• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ మెలకువలు

జూన్‌ 16న పరీక్ష

 తుది సన్నద్ధతకు నిపుణుల సూచనలు


ప్రతిష్ఠాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష దేశవ్యాప్తంగా జూన్‌ 16న జరగబోతోంది. సన్నద్ధతలో ఈ చివరి దశ ఎంతో ముఖ్యమైంది. ఈ కీలక సమయంలో చేసే కృషి మెరుగైన విజయానికి బాట వేస్తుంది! 


గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే.. ఈ ఏడాది పరిస్థితులు సివిల్స్‌ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో హాజరుకావడానికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. సోషల్‌ మీడియా ప్రచారం కారణంగా పరీక్షపై అవగాహన పెరిగింది. గత ఏడాది ప్రైవేటు రంగంలోని పరిస్థితులు తాజా పట్టభద్రులకు ఆకర్షణీయంగా లేవు. ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉండి.. అది మరింతగా పెరిగే అవకాశమూ ఉంది. కాబట్టి దానికి సిద్ధంగా ఉండి ప్రతి అదనపు మార్కు కోసం కృషి చేయాలి.  

ఈసారి ఖాళీల సంఖ్య 1056. అంటే మెయిన్స్‌కు ఎంపికయ్యే అభ్యర్థులు 13750 నుంచి 14,000 మధ్య ఉంటారు. కాబట్టి ఎంపికయ్యే అవకాశాలు గణనీయంగా పెరగొచ్చు. దేశవ్యాప్తంగా చూస్తే ఎక్కువ మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. అయితే మన రెండు రాష్ట్రాల్లోనూ గ్రూప్‌-1, ఇతర పరీక్షల మూలంగా సివిల్స్‌కు హాజరయ్యేవారి సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తోంది.  


     ప్రస్తుత దశలో..   

1. సిలబస్‌ను మరోసారి గమనించాలి: ఇప్పటి వరకూ సిలబస్‌ను ఎన్నోసార్లు పరిశీలించే ఉంటారు. పొరపాటున వదిలేసినవి ఏమైనా ఉన్నాయేమో మరోసారి చూసుకోవాలి. సాధారణంగా అతి విశ్వాసం లేదా ఏమరుపాటుతో కొన్నిసార్లు కొన్ని అంశాలను వదిలేస్తుంటారు. అలాంటివి ఏమైనా ఉంటే గుర్తించాలి. ఆయా విషయాలకు సంబంధించిన వర్తమానాంశాలపై దృష్టి పెట్టి.. వీటిని మౌలిక అంశాలతో అనుసంధానిస్తే స్పష్టత వస్తుంది. 

2. ఏయే అంశాల నుంచి ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉందో అంచనా వేసుకోవాలి: (పట్టికను గమనించండి). గత రెండు మూడేళ్ల నుంచి ఏయే అంశాల నుంచి ప్రశ్నలు అడిగారో  గమనించి పట్టికను తయారుచేసుకోవచ్చు. ఇది పూర్తిగా కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. అవసరమైనచోట చివరి నిమిషంలోనూ మార్పులూ, చేర్పులూ చేసుకోవచ్చు.  

3. మారుతున్న ప్రశ్నల శైలి: కిందటి సంవత్సరం ప్రిలిమినరీ ప్రశ్నపత్రం అభ్యర్థులను ఆశ్చర్యపరిచింది. అవ  కాశం, అదృష్టాల మూలంగా పాసవడానికి వీల్లేకుండా పేపర్‌-1 పద్ధతిని మార్చేశారు. లోతైన పరిజ్ఞానం ఉన్నవారూ, ఇంతకుముందు హాజరైనవారూ మాత్రమే పరీక్ష బాగా రాయగలిగారు. ఇలాంటిదే మళ్లీ జరిగే అవకాశం ఉంటుందనుకుని బాగా సన్నద్ధం కావాలి. 


  ఈ నాలుగూ ముఖ్యం  


ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని సన్నద్ధత వ్యూహాన్ని పాటిస్తేనే ప్రయోజనం. 

వదిలేసినవాటిని పూర్తిచేయాలి: సిలబస్‌లోని ముఖ్యాంశాలన్నింటినీ చదవడం పూర్తిచేసి ఉండొచ్చు. వాటిలో వదిలేసినవి కొన్ని ఉంటాయి. వాటిని వేగంగా గుర్తించాలి.  

వర్తమానాంశాల సన్నద్ధత: కరెంట్‌ అఫైర్స్‌కు తప్పనిసరిగా సన్నద్ధమయ్యే ఉంటారు. ఇప్పుడు వాటిల్లో ముఖ్యమైనవి గుర్తించాలి. అయితే ప్రతిదీ ముఖ్యమైందిగానే కనిపించవచ్చు. మీరు సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధం అవుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజాసేవ చేయగల సహజ సామర్థ్యం, సున్నితత్వం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడమే ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రయోజనం ఎక్కువగా ఉన్న అంశాలపై దృష్టి సారించాలి. 

వెబ్‌సైట్ల సందర్శన: ప్రభుత్వ మంత్రిత్వ శాఖలన్నీ ముఖ్యమైనవే అయినా.. సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఎక్కువ ప్రాధాన్యముంటుంది. సంక్షేమ పథకాలన్నింటినీ పరిశీలించి.. ముఖ్యమైనవాటిని క్షుణ్ణంగా చదవాలి. 


పేపర్‌-1 ప్రశ్నపత్రాల సాధన: సమగ్ర ప్రశ్నపత్రాలు ఎంచుకుని సాధన చేయాలి. మార్కెట్లో వివిధ సంస్థలకు చెందిన ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉండొచ్చు. గుర్తింపు పొందిన విద్యాసంస్థలకు చెందిన రెండు ప్రశ్నపత్రాలను ఎంచుకుని సమాధానాలు రాయాలి. 

 


   వీటిని పాటిస్తే మేలు    
 

మాధానాలు రాయటం సాధన చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. 

ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే హార్డ్‌కాపీ ప్రింటవుట్‌ తీసుకుని సమాధానాలు గుర్తించాలి. నేరుగా ఆన్‌లైన్‌లోనే జవాబులు రాస్తే.. అవసరమైన సాధన జరగదు. 

పరీక్ష వేళలోనే ప్రాక్టీస్‌ సమయాలు ఉండేలా జాగ్రత్తపడాలి. పరీక్ష సమయం ఉదయం 9.30 అయితే సాధన కూడా ప్రతిరోజూ అదే వేళలో చేయాలి. ఇది పరీక్షలో సహాయపడుతుంది. 

జవాబులు రాయడానికి కూర్చున్నప్పుడు.. ముందుగా ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా గమనించాలి. కొన్ని ప్రశ్నలు పెద్దగా ఉండి చదవడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు (ఇటీవలి ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షలో ఇలాగే జరిగింది). ఇలాంటి వాటిని ప్రశ్నపత్రంలో ముందుగానే గుర్తించాలి. తక్కువ సమయం పట్టే ప్రశ్నలను ఎంచుకుని ముందుగా వాటికి సమాధానాలు రాయాలి. ఆ తర్వాత దీర్ఘ సమాధాన ప్రశ్నలకు వెళ్లాలి. అన్ని ప్రశ్నలకూ సమాన మార్కులే ఉంటాయి. కానీ ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశారనే దానిమీదే మార్కులు ఆధారపడి ఉంటాయి. ప్రశ్నపత్రం సాధన చేసిన తర్వాత స్కోరు పరిశీలించాలి.  

పరీక్ష మొదలుపెట్టిన తర్వాత విరామం తీసుకోకూడదు. సమాధానాలు రాయడం మొదలుపెట్టిన తర్వాత తప్పనిసరిగా పరీక్ష ముగించాలి. ఏ ప్రలోభాలనూ పట్టించుకోకుండా పేపర్‌ను నిబద్ధతతో పూర్తిచేయాలి. పరీక్ష అయిపోగానే స్కోరు చూసుకోవాలి. 

‣ పేపర్‌ పూర్తవగానే రాసిన సమాధానాల్లో ఎన్ని సరైనవో, ఎన్ని కావో పట్టిక రూపంలో విశ్లేషించుకోవాలి. ఊహించి రాసినవి ఎన్ని సరైనవో, ఎన్ని కావో కూడా గమనించాలి. 

రెండు పేపర్లకు పైగా సాధన చేసిన తర్వాత.. సిలబస్‌లోని ఏ అంశాల్లో తక్కువ మార్కులు వస్తున్నాయో వాటిని పునశ్చరణ చేయాలి. ఆయా విషయాలకు సంబంధించిన వర్తమానాంశాలపైనా దృష్టి సారించాలి. 

మీకు వచ్చిన స్కోర్‌ను మూడేళ్ల కటాఫ్‌ మార్కులతో పోల్చుకుని చూసుకోవాలి. గత నాలుగేళ్ల కటాఫ్‌ మార్కుల కంటే పది మార్కులు ఎక్కువ సంపాదించడమే మీ లక్ష్యం కావాలి. 

చాలామంది అభ్యర్థులు ఓంఎంఆర్‌ షీట్ల మీద సాధన చేయడాన్ని నిర్లక్ష్యం చేస్తారు గానీ ఇదెంతో ముఖ్యమైంది. ప్రస్తుత పద్ధతిలో పేపర్‌లోని ప్రశ్నలను ఒక క్రమంలోనే పూర్తిచేయాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రశ్నలు వదిలి ముందుకు వెళ్లొచ్చు. తర్వాత మళ్లీ వెనక్కు వచ్చి సమాధానం రాయొచ్చు. ఈ పరిస్థితిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు వరుసలో సమాధానాలు మార్క్‌ చేసే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి ఒక్క పొరపాటు కూడా అదృష్టాన్ని తలకిందులు చేస్తుంది.  

అర్హత పరీక్ష పేపర్‌-2ను నిర్లక్ష్యం చేయకూడదు. కిందటి ఏడాది ఎంతోమంది అభ్యర్థులు పేపర్‌-2లో తక్కువ మార్కులు సంపాదించడం వల్ల అర్హతను కోల్పోయారు. మీరు సైన్స్‌/ మ్యాథ్స్‌ నేపథ్యం నుంచి వచ్చి.. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లలో మెరుగ్గా ఉన్నా గతంలో నిర్వహించిన ఐదు ప్రశ్నపత్రాలకైనా సమాధానాలు రాయాలి. అప్పుడే ఎలా సమాధానాలు రాయాలో అవగాహన వస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ముందుగా మ్యాథ్స్‌ ప్రశ్నలకు.. ఆ తర్వాత ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.

   చాలామంది అభ్యర్థులు నేరుగా అడిగే ప్రశ్నలకే సమాధానాలను సరిగ్గా ఊహించగలుగుతారు. అలా లేని ప్రశ్నలకు సమాధానాలను గ్రహించాలంటే సాధన ఎంతో అవసరం. హిస్టరీ, సైన్సెస్‌తో పోలిస్తే పాలిటీ, జాగ్రఫీ, ఎకాలజీలో ప్రశ్నలకు సమాధానాలను ఊహించడం సులువు


   పరీక్ష రోజున   

పరీక్ష కేంద్రానికి వెళ్లే మార్గాన్ని రెండు రోజుల ముందే చూసుకోవాలి. అభ్యర్థులు తప్పు దారిలో వెళ్లడం వల్ల పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరిన ఘటనలు చాలా ఉన్నాయి. ఫోన్‌లో చూపించే దిశలను గుడ్డిగా అనుసరించొద్దు. 

ప్రశ్నపత్రాన్ని తెరిచి జాగ్రత్తగా గమనించిన తర్వాత.. తెలిసిన ప్రశ్నలు లేవనిపించవచ్చు. ఇది ప్రతి అభ్యర్థి విషయంలోనూ జరిగేదే. మీకు పేపర్‌ కఠినంగా ఉందని అనిపించినట్లయితే.. ప్రతి ఒక్కరికీ అలాగే ఉంటుంది. సమాధానాలు రాయడం మొదలుపెడితే సందేహాలు తగ్గిపోయి, మిగతావాటికీ రాయగలమనే నమ్మకం పెరుగుతుంది. 

అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయనవసరం లేదు. ఇతరులు రాసేస్తున్నారని అపోహపడి ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించిన కొందరు నెగ్గలేకపోయారు. వాస్తవానికి కిందటి ఏడాది కటాఫ్‌ మార్కులు చాలా తక్కువగా 37 శాతం ఉన్నాయి. గుడ్డిగా సమాధానాలు రాయకుండా జాగ్రత్తపడ్డ విద్యార్థులే అర్హత సాధించారు!  


- వి. గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్‌ ట్రీ

 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నలుగురితో కలిసిపోవాలంటే...

‣ బృందంతో నడుస్తూ..!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

Posted Date : 29-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌