• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో ఆర్మీలో చదువు.. ఆపై ఉద్యోగం

10+2 టెక్నికల్‌ ఎంట్రీతో అవకాశం

ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూపు విద్యార్థులు ఉచితంగా బీటెక్‌ చదువుకుని, లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది. ఇందుకు ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ దారి చూపుతుంది. జేఈఈ మెయిన్‌ స్కోరు ప్రకారం దరఖాస్తులు షార్ట్‌లిస్ట్‌ చేసి, రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. ఎంపికైనవారికి బీటెక్‌ కోర్సు, లెఫ్టినెంట్‌ కొలువులకు ఉచిత శిక్షణ ఐదేళ్లు కొనసాగుతుంది. 

ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీముకు ఎంపికయినవారికి జనవరి, 2024 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసుకున్నవారికి బీటెక్‌ డిగ్రీతోపాటు ఆర్మీలో లెఫ్టినెంట్‌ ఉద్యోగం సొంతమవుతుంది. విధుల్లో చేరినవారికి నెలకు లక్ష రూపాయల వేతనం లభిస్తుంది. 

ఎంపిక..

జేఈఈ మెయిన్‌-2023 స్కోరుతో ఈ కోర్సు, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి స్కోరు మెరిట్‌తో షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో బెంగళూరులో ఐదు రోజులు రెండు దశల్లో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. తొలిరోజు స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ (ఇంటెలిజెన్స్‌) పరీక్షల్లో అర్హత సాధించినవారిని స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత నాలుగు రోజులు నిర్వహించే వివిధ పరీక్షల్లో అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని కోర్సు, శిక్షణకు తీసుకుంటారు.

కోర్సు, శిక్షణ

మొత్తం ఐదేళ్లు కోర్సు, శిక్షణ కొనసాగుతుంది. ఇందులో ఏడాది పాటు ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ - గయలో బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం నాలుగేళ్లు టెక్నికల్‌ ట్రైనింగ్‌ పుణె, సికింద్రాబాద్, మావ్‌ల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఏదో ఒక చోట కొనసాగుతుంది. ఇందులో రెండు దశలు...ఫేజ్‌-1 మూడేళ్ల ప్రీ కమిషన్‌ ట్రైనింగ్, ఫేజ్‌-2 ఏడాది పోస్ట్‌ కమిషన్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. మూడేళ్ల ఫేజ్‌-1 శిక్షణ అనంతరం ఫేజ్‌-2లో అభ్యర్థులకు ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ అందుతుంది. నాలుగేళ్ల శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్‌ హోదా దక్కుతుంది. శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజినీరింగ్‌ (బీటెక్‌) డిగ్రీని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూదిల్లీ అందిస్తుంది. 

వీరిని పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు. లెవెల్‌-10 మూలవేతనం రూ.56,100, మిలటరీ సర్వీస్‌ పే రూ.15,500 ప్రతి నెలా అందుతాయి. వీటికి డీఏ, హెచ్‌ఆర్‌ఎ, పలు ప్రోత్సాహకాలు దక్కుతాయి. మొదటి నెల నుంచే వీరు అన్ని ప్రోత్సాహకాలతో నెలకు దాదాపు లక్ష రూపాయలు అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు. రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల సర్వీస్‌తో మేజర్, పదమూడేళ్లకు లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలు దక్కుతాయి. ఈ విధానంలో ఎంపికైనవాళ్లు పదవీవిరమణ వయసు వరకు లేదా ఆసక్తి ఉన్నంత వరకు విధుల్లో కొనసాగవచ్చు. ఇవి శాశ్వత (పర్మనెంట్‌) పోస్టులు.     

ఖాళీలు: 90 

అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌/ప్లస్‌ 2. జేఈఈ మెయిన్స్‌ 2023 స్కోరు తప్పనిసరి. పురుషులు మాత్రమే అర్హులు.

వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2004 జులై 2 - 2007 జులై 1 మధ్య జన్మించినవారే అర్హులు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జూన్‌ 30 వరకు స్వీకరిస్తారు.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/Authentication.aspx
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ కష్టంతో మూడు కేంద్ర కొలువులు

‣ ఫైన్‌ ఆర్ట్స్‌లో వైఎస్‌ఆర్‌ఏఎఫ్‌యూ కోర్సులు

‣ ఎన్‌ఎల్‌సీలో పారామెడికల్‌ పోస్టులు

‣ ఇంటర్‌తో అత్యున్నత హోదా

Posted Date : 06-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌