• facebook
  • whatsapp
  • telegram

ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

జాబ్‌ స్కిల్‌ 2024 వివరాలుగడ్డుకాలం ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలబడాలి. ఎదురుగాలి వీస్తున్నప్పుడు బెదురు లేకుండా ముందుకు సాగాలి. ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు సానుకూల దృక్పథంతో సమస్త శక్తులూ వినియోగించాలి. 


ప్రస్తుతం ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో ఉద్యోగాల విషయంలో ప్రోత్సాహకర వాతావరణం కనిపించడం లేదు. 2024 సంవత్సరానికి నియామకాలకు వచ్చిన రిక్రూటర్లు నామమాత్రంగా ఎంపికలతో సరిపుచ్చడం, విద్యా సంస్థలకు ఏటా వచ్చే కంపెనీలు కాకుండా ఏ ఒక కొత్త కంపెనీ కూడా ముఖం చూపించకపోవడం వల్ల ఈ సంవత్సరం ఫ్రెషర్స్‌ సెలక్షన్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండవని భావించాల్సి వస్తోంది.


నియామకాల మందగమనం  

మరి అలాంటప్పుడు ఉద్యోగ సాధనే లక్ష్యంగా మొదటి నుంచీ కృషిచేస్తున్నవారు నిరాశతో తమ ప్రయత్నాలకు స్వస్తి పలకడమేనా? ఈ అరకొర ఎంపికలపై ఆశలు వదులుకోవడమేనా?  

అంతా సానుకూలంగా ఉన్నప్పుడు సాధారణ సన్నద్ధత సరిపోతుంది. అవకాశాలు బలహీనంగా ఉన్నప్పుడు ప్రయత్నాలు బలంగా ఉండాలే తప్ప మడమ తిప్పాల్సిన పని లేదు. పరిస్థ్థితులను ఆకళింపు చేసుకొని అప్రమత్తతతో అడుగులు ముందుకు వేస్తే చాలు. 

ప్రతి కంపెనీకీ ఏటా ఫ్రెషర్లను ఎంపిక చేసుకునేందుకు కొన్ని కాలేజీలతో ఒక జాబితా ఉంటుంది.  సాధారణంగా కంపెనీ ఆ కాలేజీ ప్రాంగణాల నుంచే తమకు కావలసిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంది. ఆ సంవత్సరం ఎక్కువమంది అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటే ప్యానెల్‌లో ఉన్న కాలేజీల నుంచే మరింతమందిని ఎంచుకోవచ్చు. ప్యానల్‌లో లేని కొత్త కాలేజీలకు కూడా వెళ్లవచ్చు. అయితే ఈ సంవత్సరం నియామకాల సీజన్‌ బాగా ఆలస్యంగా ప్రారంభం కావడం ఈ ఏడాది నియామకాల్లో ఏర్పడ్డ స్తబ్ధతను తెలుపుతోంది. అంతేకాక ప్రతి సంవత్సరం చేసే నియామకాలతో పోలిస్తే మూడోవంతుతోనే సరిపెట్టేయడం పట్ల ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్లు కలవరపడుతున్నారు.  

ఒకపక్క క్యాంపస్‌లకు వచ్చిన కంపెనీలు తక్కువగా ఎంపిక చేసుకోవడం, మరోపక్క కొత్త కంపెనీలు వచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో 2024లో ప్లేస్‌మెంట్స్‌ పుష్కలంగా ఉండే అవకాశాలు లేవన్న నిర్థరణకు విద్యా సంస్థల ప్లేస్‌మెంట్స్‌ విభాగాలు వచ్చేస్తున్నాయి.  


స్థిరీకరణే కారణమా?  

ఈ రెండేళ్లూ ప్రాంగణ నియామకాల జోరు తగ్గుతుందని గత కొన్ని నెలలుగా పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇందుకు మూడు నాలుగు కారణాలు చెబుతున్నారు.  

కొవిడ్‌ సంక్షోభం ప్రపంచాన్ని ఊపేస్తున్నప్పుడు భారత్‌లో ఈ వైరస్‌ దీర్ఘకాలం కొనసాగుతుందన్న అంచనాకు ఐటీ కంపెనీలు వచ్చాయి. ఆ సందర్భంలో అలవాటైన.. ఇంటి నుంచే పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) సంస్కృతిని దీర్ఘకాలం ఆశ్రయించాల్సి ఉంటుందని భావించాయి. ఈ విధానం వల్ల ఉద్యోగులు కార్యాలయానికి వస్తే కల్పించాల్సిన మౌలిక వసతులపై పెట్టాల్సిన పెట్టుబడి దాదాపు శూన్యం కావడంతో కంపెనీలు నియామకాల విషయంలో దూకుడుగా వెళ్లాయి. అవసరానికి మించి ఉద్యోగులను నియమించుకున్నాయి. అయితే కొవిడ్‌ను అరికట్టడంలో భారత్‌ విజయం సాధించింది. అందరూ ఊహించినదానికంటే త్వరగా పరిస్థితులు చక్కబడ్డాయి. కంపెనీలు తలుపులు తెరిచి పూర్తిగా ఆఫీసుకు వచ్చే విధానాన్నో, వారంలో కొద్ది రోజులు ఆఫీసులకు వచ్చే విధానాన్నో (హైబ్రిడ్‌ మోడల్‌) ఎంచుకోవాల్సి వచ్చింది. ఫలితంగా మౌలిక వసతులపై మళ్లీ పెట్టుబడి పెట్టాల్సివస్తోంది. అందువల్ల ఇక ఇప్పుడు నియామకాలు తగ్గించి, ఉన్నవారికి పూర్తి పని, ఉన్నవారి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలన్న నిర్ణయానికి కంపెనీలు వచ్చాయి. కొవిడ్‌ సమయంలో జరిగిన అదనపు నియామకాలను ఇప్పుడు రిక్రూట్‌మెంట్లు తగ్గించడం ద్వారా సమతుల్య స్థితికి తీసుకు రావాలని అవి భావిస్తున్నాయి. దీనినే సర్దుబాటు (కన్సాలిడేషన్‌) అంటున్నారు.


నెమ్మదించిన ప్రాజెక్టులు

కంపెనీలకు ప్రాజెక్టులు తగ్గడం మరో కారణం. కొత్త ప్రాజెక్టులు ఒకదానిపై మరొకటి వస్తుంటే కంపెనీలు కొత్తగా నియామకాలు చేసుకుంటాయి. అయితే నూతన ప్రాజెక్టుల విషయంలో కొంత స్తబ్ధత ఏర్పడటంతో కంపెనీలు నియామకాల వేగం తగ్గించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం బెడద పూర్తిగా తొలగిపోని నేపథ్యం.. ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. బహుళజాతి కంపెనీలు నియామకాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. 2023లో ఆర్థిక మాంద్యం కారణంగా భారీ కంపెనీలు సైతం సిబ్బంది సంఖ్యలో కోతపెట్టాయి. పెద్ద ప్యాకేజీ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. 2024లో కొత్త నియామకాలను అవసరమైన మేరకే చేయడం ద్వారా అదనంగా ఉన్న ఉద్యోగుల సర్దుబాటుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీనితో ప్రాంగణ నియామకాలపై  ఈ ప్రభావం పడింది.


కొత్త టెక్నాలజీ కోతలా?

అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానపు ప్రభావం తాజా నియామకాలపై పడుతోందా అన్న సందేహం కలుగుతోంది. కృత్రిమ మేధ (ఏఐ) దాదాపు అన్ని రంగాలకూ విస్తరిస్తోంది. ఒక కంపెనీ తమకు అవసరమైన పనుల్లో ఎన్నింటిని ఈ సాంకేతికత ద్వారా సమర్థŸంగా పూర్తి చేయవచ్చు? ఎంతమంది ఉద్యోగుల సేవలను దీని ద్వారా చేయించుకోవచ్చు? అన్న కోణంలో కంపెనీల ఆర్‌ అండ్‌ డీ విభాగాలు అధ్యయనం చేస్తున్నాయి. ఒకవేళ ఏఐ కొన్ని పనులకు ప్రత్యామ్నాయం అని తేలితే ఆమేరకు సిబ్బంది భారాన్ని కంపెనీలు  తొలగించుకుంటాయి. ప్రస్తుతం నియామకాల  విషయంలో వేగం తగ్గిస్తే మంచిదన్న అభిప్రాయానికి కంపెనీలు వచ్చాయా? అన్న సందిగ్ధం ఏర్పడుతోంది. కొన్ని సంవత్సరాల కిందట ఆటోమేషన్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం.


వేతన ప్యాకేజీలు ఎంత ఉంటున్నాయి?

ఏదైనా రెండు లాంగ్వేజ్‌ల్లో ప్రావీణ్యం ఉండి, మార్కెట్‌లో డిమాండ్‌ గల ఏఐ అండ్‌ ఎంఎల్, ఐఓటీల్లో దేనిలోనైనా మంచి పరిజ్ఞానంతో పనిచేయగలరన్న నమ్మకం కల్గించిన విద్యార్థికి ప్రథమ శ్రేణి కంపెనీలు రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల ప్యాకేజీ ఇస్తున్నాయి. 
మార్కెట్‌ బాగున్నప్పుడు ‘గుంపులో గోవింద’లా కొట్టుకు పోవచ్చు కానీ, ఆటుపోట్ల మార్కెట్‌లో తగిన నైపుణ్యాలతో దీటుగా జవాబు చెప్పగలగాలి. నియామకాల జోరు తగ్గినా, డిమాండ్‌ గల స్కిల్స్‌లో ఆశావహ దృక్పథంతో ఎదురునిలిచిన ఉద్యోగార్థిని ఏ కంపెనీ కూడా వదులుకోదు. ఎందుకంటే ఐటీ కంపెనీలకు మానవ  వనరులే తిరుగులేని సంపద! 


దీటుగా సన్నద్ధం కావాలి

ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకొని అడుగులు వేయాలే తప్ప భీతిల్లాల్సిన పని లేదు. పరిస్థితులు జటిలంగా ఉన్నప్పుడు ప్రతిభాపాటవాలు ఇంకా పెంచుకోవడమే విజయ మార్గం.

చదివే స్ట్రీమ్‌ ఏదైనా ఐటీ రంగానికి అవసరమైన రెండు కంప్యూటర్‌ లాంగ్వేజ్‌లను నేర్చుకోవాలి. సాధారణంగా సీ, సీ ప్లస్‌ ప్లస్, జావాలలో ఏవైనా రెండు నేర్చుకొనివుంటే కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే అభ్యర్థులు ఎక్కువగా పైతాన్‌ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. కంపెనీలు మాత్రం సీ, జావా లాంగ్వేజ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

లాంగ్వేజ్‌లు నేర్చుకోవడంతోపాటు ప్రోగ్రామ్‌ను ఎంత తక్కువ నిడివిలో రాస్తున్నారన్నది ముఖ్యం. లాంగ్వేజ్‌లు నేర్చుకొని ఏమాత్రం అవగాహన ఉన్నా ప్రోగ్రామ్‌ రాయగలుగుతుంటారు కానీ, ఎంత తక్కువ కోడ్‌ వర్డ్స్‌లో ప్రోగ్రామ్‌ రాయగలిగితే అంత మెరుగ్గా సెలక్షన్స్‌ సమయంలో రిక్రూటర్లను ఆకట్టుకోవచ్చు. వీటికి అదనంగా డిమాండ్‌లో ఉన్న టెక్నాలజీల్లో పట్టు ఉండేలా చూసుకోవాలి. డేటాబేస్, ఒరాకిల్, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్, ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ (ఎం.ఎల్‌.), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐ.ఒ.టి.) ల్లో ఒకదానిపై నైపుణ్యాలు సాధిస్తే నియామక సమయంలో అందరికంటే పైచేయి అవుతుంది. ఇతర స్ట్రీమ్‌ల విద్యార్థులకు ఈ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉంటే చాలు గానీ, కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు మాత్రం వీటిలో ఎంచుకున్నదానిపై లోతైన అవగాహన, ఆ టెక్నాలజీ సహాయంతో పనిచేయగలిగి ఉండాలి.


ఇలా ఉంటే..!   

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌కు వచ్చే కంపెనీలకు ఎంపికవ్వాలంటే అందరికంటే నాలుగు అడుగులు ఎక్కువ నడవాలి. అందరికంటే కాస్త ఎక్కువ కష్టపడాలి.  

పటిష్ఠమైన రెజ్యూమె: రెజ్యూమె అనేది మీ పరిచయపత్రం. మీరు ఎదురుగా లేకపోయినా మీగురించి తెలిపే లేఖ. విద్యాపరంగా, నైపుణ్యాలూ, అభిరుచులూ, వ్యక్తిత్వ అంశాల పరంగా మీరు ఏమిటో ఆవిష్కరించే పత్రం. అందుకే ఎరువు తెచ్చుకున్న పడికట్టు పదాలతో కాకుండా మీ గురించి కంపెనీకి తెలిసేలా చక్కటి రెజ్యూమె తయారుచేసుకోవాలి.  

సొంత సబ్జెక్టుపై కొంత ఎక్కువ: గ్రాడ్యుయేట్‌ పట్టా పుచ్చుకుంటున్న మీ ప్రధాన సబ్జెక్టుపై మీకు ఎంత పట్టుందో కంపెనీ ప్రతినిధులు టెక్నికల్‌ రౌండ్‌లో పరీక్షిస్తారు. మీ సబ్జెక్ట్టులో మౌలిక అంశాలనుంచి తాజా పరిణామాల వరకు నిజమైన ఆసక్తితో తెలుసుకొని ఉండాలి. ముఖ్యంగా పాఠ్యాంశాల పరంగానే కాకుండా నిజజీవితంలో, బాహ్య ప్రపంచంలో మీ సబ్జెక్టును అనుసంధానించి చెప్పగలిగితే సబ్జెక్టు పరంగా బాగా పట్టుతో ఉన్నట్టే.   

కంపెనీ గురించి క్షుణ్ణంగా: ప్లేస్‌మెంట్‌కు వస్తున్న కంపెనీ గురించి ముందే తెలుస్తుంది కాబట్టి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలు తెలుసుకోవడం మంచిది. కంపెనీ ప్రధాన ఉత్పత్తులు, ముఖ్య క్లయింట్లు, యాజమాన్యం, కంపెనీ విస్తరణ ప్రణాళికలు తెలుసుకొని ఉండటం మంచిది. కంపెనీ చేతిలో ఉన్న ప్రస్తుత ప్రాజెక్టుల గురించి తెలిసివుంటే ఇంటర్వ్యూ సమయంలో అది ఉపకరించవచ్చు.  

కొత్త టెక్నాలజీలపై ఆసక్తి: ప్రస్తుతం వినియోగంలో ఉన్న నూతన టెక్నాలజీలను సహజమైన ఆసక్తితో  తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు కృత్రిమ మేధ వివిధ రంగాల్లో అనువర్తింపజేస్తున్న విధానాన్ని నిశితంగా పరిశీలిస్తుండటం వల్ల అవగాహన పెంచుకోవచ్చు. మీ సొంత సబ్జెక్టులో ఏఐ వినియోగం పూర్వాపరాలను తెలుసుకొని ఉండటం మంచిది. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ ఆఫర్‌ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!

Posted Date: 13-03-2024


 

నైపుణ్యాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం