• facebook
  • whatsapp
  • telegram

గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

మూడేసి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన మహిళలు


ఓ పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు హిమబిందు, చైతన్య. ఈ ఇద్దరు మహిళలూ గత ఏడాది గురుకుల విద్యాసంస్థ అధ్యాపక పోస్టులకు నియామక పరీక్షలు రాశారు.. జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, పాఠశాల విభాగాల్లో చక్కని ప్రతిభ చూపి ఇటీవలే కొలువులకు ఎంపికయ్యారు. స్ఫూర్తిదాయకమైన వీరి కృషి వారి మాటల్లోనే..


చదువుతూనే ఉన్నా..
(బండి హిమబిందు)


చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో బాగా చదివేదాన్ని. 6వ తరగతిలో మామ్‌నూరు, వరంగల్‌ నవోదయలో సీటు వచ్చింది. మా ఊరిలో అలా సీటు సాధించిన మొట్టమొదటి అమ్మాయిని నేనే! దాంతో వెంటనే చేరిపోయా. ఇంటర్‌ వరకూ అక్కడే చదువుకుని డిగ్రీ బీఎస్సీ ఎంపీసీ, పీజీ కెమిస్ట్రీ కూడా పూర్తిచేశాను. తర్వాత లైబ్రరీ సైన్స్‌పై ఆసక్తితో అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా మళ్లీ పీజీ చదివాను. ఈలోగా పెళ్లయింది, ఇద్దరు పిల్లలు కూడా. 2021లో నెట్‌కి ఎంపికయ్యాను, 2023లో లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో జేఆర్‌ఎఫ్‌కి ఎంపికయ్యాను. గురుకులాల్లో  పోస్టులకు నోటిఫికేషన్‌ పడటంతో చదివి పరీక్షలు రాశాను. వీటిలో స్కూల్‌, జూనియర్‌ కాలేజ్‌, డిగ్రీ కాలేజ్‌ లైబ్రేరియన్‌ పోస్టులు మూడింటికీ సెలెక్ట్‌ అయ్యాను. ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో చేరేందుకు నిర్ణయించుకున్నాను. వీటికి సంబంధించిన నోటిఫికేషన్‌లో జనరల్‌లో 36వ ర్యాంకు, మహిళా కేటగిరీలో 2వ ర్యాంకు లభించింది.


‣ 2010లో డిగ్రీ పూర్తయ్యింది, 2015లో పెళ్లయింది. అప్పటి నుంచి చదువుతూనే ఉన్నా. ఇందుకు మా నాన్న, మావారు చాలా సహకరించారు. ఆఖరికి పిల్లలు పుట్టిన సమయాల్లో కూడా ఎక్కువ రోజులు పుస్తకాలకు దూరం కాలేదు. ఓ పక్క ఇంట్లో పనులు, పిల్లలను చూసుకుంటూనే మధ్యాహ్నాలు కాస్త సమయం చిక్కించుకుని చదువుకునేదాన్ని. అలా అని రోజుకు ఎక్కువ సమయం కూడా దొరికేది కాదు. మహా అయితే 3 గంటలు కేటాయించగలిగాను. కానీ ఆ సమయంలోనే పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం చదువుకున్నా. ఈ ఉద్యోగాలు రాకముందు, పెళ్లికాక ముందు రైల్వే, బ్యాంకింగ్‌ వంటి చాలా నోటిఫికేషన్లకు పరీక్షలు రాశాను. గత మూడేళ్లుగా మాత్రం పూర్తిగా వీటి మీదనే ధ్యాస పెట్టాను. అమ్మ, అత్త పిల్లలను చూసుకోవడంలో సాయం చేసేవారు. మొత్తం కుటుంబం సహకారం లేకపోతే ఇలా చదవగలిగేదాన్ని కాదు. పరీక్షల ముందు మొత్తం పుస్తకాలతోనే గడిపేదాన్ని. ఆ టైమ్‌లో పిల్లలకు సమయం కేటాయించలేక వారిని చాలా మిస్‌ అయ్యేదాన్ని కూడా. కానీ ఉద్యోగం వస్తే వారికి మెరుగైన భవిష్యత్తు ఇవ్వొచ్చనే ఆలోచన నన్ను ఉత్సాహపరిచేది.


మొదటి నుంచీ ఆర్థికంగా స్వాతంత్య్రం ఉండాలనే ఆలోచన నాది. అందుకు మావారు కూడా సహకరించారు. ఇప్పుడు మా బాబుకు ఏడేళ్లు, పాపకు ఐదేళ్లు. అమ్మ ఏదో సాధించిందనే విషయం వారికి కూడా అర్థం అవుతోంది, నా విజయం పట్ల వారి సంతోషం చూస్తుంటే ఇన్నేళ్లు పడ్డ కష్టం అంతా మర్చిపోతున్నా.


ప్రస్తుత నోటిఫికేషన్‌లో మెరుగైన ర్యాంకు సాధించడానికి పాత పరీక్షలు రాసిన అనుభవం కూడా ఉపయోగపడింది. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు. నావద్ద ఉన్న మెటీరియల్‌, మార్కెట్‌లో దొరికే కొద్దిపాటి బుక్స్‌, ఆన్‌లైన్‌లోనే చదువుకున్నా.


ప్రాథమిక అంశాలతో మొదలు..

ప్రతి సబ్జెక్టుకు ప్రాథమిక అంశాలపై బాగా పట్టు సంపాదించా. ఆ తర్వాత ఎగ్జామ్‌కి సంబంధించి అన్ని కోణాల్లోనూ చదివేదాన్ని. ‘ఈపీజీ పాఠశాల’ అనే సైట్‌ మెటీరియల్‌ తీసుకుని పదే పదే రివైజ్‌ చేయడం ఉపయోగపడింది. ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ప్రశాంతంగా, ప్రణాళికతో చదివా. రోజూ ఎంతోకొంత చదువుతూ ఉంటే ఎంత కష్టమైన టాపిక్‌ అయినా సులువుగా గ్రహించవచ్చు.


రోజుకు ఎన్ని గంటలు చదివాం అనేది కాకుండా ఎలా చదివాం అనేది ముఖ్యం. ఫోకస్‌ తప్పకుండా ప్రిపేర్‌ అయ్యాను. గత ఏడాది ప్రశ్నపత్రాలు బాగా చూశాను. కేవలం ప్రశ్న, జవాబు కాకుండా కంటెంట్‌ మొత్తం అర్థం అయ్యేలా చదివాను, అంటే ఆ పాఠం నుంచి ప్రశ్న ఎలా వచ్చినా జవాబు ఇచ్చేలా నా సన్నద్ధత కొనసాగింది. ఒక పాఠం పూర్తికాగానే దానికి తగిన విధంగా నోట్స్‌ రాసుకున్నాను, దానికి సంబంధించి వీలైనన్ని బిట్స్‌ ప్రాక్టీస్‌ చేశాను, రాసుకున్న నోట్సును మళ్లీ మళ్లీ రివైజ్‌ చేశాను.  


నిజానికి మాకు నోటిఫికేషన్ల కోసం చూడటంలోనే సమయం చాలా గడిచిపోయింది. కానీ నేను ఆ విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు.. చదువుతూనే ఉన్నా. ఎంత నిరాశగా అనిపించినా ఎప్పుడూ చదువు ఆపేద్దాం అనిపించలేదు. ఏం కాదు, కచ్చితంగా ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఇంట్లోవారు కల్పించేవారు.


పోటీ పరీక్షల సన్నద్ధత అంటే ఒత్తిడి చాలా సాధారణం. కానీ దాన్ని వీలైనంతగా అదుపులో ఉంచుకునేదాన్ని. మరీ చిరాగ్గా అనిపిస్తే కుటుంబంతో సమయం గడిపేదాన్ని. ప్రస్తుతం జాబ్‌లో జాయిన్‌ అయ్యాక పరిస్థితులు చూసి పీహెచ్‌డీలో చేరదాం అనుకుంటున్నా!


ఓపికతో సాధించా..
(కొప్పుల చైతన్య)


వరంగల్‌ జిల్లా ధర్మారంలో పదోతరగతి వరకూ చదివాను. పదిలో 510 మార్కులొచ్చాయి. దాంతో బాసర ట్రిపుల్‌ఐటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ సీటు దొరికింది. నిజానికి నాకు మొదటి నుంచీ సోషల్‌ సైన్సెస్‌ పైనే ఆసక్తి ఎక్కువ. కానీ అప్పుడు సాఫ్ట్‌వేర్‌ రంగం కొత్తగా వేళ్లూనుకుంటూ ఉండటం.. ట్రిపుల్‌ఐటీ మొదటి బ్యాచ్‌లోనే సీటు రావడంతో అందులో చేరాను. చదువు పూర్తయ్యాక ఐటీ జాబ్‌లో చేరడంపై ఇష్టం లేకపోయింది. దాంతో ఉస్మానియాలో జర్నలిజంలో పీజీ కోర్సులో చేరాను. ఆ తర్వాత లైబ్రరీ సైన్స్‌లో కూడా పీజీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వడం మొదలుపెట్టాను. 


మొదట గ్రూప్‌-1 కోసం చదవడం మొదలుపెట్టినా.. ఆలోగా గురుకులాల  నోటిఫికేషన్లు రిలీజ్‌ అయ్యాయి. డీఎల్‌, జేఎల్‌, స్కూల్‌ లైబ్రేరియన్‌ పోస్టులకు దరఖాస్తు చేశాను. తర్వాత పాలిటెక్నిక్‌ జేఎల్‌ నోటిఫికేషన్‌ పడింది. ఆ పరీక్ష కూడా రాశాను. అందులో మహిళా కేటగిరీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు, జనరల్‌లో 4వ ర్యాంకు లభించాయి. తర్వాత గ్రూప్‌-4 పరీక్షకు హాజరయ్యాను. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌లో జిల్లాలో 175 ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం గురుకులాల్లో డీఎల్‌, జేఎల్‌, స్కూల్‌ లైబ్రేరియన్‌ పోస్టులకు సెలెక్ట్‌ అయ్యాను, పాలిటెక్నికల్‌ జేఎల్‌ కూడా మంచి ర్యాంకు రావడంతో ఉద్యోగం వస్తుందనే అనుకుంటున్నా, అదే సమయంలో గ్రూప్‌-1కి కూడా ప్రిపేర్‌ అవుతున్నాను.


చిన్నప్పటి నుంచి సోషల్‌ సైన్సెస్‌ మీద ఆసక్తి ఎక్కువ, వ్యాసాలు రాయడం ఇష్టం. మా అన్న అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కావడంతో తను చాలా మద్దతిస్తూ నన్ను చదివించాడు. నేను ప్రిపేర్‌ అవ్వడం మొదలుపెట్టిన ఐదేళ్లు పూర్తిగా నోటిఫికేషన్లు లేవు, అయినా ఆపకుండా చదువుకుంటూ వెళ్లాను. అందుకే వరుసగా ఉద్యోగ ప్రకటనలు రాగానే, అనుకున్నట్టుగా సెలెక్ట్‌ అయ్యాను.


జీఎస్‌ మీద పట్టు బాగా పనికొచ్చింది. సబ్జెక్టు పేపర్‌కు సంబంధించి పరీక్షకు రెండు నెలల ముందు బాగా ఫోకస్‌ పెట్టాను. లైబ్రరీ సైన్స్‌కి పెద్దగా మెటీరియల్‌ దొరక్కపోవడంతో ఆన్‌లైన్‌లో చదివాను. రైటింగ్‌ ప్రాక్టీస్‌, నోట్‌ మేకింగ్‌ అలవాట్లు రివిజన్‌కి బాగా ఉపయోగపడ్డాయి.


ఇతర అభ్యర్థులకు, నాకు జీఎస్‌ వద్దే మార్కుల్లో బాగా తేడా వచ్చింది. ఏళ్ల తరబడి చదువుతూ ఉండటంతో అందులో చాలా వరకూ నాకు ఎడ్జ్‌ దొరికింది. సిలబస్‌లో ప్రతి పదం విడిచిపెట్టకుండా చదివాను. దాన్ని దాటి ఏమీ చదవలేదు. ‘ఈనాడు’ పత్రికలో ఎడిటోరియల్‌ పేజీ వ్యాసాలు జీఎస్‌ ప్రిపరేషన్‌లో ఉపయోగించుకున్నాను.


రోజుకు ఇన్ని గంటలు చదవాలి అని ఎప్పుడూ పెట్టుకోలేదు. పొద్దున్నుంచి కూర్చునేదాన్ని, కనీసం ఆరేడు గంటలు చదివాను. ఒకరోజు ఏదైనా కారణంతో చదవలేకపోతే మరుసటి రోజే కచ్చితంగా ఎక్కువ చదివి మేనేజ్‌ చేసుకున్నాను.  


నా సన్నద్ధత 2014లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇంట్లో వారి సహకారం మర్చిపోలేను. ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. ఏం చదువుతానన్నా మద్దతు ఇచ్చారు. చిరాకుతో ఆపేద్దాం అనిపించిన ప్రతిసారీ వారే ప్రోత్సహించారు. వారి సహకారం లేకపోతే ఇంత దూరం వచ్చేదాన్నే కాదు, ఇప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.


కొత్త కొత్తగా..

కొత్త టెక్నాలజీ ప్రతి రంగాన్నీ ఆక్రమిస్తోంది, ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా చదవాలి. లెబ్రరీసైన్స్‌లో కూడా కొత్తగా ఎన్నో వచ్చాయి, అన్నీ నేర్చుకున్నాను. సబ్జెక్ట్‌ ఏదైనా నోట్‌ మేకింగ్‌ ప్రధానం. దాని వల్ల చిన్న అంశాలు కూడా గుర్తుంటాయి. రివిజన్‌ సులభం అవుతుంది. ప్రతిరోజూ చదివితే పరీక్ష టైమ్‌లో ఒత్తిడి ఉండదు.


నోటిఫికేషన్‌ ఉన్నా లేకున్నా చదువుతూ ఉంటేనే పోటీ తట్టుకోగలం, ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలం. మాకు మధ్యలో కొన్నిసార్లు నోటిఫికేషన్లు రద్దు చేయడం వంటివి జరిగాయి, కానీ మళ్లీ రాకపోతుందా అనే ఆశతోనే ఉన్నా. ఎక్కడా నిరాశ పడలేదు. ఫలితం కొన్నిసార్లు ఆలస్యం అయినా.. ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది కదా!


తల్లిదండ్రులు ఇచ్చే మద్దతు ఆడపిల్లలు బాగా చదివేలా చేస్తుంది. నావరకూ అదే నన్ను ఇంతవరకూ నడిపించింది. తక్షణ ఫలితాలు ఆశించకుండా కష్టపడితే కచ్చితంగా విజయం సాధించగలం!


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ ఆఫర్‌ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!

‣ ఇంటర్‌ పరీక్షల వేళ.. ఇవి ముఖ్యం!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

Posted Date: 05-03-2024


 

ఇత‌రాలు

మరిన్ని