• facebook
  • whatsapp
  • telegram

పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష 


 

ప్రతిష్ఠాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ రాసేవారిలో సుదీర్ఘకాల అధ్యయనం, సహనం, నిరంతర కృషి చాలా అవసరం. వైఫల్యాలు సహజం. వాటిని తట్టుకుని మరోసారి..మరోసారి పట్టుదలతో ప్రయత్నిస్తేనే గెలుపు వరిస్తుంది. ఇటీవలి  ప్రిలిమ్స్‌ ఫలితాల్లో నెగ్గలేకపోయినవారూ, భవిష్యత్తులో పరీక్ష రాయబోతున్నవారూ గమనించాల్సిన కీలకమైన విషయాలను చూద్దాం!   


సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య ఇటీవలికాలంలో పెరుగుతోంది. 2024లో సుమారు ఆరు లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారని అంచనా. తెలుగు రాష్ట్రాల్లోని ఆరు కేంద్రాల నుంచి 42,560 మంది పరీక్ష రాశారు. 


పరీక్ష నిర్వహించిన 14 రోజుల్లో ఫలితాలను ప్రకటించారు. దేశవ్యాప్తంగా 14627 మంది అర్హత సాధించారు. వీరిలో 450 మందికిపైగా తెలుగు రాష్ట్రాలవారు ఉన్నారని అంచనా. అర్హత సాధించనివారి సంఖ్య ఎక్కువగా ఉంటుందనేది తెలిసిన విషయమే. అప్పుడే గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి.. పోటీ పరీక్షలు రాయడంలో ఎలాంటి అనుభవంలేని  వాళ్లను ఈ ఫలితాలు నిరుత్సాహపరచడం సహజమే. 


  బాగా రాశాను, కానీ...  

సివిల్స్‌ అభ్యర్థులు కొందరు వెల్లడించిన అభిప్రాయాలు, వాటికి కారణాలూ, పరిష్కారాలను తెలుసుకుందాం. 


పాఠశాల, కళాశాల స్థాయిలో ఎప్పుడూ మొదటి స్థానం నాదే. కానీ ఈ పరీక్షలో విజయం సాధించలేకపోయా. ఎక్కడ పొరపాటు జరిగింది?

పాఠశాల, కళాశాలల్లో టాపర్‌గా నిలవడం అనేది చిన్న విషయం కాదు. అందుకు అభినందించాలి. అయితే మీ తరగతి/ గ్రూప్‌ లేదా కాలేజీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఇప్పుడు ఎంతమందితో పోటీపడ్డారు? దీంతో మీకే సమాధానం దొరుకుతుంది. సివిల్స్‌ పరీక్ష జిల్లా, రాష్ట్రస్థాయుల్లో కాకుండా జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష. పోటీ కూడా జాతీయ స్థాయిలోనే ఉంటుందని గ్రహించాలి. 


నేనొక్కడిని మాత్రమే సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించలేదనుకుంటాను...

‣ మీతోపాటుగా సుమారు ఐదు లక్షలమంది విద్యార్థులు అర్హత సాధించలేదు. అందులో 42 వేలమంది తెలుగు రాష్ట్రాల్లోని మీలాంటి విద్యాసంస్థల్లో చదివినవారే. దాంట్లో కొంతమంది టాపర్లూ ఉండొచ్చు. ఏ పోటీ పరీక్షలోనైనా ఎక్కువమంది అభ్యర్థులు విఫలమవుతుంటారు. తక్కువ మంది మాత్రమే సఫలమవుతారు. యూపీఎస్సీ ఏ వ్యక్తి పట్లా పక్షపాత ధోరణితో వ్యవహరించదు. అభ్యర్థులను స్క్రీనింగ్‌ చేయమడమనేది చాలా కష్టమైన పని. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. 


నమూనా పరీక్షల్లో నా కంటే తక్కువ స్కోరు చేసిన అభ్యర్థి నెగ్గి.. నేనెందుకు విఫలమయ్యాను?

వివిధ సంస్థలు సూచించిన సమాధానాలు కనుక్కోవడం సులభమే. కానీ యూపీఎస్సీలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడం చాలా కష్టం. వివిధ సంస్థలు విడుదలచేసే సమాధానాలకూ, ఆ తర్వాత యూపీఎస్సీ విడుదల చేసే సమాధానాలకు చాలా తేడా ఉంటుంది. సోషల్‌ సైన్సెస్‌లో ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా ఉన్నా కచ్చితమైన సమాధానాలు ఉండవు. ఒకే పరిస్థితిని ఏ ఇద్దరు రచయితలు ఒకే విధంగా విశ్లేషించరు. వివిధ సంస్థలు సూచించిన సమాధానాలకూ ఇదే వర్తిస్తుంది. అవి భిన్నంగా ఉంటాయి. సాధారణంగా మనం ఎక్కువ మార్కులు సంపాదించిన కీ సరైందని భావిస్తాం. ఈ వాస్తవాన్ని మీరు గ్రహిస్తే మీ ఫలితాలను అర్థంచేసుకోవడం సులువవుతుంది. 


చాలా బాగా రాశాను. అయినా వైఫల్యం ఎదురైంది. అసలీ పరీక్ష నాకు సరికాదేమో... 

నిజంగా బాగా రాశారా? లేదా బాగా రాశానని అనుకుంటున్నారా? అసలు బాగా రాయడాన్ని ఎలా నిర్వచిస్తారు? చదవాల్సినవి చాలా ఉన్నాయేమో.. ఈ పరీక్ష నాకోసం కాదని అనుకోనవసరం లేదు. ప్రత్యేకంగా ఎవరి కోసమూ ఏ పరీక్షనూ రూపొందించరు. కొంతమంది నాలుగైదుసార్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఎందుకంటే.. ప్రతి ఒక్కరికీ పరీక్ష విధానాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ పరీక్ష నాకోసం కాదు.. అనుకుని ప్రైవేటు రంగంలో ఉద్యోగం చూడటం సులువే. ఇప్పుడు ఈ పరీక్షను రాయాలనుకోవడానికి కారణాల గురించి ఆలోచించండి. ఉద్యోగ భద్రత కోసమా, గౌరవం కోసమా, ఇతరులకు సేవ చేస్తున్నామనే తృప్తి కోసమా, మార్పు తీసుకురావాలనే ఆకాంక్షతోనా? మీ లక్ష్యాలూ, భావాలూ వెంటనే వదిలేసేంత తాత్కాలికమైనవా? సమాజంలో మంచి స్థానంలో ఉండాలని ఆశపడ్డారు, అదంత త్వరగా రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. గ్రాడ్యుయేట్‌ కావడానికి ఇరవై ఏళ్లు పడుతుంది. ఈ పరీక్షకు కనీసం రెండు లేకపోతే మూడేళ్లు కేటాయించలేరా?


మరోసారి పరీక్ష రాయటం సబబని అంగీకరిస్తున్నాను. కానీ ఒకవేళ నెగ్గకపోతేనో? 

జ: LIFE అనే ఆంగ్ల పదంలో నాలుగు అక్షరాలు ఉంటాయి కదా? వాటిలో రెండు.. IF. అంటే జీవితంలో 50 శాతం ఎప్పుడూ అనిశ్చితంగానే ఉంటుంది. దీన్ని ఈ పరీక్షకూ వర్తింపజేయొచ్చు. రిస్కు ఎప్పుడూ ఉంటుంది. కానీ ఓడ రేవులో ఉన్నప్పుడు నౌక ఎప్పుడూ భద్రంగానే ఉంటుంది. కానీ నౌకలను నిర్మించింది అందుకోసం కాదు కదా? మీ సన్నద్ధతను కొనసాగించడమే సముచితం. ఒకవేళ మీరు పాస్‌ అయితే? ఈ కోణంలో ఆలోచించండి. 


   గ్రూప్‌-1... ఓ సేఫ్టీ నెట్‌!  

ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లోనూ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల కావడం విద్యార్థులకు వరం లాంటిది. అర్హులైనవాళ్లు రెండు పరీక్షలూ రాయొచ్చు. అర్హత సాధించనట్లయితే ఒక దాని మీదే దృష్టిపెట్టొచ్చు. దీన్నో అవకాశంగా భావించాలి. 

సర్కస్‌లో నేలకు బాగా ఎత్తులో రెండు తాళ్లకు వేలాడే లోహపు కడ్డీపై నైపుణ్యంగా ప్రదర్శన ఇచ్చే ట్రపీజ్‌ కళాకారుణ్ని చూసేవుంటారుగా? కింద ఒక సేఫ్టీ నెట్‌ ఉంటుంది. ఎన్నోసార్లు లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమై నెట్‌పై పడిపోతుంటాడు. వెంటనే రెట్టింపు వేగంతో పైకి లేచి ఎత్తయిన లక్ష్యాన్ని చేరుకుంటాడు. మీది కూడా ఇలాంటి పరిస్థితే. గ్రూప్‌-1ను సేఫ్టీ నెట్‌లా ఉపయోగించుకోవాలి. దాని మీదే ఏకాగ్రతను నిలిపి గట్టిగా ప్రయత్నించాలి. దీంతో గ్రూప్‌-1కు అర్హత సాధించడమే కాకుండా తర్వాత ఏడాది సివిల్స్‌కు కూడా మెరుగ్గా సంసిద్ధ మవుతారు. 


  ఇవి గుర్తుంచుకోండి  

1 ఒక్క పరీక్షలో నెగ్గనంతమాత్రాన పరాజితుడు అయినట్టు కాదు. వైఫల్యాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అది మీ ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాల మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది.

2 వైఫల్యానికి మీరే బాధ్యత వహించాలి. అంతేగానీ స్నేహితులను నిందించడమో, తల్లిదండ్రులు ప్రోత్సహించలేదనèమో, పరీక్షల ముందే ఇంటికి బంధువులు వచ్చారనడమో.. ఇలాంటి సాకులు చూపవద్దు. గాయానికి లేపనంలా మాత్రమే ఇలాంటి కారణాలు పనిచేస్తాయి కానీ అంతకంటే ఫలితం ఉండదు.  

3 కావల్సిన పుస్తకాలను సమకూర్చుకుని, నేర్చుకోవాలి. వాటి సారాన్ని గ్రహించాలి. వైఫల్యాన్ని విశ్లేషించుకోవాలి. కోపగించుకోవడం, నిరాశపడటం, నిందించడం, బాధపడటం చేయకూడదు.  

4 వైఫల్యం గురించి పదేపదే ఆలోచించడం మానేయాలి. అది ఫలితాన్ని మార్చలేదు. పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. 

5 ఇతరుల ఆమోదం కోసం చూడకూడదు. వైఫల్య భయానికి అసలు కారణం ఇతరుల నుంచి గౌరవం పొందలేమేమోననే భావనే. పరీక్షలో ఫెయిల్‌ అయితే ఇతరులు ఏమనుకుంటారో, మన గురించి ఏం చెబుతారో అనేవాటికి ప్రభావితం అవుతాం. 

6 అసలు పరీక్షే రాయలేదనో, అర్హత సాధించాననో ఇతరులకు అబద్ధం చెప్పకూడదు. పాసవలేదని ధైర్యంగా చెప్పండి. ఇది ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.

7 ఒకరు నిజం అని భావించింది వాస్తవానికి నిజం కానవసరం లేదు. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువనివ్వడం అంటే.. మిమ్మల్ని మీరు బలహీనపరుచుకోవడమే అవుతుంది. 

8 కొత్త కోణంలో ఆలోచించడం మొదలుపెట్టాలి. సానుకూల దృక్పథానికి అనుకూలంగా.. ప్రతికూల ఆలోచనలకు దూరంగా దృష్టికోణాన్నీ, నమ్మకాన్నీ పెంచుకోవడం ముఖ్యం.


  ఈ అంశాలు పాటించండి  

ప్రిలిమినరీలో కటాఫ్‌ మార్కులను ఎందుకు చేరుకోలేకపోయారు? కొన్ని అంశాల్లో పరిజ్ఞానం లేకపోవడం వల్లనా? అన్ని రకాల అంశాలూ కవరయ్యేలా పేపర్‌ను రూపొందిస్తారు. కింది పట్టికను చూసి ఏయే అంశాల్లో ఎక్కువ స్కోరు చేశారో, వేటిల్లో తక్కువ స్కోరు చేశారో గుర్తించండి. 


‣ ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నారో గుర్తించాలి: మనందరం కొన్ని అంశాల్లో బలంగా, మరికొన్నింటిలో బలహీనంగా ఉంటాం. వెనకబడి ఉన్న అంశాలను గుర్తించాలి. అవి చదివే దిశగా మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోవాలి. అవసరమైతే ఈ విషయంలో ఇతరుల సహాయం తీసుకోవాలి. దీంతో తగినంతగా సన్నద్ధమవుతారు. 

 అర్హత ఉన్న పరీక్షలన్నీ రాయాలి: గ్రాడ్యుయేట్‌గా.. ఇతర పోటీ పరీక్షలు రాయడానికి కూడా మీకు అర్హత ఉంటుంది. వీటన్నిటికీ దాదాపు ఒకే సిలబస్‌. అన్ని పరీక్షలకూ దరఖాస్తు చేయండి. ఇవన్నీ రాస్తే సివిల్స్‌ రాయాలనే అభిలాష తగ్గుతుందని అనుకోవద్దు. ఈ పరీక్షల్లో విజయం సాధిస్తే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాప్‌కార్న్‌ యంత్రాన్ని చూశారా? విత్తనాలు తిరుగుతున్నప్పుడు ఎక్కువ సమయం తీసుకుని మీ సహనానికి పరీక్ష పెడుతుంది. కానీ ఒక్క విత్తనం పేలటం ఆరంభించగానే తర్వాతిది, ఆ తర్వాతిది.. ఇలా అన్నీ పేలటం చూడవచ్చు. పోటీ పరీక్షల్లో కూడా ఇదే జరుగుతుంది. ఒక్కదాంట్లో మీరు విజయం సాధిస్తే.. మిగతా వాటిలోనూ వరుసగా అలాంటి ఫలితాలే వస్తాయి. ఈ విధంగా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి. 

 వివిధ పరీక్షల ప్రశ్నపత్రాల సాధన: దేశవ్యాప్తంగా వేర్వేరు పోటీ పరీక్షలు జరుగుతాయి. నెలకు కనీసం ఒక పరీక్షయినా జరుగుతుంది. ఈ పేపర్లన్నీ వెబ్‌సైట్లు లేదా పోటీ పరీక్షల మ్యాగజీన్స్‌లో అందుబాటులో ఉంటాయి. వీటికి సమాధానాలు గుర్తించాలి. స్కోరు చూసుకుని, తప్పులను గుర్తించి, మెరుగుపరుచుకోవాలి. ఆ తర్వాత మీ పురోగతిని మీరే గుర్తిస్తారు. 


- వి. గోపాలకృష్ణ

డైరెక్టర్, బ్రెయిన్‌ ట్రీ
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

‣ జాబ్‌ మార్కెట్‌లో ఏఐ జోరు!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

Posted Date : 18-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు