• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో కేంద్ర సర్వీసుల్లోకి!

 మొత్తం 3712 ఖాళీలు

 ఎస్‌ఎస్‌సీ: సీహెచ్‌ఎస్‌ఎల్‌- 2024తో భర్తీ



చిన్న వయసులోనే చక్కని ఉద్యోగాలు ఆశించేవారికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహిస్తోన్న కంబైన్డ్‌ హయ్యర్‌ సెకెండరీ లెవెల్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) పరీక్ష మేటి అవకాశం. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే కేంద్రంలోని కీలక విభాగాల్లో సేవలు అందించవచ్చు. ఎంపికైనవారు ఎల్‌డీసీ/ జూనియర్‌ సెక్రటేరియట్‌  అసిస్టెంట్‌/ డేటా ఎంట్రీ ఆపరేటర్‌   హోదాతో ఆకర్షణీయ వేతనం, సుస్థిర కెరియర్‌ సొంతం చేసుకోవచ్చు. 

ఇటీవల వెలువడిన ఎస్‌ఎస్‌సీ: సీహెచ్‌ఎస్‌ఎల్‌ ప్రకటన వివరాలు..

కేంద్రంలో ఉద్యోగాలు ఆశించేవారు లక్ష్యం చేసుకోవాల్సిన పరీక్షల్లో ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ ముఖ్యమైంది. ఏటా ఈ ప్రకటన వెలువడటం, బ్యాంకులు, రైల్వే, ఇతర పోటీ పరీక్షల సిలబస్‌ ఇంచుమించూ ఇదే విధంగా ఉండటం సానుకూలతలు. ఈ పోస్టులకు ఎంపికైనవారు.. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర సంస్థల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించవచ్చు. శాఖలు/ విభాగాలవారీ ఖాళీల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. రెండు దశల్లో నిర్వహించే పరీక్షలు, స్కిల్‌/టైప్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు. 

 లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జేఎస్‌ఏ) ఉద్యోగాలకు లెవెల్‌ 2 మూలవేతనం రూ.19,900 అందుతుంది. 

 డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు లెవెల్‌ 4 రూ.25,500 మూలవేతనం దక్కుతుంది. 

 కొన్ని విభాగాలకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకైతే లెవెల్‌ 5 మూలవేతనం రూ.29,200 చెల్లిస్తారు. 

 డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులు ఉంటాయి. 

 లెవెల్‌-2 ఉద్యోగాలకు సుమారు రూ.35 వేలు, లెవెల్‌-4కు ఇంచుమించు రూ.45 వేలు, లెవెల్‌-5 కొలువైతే రూ.55 వేల వేతనం పొందవచ్చు. 



పరీక్ష..

టైర్‌-1: ఈ పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి గంట. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు. తప్పు జవాబుకు అర మార్కు తగ్గిస్తారు. పరీక్షలో 4 భాగాలు ఉంటాయి. ఆంగ్ల భాషలో ప్రాథమిక స్థాయిలో 25, జనరల్‌ ఇంటలిజెన్స్‌ 25, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (బేసిక్‌ అరిథ్‌మెటిక్‌ స్కిల్‌) 25, జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు వస్తాయి. ఆంగ్ల విభాగం తప్ప మిగిలిన ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.  


టైర్‌-2: పరీక్షను మూడు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్‌లో 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌ 1లో.. మ్యాథమెటికల్‌ ఎబిలిటీస్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ ఒక్కో విభాగంలో 30, మొత్తం 60 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. 180 మార్కుల ప్రశ్నపత్రాన్ని గంటలో పూర్తి చేయాలి. రెండో సెక్షన్‌లో.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ 40, జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున 180 మార్కులకు ఈ ప్రశ్నపత్రం ఉంటుంది. గంట వ్యవధిలో పూర్తి చేయాలి. సెక్షన్‌ 3లో కంప్యూటర్‌ పరిజ్ఞానంపై 15 ప్రశ్నలు 45 మార్కులకు ఉంటాయి. వ్యవధి 15 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. అన్ని సెక్షన్లలోనూ తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. సెక్షన్‌ 3 రెండో సెషన్‌లో.. స్కిల్‌/ టైప్‌ టెస్టు నిర్వహిస్తారు. డేటా ఎంట్రీ పోస్టులకు 15 నిమిషాల వ్యవధిలో స్కిల్‌ టెస్టు ఉంటుంది. ఎల్‌డీసీ/జేఎస్‌ఏ పోస్టులకు 10 నిమిషాల వ్యవధిలో టైప్‌ టెస్టు నిర్వహిస్తారు. డేటా ఎంట్రీ పోస్టులకు మినిస్ట్రీ విభాగాలకు చెందిన ఖాళీలకు 15 నిమిషాల్లో కంప్యూటర్‌పై 3700 - 4000 కీ డిప్రెషన్లు, మిగిలిన వాటికి 15 నిమిషాలకు 2000-2200 కీ డిప్రెషన్స్‌ ఇవ్వాలి. ఏదైనా అంశంలో ముద్రించిన సమాచార పత్రం ఇచ్చి దాన్ని కంప్యూటర్‌లో పొందుపర్చమంటారు. టైప్‌ టెస్టులో భాగంగా ఇంగ్లిష్‌ లేదా హిందీ ఎంచుకోవచ్చు. ఆంగ్లం అయితే నిమిషానికి 35, హిందీ 30 పదాల చొప్పున టైప్‌ చేయాలి. పది నిమిషాల వ్యవధితో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆంగ్లంలో అయితే 1750, హిందీలో 1500 కీ డిప్రెషన్స్‌ ఇవ్వగలగాలి.  


టైర్‌ 1లో అర్హత సాధిస్తేనే టైర్‌ 2కి అనుమతిస్తారు. ఈ రెండు దశల్లోనూ అన్‌ రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు 30, ఓబీసీ, ఈబీసీలు 25, మిగిలిన విభాగాలవారు 20 శాతం చొప్పున ప్రతి సెక్షన్‌లోనూ మార్కులు పొందితేనే అర్హులవుతారు. కంప్యూటర్‌ అవేర్‌నెస్, స్కిల్‌/ టైప్‌ టెస్టులో అర్హత సాధిస్తే చాలు. ఈ మార్కులను ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. తుది నియామకాలు టైర్‌ 2 మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి. 


సన్నద్ధత 

 సిలబస్‌ వివరాలు గమనించాలి. ఎక్కువ ప్రశ్నలు ప్రాథమికాంశాల నుంచే వస్తాయి. అందువల్ల వాటిపైనే అధిక దృష్టి సారించాలి. ఆ తర్వాత ప్రతి విభాగంలోనూ అంశాలవారీ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. 

 పరిమిత పుస్తకాలనే ఎంచుకుని, వాటినే బాగా చదవాలి. 

 గత ప్రశ్నపత్రాలు గమనించాలి. ఏ అంశాల్లో, ఏ తరహాలో ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించి, సన్నద్ధత అందుకు తగ్గట్టు ఉండేలా చూసుకోవాలి. 

 పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. ఇలా రాస్తున్నప్పుడు సమయ నిబంధనను కచ్చితంగా పాటించాలి. జవాబులను సరిచూసుకుని, వెనుకబడిన వాటికి అదనపు సమయం కేటాయించి, తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. 

 టైర్‌-1లో అరవై నిమిషాల్లో వంద ప్రశ్నలకు జవాబు గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకు 36 సెకన్ల సమయమే ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ ఇంటలిజెన్స్‌ల్లో ఎక్కువ ప్రశ్నలకు ఈ వ్యవధి సరిపోదు. సెక్షన్లవారీ సమయ నిబంధన లేనందున.. ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలను తక్కువ వ్యవధిలో ముగించి, మిగిలిన వ్యవధిని కష్టమైన వాటికి వెచ్చించాలి. 

 కొన్ని ప్రశ్నలకు జవాబు కోసం ఎక్కువ సమయం తీసుకోవచ్చు. ఇలాంటివి ఆఖరులో, సమయం ఉంటేనే ప్రయత్నించాలి. సులువుగా, తక్కువ వ్యవధిలో పూర్తయ్యే వాటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. జవాబు రాబట్టడం తెలిసినప్పటికీ అధిక సమయం తీసుకునేవాటిని చివరలోనే ప్రయత్నించాలి. 

 రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియని ప్రశ్నలను వదిలేయాలి.



ప్రశ్నలు వేటిలో? 

జనరల్‌ ఇంగ్లిష్‌: అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. ఆంగ్లాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో గమనిస్తారు. ఖాళీలు పూరించడం, వ్యాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థకాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ మార్కులు పొందడానికి 8,9,10 తరగతుల ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకోవాలి. వీలైనన్ని నమూనా ప్రశ్నలు సాధన చేయాలి.


జనరల్‌ ఇంటలిజెన్స్‌: ఈ విభాగంలో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలు ఉంటాయి. సెమాంటిక్‌ ఎనాలజీ, సింబాలిక్‌ ఆపరేషన్స్, నెంబర్‌ ఎనాలజీ, ట్రెండ్స్, ఫిగర్‌ ఎనాలజీ, వెన్‌ డయాగ్రమ్స్, నంబర్‌ క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్‌-డీకోడింగ్, వర్డ్‌ బిల్డింగ్‌... తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకుని, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే తక్కువ సమయంలో జవాబు గుర్తించే నైపుణ్యం అలవడుతుంది. 


క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: నంబర్‌ సిస్టమ్, ఫండమెంటల్‌ అరిథ్‌మెటికల్‌ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, త్రికోణమితి, స్టాటిస్టికల్‌ చార్ట్స్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. అరిథ్‌మెటిక్‌ ఆపరేషన్స్‌లో.. శాతాలు, నిష్పత్తి, సరాసరి, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, డిస్కౌంట్‌.. అంశాల్లో ప్రశ్నలుంటాయి. గణిత పాఠ్యపుస్తకాల్లోని ఈ విభాగాలను బాగా అభ్యాసం చేయాలి. అలాగే ముఖ్యమైన సూత్రాలు, వాటిని ఉపయోగించే విధానం తెలుసుకుని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.  

జనరల్‌ అవేర్‌నెస్‌: దైనందిన జీవితంతో ముడిపడే రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం. భారత్‌- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. 8,9,10 తరగతుల సైన్స్, సోషల్‌ పుస్తకాలు బాగా చదివి ముఖ్యమైన విషయాలు నోట్సు రాసుకోవాలి. వర్తమాన వ్యవహారాల కోసం 2023 జులై నుంచి పరీక్ష తేదీ వరకు ముఖ్య సంఘటనలు మననం చేసుకోవాలి. పత్రికలు చదువుతున్నప్పుడే ప్రశ్నగా రావడానికి అవకాశం ఉన్నవాటిని నోట్సు రాసుకుంటే.. పరీక్షకు ముందు తక్కువ వ్యవధిలోనే మరోసారి చదువుకోవచ్చు. నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు-రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు.. వీటికి ప్రాధాన్యం ఉంటుంది.

టైర్‌-2: ఇందులోనూ టైర్‌-1 అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. ఇవి కొంచెం కఠినంగా ఉంటాయి. లోతైన అధ్యయనం తప్పనిసరి. ఇందులో కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ చేర్చారు. కంప్యూటర్‌ ప్రాథమికాంశాలు, సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్, ఈమెయిల్, నెట్‌వర్కింగ్, సైబర్‌ సెక్యూరిటీ అంశాల్లో తేలికపాటి ప్రశ్నలు వస్తాయి. వీటికి ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల కంప్యూటర్‌ సైన్స్‌ పుస్తకాల్లో ముఖ్యాంశాలు చదివితే ఈ విభాగంలో అర్హత సాధించవచ్చు.


 

ముఖ్య సమాచారం

ఖాళీలు: 3712

అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. నేషనల్‌/ స్టేట్‌ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆహారం, ప్రజా పంపిణీ విభాగం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల్లోని డేటా ఎంట్రీ పోస్టులకు మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా సైన్స్‌ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి.  

వయసు: ఆగస్టు 1, 2024 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఆగస్టు 2, 1997 - ఆగస్టు 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 7 రాత్రి 11 గంటల వరకు స్వీకరిస్తారు. 

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు

టైర్‌-1 పరీక్షలు: జులై 1-5, 8-12 తేదీల్లో నిర్వహిస్తారు 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.

టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ పరీక్ష: తేదీల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. 

వెబ్‌సైట్‌: https://ssc.gov.in/


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

Posted Date : 15-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌