• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సమ్మర్‌లో సరికొత్త కోర్సులు

కెరియర్‌కు ఉపయోగపడే స్కిల్స్‌

చదివి చదివి బోర్‌ కొట్టిందా..? మరి ఏదైనా కొత్తగా చేయొచ్చుగా.. అది మన కెరియర్‌కు పనికొచ్చే స్కిల్‌ అయితే ఇంకా బాగుంటుంది కదా..! ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి వేసవి సెలవులు భలే చక్కని అవకాశం. అకడమిక్స్‌ నుంచి భిన్నంగా, ఆసక్తిగా, ఇష్టంగా నేర్చుకునే వీలుండేది ఈ సమయంలోనే. మరి ఈ తక్కువ టైమ్‌లో ఉద్యోగాలకు ఉపయోగపడేలా నేర్చుకోదగిన నైపుణ్యాలు ఏం ఉన్నాయో.. ఎక్కడ దొరుకుతున్నాయో.. ఓసారి చూసేద్దామా!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పుడూ పరిగెత్తుతూనే ఉండాలి. అప్పుడే జాబ్‌ మార్కెట్‌లో మనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. వేసవిలో ఖాళీగా దొరికిన సమయాన్ని సరదాగా గడుపుతూనే నూతన నైపుణ్యాలు సమకూర్చుకునేందుకు కూడా ఉపయోగించవచ్చు. ఆ స్కిల్స్‌ తర్వాత రెజ్యూమెలో చూపించుకునేందుకు పనికొస్తాయి.

గ్రాఫిక్‌ డిజైనింగ్‌

ఇది ప్రస్తుతం సులభంగా నేర్చుకోదగిన, అధికంగా డిమాండ్‌ ఉన్న కోర్సు. గ్రాఫిక్‌ డిజైనర్లు కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విజువల్‌ కాన్సెప్ట్స్‌ తయారుచేయడం, వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా ఆలోచనలను ప్రదర్శించడం చేస్తారు. దీన్ని రెండు నుంచి మూడు నెలల్లో నేర్చుకోవచ్చు. ఇందులోనే వివిధ ప్లాట్‌ఫామ్స్‌ గురించి కూడా నేర్పిస్తారు. ఇందుకు ఇలస్ట్రేటర్, కోరల్‌ డ్రా, ఫొటోషాప్‌ వంటి చాలా అప్లికేషన్లు ఉన్నాయి. ఇది యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా, నేర్చుకోవడం కూడా ఆసక్తిగా ఉంటుంది. కొన్నినెలల సాధనతో ఎవరైనా ఈ డిజైనింగ్‌ వర్క్స్‌ చేయగలుగుతారు. తర్వాత ఫ్రీలాన్సర్‌గా చేస్తూ ఉంటే పాకెట్‌మనీగా కూడా ఉపయోగపడుతుంది. సృజనాత్మక రంగాల్లోకి ప్రవేశించాలనుకునే విద్యార్థులకు ఈ స్కిల్‌ చాలా అవసరమైనది.

గ్రాఫిక్‌ డిజైన్, మల్టీమీడియా ఇన్‌స్టిట్యూట్లు దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో వారాల వ్యవధి నుంచి మూడు నెలల వరకూ ఉండే స్వల్పకాల కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇవేకాక యుడెమీ, సింప్లీలెర్న్, కోర్సెరా వంటి లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లోనూ దీనికి సంబంధించి కోర్సులు అందుబాటులో  ఉన్నాయి.

వెబ్‌ డిజైనింగ్‌

ఏ వ్యాపారానికైనా చూడచక్కని, ఉపయోగించేందుకు వీలుగా వెబ్‌సైట్‌ ఉండటం చాలా ముఖ్యం. ఈ పని చేసేవారే వెబ్‌ డిజైనర్లు, డెవలపర్లు. ఆకర్షించే వెబ్‌సైట్లు, ఇంటరాక్టివ్‌ పేజెస్, నావిగేషన్లు తయారుచేయడం వీరి విధి. ఉద్యోగంలో ఉపయోగించుకోవడమే కాకుండా.. దీన్నే కెరియర్‌గానూ మలచుకోవచ్చు. ఇందులో గ్రాఫిక్‌ ఆర్ట్, వెబ్‌ డిజైనింగ్, వెబ్‌ స్టాండర్డ్స్, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్, డిజిటల్‌ అండ్‌ ఇంటరాక్టివ్‌ డిజైనింగ్‌ వంటి స్కిల్స్‌ నేర్చుకుంటారు. మొదలుపెట్టే క్రమంలో ప్రాథమిక అంశాల కోసం తక్కువ వ్యవధి కలిగిన కోర్సులు తీసుకోవచ్చు. తర్వాత మరింత ప్రొఫెషనల్‌గా నేర్చుకోవాలనిపిస్తే పూర్తిస్థాయి కోర్సులు ఎంచుకోవచ్చు. 

వెబ్‌డిజైనింగ్‌ను అప్‌గ్రాడ్, యుడెమీ, సెమ్‌రష్‌ అకాడమీ వంటి అన్ని ప్లాట్‌ఫామ్స్‌ నుంచి నేర్చుకోవచ్చు. యూట్యూబ్‌లోనూ చాలా ట్యుటోరియల్స్‌ లభిస్తున్నాయి.

నూతన భాష

సెలవుల్లో కొత్త భాష నేర్చుకోవడాన్ని మించిన చక్కని పని ఇంకేదైనా ఉంటుందా చెప్పండి! ఇంగ్లిష్, హిందీలను పూర్తిస్థాయిలో సాధన చేయడంతోపాటు విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులు ఫారిన్‌ లాంగ్వేజెస్‌ మీద కూడా దృష్టి పెట్టవచ్చు. ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్‌ వంటివీ నేర్చుకోవచ్చు. విదేశాల్లో కొన్ని కంపెనీల్లో పనిచేయాలంటే స్థానిక భాష కచ్చితంగా తెలిసి ఉండాలనే నిబంధన ఉంది. అలాంటప్పుడు ఈ భాషాజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది.

భాషలు నేర్చుకోవాలి అనుకునేటప్పుడు యాప్స్‌ బాగా ఉపయోగపడతాయి. డ్యూలింగో, బాబల్, ఫ్లూయెంట్‌యూ.. ఇలా ఏ యాప్‌ ద్వారానైనా సులభంగా నేర్చుకోవచ్చు.

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

నిజానికి భావ ప్రకటన నైపుణ్యాలు నేర్చుకోవడం ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది. ఎందుకంటే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అనేవి కాలేజీలోనూ కెరియర్‌లోనూ ప్రతిచోటా చాలా అవసరం. ఎక్కడ, ఎలా, ఎంతవరకూ మాట్లాడాలో.. ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎదుటివారిని ఎలా నొప్పించకుండా ఒప్పించాలో తెలియడం కంటే మంచి స్కిల్‌ ఇంకొకటి ఉండదు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు ఎప్పుడూ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

లింక్డిన్‌ లెర్నింగ్, గ్రేట్‌ లెర్నింగ్, ఫ్యూచర్‌ లెర్న్, కోర్సెరా, యుడెమీ, వంటి ఫ్లాట్‌ఫామ్స్‌ నుంచి దీన్ని సులభంగా సాధన చేసే అవకాశం ఉంది.

కోడింగ్‌

ఇప్పుడున్న టెక్‌ ప్రపంచంలో కోడింగ్‌ ఎంత బాగా వస్తే.. అంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. అందుకని ఈసారి సరదాగా కోడింగ్‌ మొదలుపెట్టండి! చాలా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ అందుబాటులో ఉన్నాయి. ఏదైనా ఒకదానిలో ప్రావీణ్యం సంపాదించేందుకు ప్రయత్నించవచ్చు. భవిష్యత్తులో ఐటీ రంగంలో పనిచేయాలి అనుకుంటే ఈ సాధన, అనుభవం బాగా ఉపయోగపడతాయి. 

కోడింగ్‌ నేర్పించేందుకు ప్రత్యేకంగా కోడ్‌ అకాడెమీ, ఫ్రీకోడ్‌ క్యాంప్, ఖాన్‌ అకాడమీ, కోడ్‌ అవెంజర్స్, కోడ్‌మెంటర్‌.. ఇలా చాలా ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి. నచ్చిన లాంగ్వేజ్‌ను ఎంచుకుని ప్రయత్నించవచ్చు.

డిజిటల్‌ మార్కెటింగ్‌

ఇటీవల కాలంలో బాగా డిమాండ్‌ పెరిగిన రంగం ఇది. ఇందులో విస్తృతమైన సిలబస్‌ ఉంటుంది. మొదలుపెట్టాలంటే, వివిధ డిజిటల్‌ చానెల్స్‌ ద్వారా ప్రకటనలు ఇవ్వడం గురించి నేర్చుకోవచ్చు. వెబ్‌సైట్లు, సెర్చ్‌ ఇంజిన్లు, ఈ-మెయిల్, సోషల్‌ మీడియా, వివిధ మొబైల్‌ యాప్స్‌ ద్వారా అడ్వర్టైజింగ్‌తో ప్రారంభించాలి. ఇందులో ఎస్‌ఈవో (సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌), వెబ్‌సైట్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైనింగ్, కంటెంట్‌ రైటింగ్, సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్, ఈ-మెయిల్‌ మార్కెటింగ్, బ్లాగింగ్‌ వంటివి ఉంటాయి. కొన్ని నెలలు కష్టపడితే ఈ రంగంలో సులభంగా నైపుణ్యం సంపాదించవచ్చు. 

దీనికి సంబంధించి గూగుల్‌ యాడ్స్, అనలిటిక్స్, ఎస్‌ఈవో, ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌.. ఇలా ప్రతిదానికీ గంటల వ్యవధి గల కోర్సులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఐఐఎం ఇండోర్, గూగుల్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు వారాల వ్యవధితో నిర్వహిస్తున్నారు. ఎంత ప్రొఫెషనల్‌గా నేర్చుకోవాలి అనేదాన్ని బట్టి కోర్సును ఎంచుకోవచ్చు.

రెజ్యూమె రైటింగ్‌

మంచి ఉద్యోగం దొరకాలంటే ఆకట్టుకునే  రెజ్యూమె అవసరం. చూడగానే ఆసక్తికరంగా అనిపించే రెజ్యూమెను తయారుచేయడం ఒక నైపుణ్యం. ఈ సెలవుల్లో దీన్ని సాధన చేయవచ్చు. రెజ్యూమెలో రకాలు, రాసే విధానం, చెప్పాల్సిన అంశాలు, వాడాల్సిన పదాలు.. ఇలా లోతుగా అధ్యయనం చేయవచ్చు. ఇది మంచి అవకాశాల దిశగా మనల్ని నడిపిస్తుంది.

రెజ్యూమె రాయడంలో మెలకువలు, సూచనలు ఇస్తూ అన్ని ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లోనూ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటితోపాటు యూట్యూబ్‌ ట్యుటోరియల్స్‌నూ అనుసరించవచ్చు. 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిగ్రీతో సీఏపీఎఫ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు

‣ నలంద వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లు

‣ నౌకాదళంలో అధికారులుగా అవకాశం

‣ బీటెక్‌తో సైన్యంలోకి..

‣ గ్రామర్‌ తెలిస్తే మార్కులు ఈజీ

‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

Posted Date : 10-05-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌