• facebook
  • whatsapp
  • telegram

స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

విశాఖకు చెందిన శ్రీరామ్‌ వరుణ్‌ ఘనతప్రతిష్ఠాత్మకమైన స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో సీటు దొరకడం అంటే మాటలు కాదు.. అందులోనూ స్కాలర్‌షిప్‌తో కూడిన ప్రవేశం పొందాలంటే ఎంతో కష్టపడితే కానీ సాధ్యం కాదు. అటువంటి అరుదైన ఘనతను సాధించాడు విశాఖ నగరానికి చెందిన ఒబ్బిలిశెట్టి శ్రీరామ్‌ వరుణ్‌. గూగుల్, ఫేస్‌బుక్‌ వంటి అత్యున్నత స్థాయి సంస్థలు అంకురాల దశలో ఇదే అమెరికన్‌ వర్సిటీలో రూపుదిద్దుకున్నాయి. తానూ అక్కడే ఎంబీఏ చదివి, తిరిగి భారత్‌కు వచ్చి నలుగురికీ ఉపయోగపడేలా ఒక సంస్థను నిర్మించాలనే కలతో ఈ ప్రయాణాన్ని ఆరంభించాడు వరుణ్‌. మన దేశం మొత్తం మీద అక్కడ సీటు సాధించే విద్యార్థులు వేళ్ల మీద లెక్కించే సంఖ్యలో ఉంటారు. మరి ఇది ఎలా సాధ్యమైందో తన మాటల్లోనే..


అ మ్మానాన్నలు ఇద్దరూ వైద్యులే. కానీ నన్ను వైద్యవృత్తిలోకి వెళ్లాలని ఎటువంటి ఒత్తిడీ చేయలేదు. నచ్చింది చేయమని ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచి సొంతంగా కంపెనీ పెట్టాలనే ఆశ. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 178, మెయిన్స్‌లో 167 ర్యాంకు సాధించడంతో ఐఐటీ కాన్పూర్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ సీటు దొరికింది. మూడో ఏడాది ఇంటర్న్‌షిప్‌లో భాగంగా దక్షిణ కొరియాలోని శామ్‌సంగ్‌ కంపెనీకి వెళ్లాను. వారికి నా పనితీరు నచ్చడంతో ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ ఇచ్చారు. అందులో చేరి, అదే సమయంలో నా సొంత స్టార్టప్‌ ఆలోచనను కూడా పట్టాలెక్కించాలి అనుకున్నా. కొంత మంది స్నేహితులం కలిసి 2021లో ఆర్థిక సేవలు అందించే ఒక ఫిన్‌టెక్‌ యాప్‌ను అభివృద్ధి చేశాం. మన దేశంలో తక్కువ ఆదాయ వనరులు కలిగిన దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దాం. కానీ మార్కెట్‌లోకి తీసుకెళ్లడం కొంచెం కష్టమైంది. మేమంతా టెక్నికల్‌ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లం కావడంతో మా బిజినెస్‌ను ఎలా మార్కెట్‌ చేసుకోవాలో తెలియక కాస్త ఇబ్బంది పడ్డాం. అదే సమయంలో కొవిడ్‌ విజృంభించింది. నిధులకు ఇంకా కష్టం అయిపోవడంతో అప్పటికి ఆ ఆలోచనను  తాత్కాలికంగా విరమించుకున్నా.


అయితే ఉద్యోగంలో చేరానని నా లక్ష్యానికి దూరం కాలేదు. కంపెనీ పెట్టాలనే తపన అలాగే ఉంది. ఆ సంస్థలో మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉంది, కానీ మార్కెటింగ్‌లో అనుభవం కోసం.. అలాగే ఆంత్రప్రెన్యూర్‌షిప్, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్‌.. ఇలా వ్యాపారానికి సంబంధించిన సమస్త విషయాల గురించి తెలుసుకునేందుకు ఎంబీఏ చేయాలని నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి నా ప్రయత్నం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నతస్థాయి విద్యాసంస్థల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. నా ఆలోచనకు రూపం ఇవ్వగలిగేలా నన్ను తీర్చిదిద్దే సంస్థ గురించి అన్వేషించాను. టాప్‌ 5 వర్సిటీలను ఎంచుకుని, ఒక్కోదానికి ఒక్కొక్క ఫైల్‌ తయారు చేసుకున్నాను. ఎందులో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, అధ్యాపకులు ఎవరు, ఏమేం నేర్పిస్తారు, ఇలా అన్నీ తెలుసుకున్నాను. అప్పటికే అక్కడ చదివి బయటకు వెళ్లిన పూర్వ విద్యార్థులను సామాజిక మాధ్యమాల ద్వారా కలిసి నా సందేహాలు నివృత్తి చేసుకున్నాను. స్నేహితుల ద్వారా కూడా సమాచారం సేకరించాను. కేవలం వీటిలో సీటు దొరికితే చదువుదాం అనుకుని దరఖాస్తులు పంపించడం మొదలుపెట్టాను.


ఉన్నత విద్యాసంస్థలకు దరఖాస్తులు చేయడం అంత సులభమైన పనికాదు. వీటికి ప్రపంచవ్యాప్తంగా మెరిట్‌ ఉన్న విద్యార్థులు వేలల్లో పోటీ పడుతుంటారు. 2022లోనే జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలు రాసేశాను. జీఆర్‌ఈలో 334, టోఫెల్‌లో 118 మార్కులు వచ్చాయి. మంచి స్కోర్లు రావడంతో నచ్చిన వర్సిటీలో సీటు దొరుకుతుందని ఊహించాను. అనంతరం దరఖాస్తులతోపాటు పంపాల్సిన వ్యాసాలు రాయడం సాధన చేశాను. మన గురించి చెబుతూ, కెరియర్‌కు సంబంధించి మన ఆలోచనలు పంచుకునేలా రాయాల్సిన ఈ వ్యాసాలు ప్రవేశం దొరికేదీ లేనిదీ నిర్ణయించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకే అలా సాధన కోసం రాసిన వాటిని సీనియర్లకు పంపి వారి అభిప్రాయాలు తీసుకునేవాడిని. నా ఇంటర్వ్యూ కూడా సుదీర్ఘంగా సాగింది. ఒక ఫార్మాస్యూటికల్‌ కంపెనీ సీఈవో గంటపాటు 20, 30 ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ మంచి జవాబులిచ్చాను. ఆ ముఖాముఖి తర్వాత సీటు, స్కాలర్‌షిప్‌ ప్రకటించారు. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే రాత్రుళ్లు, వారాంతాల్లో ఈ పనులు చేస్తూ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి దాదాపు ఏడాది పట్టింది. ఆ కష్టానికి తగినట్టుగానే కోరుకున్న కాలేజీలో సీటుతోపాటు రెండేళ్లకూ రూ.కోటి ఉపకార వేతనం లభించింది. ఫస్ట్‌ఇయర్‌ చూపిన ప్రతిభ ఆధారంగా రెండో ఏడాది మరిన్ని సౌకర్యాలు ఉంటాయి.


బహుముఖంగా..

ఇటువంటి ఫారిన్‌ వర్సిటీల్లో సీటు సాధించాలంటే మన ప్రొఫైల్‌ను వీలైనంత వైవిధ్యంతో ఉండేలా చూసుకోవాలి. మొదటి నుంచి మార్కులు, ర్యాంకులు, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌పై దృష్టి పెట్టాలి. లక్ష్యం ఏమిటి, దాన్ని చేరుకోవడానికి ఎటువంటి మార్గం అనుసరిస్తున్నాం అనే దానిపై స్పష్టత ఉండాలి. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు స్థానిక బృందాలకు నాయకత్వం వహించాను. అది వర్సిటీ వారికి నాపై మరింత ఆసక్తి కలగడానికి కారణం కావొచ్చు. సంస్థను నెలకొల్పాలనే నా బలమైన లక్ష్యం వారికి అంతకంటే బలంగా చెప్పగలిగాను. దరఖాస్తు చేయదలచిన విద్యార్థులు ఈ విషయాలన్నీ గమనించాలి. అలాగే దీనిలో చదివేందుకు రూ.కోటి వరకూ ఖర్చవుతుంది. సాధారణ వర్సిటీలైతే కనీసం రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ ఉండాలి. ప్రతి వర్శిటీ వెబ్‌సైట్‌లో ఎంప్లాయిమెంట్‌ రిపోర్ట్‌ ఉంటుంది, అక్కడ చదివి కొలువులు సాధించిన వారి వివరాలు అందులో చూసి అవకాశాలు ఎలా ఉన్నాయో తప్పకుండా అంచనా వేసుకోవాలి. నిజానికి ఇప్పుడున్న ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ఏడాదికి రూ.కోటిపైగా చెల్లించే స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేసి మళ్లీ చదువు కోసం వేరే దేశం వెళ్లడం అంటే చాలా పెద్ద నిర్ణయం. కానీ నా లక్ష్యం ఉద్యోగం, డబ్బు సంపాదన కాదు. భారతీయులకు ఉపయోగపడేలా ఏదైనా కనిపెట్టాలి, దాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలి, సొంతంగా సంస్థను నెలకొల్పి పలువురికి ఉద్యోగాలివ్వాలి, అందుకే ఉన్న ఉద్యోగాన్ని వదిలేయడానికి సిద్ధమయ్యా. 


యూనివర్సిటీలకు దరఖాస్తు ప్రక్రియ క్లిష్టమైనది. ముందే అన్నీ తెలుసుకుని దిగాలి. ఏదో ఒక సాధారణ సంస్థ నుంచి పట్టా పుచ్చుకున్నా అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అలాగే కనిపించిన ప్రతి విద్యాసంస్థకూ దరఖాస్తు చేయడం వల్ల సమయం, డబ్బు వృథా. ఇవన్నీ ఆలోచించే అడుగులు వేయాలి. ఏది ఏమైనా కష్టపడి ప్రయత్నిస్తే మనం అనుకున్న విధంగా ప్రయాణించవచ్చు. తరచిచూస్తే మనలోనూ ఒక ఎలన్‌మస్క్, మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఉంటారు! కావాల్సిందల్లా పట్టుదలా, ప్రయత్నం మాత్రమే!!


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Posted Date: 09-04-2024


 

ఇత‌రాలు

మరిన్ని