• facebook
  • twitter
  • whatsapp
  • telegram

స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

తరగతిలో సహ విద్యార్థులతో కలిసి ఉంటారు. ఆ తర్వాత ఏ కాస్త సమయం చిక్కినా సెల్‌ఫోన్‌కు అతుక్కుపోతారు. కొన్నిసార్లు వినోదాలూ, విహారాలూ ఉండనే ఉంటాయి. మరి మీతో మీరు సమయం గడిపేదెప్పుడు? అసలెందుకు గడపాలంటారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!



సంతోష్‌కు ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ అంటే చాలా ఇష్టం. మ్యాథమెటిక్స్‌ అంటే భయం. కానీ టెన్త్‌లో దాంట్లోనే ఎక్కువ మార్కులు వచ్చాయి. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ముఖ్యమైనవి అని భావించి చదివినవే పరీక్షలో వచ్చి ఉండొచ్చు. లేదా ఆ సబ్జెక్టు అంటే ఉండే భయంతో ఎక్కువ సమయాన్ని దాని మీదే వెచ్చించి కష్టపడి చదివుండొచ్చు. మ్యాథ్స్‌లో ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి అందరూ ఎంపీసీ తీసుకోమన్నారు. మరో ఆలోచన లేకుండా సంతోష్‌ కూడా అదే పని చేశాడు. కానీ ఇప్పుడు ఇబ్బందిపడుతున్నాడు. తను ఇలా చేయడానికి స్వీయ అవగాహన లేకపోవడమూ ఒక కారణం కావచ్చు. కాసేపు ఒంటరిగా కూర్చుని తన గురించి తాను ఆలోచించుకుని, అంచనా వేసుకునివుంటే ఇలాంటి ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. 

కాలేజీకి కొంత సమయం, చదవడానికి కొంత, బయటకు వెళ్లడానికి కొంత అని సమయాన్ని విభజించుకుంటాం కదా. అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా మనం కోసం మనం కూడా కొంత సమయాన్ని తప్పనిసరిగా కేటాయించుకోవాలి.

ఏకాంత సమయంలో మన బలాలూ, బలహీనతల గురించి ఎలాంటి భేషజాలకు పోకుండా చక్కగా ఆలోచించగలుగుతాం. మన గురించి అందరికీ తెలిసింది వేరు. మనకు మాత్రమే తెలిసిన విషయాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు మనకు కొన్ని బలహీనతలు ఉన్నాయనుకుందాం. పని వాయిదాలు వేయడమో.. సమయ పాలన సరిగా లేకపోవడమో.. ఇలాంటివి. వీటిని అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో ఆలోచించొచ్చు. ఎందుకంటే వాటి గురించి నలుగురి ముందూ మాట్లాడటం మంచి పద్ధతి కాకపోవచ్చు. ఒకవేళ మాట్లాడినా చులకన కావడం తప్ప ప్రయోజనమూ ఉండకపోవచ్చు. స్వీయ అవగాహనతోనే వీటి నుంచి బయటకు రావడం సాధ్యమవుతుంది. 

కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఆలోచనలూ వేధిస్తుంటాయి. ఉత్సాహంగా ఏ పనీ చేయాలనిపించదు. ఇలాంటప్పుడు పనులన్నింటినీ పక్కనపెట్టి కాసేపు మనతో మనం గడపడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో మనసుకు నచ్చిన పనులే చేయాలి. పాటలు వినటమా, పుస్తకం చదవటమా, ఆటలు ఆడటమా.. అనేది ఎవరికివారు ఇష్టాలను బట్టి అనుసరించవచ్చు. దాంతో మరుసటి రోజు రెట్టింపు ఉత్సాహంతో పనులు చేయటం సాధ్యమవుతుంది. 

ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితుల్లో స్నేహితుల, కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం అందరూ చేసేదే. కానీ ఎవరు ఏం చెప్పినా అంతిమ నిర్ణయం తీసుకోవల్సింది మాత్రం మనమే. ఇలాంటప్పుడు కాసేపు ఒంటరిగా కూర్చుని సమీక్షించుకోవాలి. లాభనష్టాలను బేరీజు వేసుకుని నిజాయతీగా నిర్ణయం తీసుకోవాలి. దీంతో భవిష్యత్తులో సమస్యలు రావు. 

కాలేజీలోగానీ, ఇంట్లోగానీ ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరగొచ్చు. స్నేహితులు సరదాకు అన్న మాటలను సీరియస్‌గా తీసుకుని గొడవకు దిగే సందర్భం ఉండొచ్చు. నిజానికి చిన్న విషయాన్ని పెద్దగా చేసి పొరపాటుగా ప్రవర్తించి ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఒంటరిగా కూర్చుని కాసేపు ఆలోచిస్తే.. లోపాలు స్పష్టంగా తెలుస్తాయి. మరోసారి అలాంటి పొరపాటు చేయకుండా ఉండొచ్చు. నిజానిజాల గురించి ఆలోచించే చక్కని అవకాశమూ దొరుకుంది. ఎవరితో వారు అబద్ధం చెప్పలేరుగా! 

రోజూ తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. వాటిల్లో మనతో మనం గడపడాన్నీ చేర్చుకోవాలి. కనీసం అరగంటైనా ఇలా కేటాయించుకోవాలి. కొన్ని రోజుల తర్వాత తేడా మనకే తెలుస్తుంది. ఆ తర్వాత ఆలోచనారహితంగానో, ఆవేశంలోనో కాకుండా అవగాహనతో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

‣ క్లర్కు నుంచి కలెక్టర్‌ వరకూ..!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

Posted Date : 16-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం