• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కష్టంతో మూడు కేంద్ర కొలువులు

మాకవరపాలెం యువకుడి ఘనత

ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే అంత సులభం కాదు.. లక్షల మంది అభ్యర్థులు పగలూ రాత్రీ కష్టపడి చదువుతుంటారు. అంత శ్రమించినా ఒక్కోసారి విజయం సాధించడం కష్టమవుతుంది. అలాంటిది ఈ అబ్బాయి ఒకేసారి మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు.. అన్నీ ఆఫీసర్‌ స్థాయివే! అదీ 26 ఏళ్లు నిండకుండానే. ఈ విజయాల వెనుక ఆరేళ్ల సన్నద్ధత ఉంది. తను ఎలా ఈ ఉద్యోగాలు పొందాడో రుత్తల రేవంత్‌ వివరించారు. మనమూ తెలుసుకుందామా..

మాది అనకాపల్లి జిల్లా మాకవరపాలెం. నాన్న వ్యాపారం చేస్తుంటారు, అమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచీ నేనూ, తమ్ముడూ చదువులో ముందుండేవాళ్లం. ఇంటర్‌లో 903 మార్కులు వచ్చాయి. డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో చేరాను. జాయిన్‌ అయ్యానే కానీ మొదటి రెండేళ్లు అసలు కాలేజీకి సరిగ్గా వెళ్లేవాడిని కాదు. పూర్తిగా డిఫెన్స్, నేవీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవాడిని.

పరీక్షలకు మాత్రమే హాజరయ్యేలా ముందే యాజమాన్యంతో మాట్లాడుకున్నాను. దీనికోసం బెంగళూరు వెళ్లి కోచింగ్‌ కూడా తీసుకున్నా. అలా మొదటి రెండు మూడేళ్లలో 6 పోటీ పరీక్షలు పాసయ్యాను. అంతా అయిపోయింది అనుకునే సమయంలో మెడికల్‌ టెస్ట్‌లో ఫెయిల్‌ అయ్యేవాడిని. మొత్తం అన్ని ఉద్యోగాలూ ఆఖర్లో పెట్టే ఆ టెస్ట్‌ వల్లే రాకుండా పోయాయి. చాలా నిరుత్సాహపడ్డాను. కానీ తేరుకుని ఉపాయం ఆలోచించడం ప్రారంభించాను. అప్పుడే నా పోటీ పరీక్షల ప్రయాణంలో రెండో భాగం మొదలైంది.

కొవిడ్‌ మొదటి వేవ్‌ సమయంలో హాస్టళ్లు మూతపడటంతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. రెండో వేవ్‌ ముగిశాక మళ్లీ హైదరాబాద్‌ వచ్చాను. అప్పటికి అంతా ఇంకా పూర్తిగా తేరుకోకపోవడంతో క్లాసులు సరిగ్గా జరిగేవి కాదు. కానీ నేను మాత్రం రూమ్‌లో ఉండి, నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి చదువుకుంటూ ఉండేవాడిని. కొన్నాళ్లకు అక్కడి నుంచి ఇంటికి వచ్చేశాను.

ఊళ్లో నాలాగే సీరియస్‌గా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మరో ముగ్గురిని వెతికి పట్టుకున్నా. అందరం కలిసి కేవలం చదువుకోవడం కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాం. ఆ ఇంట్లో వేరే ఫర్నిచర్‌ ఏదీ ఉండేది కాదు. కేవలం చదువుకునే బల్లలు, ల్యాప్‌టాప్‌లు, ఎప్పుడైనా నైట్‌అవుట్‌ చేస్తే పడుకునేందుకు చిన్నపాటి పరుపులు ఉండేవంతే. అలా మా ప్రిపరేషన్‌కు ఆ ఇంటిని లైబ్రరీలా వాడుకున్నాం. అప్పుడే వరుసగా ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ రాశాను.

నేను ఫెయిల్‌ అవుతున్నది మెడికల్‌ టెస్టుల్లో కదా.. అందుకే అసలు ఆ టెస్టే లేని పరీక్షలు ఏం ఉన్నాయా అనేది వెతికేవాడిని. హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు నా దృష్టి రైల్వే, ఎస్‌ఎస్‌ఎస్‌ సీజీఎల్‌ పరీక్షల మీద పడింది. తరచూ నోటిఫికేషన్లు రావడం, రిక్రూట్‌మెంట్‌ కచ్చితంగా జరిగే అవకాశం ఉండటంతో పూర్తిస్థాయిలో వాటిపై దృష్టి పెట్టాను. ముందు నుంచి నేను ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగాలకే ప్రయత్నించేవాడిని. టెన్త్, ఇంటర్‌ అర్హతతో నిర్వహించే ఏ ఒక్క పరీక్షనూ రాయలేదు. వాటితో క్యాడర్‌ మెరుగవ్వడానికి ఎక్కువ సమయం పట్టడమే ఇందుకు కారణం. ఒకవేళ వస్తే తృప్తిపడి అక్కడితో ఆగిపోతానని భయం. కేవలం డిగ్రీ అర్హతతో ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగాలకే పోటీపడ్డాను. అలా సన్నద్ధత కొనసాగుతుండగా కరోనా రావడంతో ఒక్కసారిగా అంతా గందరగోళం అయిపోయింది.

చివరికి అన్ని పరీక్షలూ కలిపి రైల్వే, కాగ్, కస్టమ్స్‌లో ఉద్యోగాలు సంపాదించాను. రైల్వేలో ట్రెయిన్‌ మేనేజర్‌గా లెవెల్‌ 5 జాబ్‌ వచ్చింది. కాగ్‌లో అకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది, అది కూడా లెవెల్‌ 5 జాబ్‌. చివరిగా కస్టమ్స్‌లో ఎగ్జామినర్‌ పోస్టు సంపాదించాను. ఇది లెవెల్‌ 7 ఉద్యోగం. ప్రస్తుతం ఇందులోనే చేరబోతున్నాను. నా స్కోరుకు బహుశా చెన్నైలో పోస్టింగ్‌ వచ్చే అవకాశం ఉండొచ్చు. ప్రారంభ వేతనం రూ.80 వేల వరకూ ఉంటుంది. 

ఈ జర్నీలో చాలా సార్లు ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయేది. మొదటిసారి ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌లో 0.3 మార్కులతో జాబ్‌ పోయింది. రెండోసారి కూడా ఉద్యోగం రాకపోయేసరికి చాలా బాధపడ్డాను. అయితే మూడు, నాలుగు అటెమ్ట్స్‌కి బాగా కష్టపడ్డాను. అప్పుడే కాగ్, కస్టమ్స్‌ డిపార్ట్స్‌మెంట్స్‌లో ఉద్యోగాలొచ్చాయి.

పుస్తకాలు

నేను రాసిన పరీక్షల్లో ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇంగ్లిష్‌ కోసం ‘వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ’ పుస్తకాన్ని అనుసరించాను. ఆప్టిట్యూడ్‌ కోసం రాకేష్‌ యాదవ్, కిరణ్‌ పబ్లికేషన్స్‌ పుస్తకాలు చదివాను. పినాకిల్‌ సిరీస్‌ కూడా బాగున్నాయి. జీకే కోసం లూసెంట్స్‌ చదివాను. రోజూ హిందూ పత్రిక చదువుతూ కొత్తపదాలను ఒక చోట రాసుకుని వాటి అర్థాలు తెలుసుకునే వాడిని. దానికోసం ప్రత్యేకంగా ఒక పుస్తకం పెట్టుకున్నాను. దీనివల్ల భాషపై బాగా పట్టు దొరికింది.

సన్నద్ధత

నాకు రాత్రుళ్లు మెలకువగా ఉండటం కష్టంగా అనిపించేంది. అందుకే పొద్దున్నే 4, 4:30 మధ్య నిద్ర లేచేవాడిని. అప్పటికి ఎవ్వరూ నిద్రలేవకపోవడం వల్ల అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటూ చదువుకోవడానికి బాగా ఏకాగ్రత కుదిరేది. అలా పొద్దున్న 10, 11 గంటల వరకూ కదలకుండా చదివేవాడిని. తర్వాత కూడా సాయంత్రం 4 గంటల వరకూ చదివి తర్వాత గ్రౌండ్‌కి వెళ్లేపోయేవాడిని. ఎక్కడ ఉన్నా ఒక గంట బ్యాడ్మింటన్‌ ఆడటం అలవాటు. ఆ సమయంలోనే బాగా రిలాక్స్‌ అయ్యేవాడిని. రాత్రి త్వరగా పడుకుని మళ్లీ తెల్లవారుజామునే లేవడం.. అలాగే రోజూ ప్రిపరేషన్‌ సాగేది.

కొత్తగా చదివేవారు..

కొత్తగా పోటీ పరీక్షలు రాసేవారు కనీసం ఒక ఏడాది పూర్తిస్థాయిలో క్లాసులకు హాజరుకావడం మంచిది. తర్వాత ఎక్కడ ఉండైనా సన్నద్ధత కొనసాగించవచ్చు. రోజుకు 8 నుంచి 10 గంటల సమయం వెచ్చిస్తే సరిపోతుంది. ఎంతసేపు చదివాం అనేదాని కంటే ఎంత ఏకాగ్రతతో చదివాం అనేది ప్రధానం. డైలీ మాక్‌ టెస్టులు రాయడంతోపాటు వారానికి ఒక్కసారైనా లైవ్‌ మాక్‌ టెస్టులు రాయాలి. అప్పుడే టైం మేనేజ్‌మెంట్‌ తెలుస్తుంది. నాకు ప్రిపరేషన్‌లో టెలిగ్రామ్‌ గ్రూప్స్‌ చాలా ఉపయోగపడ్డాయి. ఏదైనా సందేహం ఉంటే అందులో పోస్ట్‌ చేస్తే ఎక్కడెక్కడి నుంచో నాలాగే చదివేవారు రెస్పాండ్‌ అవుతూ కొత్త కొత్త షార్ట్‌కట్స్‌ చెప్పేవారు. రోజూ లేచాక ఇవాళ ఏం చదవాలి అనేది ఒక షెడ్యూల్‌ వేసుకుని రోజు పూర్తయ్యేలోపు ఏదోలా దాన్ని పూర్తిచేసేవాడిని. ఈ పద్ధతులు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కానీ ఏళ్లకేళ్లు సన్నద్ధత పేరుతో వృథా చేసుకోకుండా మొదటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే.. పాతికేళ్లలోపే ప్రభుత్వ కొలువు పొందొచ్చు!
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎన్‌ఎల్‌సీలో పారామెడికల్‌ పోస్టులు

‣ ఇంటర్‌తో అత్యున్నత హోదా

‣ ఇంటర్‌తో 1600 కేంద్ర కొలువులు

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు తుది సన్నద్ధత

‣ బోధన ఉద్యోగాలకు తొలి మెట్టు.. నెట్‌

‣ ఇంటర్‌తో ఉపాధ్యాయ విద్య.. డీఎడ్‌

Posted Date : 26-05-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌