• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

కోర్సులు, ప్రవేశ పరీక్షలు, ఉద్యోగావకాశాల వివరాలు


 

నిత్యం అవసరాలు, అవకాశాలు ఉండే ఆర్థిక రంగంలో కెరియర్‌ను నిర్మించుకోవడం ఒక మెరుగైన ఛాయిస్‌. ఇందులో ఫైనాన్షియల్‌ ప్లానర్స్‌/అడ్వైజర్లుగా.. వ్యక్తులు, సంస్థలకు ఆర్థిక సేవలు అందిస్తూ, మెరుగైన ప్రణాళికల కోసం పనిచేస్తూ తద్వారా వ్యక్తిగతంగానూ ఎదిగే అవకాశం ఉంటుంది. మరి ఈ కెరియర్‌ను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా..

ఫైనాన్షియల్‌ ప్లానర్లు తమ క్లయింట్ల కోసం పనిచేస్తారు. వ్యక్తులు, సంస్థలు తమ ఆర్థిక లక్ష్యాలను ఎలా చేరుకోవాలో సలహాలు, సూచనలు ఇస్తారు. కొందరు రికమెండేషన్లు లేకుండా నేరుగా తామే ప్రణాళిక, ట్రాన్సాక్షనల్‌ సేవలు అందిస్తారు. సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ (సీఎఫ్‌పీ) అనేది ఒక అధికారిక గుర్తింపు. వీరి నైపుణ్యం ఆర్థిక ప్రణాళిక, పన్నులు, బీమా, ఎస్టేట్‌ ప్లానింగ్, విరమణ ఖాతా నిల్వలు వంటి అనేక విషయాల్లో వీరు పనిచేస్తారు. ఏదైనా సంస్థతోకానీ లేదా సొంతంగా కానీ పనిచేసే వీలుంటుంది. 

‣ ఒక క్లయింట్‌ మొత్తం ఆదాయం, అప్పులు, నెలవారీ ఖర్చులు, పెట్టుబడులు, నగదు ఖాతా నిల్వలు, కట్టాల్సిన పన్నులు, బీమాలు.. ఇలా అన్నింటినీ తెలుసుకోవడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తారు. ఆపైన ఆచరణాత్మకమైన, అర్థవంతమైన రికమెండేషన్లు ఇస్తారు.

‣ ఫైనాన్షియల్‌ ప్లానర్లు అప్పుల నిర్వహణ, నిల్వలు, వ్యూహాలు, ఫ్యామిలీ బడ్జెటింగ్‌.. ఇలా అన్నీ సరిచూస్తారు. పెట్టుబడి వ్యూహాలు, ఎస్టేట్‌ ప్లానింగ్‌ కన్సిడరేషన్స్, బీమా రక్షణ, పదవీ విరమణ వంటి వాటి కోసం పనిచేస్తారు. సాధారణంగా వీరు పన్ను మినహాయింపులు ఎలా పొందాలో చర్చిస్తారు కానీ.. ట్యాక్స్‌ రిటర్న్స్‌ కోసం పనిచేయరు. క్యాష్‌ ఫ్లో, ప్రొజెక్టడ్‌ రెవెన్యూ, డెప్త్‌ మేనేజ్‌మెంట్‌ వంటివి చూస్తారు. ఇవన్నీ మొత్తంగా క్లయింట్ ఎదుగుదల, ఆర్థిక భద్రతపై ప్రభావం చూపుతాయి.


   కోర్సులు?  

ఆర్థిక ప్రణాళిక నిపుణులు అయ్యేందుకు కనీసం బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి. పీజీ ఉండటం మరింత ఉపకరిస్తుంది. వీరు ఫైనాన్షియల్‌ అడ్వైజ్‌ ఇచ్చేందుకు, వాటిని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కొన్ని లైసెన్సులు అవసరం. విజయవంతమైన ఫైనాన్షియల్‌ ప్లానర్లకు బలమైన పరిచయాలు ఉండాలి. ఇది నెట్‌వర్కింగ్, క్లయింట్‌ రిటెన్షన్‌ను కాపాడేందుకు దోహదపడుతుంది. దాని ద్వారా వారి నమ్మకాన్ని చూరగొని పనిలో మెరుగ్గా దూసుకుపోయే వీలుంటుంది.


   ఎలా?  

ఇందుకోసం అభ్యర్థులు కనీసం బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేయాలి. ఫైనాన్స్, అకౌంటింగ్, బిజినెస్, ఎకనామిక్స్‌.. వంటి ఏ విభాగాల్లో అయినా చదవొచ్చు. అనంతరం ఇంటర్న్‌షిప్స్‌కు దరఖాస్తు చేయాలి. మంచి సంస్థ నుంచి ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయడం ద్వారా లైసెన్స్‌డ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు.


   సెబి రిజిస్ట్రేషన్‌  

ఫైనాన్సియల్‌ ప్లానర్‌గా స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్సూరెన్స్‌ పాలసీల వంటివి కొనాలన్నా అమ్మాలన్నా సెబి (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) నుంచి రిజిస్ట్రేషన్‌ పొందాలి. వ్యక్తిగతంగా, సంస్థగా, పార్టనర్‌షిప్‌ ఫర్మ్‌గా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం సర్టిఫికేషన్‌ పరీక్షలు రాయాలి. 

‣ ఎన్‌ఐఎస్‌ఎం సిరీస్‌-ఎక్స్‌-ఏ: ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ (లెవెల్‌ 1)

‣  ఎన్‌ఐఎస్‌ఎం సిరీస్‌-ఎక్స్‌-బి: ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ (లెవెల్‌ 2)

ఈ సర్టిఫికేషన్స్‌ పూర్తి చేస్తే సెబితో రిజిస్టర్‌ చేసుకోవడానికి వీలు పడుతుంది. ఆ సర్టిఫికేషన్‌ అనంతరం అందించిన సేవలకు క్లయింట్ల నుంచి ఫీజు వసూలు చేయవచ్చు.


   ఇతర సర్టిఫికేషన్లు   

ఎటువంటి ఆర్థిక సేవలు అందించాలని భావిస్తున్నారు అనే దాన్ని బట్టి ఇతర సర్టిఫికేషన్లు చేయడం ఉపకరిస్తుంది. ఛార్టెడ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ (సీఎఫ్‌ఏ), సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ (సీఎఫ్‌పీ), చార్టెడ్‌ ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనలిస్ట్‌ (సీఏఐఏ), ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజర్‌ (ఎఫ్‌ఆర్‌ఎంఎన్‌), ఛార్టెర్డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కౌన్సెలర్‌ (సీఎంఎఫ్‌సీ), ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డిపార్ట్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏ) వంటి సర్టిఫికేషన్లు తీసుకునే వీలుంది.


   దరఖాస్తులు   

సెబితో రిజిస్టర్‌ చేసుకున్న తర్వాత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలతో తీర్చిదిద్దిన రెజ్యూమె ద్వారా మన నైపుణ్యాల గురించి అవతలివారికి అవగాహన వస్తుంది. ప్రొఫెషనల్‌ పరిచయాలు పెంచుకోవడం ద్వారా మంచి అవకాశాలు అందుకునే వీలుంటుంది.


   కొన్ని ప్రవేశ పరీక్షలు   

ఐఎస్‌ఐ-ఏటీ: ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ సీయూఈటీ: సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్‌ టెస్టుతో దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఎకనామిక్స్‌/ ఫైనాన్స్‌ సంబంధిత యూజీ, పీజీ కోర్సుల్లో చేరవచ్చు. 

‣  డిగ్రీ స్థాయిలో బీఏ ఎకనామిక్స్, బీబీఏ ఫైనాన్స్, బీకాం, బీస్టాట్, బీబీఏ బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్, బీబీఏ మార్కెటింగ్, బీకాం ఆనర్స్‌ వంటివి చదవడం ద్వారా ఈ వృత్తిలోకి ప్రవేశించవచ్చు. 

‣  పీజీ స్థాయిలో ఎంబీఏ ఫైనాన్స్, ఎంబీఏ మార్కెటింగ్, ఎంకాం అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్, ఎంకాం టాక్సేషన్, ఎంఏ ఎకనామిక్స్, ఎంబీఏ బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్, ఎంకాం అకౌంటింగ్, ఎంకాం బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్, ఎంస్టాట్‌ వంటి కోర్సుల ద్వారా మరింతగా ఇందులో రాణించవచ్చు.


   నైపుణ్యాలు 

చక్కని ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌ పెంచుకోవడం అవసరం. దీర్ఘకాలం కొనసాగేలా ప్రొఫెషనల్‌ సంబంధాలు పెంపొందించుకోవాలి. మన సేవలు అవసరమైన వారితో నెట్‌వర్క్‌ పెంచుకోవడం ద్వారా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు ప్రతి క్లయింట్‌కు తగిన ఇన్వెస్ట్‌మెంట్‌ పద్ధతులేంటో పరిశీలించాలి. క్రిటికల్‌ థింకింగ్‌ స్కిల్స్‌ను ఉపయోగించుకోవడం ద్వారా క్లయింట్ల ఆర్థిక లక్ష్యాలు ఏమిటో తెలుసుకునేందుకు వీలుంటుంది. సమస్యా పరిష్కార నైపుణ్యాలు సైతం అభివృద్ధి చేసుకోవాలి. తద్వారా వృత్తిలో ఎదురయ్యే సవాళ్ల నుంచి ఎలా బయటపడాలో అర్థం చేసుకోవచ్చు. రిస్క్‌ను ఎదుర్కోవడం, కొత్త కొత్త ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్‌లను ఉపయోగించేందుకు ప్రాబ్లం సాల్వింగ్‌ స్కిల్స్‌ కావాలి. అలాగే వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం కూడా ఈ నైపుణ్యాల్లో ఒక భాగం.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ జాబ్‌ మార్కెట్‌లో ఏఐ జోరు!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

‣ క్లర్కు నుంచి కలెక్టర్‌ వరకూ..!

Posted Date: 17-07-2024


 

కోర్సులు

మరిన్ని