• facebook
  • whatsapp
  • telegram

మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

పరీక్షల్లో విజయానికి విద్యార్థులకు సూచనలుఏడాది పొడవునా తరగతులకు హాజరైనా.. సకాలంలో నోట్సులూ, అసైన్‌మెంట్లన్నీ పూర్తిచేసినా.. పరీక్షలు దగ్గరపడుతుంటే మాత్రం ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. చదివినవన్నీ పరీక్షల్లో వస్తాయో రావో.. వచ్చినా.. సమాధానాలు సరిగ్గా రాయగలుగుతారో లేదోననే సందేహాలు పీడిస్తుంటాయి. దీనికి పరిష్కారం?  


పరీక్షల ముందు ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది పునశ్చరణ మీదే. ముందుగానే దీనికి టైమ్‌ టేబుల్‌ను సిద్ధం చేసుకోవాలి. ఇది ఎంత త్వరగా తయారుచేసుకుంటే అంత మంచిది. సబ్జెక్టులవారీగా ఏ అంశాలకు ఎంత సమయాన్ని కేటాయించాలనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. సాధారణంగా పనులు సకాలంలో పూర్తికావేమోననే ఆలోచనలే ఒత్తిడికి కారణమవుతుంటాయి. వాటికి తావుండకూడదంటే పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాల్సిందే. ఆలోచనలను టైమ్‌టేబుల్‌ రూపంలో పేపర్‌ మీద పెడితే ఆందోళన చాలా వరకూ తగ్గుతుంది. ఎందుకంటే చేయాల్సిన పనులు కంటికి ఎదురుగా కనిపించడం వల్ల మీ దృష్టి ఎప్పుడూ కార్యాచరణ మీదే ఉంటుంది. 


1. రోజువారీ టైమ్‌ టేబుల్‌లో ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలనేది పక్కాగా ఉండాలి. ఇష్టంగా, కాస్త తేలిగ్గా అనిపించే సబ్జెక్టుకు తక్కువ సమయాన్నీ, కఠినంగా ఉండేవాటికి ఎక్కువ సమయాన్నీ కేటాయించాలి. మధ్యలో కాస్త విరామం ఉండేలానూ చూసుకోవాలి. ఏమాత్రం విశ్రాంతి లేకుండా చదివితే ఒత్తిడి మరింత పెరుగుతుంది. మానసికంగానూ, శారీరకంగానూ బాగా అలసిపోతారు కూడా. అందుకే టైమ్‌టేబుల్‌ను పాటించడంతోపాటు విరామం తీసుకోవడమూ ముఖ్యమే. 


2. పునశ్చరణ చేయడంలో ఎవరికి అనువైన పద్ధతిని వాళ్లు ఎంచుకోవాలి. ఒకే పద్ధతి అందరికీ పని చేయదు. కొందరికి చదివినవాటిని మళ్లీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. కొందరేమో ఒకసారి చూడకుండా రాసుకుంటేగానీ గుర్తుంచుకోలేరు. మరికొందరేమో ఎదుటివాళ్లు చదివితే విని కూడా గుర్తు పెట్టుకోగలుగుతారు. 


3. చదివే విధానంతోపాటు.. చదువుకునే వేళల్లోనూ ఎవరికి అనువైన పద్ధతి వారికి ఉంటుంది. కొందరు అర్ధరాత్రి వరకూ మెలకువగా ఉండి చదివి.. ఆలస్యంగా నిద్రలేస్తారు. మరికొందరు రాత్రి త్వరగా పడుకుని తెల్లవారు జామునే లేస్తే బాగా చదువుకోగలుగుతారు. 


4. రివిజన్‌ చేసే ప్రదేశానికీ ప్రాధాన్యం ఉంటుంది. దీనికోసం ఎలాంటి అవాంతరాలకూ అవకాశంలేని చోటునే ఎంచుకోవాలి. ఉదాహరణకు కొందరు తమ ఇంట్లో ప్రత్యేకంగా కేటాయించుకున్న ప్రదేశంలో కూర్చుని మాత్రమే చదవగలరు. అలా చదివినప్పుడే బాగా గుర్తుంటాయి. సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే ప్రదేశాల్లోనే ప్రశాంతంగా చదువుకోగలుగుతారు. 


5. రివిజన్‌ టైమ్‌టేబుల్‌ను పక్కాగా అమలుచేయాలంటే.. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి. చుట్టుపక్కల స్మార్ట్‌ఫోన్‌ లేకుండానూ జాగ్రత్తపడాలి. ఈ విషయంలో మీరు ఎంత కఠినంగా ఉంటే అంత మంచిది. విరామ సమయంలో స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించినా మీ దృష్టి వాటిలోని అంశాలపైకి మరలే ప్రమాదం ఉంటుంది. 


6. రివిజన్‌లో భాగంగా పాత ప్రశ్నపత్రాలనూ సాధన చేయొచ్చు. ఎందుకంటే మీరు ఎంచుకుని ప్రత్యేకంగా చదివినవన్నీ ముఖ్యమైనవి కాకపోవచ్చు. కానీ గత కొన్నేళ్లుగా పరీక్షల్లో వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలను చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

‣ పరీక్షలో మంచి మార్కులకు మెలకువలు

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

Posted Date: 20-03-2024