• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌లో ముఖ్యం.. పాజిటివిటీ

ప్రొఫైల్స్‌, పోస్టులపై అప్రమత్తత అవసరం

నలుగురిలోనూ ఉన్నప్పుడు ఎలా ఉండాలో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉంటాం. కానీ మధ్యలో వచ్చిన సోషల్‌మీడియాలో మాత్రం ఎలా ఉండాలో తల్లిదండ్రులు నేర్పగలిగే పరిస్థితి లేదు. మనకు మనంగా నేర్చుకునే క్రమంలో చిన్నచిన్న పొరపాట్లు. అవి సరిదిద్దుకునే స్థాయిలోవైతే పర్వాలేదు. కానీ అంతకంటే పెద్దవైతే మన ఉన్నతవిద్య, ఉద్యోగావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేయగలవు. అందుకే విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ ఆన్‌లైన్‌ ప్రొఫైల్స్, పోస్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల జరిగిన ఘటనలు ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి.

ఒక్క ఆన్‌లైన్‌ పోస్టుతో ఉద్యోగం పోయిన ఘటన ఐటీ కంపెనీల ఉద్యోగులను షాక్‌కు గురిచేసింది. ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ ఉద్యోగి ఒకరు తన సోషల్‌ మీడియా ఖాతాలో హిట్లర్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. అవి వైరల్‌ అయ్యి పెద్దయెత్తున దుమారం చెలరేగడంతో తర్వాత తొలగించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ పోస్టు  స్క్రీన్‌షాట్లను కంపెనీ ఖాతాకు జతచేస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ‘కోట్ల మంది ఊచకోతకు కారకుడైన హిట్లర్‌ వంటి నియంతలను వెనకేసుకొచ్చే గొప్ప మేధావులు మీ వద్ద పనిచేస్తున్నా’రంటూ కంపెనీని తప్పుపట్టడంతో.. సంస్థ ఆ ఉద్యోగిని తక్షణం విధుల నుంచి తొలగించింది.

ఇదేకాదు.. గతంలోనూ ఇటువంటి సంఘటనలు జరిగాయి. సోషల్‌ మీడియాను సరిగ్గా ఉపయోగించుకుంటే అది ఎన్నో మంచి మంచి అవకాశాలకు వేదికవుతుంది. అలాకాదని నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అందుకే ఈ అంశంలో ఎలా నడుచుకోవాలనే విషయమై నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. 

ఒక సర్వే ప్రకారం ప్రతి నాలుగు సంస్థల్లోనూ మూడు తమ వద్దకు ఇంటర్వ్యూలకు వచ్చిన ఉద్యోగార్థిని ఎంపిక చేసుకునే ముందు కచ్చితంగా అతడి/ఆమె ఆన్‌లైన్‌ ప్రొఫైల్స్‌ను చెక్‌ చేస్తున్నాయి. ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు కూడా ఇదేబాట పట్టాయి. అందులో దొరికే సమాచారాన్ని బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నాయి. అందువల్ల ఎదుటివారు మనల్ని ఎలా జడ్జ్‌ చేస్తారనే అంశం మన చేతుల్లోనే  ఉందనే విషయాన్ని గుర్తించాలి.

ఎన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులో ఉన్నాయో అన్నింటిలోనూ మనకు ఖాతాలు ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన వాటిలో అప్‌డేటెడ్‌గా ఉంటే చాలు. వాటిని తరచూ వాడుతున్నట్లుగా కనిపించాలి. కుదిరితే ఉద్యోగ, వ్యక్తిగత అవసరాలకు విడివిడిగా రెండు మెయిల్‌ ఐడీలు, సోషల్‌మీడియా ఖాతాలు ఉండాలి. ఎక్కడ స్నేహితులను అక్కడికే పరిమితం చేయడం ద్వారా అక్కర్లేని అంశాలు ఇతరులకు చేరే వీలుండదు.

ఎందుకు ఇదంతా అనుకుని మొత్తంగా సోషల్‌మీడియాకు దూరంగా ఉండటం కూడా సరికాదు. కెరియర్‌ ఆరంభంలో ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ ఉండటం చాలా అవసరం. అదే సమయంలో పేరుకు తగినట్టుగా ప్రొఫెషనల్‌గానే ఉండాలి. ఇది ఏ ఉద్యోగానికైనా హుందాతనం అదనపు అందం తెచ్చిపెడుతుంది. మనం ఖాతాల్లో రాసే పోస్టులు, అప్‌లోడ్‌ చేసే ఫొటోలు, చెప్పే వివరాలు.. అన్నీ దానికి తగినట్టుగానే ఉండాలి. బయట బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో ఉన్నట్టుగా అక్కడ ఉండాల్సిన పనిలేదు.

కంపెనీలు ఇచ్చే ఆఫర్‌ లెటర్స్‌లోనూ, ఎంప్లాయిమెంట్‌ కాంట్రాక్ట్స్‌లోనూ సోషల్‌ మీడియా, ఈ-మెయిల్, ఎలక్ట్రానిక్‌ డేటా, ఆన్‌లైన్‌ కమ్యూనికేషన్స్‌.. వంటి విభాగాల్లో వాటి పాలసీలను రాస్తుంటాయి. ఆ నిబంధనలను పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే సాధారణంగా సంస్థలు మన నుంచి ఏం ఆశిస్తున్నాయనే విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ఎలా ఉండాలని కోరుకుంటున్నాయో తెలుసుకోవడం అవసరం.

ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఆన్‌లైన్‌ ఖాతాలకు వెరైటీ ముద్దుపేర్లు వంటివి కాకుండా అసలు పేర్లనే ఉపయోగించాలి. బయోలో సూటిగా, స్పష్టంగా మన గురించి చెప్పాలి. చూడగానే మంచి అభిప్రాయం కలిగే కంటెంట్‌కు మాత్రమే అక్కడ చోటివ్వాలి. స్నేహపూర్వకమైన చిరునవ్వుతో, ఆహ్లాదకరమైన దుస్తుల్లో ఉన్న ప్రొఫైల్‌ ఫొటోలే వాడాలి. వీలైనంత పాజిటివ్‌గా కనిపించాలి.

ఉద్యోగాలు ఆశించేవారు తామేంటో పూర్తిగా కంపెనీకి చెప్పేయాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, ఉద్యోగ జీవితం వేరు. మన అభిప్రాయాలను అందరికీ తెలియజేయాలని, వాటితో వారు ఏకీభవించాలని అనుకోవడం అనవసరం. రెంటినీ కలిపి చూస్తూ చక్కటి అవకాశాలు కోల్పోకూడదు. ఉద్యోగంలో ఎంత ఏకాగ్రత, సమయస్ఫూర్తి, కచ్చితత్వంతో ఉంటామనేదే కీలకం.  సంస్థల పాలసీలను ఎలా పాటిస్తున్నామనేదే ముఖ్యం. అంతకుమించి పూర్తిగా తెరిచిన పుస్తకంలా ఎవ్వరికీ కనిపించకపోవడమే మంచిది. అది లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది.

అనవసరమైన విషయాల జోలికి వెళ్లడం, వివాదాస్పదమైనవి, రాజకీయపరమైన కోణాలు, సున్నిత సామాజిక అంశాలు, ఫ్యాన్‌ వార్స్‌.. ఇటువంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈరోజుల్లో ఏది ఎందుకు వైరల్‌ అవుతుందో, ఏది ఎలా మలుపు తిరుగుతుందో, అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు ఇటువంటి అంశాలపై అభిప్రాయాలు, కామెంట్లు బయటపెట్టడం కోరి ఇబ్బందుల్లో పడినట్టే అవుతుంది. మనలాగే ఇతరులకూ బలమైన భావనలు ఉంటాయనే విషయం గమనించాలి. అవి దెబ్బతినే అవకాశం ఉన్నప్పుడు అటువంటి సందర్భాలకు దూరంగా ఉండటమే మేలు.

చాలా సంస్థలు తమ ఉద్యోగ ప్రకటనలను తెలియజేసేందుకు ప్రొఫెషనల్‌ ఖాతాలను కలిగి ఉంటాయి. వాటిని ఫాలో అవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవడమే కాదు... మన ఫీల్డ్‌లో ఏం జరుగుతుందో గ్రహించే వీలుంటుంది. చేరాలనుకునే కంపెనీల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు, వాటికి సంబంధించిన వ్యక్తులను ఫాలో అవ్వడం  ద్వారా అక్కడ ఎటువంటి వాతావరణం ఉంటుందో గమనించే వీలు చిక్కుతుంది. అప్పుడు దానికి తగినట్టుగా మనం కూడా నేర్చుకోవచ్చు, మారవచ్చు.

సోషల్‌ మీడియాలో ఏం పోస్ట్‌ చేస్తాం అనేది మన నిర్ణయం కావొచ్చు. కానీ అవతలి వ్యక్తులు దాన్ని ఎలా తీసుకుంటారనేది మాత్రం కచ్చితంగా మన చేతుల్లో ఉండదు. అందువల్ల ఏం చేసినా పోస్ట్‌ చేసే ముందు ఒకసారి ఆగి ఆలోచించడం, సరిచూసుకోవడం మంచిది.

కార్పొరేట్‌ కంపెనీలు దేన్నయినా తమ వ్యాపార కోణంలోనే ఆలోచిస్తాయి. రెప్యుటేషన్‌ కలిగి ఉండేవారు, వివాదరహితులనే కోరుకుంటాయి. తమ ఉద్యోగుల ద్వారా తమ వ్యాపారాలకు, బ్రాండ్‌ ఇమేజ్‌కు ఎటువంటి హానీ జరగకూడదనే అనుకుంటాయి. దానికి తగినట్టు మనం ప్రవర్తించాలి. అందుకే ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ’జీఆర్‌ఈ’లో ముఖ్య మార్పులివే..

‣ 8,612 ఉద్యోగాలకు ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌

‣ ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు

‣ డిగ్రీ, బీటెక్‌తో వాయుసేనలో ఉన్నతోద్యోగం

‣ ఇంటర్‌తో ఆర్మీలో చదువు.. ఆపై ఉద్యోగం

Posted Date : 07-06-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.