• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో 1600 కేంద్ర కొలువులు

* ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ నోటిఫికేషన్‌

   

   

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో కేంద్రప్రభుత్వ కొలువు కావాలా? అయితే మీకో అద్భుత అవకాశం! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) ప్రకటన వెలువడింది. వివిధ కేంద్రప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన  వాటిలో  గ్రూప్‌-సికి చెందిన లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీ జరగబోతోంది. 

మొత్తంగా 1600 ఖాళీలు సీహెచ్‌ఎస్‌ఎల్‌ ద్వారా భర్తీ అవనున్నాయి. వీటి సంఖ్య రాబోయే కాలంలో ఇంకా పెరిగే అవకాశం ఉంది. 12వ తరగతి/ ఇంటర్‌మీడియట్‌ అర్హత ఉన్నవారెవరైనా జూన్‌ 8లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 


ఈ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషలతోపాటు 13 ఇతర ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం ఉంది. కాబట్టి తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులకు తెలుగులో రాసే అద్భుత అవకాశం ఉంది. 

   


ఎంపిక 


రెండు దశల్లో (టయర్‌-1, టయర్‌-2) నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 
మొదటి దశ పరీక్ష (టయర్‌-1) అర్హత పరీక్ష మాత్రమే. దీంట్లో తగిన మార్కులు సాధించిన అభ్యర్థులకు రెండో దశ (టయర్‌-2) పరీక్షను నిర్వహిస్తారు. దీనిలో ఎక్కువ మార్కులతో ప్రతిభ చూపిన అభ్యర్థుల నుంచి తుది ఎంపిక ఉంటుంది. అయితే అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి రెండో దశలో నిర్వహించే స్కిల్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌లలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. 

   


జీతభత్యాలు


ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు మూలవేతనం రూ.19900, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌కు రూ.25,500 ఉంటుంది. వీటికి వివిధ అలవెన్సులు (డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ, స్పెషల్‌ అలవెన్స్‌ మొదలైనవి) కలుస్తాయి. అన్నీ కలిపి పనిచేసే ప్రాంతాలను బట్టి, ఎల్‌డీసీ/జేఎస్‌ఏలకు సుమారు రూ.30 వేల వరకూ, డీఈఓలకు రూ.40 వేల వరకూ ప్రారంభంలో నెల వేతనాలు ఉంటాయి. 

   


పదోన్నతులు


* ఎల్‌డీసీ/జేఎస్‌ఏలుగా ఉద్యోగం ప్రారంభించినవారు అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌ (యూడీసీ), డివిజన్‌ క్లర్క్‌ నుంచి సెక్షన్‌ ఆఫీసర్‌ వరకూ చేరుకోవచ్చు.

* డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా కెరియర్‌ ప్రారంభిస్తే డీఈఓ గ్రేడ్‌ బి, గ్రేడ్‌ సి నుంచి గ్రేడ్‌ ఎఫ్‌ (సిస్టమ్‌ అనలిస్ట్‌) వరకూ చేరుకునే అవకాశం ఉంది. 

   


సన్నద్ధత ఎలా?


గత సంవత్సరం నుంచీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షా విధానంలో మార్పు వచ్చింది. ఇంతకుముందు ఉన్న ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ విధానం బదులుగా రెండు దశల్లోనూ ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా రెండు దశల్లోనూ దాదాపు ఒకే రకమైన సబ్జెక్టులున్నాయి. కాబట్టి అభ్యర్థులు రెండు దశలకు కలిపి ఉమ్మడిగానే సన్నద్ధతను మొదలుపెట్టాలి. 


  ముందుగా నోటిఫికేషన్‌లో వివరంగా వచ్చిన సిలబస్‌ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత గతంలో జరిగిన పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలు వచ్చాయో గమనించాలి. దీనివల్ల మీ సన్నద్ధత ఏ విధంగా, ఏ స్థాయిలో ఉండాలో అర్థమవుతుంది. ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో వచ్చే ప్రశ్నల మధ్య భేదాన్ని అర్థం చేసుకోవాలి. 


తొలిసారిగా పరీక్ష రాసే అభ్యర్థులు తమ సన్నద్ధతను మూడు భాగాలుగా విభజించుకోవాలి. 

1. టాపిక్స్‌ నేర్చుకోవడం

2. ప్రశ్నలు వేగంగా చేసేలా బాగా సాధన చేయడం.

3. మోడల్‌ ప్రశ్నపత్రాలు సాధన చేయడం.


ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటిలాగా కాకుండా కలిసే ఉండేలా చూసుకోవాలి. అంటే ముందుగా సబ్జెక్టులోని టాపిక్‌ బేసిక్‌ కాన్సెప్ట్స్‌ను నేర్చుకుని దానిలోని వివిధ తరహా ప్రశ్నలు సాధన చేయాలి. టాపిక్స్‌ మొత్తం నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా ప్రతిరోజూ ఒక మాదిరి ప్రశ్నపత్రం సాధన చేయాలి. దీనివల్ల నిర్ణీత సమయంలో ప్రశ్నలు పూర్తిచేసే మెలకువలు అర్థమవుతాయి. 

   


క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ మేథమెటికల్‌ ఎబిలిటీస్‌ 


* అన్ని టాపిక్స్‌ను బాగా నేర్చుకోవాలి. వాటిలో వివిధ తరహాలో అడిగే ప్రశ్నలు సాధన చేయాలి. 

* కాలిక్యులేషన్స్‌ వేగంగా చేయగలగే స్పీడ్‌మ్యాథ్స్‌/ మెంటల్‌ కాలిక్యులేషన్స్‌ నేర్చుకోవాలి.

* వేగంగా చేయగలిగేలా షార్ట్‌కట్‌ పద్ధతులను ఉపయోగించాలి. 

* పర్సంటేజి టాపిక్‌పై పూర్తి పట్టు సాధించాలి. మనసులోనే పర్సంటేజి లెక్క కట్టేలా సాధన చేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం.

* వర్గాలు (30 - 50), ఘనాలు (15 - 20), ఎక్కాలు (20 - 25), వర్గమూలాలు, ఘన మూలాలు బాగా నేర్చుకోవాలి. 

   

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌


*  దీంట్లో వెర్బల్, నాన్‌-వెర్బల్‌ ప్రశ్నలు లాజికల్‌గా డేటా ఆధారంగా ఉంటాయి. 

*  అనాలజీ, క్లాసిఫికేషన్‌ ప్రశ్నల పాటర్న్‌ గుర్తుంచుకుని తక్కువ సమయంలో పరిష్కరించే విధంగా సాధన చేయాలి.

*  మార్కులు సాధించే వెన్‌ డయాగ్రమ్, ఆల్ఫాబెట్‌ టెస్ట్, షార్ట్‌నోట్స్‌ నేర్చుకోవాలి. నంబర్‌ సిరీస్‌ ప్రశ్నలు రెగ్యులర్‌గా సాధన చేయాలి. 

*  వివిధ రకాలైన ‘పజిల్స్‌’ ప్రాక్టీస్‌ చేయాలి. దీనివల్ల క్రిటికల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు సాధించగలిగే నేర్పు అలవడుతుంది. 

*  సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌/బ్లడ్‌రిలేషన్స్‌/డైరెక్షన్స్‌ టాపిక్స్‌లకు ఇచ్చిన సమాచారాన్ని ఫ్లోఛార్ట్‌/డయాగ్రమ్‌ రూపంలో తయారుచేసుకుంటే ప్రశ్నలను తేలిగ్గా, వేగంగా సాధించే వీలుంటుంది. 

   

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌


* బేసిక్‌ గ్రామర్‌ బాగా నేర్చుకోవాలి. ప్రిలిమ్స్‌లో దీని ఆధారంగా వచ్చే సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్, స్పాటింగ్‌ ఎర్రర్స్, ఫిల్లింగ్‌ ది బ్లాంక్స్, క్లోజ్‌టెస్ట్‌ మొదలైన ప్రశ్నలు బాగా సాధించవచ్చు. 

* రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ కోసం ముందుగా ఇచ్చిన పాసేజ్‌ అర్థంచేసుకుని దానిలోని విషయాలు నోట్‌ చేసుకోవాలి. దీనివల్ల ప్రశ్నను చదవగానే వెంటనే జవాబు ఏదో తెలిసిపోతుంది. 

* క్లోజ్‌టెస్ట్‌ ప్రశ్నల్లో ముందుగా ఖాళీలలో ఇచ్చి పాసేజ్‌ మొత్తం చదివితే దీనిపై కొద్దిగా అవగాహన ఏర్పడుతుంది. ఇచ్చిన ఆప్షన్స్‌లోని ఏ పదం ఖాళీలో ఉంచితే అర్థవంతమైన వాక్యమవుతుందో తెలుస్తుంది. దీనికోసం ఒకాబ్యులరీ పెంచుకోవాలి. గ్రామర్‌పై పట్టు ఉండాలి. 

* సిననిమ్స్‌ (పర్యాయ పదాలు), యాంటనిమ్స్‌ (వ్యతిరేక పదాలు) కోసం వివిధ వార్తాపత్రికలు, టీవీ వార్తలు, వ్యక్తుల సంభాషణల ద్వారా రకరకాలైన తెలియని పదాలను గుర్తించి వాటికి సిననిమ్స్, యాంటనిమ్స్‌ నేర్చుకోవాలి. ఇది నిరంతర ప్రక్రియలా కొనసాగాలి. 

* ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌ తప్పనిసరి విభాగం. పాపులర్‌ ఇడియమ్స్, ఫ్రేజల్‌ వెర్బ్స్‌ను బాగా నేర్చుకుని ఫిల్లింగ్‌ ద బ్లాంక్‌ తరహా ప్రశ్నలు సాధన చేయాలి. వీలైతే కొన్నింటిని కంఠస్థం చేసుకోవాలి. 

   


జనరల్‌ అవేర్‌నెస్‌/ జనరల్‌ నాలెడ్జ్‌


* ప్రతిరోజూ వార్తా పత్రికలు చదువుతూ ముఖ్యమైన విషయాలు నోట్‌ చేసుకోవాలి. 

* ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో బేసిక్‌  కాన్సెప్ట్‌లను నేర్చుకోవాలి. 

* పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టుల ముఖ్య విషయాలను బాగా నేర్చుకోవాలి. 

* ముఖ్యమైన ప్రదేశాలు, వ్యక్తులు, కట్టడాలు, దేశాల కరెన్సీలు, రాజధానులు, ఎత్తయినవి, పెద్దవి మొదలైనవాటితో కూడిన స్టాటిక్‌ జీకేను నేర్చుకోవాలి. 

* జాతీయ/అంతర్జాతీయ దినోత్సవాలను గుర్తుంచుకోవాలి. 

   

గుర్తుంచుకోండి


ఎస్‌ఎస్‌సీలో సాధారణంగా కొన్ని ప్రశ్నలు మళ్లీ మళ్లీ వస్తుంటాయి. అందువల్ల గతంలోని పరీక్షల ప్రశ్నపత్రాలు తప్పనిసరిగా (కనీసం 4, 5) సాధన చేయాలి. 

* స్టాటిక్‌ జీకే, కరెంట్‌ అఫైర్స్‌ ఎక్కువ మార్కులు తెచ్చి పెట్టే విభాగం. గత ప్రశ్నపత్రాల ద్వారా ప్రశ్నల సరళిని గమనించి తగిన విధంగా సిద్ధం కావాలి. 

* మాదిరి ప్రశ్నపత్రాలు ప్రతిరోజూ సాధన చేయాలి. వాటిని విశ్లేషించి బలహీనంగా ఉన్న టాపిక్స్‌పై దృష్టి కేంద్రీకరించాలి. లాప్‌టాప్‌/ మొబైల్‌లో కంటే వీటిని కంప్యూటర్‌ మీదనే సాధన చేయాలి. 

*  ప్రతిరోజూ అన్ని విభాగాలూ కవర్‌ అయ్యేలా చూడాలి. ప్రతీవారం సాధనను సమీక్షించుకోవాలి.

* మెయిన్స్‌ పరీక్షలో ఉండే స్కిల్‌/టైపింగ్‌ టెస్ట్‌ కోసం రోజూ టైపింగ్‌ సాధన చేయాలి.  అదేవిధంగా బేసిక్‌ కంప్యూటర్‌ విషయాలు నేర్చుకోవాలి. 

* పరీక్ష రాసే వరకూ ఎలాంటి విరామం లేకుండా క్రమం తప్పకుండా సాధన చేయడం చాలా ముఖ్యం. 


  పరీక్షకు ఉండే సమయాన్ని అనుసరించి ప్రణాళికను నిర్దేశించుకుని దానికి తగిన విధంగా సాధన చేయాలి. అలాచేస్తే ఆకర్షణీయమైన వేతనాలు, సదుపాయాలు ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఈ సాధన రాబోయే ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. 

- డా.జి.ఎస్‌. గిరిధర్‌  డైరెక్టర్, రేస్‌ ఇన్‌స్టిట్యూట్‌

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సమ్మర్‌లో సరికొత్త కోర్సులు

‣ సరిహద్దు దళంలో 247 కొలువులు

‣ డిగ్రీతో సీఏపీఎఫ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు

‣ నలంద వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లు

Posted Date : 16-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌