ్లు మరీ ముక్కుసూటిగా కచ్చితంగా ఉంటున్నారు. నేరుగా సీఈఓ గదిలోకి వెళ్లిపోయి తమ మనసులో మాట చెప్పేస్తారు. దేనికీ సంకోచించరు...’ అంటారు బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ హెచ్‌ఆర్‌ చీఫ్‌ సుమన్‌ కుమార్‌ ఘోష్‌.

పదేళ్ల క్రితం క్యాంపస్‌ సెలెక్షన్స్‌లో ఉద్యోగం ఎక్కడా, జీతం ఎంతా అన్న ప్రశ్నలే అభ్యర్థుల నుంచి ప్రధానంగా వినిపించేవట. ఇప్పుడు భిన్నమైన ప్రశ్నల్ని స్పష్టంగా అడుగుతున్నారని అంటున్నారు మెకిన్సే కంపెనీ నిపుణులు. సంస్థలో తమ కెరీర్‌ గ్రోత్‌ ఎలా ఉండబోతోందన్న విషయంతో మొదలెట్టి సమాజహితానికి ఆ సంస్థ చేస్తున్నదేంటీ, తన అభిప్రాయానికి అక్కడ విలువ ఉంటుందా అని కూడా వాళ్లు అడుగుతున్నారట. స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉన్న ఈ తరం తమకు నచ్చినట్లుగానే ఉంటారనీ, జీతం కన్నా చేస్తున్న పనివల్ల సమాజానికి చేకూరే ప్రయోజనానికి విలువిస్తారనీ వారు చెబుతున్నారు. సంస్థ అనుసరిస్తున్న విలువలను పరిశీలిస్తారు. పర్యావరణ పరిరక్షణకు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తారు. ఉద్యోగాల్లో ఎలాంటి వ్యత్యాసమూ చూపకుండా అన్ని వర్గాలవారినీ చేర్చుకుంటున్నారా లేదా అని శోధిస్తారు. అలా అన్ని అంశాల్లోనూ సంస్థ పద్ధతులు నచ్చితే అప్పుడు ‘ఈ సంస్థలో నేనేవిధంగా నాదైన ప్రత్యేకతను చూపగలుగుతాను’ అని ఆలోచిస్తారు. సమాజంపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపని సంస్థల్లో పనిచేయడానికి ఇష్టపడని ఈ నవతరం ఏ మాత్రం మొహమాటం లేకుండా వదిలి వెళ్లిపోతోంది- అంటున్నారు నిపుణులు. అసలీ తరానికి చెందిన పిల్లలు అవసరమైతే కొంతకాలం ఖాళీగా ఉండి అయినా తాము ఏ రంగంలో రాణించగలరో ఆలోచించి, నచ్చిన ఉద్యోగంలోనే చేరుతున్నారు... అంటున్నాయి మానవ వనరుల నివేదికలు.

డిమాండ్‌ ఎక్కువ

నిజానికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని కొవిడ్‌ సమయంలో మొదలుపెట్టారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక కూడా మానకుండా కొనసాగించడానికి కారణం ఈ యువతరమే. మూడ్‌ని బట్టి ఆఫీసుకు వస్తారు, లేదంటే ఇంట్లోంచే పనిచేస్తామంటారు. అందుకే వీరికోసం హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ని కొనసాగిస్తున్నాయి కంపెనీలు. డిజిటల్‌ తరంలో పుట్టి పెరిగిన వీరి నైపుణ్యాలకు ఇప్పుడు విపరీతమైన డిమాండు ఉంది. అందుకే ఇలా రకరకాల ప్యాకేజీలూ వెసులుబాట్లతో వారిని ఆకర్షించాల్సి వస్తోంది. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌- గ్యాలప్‌ సంస్థలు సంయుక్తంగా వెలువరించిన ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో 97 శాతం కంపెనీలు డిజిటల్‌ నైపుణ్యాలు తెలిసిన సిబ్బంది తమకు తక్షణావసరమనీ కానీ నిపుణుల్ని ఎంచుకోలేకపోతున్నామనీ చెప్పాయిట. సరిగ్గా కంపెనీలకు అవసరమవుతున్న సరికొత్త ప్రతిభానైపుణ్యాలు కొరవడిన సమయంలో ఈ కొత్త తరం ఉద్యోగ రంగంలోకి ప్రవేశించడం వల్లే కంపెనీలు వీరికోసం తమను తాము మార్చుకుంటున్నాయి.

మారుతి నుంచి బజాజ్‌ వరకూ

మారుతి సుజుకి సంస్థ గురుగ్రామ్‌లో ప్రత్యేకంగా ‘మొబిలిటీ అండ్‌ ఇన్నొవేషన్‌ హబ్‌’ని ఏర్పాటుచేసింది. కళాశాలలో ఉన్నప్పటినుంచే విద్యార్థులకు రకరకాల పోటీలు నిర్వహిస్తూ వారి అభిరుచులనూ ఆసక్తులనూ తెలుసుకుంటున్న ఈ సంస్థ జనరేషన్‌ జడ్‌ ఉద్యోగుల కోసం కార్యాలయాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఐఐటీ, ఐఐఎం స్టూడెంట్లు తమ స్టార్టప్‌ ఐడియాలతో ఈ హబ్‌కి వచ్చి ప్రయోగాలు చేసుకోవచ్చు. అనుభవజ్ఞుల మార్గదర్శకత్వం పొందవచ్చు. మధ్యమధ్యలో తోటివారితో ఆడుతూ పాడుతూ రిలాక్స్‌ అవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో చేరినవారిని ప్రోత్సహించడానికి ‘ఇంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ పేరుతో ఏటా రెండుసార్లు ఐడియాల పోటీపెడుతోంది. వాళ్లిచ్చిన కొత్త ఐడియాలకు బహుమతులిచ్చి, నచ్చినవాటిని అమలుచేస్తోంది.

మారుతీ ఒక్కటే కాదు, స్టార్‌బక్స్‌, పానసోనిక్‌, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, టైటాన్‌... ఇలా విభిన్న రంగాలకు చెందిన సంస్థలన్నీ ఇప్పుడు జనరేషన్‌ జడ్‌ని ఆకట్టుకునే ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నాయి. తాము అనుసరిస్తున్న వ్యాపార, నైతిక విలువల గురించి ఉద్యోగ ప్రకటనల్లో స్పష్టంగా చెబుతున్నాయి. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ది ఎనిమిదన్నర దశాబ్దాల చరిత్ర. వినియోగవస్తువుల తయారీ రంగంలో ఉన్న కంపెనీల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అన్నది ఊహకందని విషయం. అలాంటిది ఆ విధానాన్ని అనుసరించడమే కాక తమ ఉద్యోగుల మదింపు(అప్రైజల్‌) పద్ధతినీ మార్చుకుంది. ఒకప్పుడు సిబ్బంది నైపుణ్యాలను బట్టి రాడికల్‌, ఎక్స్‌లెంట్‌, గుడ్‌... ఇలా రకరకాలుగా వర్గీకరిస్తే ఉద్యోగులు అభ్యంతరం చెప్పలేదట. ఇప్పటివాళ్లు మాత్రం దాన్ని ‘లేబులింగ్‌’గా భావించడంతో ఆ విధానాన్ని మానేసింది బజాజ్‌. మైనింగ్‌ రంగంలో ఉన్న ఒక సంస్థ పాతికేళ్ల కుర్రాడు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో 15 మంది ట్రాన్స్‌జెండర్లని ఉద్యోగాల్లోకి తీసుకుంది. అప్పటివరకూ కార్యాలయాల్లో వైవిధ్యం అంటే కొంతమంది స్త్రీలు ఉంటే చాలనుకునేవాళ్లం. మా అభిప్రాయం తప్పని ఎత్తిచూపించాడు ఆ కుర్రాడు... అంటుంది ఆ సంస్థ. ఇక చాలా సంస్థలు తమ భవనాల్లో ఇంటీరియర్స్‌ని ఆధునికంగానూ పర్యావరణహితంగానూ తీర్చిదిద్దుతున్నాయి. ఉద్యోగులు సేదతీరడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాయి. వారాంతాల్లో రకరకాల సరదా ఈవెంట్లను నిర్వహిస్తూ ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

ఇంతకీ... వీళ్లకేం కావాలి?

జనరేషన్‌ జడ్‌కి ఏం కావాలీ అన్నది ఇప్పుడు కంపెనీల ముందున్న పెద్ద ప్రశ్న. ఎవరికి వాళ్లు తమకు తోచిన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది సరిపోతుందన్న నమ్మకం కలగడం లేదు. అందుకే అధ్యయనాలు జరుపుతున్న సంస్థలన్నీ కలిసి జనరేషన్‌ జడ్‌ లక్షణాలను ఇలా క్రోడీకరించాయి...

యూనివర్సిటీ విద్యకి ప్రాధాన్యమిస్తారు. డ్రాపవుట్‌ వ్యవహారం నచ్చదు. తమను తాము గౌరవించుకుంటారు.

నిత్యం కొత్తదనం కావాలి. అది పనిలో కావచ్చు, చుట్టూ ఉన్న వాతావరణంలో కావచ్చు.

తమ ఆశయానికి సరిపోయే సంస్థలోనే పనిచేయడానికి ఇష్టపడతారు. కంపెనీ విధానాలూ విలువలూ తెలుసుకుంటారు. నచ్చని ఉద్యోగం చేయరు.

పర్యావరణం, సమాజం, పారదర్శక పాలన... జనరేషన్‌ జడ్‌కి ముఖ్యమైన అంశాలు. వీటిపట్ల బాధ్యతాయుతంగా ఉంటారు.

ఉద్యోగంలో చేరితే జీవితంలో సెటిలైపోయినట్లే అనుకోరు. ఎప్పటికప్పుడు పనిలో నైపుణ్యాలను పెంచుకుంటారు.

సోషల్‌మీడియాని కాలక్షేపానికి కాక, విషయాలు తెలుసుకోవడానికి వాడతారు.

రిస్క్‌ తీసుకోవడానికి భయపడరు. నలభై ఏళ్లకే రిటైరవ్వాలన్న ఆలోచనలో ఉంటారు.

ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ అవర్స్‌ని ఇష్టపడతారు. నిర్ణీత సమయాల్లోనే పనిచేయాలంటే ఒత్తిడికి గురవుతారు.

సంస్థలు రకరకాల వడపోత పరీక్షలు పెట్టి తమకు నచ్చిన ఉద్యోగుల్ని ఎంపిక చేసుకునే రోజులు పోయాయి... ఉద్యోగులే తమకు నచ్చే సంస్థల్ని ఎంచుకునే రోజులు వచ్చాయి. అందుకే... జనరేషన్‌ జడ్‌ని అర్థం చేసుకుని, వారికి నచ్చేలా, స్ఫూర్తినిచ్చేలా సంస్థలు సమూలంగా తమను తాము మార్చుకుంటేనే ఉభయులకూ లాభదాయకం అంటున్నారు నిపుణులు.

రేపటి ప్రపంచ నిర్మాతలు!

ఒకప్పుడు పాతిక ముప్పై ఏళ్లను ఒక తరంగా చెప్పేవారు.ఇప్పుడు పదేళ్లకే తరాల మధ్య అంతరం కనిపిస్తోంది. గత అర్ధశతాబ్దంలో ఆ అంతరం తెచ్చిన మార్పులివి...

బేబీ బూమర్స్‌: రెండో ప్రపంచయుద్ధం తర్వాత జననాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాంతో 1946-64 మధ్య పుట్టిన వారిని ‘బేబీ బూమర్స్‌’ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలురంగాల్లో చెప్పుకోదగ్గ మార్పులకు లోనైన తరం ఇది. కష్టపడి పైకి వచ్చి, ఇప్పటి వారికి మార్గదర్శకులుగా కన్పిస్తున్న బిల్‌గేట్స్‌, స్టీవ్‌జాబ్స్‌ లాంటివారంతా అప్పుడు పుట్టినవారే.

జనరేషన్‌ ఎక్స్‌: 1965- 84 మధ్య పుట్టినవారంతా జనరేషన్‌ ఎక్స్‌ తరానికి చెందినవారు. వీళ్లు వియత్నాం యుద్ధం, బెర్లిన్‌ గోడ కూలగొట్టడం, అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం లాంటి రాజకీయంగా ప్రాధాన్యం గల ఎన్నో ఘటనల్ని చూశారు. విశాల దృక్పథం, వైవిధ్యానికి ప్రాధాన్యమివ్వడం ఈ తరం ప్రత్యేకతలు.

జనరేషన్‌ వై: 1985-95 మధ్య పుట్టినవారిని ‘జనరేషన్‌ వై’ అనీ ‘మిలెనియల్స్‌’ అనీ అంటారు. సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్న తరంలో పుట్టడంతో సహజంగానే వీరిది ‘టెక్‌ శావీ’ తరం అయింది. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ నివేదిక ప్రకారం ఉద్యోగుల వ్యక్తిత్వాల్నీ విలువల్నీ నిశితంగా అధ్యయనం చేయడం మొదలెట్టింది కూడా ఈ తరం నుంచే. ఉద్యోగాల్లో వీళ్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో,ఏదైనా సాధించాలన్న స్ఫూర్తితో ఉంటారు. ఉద్యోగుల అభీష్టాలకు అనుగుణంగా కార్యాలయాలు మారడం మొదలెట్టిందీ వీరి తరం నుంచేనట.

జనరేషన్‌ జడ్‌: 1996- 2010 మధ్య పుట్టిన పోస్ట్‌ మిలెనియల్స్‌నే ‘జనరేషన్‌ జడ్‌’ అంటున్నారు. ఉద్యోగచరిత్రలో అత్యధిక విద్యావంతులున్న తరం ఇదే. కొవిడ్‌ సమయానికి అటూ ఇటూగా వీళ్లు ఉద్యోగాల్లో చేరడం మొదలైనా ఈ మధ్యే నియామకాలు ఊపందుకుంటున్నాయి. మరో నాలుగైదేళ్లకల్లా ప్రతి కార్యాలయంలోనూ మూడోవంతు వీళ్లే ఉంటారని అంచనా. ఇంటర్నెట్టూ గ్యాడ్జెట్లూ లేకుండా క్షణం గడవని వీరిని డిజిటల్‌ జనరేషన్‌ అంటున్నారు. ఒకేసారి ఐదు స్క్రీన్లమీద పనిచేయగల సమర్థులు. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండున్నర వందల కోట్ల మంది ఈ తరానికి చెందినవారే కాగా అందులో 35 కోట్లు మనదేశంలోనే ఉన్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పెనుమార్పులకు కారణమయ్యే సత్తా జనరేషన్‌ జడ్‌కి ఉందనీ రేపటి ప్రపంచ నిర్మాతలు వీరేననీ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ నివేదిక చెబుతోంది.

‘పెళ్లయిందా’ అని అడగడమూ తప్పే!

ఉద్యోగుల తరం మారినప్పుడు వారికి తగినట్లుగా పై అధికారుల్లోనూ యాజమాన్యంలోనూ మార్పు రావాలి. తాము పెట్టుకున్న విధివిధానాల మూసలోనే ప్రతి ఉద్యోగీ ఒదిగిపోవాలనుకోవడమూ అందరినీ ఒకే గాట కట్టడమూ ఇప్పుడు కుదరదు. ఉద్యోగి నైపుణ్యాలకు అనుగుణంగా అతడి పని విధానాన్ని రూపొందించాలి. ఎవరి ప్రత్యేకత వారిదేనని గుర్తించి గౌరవించాలి. కేవలం సంస్థ విధానాలను మార్చుకుంటే సరిపోదు, నాయకత్వ స్థానాల్లో ఉన్నవారి భాషా ప్రవర్తనా కూడా మారాలంటున్నారు నిపుణులు. ఈ విషయంలో కొన్ని సంస్థలు ఇప్పటికే తమ సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నాయి. ఇంకా... ‘సర్‌’, ‘మేడమ్‌’లాంటి పిలుపుల్ని జనరేషన్‌ జడ్‌ నుంచి ఆశించకూడదు. సీఈఓని కూడా పేరుతోనే పిలుస్తారు వాళ్లు. ఆఫీసులో తరచూ పార్టీలు చేసుకోవడం ఇప్పుడు సాధారణ విషయం. అలాంటి పార్టీల్లో కూడా ఎవరినీ ఏ విషయంలోనూ బలవంతం చేయకూడదు. యువతరం ఎంత స్నేహపూర్వకంగా మసలుతుందో అంత ప్రైవసీనీ కోరుకుంటుంది. అందుకని వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. సరదాగా అయినా పెళ్లయిందా, ప్రేమలో ఉన్నావా లాంటి ప్రశ్నలు అడగకూడదు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ’జీఆర్‌ఈ’లో ముఖ్య మార్పులివే..

‣ ఆన్‌లైన్‌లో ముఖ్యం.. పాజిటివిటీ

‣ 8,612 ఉద్యోగాలకు ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌

‣ ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు

‣ డిగ్రీ, బీటెక్‌తో వాయుసేనలో ఉన్నతోద్యోగం

‣ ఇంటర్‌తో ఆర్మీలో చదువు.. ఆపై ఉద్యోగం

Posted Date : 11-06-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.