• facebook
  • whatsapp
  • telegram

పరీక్షలో మంచి మార్కులకు మెలకువలు

విద్యార్థులకు ముఖ్య సూచనలుపరీక్షల ముందు అందుబాటులో ఉండే సమయం ఎంతో విలువైంది. సబ్జెక్టులవారీగా టైమ్‌టేబుల్‌ వేసుకోవడం, ప్రశ్నపత్రం విషయంలో అవగాహన పెంచుకోవడం, ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను రాయడం లాంటివి చేస్తూ విద్యార్థులు సమయాన్ని సద్వినియోగ పరచుకుంటారు. అలాగే పరీక్షలు జరుగుతున్నప్పుడు ఏం చేస్తే సమయం వృథా కాకుండా ఉంటుందో కూడా తెలుసుకుందామా..


ప్రశ్నపత్రం తీసుకోగానే మొత్తం ప్రశ్నలన్నింటినీ ఒకసారి చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల మార్కులపరంగా వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి. సమయాన్ని ఎలా విభజించుకోవాలనే విషయంలో ఒక స్పష్టత వస్తుంది. అలాగే ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటే వేటికి సమాధానం రాయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. 


1. కొన్ని ప్రశ్నలు క్లుప్తంగా ఉంటే.. మరికొన్ని పెద్దగా.. నేరుగా ప్రశ్నించకుండా కాస్త తికమక పెట్టేలా ఉంటాయి. ఇలాంటి వాటిని అర్థం చేసుకోవాలంటే ప్రశ్నను పూర్తిగా ఒకటికి రెండుసార్లు చదవాలి. సగం వరకే చదివి మీకు తెలిసిన సమాధానం రాసేయాలని తొందరపడకూడదు. అలా కంగారుగా చదివి రాసిన సమాధానం సరైంది కాకపోవచ్చు కూడా. కాబట్టి పెద్ద ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు చదివి.. అర్థం చేసుకున్న తర్వాతే సమాధానాలు రాయడం మొదలుపెట్టాలి. 


2. మొదటి 5 నుంచి 10 నిమిషాల సమయాన్ని ప్రశ్నపత్రం క్షుణ్ణంగా చదవడానికీ, ఏయే ప్రశ్నలకు సమాధానాలు రాయాలో నిర్ణయించుకోవడానికీ వినియోగించాలి. 


3. కొందరు విద్యార్థులు కాస్త క్లిష్టంగా ఉండే ప్రశ్నలకు మొదట్లోనే సమాధానాలు రాయాలని ప్రయత్నిస్తారు. ఇది అంత సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ విధానంలో ఎక్కువ సమయం వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది. ముందుగా బాగా తెలిసిన ప్రశ్నలైతే ఉత్సాహంగా సమాధానాలు రాయడం మొదలుపెడతారు. దీంతో సమయం ఆదా అవడంతోపాటు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. ఆ తర్వాత కఠినంగా ఉండే ప్రశ్నలకు సమాధానాలను రాయడానికి కావల్సిన ప్రేరణను పొందగలుగుతారు. 


4. ఎడిషనల్‌ పేపర్‌ అవసరం పడినప్పుడు.. ఒక్కోసారి ఇన్విజిలేటర్‌ పరీక్ష హాల్లో ఎక్కడో దూరంగా ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా కాస్త సమయం వృథా అయ్యే పరిస్థితీ ఉంటుంది. కాబట్టి చివరి పేజీ రాస్తున్నప్పుడే మరో పేపర్‌ అడిగి తీసుకుంటే అర నిమిషం కూడా వృథా కాదు. 


5. రాయడం పూర్తయిన తర్వాత వెంటనే పరీక్ష హాలు నుంచి బయటికి వెళ్లిపోవాలని అనుకోకూడదు. ఒకటికి రెండుసార్లు అన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. సమయం మించి పోతుందనే తొందరలో కొన్నింటికి నంబర్లు వేయడం మర్చిపోవచ్చు. లేదా అసలు ప్రశ్న సంఖ్య వేయకుండానే సమాధానం రాయొచ్చు. రాయడం పూర్తయిన తర్వాత చివరి కొద్ది నిమిషాల్లో ఇలాంటి విషయాలను జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు ఏమైనా పొరపాట్లు దొర్లినా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. సమాధాన పత్రాన్ని పరీక్ష సమయం కంటే ముందే ఇచ్చేస్తే.. ఆ తర్వాత రాసిన తప్పులు గుర్తొచ్చినా సరిదిద్దుకునే అవకాశం ఉండదు. అప్పుడు తీరిగ్గా బాధపడినా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. 


6. పరీక్ష మొత్తం రాసిన తర్వాత.. ప్రశ్నను తప్పుగా అర్థంచేసుకుని వేరే సమాధానం రాశారు అనే విషయాన్ని గుర్తించారు అనుకుందాం. కంగారుపడకుండా వెంటనే సరైన సమాధానం రాయడం మొదలుపెట్టాలి. తక్కువ సమయంలో వివరంగా మొత్తం రాయలేకపోవచ్చు. ఇలాంటప్పుడు బుల్లెట్‌ పాయింట్ల రూపంలో సమాధానం రాయొచ్చు. ముఖ్యమైన పదాలను అండర్‌లైన్‌ చేయొచ్చు. చివరి నిమిషంలోనూ ఇలా చేసిన పొరపాటును సరిదిద్దుకోవచ్చు. సమాధానాల నంబర్లను సరిగా వేయకపోయినా గమనించి సరిచేసుకోవచ్చు. 


7. చివర్లో ఇలా ఒకసారి సమాధానాలను సరిచూసుకుంటే.. అవసరమైన మార్పులు చేసుకోవడానికీ అవకాశం ఉంటుంది. ఉదాహరణకు వ్యాసరూప సమాధానాల్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లను రాయడం మర్చిపోయారు అనుకుందాం. వెంటనే వాటిని జత చేయొచ్చు. 


8. పరీక్షలు రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పరీక్ష హాలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత మీరు రాసిన సమాధానాల్లో చాలావరకూ తప్పులే ఉన్నాయని స్నేహితులు చెప్పొచ్చు. దాంతో నిరుత్సాహం ఆవరించి మర్నాటి పరీక్షకు సరిగా సన్నద్ధం కాలేకపోవచ్చు. అంటే జరిగిన దాన్ని గురించి ఆలోచిస్తూ జరగాల్సిన దాన్ని నిర్లక్ష్యం చేయడం మొదలుపెడతారు. ఈ ప్రమాదం లేకుండా ఉండాలంటే రాసిన పరీక్ష గురించి ఆలోచించడం వెంటనే మానేయాలి. మీ దృష్టి మొత్తాన్నీ తర్వాతి పరీక్ష మీదే కేంద్రీకరించాలి. రాసిన పరీక్ష మీ చేతి నుంచి చేజారిపోయింది. రాయాల్సిన పరీక్ష భవితవ్యం ఇంకా మీ చేతుల్లోనే ఉంది. దాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ ఆఫర్‌ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!

Posted Date: 13-03-2024


 

సన్నద్ధత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం