• facebook
  • whatsapp
  • telegram

మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

జాబ్‌ స్కిల్స్‌ 2024 వివరాలు

ఉద్యోగ మార్కెట్‌ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నప్పుడు కొలువులు తెచ్చుకోవడం ఎవరికైనా తేలికే. కానీ మార్కెట్‌ మందగమనంలో ఉన్నప్పుడే కంపెనీలను ఒప్పించి ఉద్యోగం సాధించుకోవడం నిజమైన విజయం. అందుకు నేర్చుకునే సామర్థ్యం (ఎబిలిటీ టు లెర్న్‌)తో కొత్త దృక్కోణంలో (డిఫరెంట్‌ అవుట్‌లుక్‌) త్వరగా ఇమిడిపోగలిగితే (క్విక్‌ అడాప్టబిలిటీ) ఉద్యోగార్థికి అద్భుతంగా ఉపకరిస్తుంది. ఈ మూడు అంశాలే ఆయుధాలై నిస్తేజ మార్కెట్‌లోనూ విస్తుపోయే విజయాలను అందిస్తాయి!  


దేశ ఉద్యోగ అక్షయపాత్ర అయిన ఐటీ రంగం గురించి రోజూ నిరుత్సాహపూరిత వార్తలు వస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2025 మార్చి వరకూ ఈ రంగంలో ఉద్యోగాలు మందగిస్తాయనేది సారాంశం. భారతీయ సంస్థలకు భారీ ఆర్డర్లు ఇచ్చే అమెరికా, కెనడా, యూరప్‌ల్లో ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణమని నివేదికలు వస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లతో సతమతమవుతున్న అక్కడి కంపెనీలు విస్తరణ విషయంలో అప్రమత్తంగా ఉండటంతో కొత్త ప్రాజెక్టుల రూపంలో మన సంస్థలకు ఆర్డర్లు రాక నూతన నియామకాల జోష్‌ తగ్గుతుందని ఈ రంగ నిపుణులు సూచిస్తున్నారు.  


నియామకాల తగ్గుదల ఘంటికలు ఇప్పటికే కళాశాలలు, విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో మోగుతున్నాయి. రుతుపవనాలకోసం రైతు ఆశగా ఆకాశంవైపు చూస్తున్నట్టే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు చేసుకునే కంపెనీల ఆగమనం కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు ఎదురుచూస్తున్నాయి. నియామకాలకోసం ఆలస్యంగా వచ్చినా, గతంలోలాగా వందలకొద్దీ ఫ్రెషర్స్‌ను ఊడ్చుకెళ్లే పరిస్థితి కనిపించడంలేదు. ప్రతి ఎంపికనూ తూకం వేసినట్టు జాగ్రత్తగా చూసుకుంటున్నాయి. కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెంచేలా నియామకాలు చేసే వ్యూహాన్ని మార్చి కంపెనీ విలువ జోడించే తాజా అభ్యర్థుల కోసం కాగడాలు పెట్టి వెతుకుతున్నాయి. ఈ తరుణంలో ఆదుకునే బలమైన మూడు ఆయుధాలపై ఉద్యోగార్థులు దృష్టి పెట్టాలి.


1. విభిన్న ఆలోచనా దృక్పథం  

చెట్టుకింద కూర్చుంటే చటుక్కున నెత్తిన యాపిల్‌ పండు పడితే... తల బొప్పి కట్టిందేమోనని తడుముకోలేదు. అయాచితంగా పండు దొరికింది కదాని ఆరగించడానికి ఉపక్రమించలేదు. ‘యాపిల్‌ కిందికే ఎందుకు పడింది, పైకి ఎందుకు పోలేదు?’ అని ఆలోచించినందుకే న్యూటన్‌ గతించి మూడొందల ఏళ్లవుతున్నా గుర్తుపెట్టుకున్నాం.  


కంప్యూటర్లు కార్యాలయాలకే అన్న దృష్టి ఉన్న ఏడో దశకంలో పర్సనల్‌ కంప్యూటర్‌ ఆలోచనను ఆవిష్కరించారు స్టీవ్‌ జాబ్స్‌. ఆపై అరచేతిలో ఇమిడే మొబైల్‌నే మినీ కంప్యూటర్‌గా మార్చేసి టెలికమ్యూనికేషన్‌ ఆద్యుల్లో ఒకరిగా, యాపిల్‌ ఉత్పత్తుల సృష్టికర్తగా కలకాలం గుర్తుండేలా చేసింది ఆయన వినూత్న ఆలోచనా సరళే.   


రెండు దశాబ్దాల కిందట గూగుల్‌లోకి అడుగిడిన సుందర్‌ పిచాయ్‌ రెండు లక్షలమంది ప్రత్యక్ష ఉద్యోగులున్న కంపెనీ సీఈఓ ఎలా అయ్యారు? ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌ చేసినందువల్లనో, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదవడం వల్లనో, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్‌సిల్వేనియాలో ఎంబీఏ చేసినందువల్లనో కాదు. వీటన్నింటిని మేళవించిన మేలైన దృక్పథంతో గూగుల్‌ క్రోమ్, ఓఎస్, జీమెయిల్స్, మ్యాప్స్‌ లాంటి మేటి సేవలను ఆవిష్కరించినందుకే ఉన్నత పీఠం ఆయన్ను వరించింది.  


ఎంపిక చేసుకునే అందరూ సత్యనాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లు కావాలని ఏ కంపెనీ కోరుకోదు. తీసుకున్న ఉద్యోగి అందరిలో ఒకడిగా మిగిలిపోకుండా ముందుండి నడిపించే వాడిగా రాణించాలనుకుంటుంది. దీనికి కావలసింది విభిన్న ఆలోచనా దృక్పథం.   సాధారణంగా ప్రాంగణ నియామకాల సమయంలో అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచించే స్వభావంగల అభ్యర్థి కంపెనీ ప్రతినిధులను సూదంటురాయిలా ఆకర్షిస్తాడు. టెక్నికల్‌ రౌండ్‌లోనో, ప్రాజెక్టువర్క్‌ను ప్రజెంట్‌ చేయడంలోనో, హెచ్‌ఆర్‌ రౌండ్‌లోనో చివరికి క్యాంపస్‌లో మూడు నాలుగేళ్లలో పాల్గొన్న కార్యక్రమాల వల్లనో అభ్యర్థి ఆకట్టుకుంటాడు. నియామకాలు తగ్గుముఖం పట్టినా ఇలాంటివారిని ఏ కంపెనీ చేజేతులా వదులుకోదు.  



ఉపయోగాలేమిటి?  

భిన్న దృక్కోణం ఉన్నవారు ప్రతి విషయాన్నీ సానుకూలంగా చూస్తారు. ప్రతికూల ఆలోచనలు తమను తాకనీయరు. ఉదాహరణకు ప్రాంగణ నియామకాల్లో ఒకవేళ తక్కువ ప్యాకేజీ ఆఫర్‌ చేస్తే మిగతావారు నిరాశ చెందుతారు. తప్పని పరిస్థితుల్లో ఉద్యోగంలో చేరినా ‘ఇదీ ఒక జాబేనా’ అన్న ధోరణిలో ఉంటారు. కానీ సానుకూల దృష్టి ఉన్న ఉద్యోగార్థి మాత్రం తనకు ఎటువంటి అనుభవం లేకుండా అందివచ్చిన అవకాశం కాబట్టి నేర్చుకునేందుకు మార్గంగా పరిగణిస్తాడు.  

 పనిలో ప్రతి విషయాన్నీ భిన్నంగా చూసే అలవాటువల్ల ఎంతో ఉత్సాహంగా ఉన్న భావన ఏర్పడుతుంది. హై ఎనర్జీ కారణంగా పనితీరు మిగతావారికంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఇది టీమ్‌ లీడర్స్‌తో పాటు పనితీరు ఎప్పటికప్పుడు మదింపు చేసేవారి దృష్టికీ వెళుతుంది.  

  ఈ తరహా ఆలోచనా దృక్పథం ఉన్నవారు సహజంగా అందరితో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు. టీమ్‌ సభ్యులతో సహా తమ పనికి సంబంధించిన వివిధ సమాంతర బృందాలతో సత్సంబంధాల కారణంగా మంచి పనితీరు చూపగలుగుతారు. 

  ఈ కోవకు కూడా చెందిన ఉద్యోగికి మంచి సామర్థ్యం ఉంటుంది. చొరవతో తన పరిమితి వరకు నిర్ణయాలు వేగంగా తీసుకోగలగడం కంపెనీకి లాభిస్తుంది.  

  పరిస్థితులను ఆకళింపు చేసుకొని, సానుకూలంగా స్పందిస్తూ కొత్తగా ఆలోచించేవారికి పని వాతావరణంలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం ఏర్పడుతుంది.  

  నవ కల్పనకు నూతన ఆలోచనా విధానం దారితీస్తుంది. ఒక పనిని ‘ఇలాగే ఎందుకు చేయాలి? మరోలా ఎందుకు చేయకూడ’దన్న తార్కిక ఆలోచన కొత్త మార్గాలను చూపుతుంది. మూస ధోరణికి స్వస్తి చెప్పి నవకల్పనలకు దోహదపడుతుంది.  


2. నేర్చుకునేందుకు సంసిద్ధత 

మార్కెట్‌ పరిస్థితులు సానుకూలంగా లేనప్పుడు నియామకాలకు ఎదురుగాలులు వీస్తుంటే అభ్యర్థికి ఆయుధంగా వినియోగపడే లక్షణం నేర్చుకునే సామర్థ్యం. నేర్చుకునే లక్షణాన్ని తరగతి గదుల్లోనే వదిలేసి వచ్చేవారిని కంపెనీలు స్వాగతించవు. సాంకేతికత  వేగంగా మారుతున్న తరుణంలో పాఠ్యపుస్తకాల పరిజ్ఞానం సరిపోదు. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలకు మారిపోతుంటాయి. అందుకు తగ్గట్టు ప్రతి ఉద్యోగీ కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో తయారవ్వాలని కంపెనీలు కోరుకుంటాయి. ఇలాంటివారి కోసమే కంపెనీ ప్రతినిధులు ప్రాంగణ ఎంపికల సమయంలో పరిశీలిస్తుంటారు.  

 కొత్త విషయాలు నేర్చుకోవాలంటే తగిన మానసిక సంసిద్ధత ఉండాలి. పనికి సంబంధించినవే అని కాకుండా సహజంగానే కొత్త విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్న ఆసక్తి ఉన్నవారి అవసరం కంపెనీలకు ఉంటుంది.  

 నూతన విషయాలపై దృష్టి పెట్టాలంటే ఏకాగ్రత ఉండాలి. ఎంతగా ఏకాగ్రత, ఆసక్తి వుంటే అంత త్వరగా కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. కృత్రిమ మేధ కొత్త టెక్నాలజీ. దీన్ని ఏకాగ్రతతో నేర్చుకోగలిగితే మిగతావారికంటే ముందుంటారు.  


ఎలా పెంపొందించుకోవాలి?  

 కొత్త అంశాలపై జిజ్ఞాస పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఏ నూతన విషయం మన దృష్టికి వచ్చినా దాని గురించి ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేయాలి.  

 ఏదీ అయాచితంగా లభించదు. ఎబిలిటీ టు లెర్న్‌ అనే లక్షణం పెంపొందించుకోవాలంటే సహనం అనే పెట్టుబడి పెట్టాలి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకునే క్రమంలో అవాంతరాలు వస్తాయి. వాటిని అధిగమించగల ఓర్పు అలవర్చుకోవాలి.  

 నూతన విషయాలను నేర్చుకోవడం అనేది ఒక సామర్థ్యంగా చేసుకోవాలి. నేర్చుకున్న విషయం వెంటనే కెరియర్లో ఉపయోగపడదు. కానీ నేర్చుకోవడం ద్వారా వచ్చే ఫలితాలకోసం కొంతకాలం నిరీక్షించాలి. లేటెస్ట్‌ టెక్నాలజీలను నేర్చుకొని సిద్ధంగా ఉంటే అవి అవసరమైన సమయంలో కంపెనీకి అభ్యర్థి విలువైన ఆస్తిగా కనిపిస్తాడు.  



3. త్వరగా ఇమిడిపోవడం   

దీన్నే కంపెనీల పరిభాషలో అడాప్టబిలిటీ అంటున్నారు. కంపెనీ ప్రాథమ్యాల్లోని ఏ అంశాన్నయినా ఉద్యోగార్థి తక్షణం ఆమోదించి, స్వీకరించే మనస్తత్వంతో ఉండాలి. 


కొత్త పరిస్థితులకూ, పని వాతావరణానికీ త్వరగా అలవాటు పడాలి. అసలు వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. కంపెనీ తమ అవసరాల రీత్యా ఉద్యోగ ప్రదేశాన్ని ఒక నగరం నుంచి మరో నగరానికి మార్చవచ్చు. ఒకే చోట ఒక విభాగం నుంచి మరొక విభాగానికి పంపించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూలంగా స్పందించడం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం, కొత్త టీమ్స్‌తో సమన్వయంతో పనిచేయడం ఒక సామర్థ్యంగా కంపెనీలు చూస్తున్నాయి.  


ముఖ్యంగా కంపెనీలు పోటీ వాతావరణంలో తరచూ కొత్త టెక్నాలజీలకు మారుతుంటాయి. దీనివల్ల నూతన ప్రాజెక్టులనూ కంపెనీలు కైవసం చేసుకుంటాయి. అలాంటప్పుడు ఉద్యోగులు కొత్త సాంకేతికతను తక్కువ కాలంలో నేర్చుకోవాలని కోరుకుంటాయి. కొత్త టెక్నాలజీతో త్వరగా ‘సింక్‌’ అయిపోయిన ఉద్యోగులను యాజమాన్యం గుర్తిస్తుంది. అయితే ఇటువంటి లక్షణం గల వారికోసం కంపెనీ ప్రతినిధులు ప్లేస్‌మెంట్స్‌కి వచ్చినప్పుడు పరిశీలిస్తుంటారు.  

 మార్పును నిరోధించడం చాలామందికి ఒక అలవాటుగా ఉంటుంది. మార్పును అంగీకరించాలంటే కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఇదొక బాధాకరమైన ప్రక్రియగా భావించి మార్పును వ్యతిరేకిస్తారు. కానీ ప్రతి మార్పూ కష్టంగా ఉండదు. ఒకవేళ ఉన్నా సాధనతో సులభతరమవుతుంది. అందుకే ఏ కొత్త విషయాన్నయినా యథాతథంగా స్వీకరించాలి. ముందే కష్టమనుకుంటే నిరోధించాలనిపిస్తుంది.  

 మార్పును యథాతథంగా స్వీకరించాక, దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. చాలా సందర్భాల్లో అప్పుడు అది అనుకున్నంత కష్టం కాదని తేలుతుంది.  

 కొత్త విషయాలను తెలుసుకుంటూ, చిన్న చిన్న కొత్త సాంకేతికతలను అవసరం ఉన్నా లేకపోయినా నేర్చుకుంటుంటే నూతన విషయాలపట్ల సహజంగానే జిజ్ఞాస ఏర్పడుతుంది. ఏ విషయాన్నయినా సానుకూలంగా స్వీకరించి అందుకు అనుగుణంగా తమను తాము మలచుకోవడం అభ్యర్థికి అలవాటుగా మారుతుంది.  


- యస్‌.వి. సురేష్‌ 

 

 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్పీచ్‌, హియ‌రింగ్ చికిత్స‌లో ప్ర‌త్యేక కోర్సులు

‣ ఇంటర్మీడియ‌ట్‌తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Posted Date: 27-03-2024


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం