• facebook
  • whatsapp
  • telegram

టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో!

కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అవకాశాలు
 


పదో తరగతి విద్యార్హతతోనే కేంద్రం, రాష్ట్ర స్థాయుల్లో ఉద్యోగాలెన్నో ఉన్నాయి. వీటిలో కేంద్ర ప్రకటనలు ఏటా క్యాలండర్‌ ప్రకారం వెలువడుతున్నాయి. రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నప్పుడే అవకాశం దక్కుతుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ, కోస్టుగార్డు, రైల్వే, పోస్టల్, ఆర్‌బీఐ, ఆర్టీసీల్లో టెన్త్‌తో సేవలందించవచ్చు. ఉద్యోగంలో చేరిన తర్వాత అనుభవం, అంతర్గత పరీక్షలు, ఉన్నత విద్యతో మెరుగైన స్థాయికీ చేరుకోవచ్చు.


ఆర్థిక పరిస్థితులు సహకరించనివారు, ఉన్నత విద్యపై ఆసక్తి లేనివాళ్లూ పదో తరగతితో ఉన్న ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. అయితే పది పూర్తయిన వెంటనే వీటికి పోటీ పడలేరు. యూనిఫారం కొలువులకు కనీసం 17 ఏళ్లైనా నిండాలి. సివిల్‌ పోస్టులకు పద్దెనిమిదేళ్లు ఉండాలి. అందువల్ల వీలుని బట్టి.. ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఒకేషనల్‌ కోర్సులు వీటిలో ఎందులోనైనా చేరి, ఉద్యోగానికి సన్నద్ధమైతే మంచిది. కాలేజీకి వెళ్లి చదివే పరిస్థితి లేనివాళ్లు జాతీయ/ రాష్ట్ర ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్మీడియట్‌ లేదా ఒకేషనల్‌ కోర్సుల్లో కొనసాగవచ్చు. 

 ఎస్‌ఎస్‌సీ  

పది విద్యార్హతతో ఎక్కువ పోస్టులు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా భర్తీ అవుతున్నాయి. కేంద్ర పోలీస్‌ బలగాలతోపాటు ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో జనరల్‌ డ్యూటీ- కానిస్టేబుల్, రైఫిల్‌మెన్‌ పోస్టులకు దాదాపు ఏటా ప్రకటన వెలువడుతుంది. ఒక్కో విడతలోనూ యాభై వేలకు తగ్గకుండా, సుమారు లక్ష వరకు ఖాళీలు ఉంటాయి పదో తరగతి అర్హతతో ఉన్న ఎక్కువ ఉద్యోగాలు ఇవే. ఎంపికైనవారు ఆసక్తి, మెరిట్‌ ప్రకారం.. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌లో సేవలు అందించవచ్చు. 


వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు అవసరం. కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, మెడికల్‌ పరీక్షతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి లెవెల్‌ 3 మూలవేతనం  రూ.21,700 అందుతుంది. అన్నీ కలిపి సుమారు రూ.40,000 జీతం అందుకోవచ్చు. భవిష్యత్తులో.. హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, ఆ పైస్థాయికీ చేరుకోవచ్చు. 


మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: కేంద్రానికి చెందిన వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన బహుళ సేవల నిమిత్తం మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పోస్టులను ఎస్‌ఎస్‌సీ దాదాపు ఏటా పదివేలు, ఆపైనే భర్తీ చేస్తుంది. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ పరీక్షలతో నియామకాలుంటాయి. 18-25/27 ఏళ్లవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. సుమారు రూ.35,000 జీతం అందుకోవచ్చు. 


   అగ్నివీర్‌  

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్సుల్లో పదో తరగతి విద్యార్హతతో సేవలందించాలంటే ముందు అగ్నివీర్‌గా ఎంపికవ్వాలి. ఇందుకోసం పరీక్ష, ఫిజికల్, మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. నాలుగేళ్లు విధుల్లో కొనసాగాలి. ఆ తర్వాత వీరిలో 25 శాతం మందికే శాశ్వత ఉద్యోగంలోకి అవకాశం లభిస్తుంది. ఈ నాలుగేళ్లలో.. మొదటి సంవత్సరం రూ.30,000 రెండో ఏడాది రూ.33,000 మూడో ఏట రూ.36,500 నాలుగో సంవత్సరం రూ.40,000 వేతనం చెల్లిస్తారు. ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమ చేస్తారు. మొత్తం నాలుగేళ్ల వ్యవధికి రూ.5.02 లక్షలు అగ్నివీరుని ఖాతాలో జమ అవుతాయి. అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ అందిస్తుంది. చివరలో రూ.10.04 లక్షలకు వడ్డీని కలిపి అగ్నివీరునికి అందిస్తారు. సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌/ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ నిమిత్తం వీరికి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా చూస్తారు. సర్టిఫికెట్‌ అందిస్తారు. పలు కార్పొరేట్‌ సంస్థల్లో రక్షణ విభాగంలో వీరికి ఉద్యోగాలు ఉంటాయి. త్రివిధ దళాల్లో ఏడాదికి రెండు సార్లు అగ్నివీర్‌ ప్రకటనలు వెలువడుతున్నాయి. 


 ఆర్మీలో...  

అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ: పదో తరగతిలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. గ్రేడ్‌ల్లో అయితే కనీసం సీ2 ఉండాలి. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం ఉండాలి.   

అగ్నివీర్‌ ట్రేడ్స్‌మన్‌: పదో తరగతిలో ఉత్తీర్ణులైతే చాలు. ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు ఉండాలి. అలాగే ఈ ట్రేడ్స్‌మెన్‌లో కొన్ని పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోనూ అవకాశం ఉంది. 

వయసు: కనిష్ఠంగా 17 1/2 గరిష్ఠంగా 23 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు, సరిపోయేంత ఛాతీ కొలతలు అవసరం.  

ఎంపిక: అన్ని పోస్టులకూ ఫిజికల్‌ టెస్టులో అర్హత సాధించాలి. అనంతరం ఫిజికల్‌ మెజర్‌మెంట్, మెడికల్‌ టెస్టులు ఉంటాయి. వీటన్నింటిలో విజయవంతమైతే ఉమ్మడి పరీక్ష నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు.   

అగ్నివీర్‌ నుంచి శాశ్వత కమిషన్‌లో అవకాశం వచ్చినవారికి సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ ట్రేడ్స్‌మన్‌ హోదాలు దక్కుతాయి. ఉద్యోగంలో రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. దీంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ), డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. ఉంటాయి. రూ.45,000 అందుకోవచ్చు. వీరు భవిష్యత్తులో సిపాయ్, నాయక్, హవల్దార్‌ హోదాలు పొందవచ్చు.  


  నేవీలో..  

అగ్నివీర్‌గా సేవలందించిన తర్వాత నేవీలో షెఫ్, స్టివార్డ్, శానిటరీ హైజీనిస్ట్‌ ఉద్యోగాలు పొందుతారు. 17-23 ఏళ్లలోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, దేహదార్ఢ్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. వీరికి రూ.21,700 మూలవేతనంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఉంటాయి. రూ.45,000 జీతం అందుకోవచ్చు. భవిష్యత్తులో మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ స్థాయి వరకు చేరుకుంటారు. 

మ్యుజీషియన్‌: నేవీ బ్యాండ్‌లో పనిచేయడానికి మ్యుజీషియన్లు అవసరం. సంగీత పరికరాలపై ప్రావీణ్యం, వయసు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. సంగీత ప్రావీణ్యం, ఫిజికల్, మెడికల్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు.

స్పోర్ట్స్‌ కోటా ఎంట్రీ: ఏదైనా క్రీడ/ ఈవెంట్లో ప్రావీణ్యం ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు. 


  ఎయిర్‌ ఫోర్స్‌లో..  

అగ్నివీర్‌ వాయులో నాలుగేళ్ల సేవల అనంతరం అవకాశం దక్కినవారు ఎయిర్‌ ఫోర్స్‌లో గ్రూప్‌ వై మ్యుజీషియన్‌ హోదా పొందవచ్చు. ఈ ట్రేడ్‌ ఉద్యోగాలకు పదితోపాటు ఏదైనా సంగీత/ వాయిద్య పరికరంలో ప్రావీణ్యం ఉండాలి. రూ.21,700 మూలవేతనం, రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఉంటాయి. రూ.45,000 అందుకోవచ్చు.


  కోస్ట్‌ గార్డ్‌   

ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో డొమెస్టిక్‌ బ్రాంచ్‌ కుక్, స్టివార్డ్‌ పోస్టులకు రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షలతో నియామకాలు చేపడతారు. ఉద్యోగంలో చేరినవారికి ప్రారంభంలో రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. పురుషులే అర్హులు. పదోతరగతిలో 50 (ఎస్సీ, ఎస్టీ 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18 - 22 ఏళ్లలోపు ఉండాలి. ఏడాదికి రెండు సార్లు ఈ ప్రకటనలు ఆశించవచ్చు. 


  రైల్వేలో..  

పదో తరగతితో రైల్వేలో పలు ఉద్యోగాలు ఉన్నాయి. గ్రేడ్‌-4 ట్రాక్‌ మెయింటైనర్‌తోపాటు వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వేతన శ్రేణి ప్రకారం లెవెల్‌-1 (ప్రారంభస్థాయి) ఉద్యోగాలుగా పరిగణిస్తారు. ఎంపికైనవారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. అన్నీ కలిపి రూ.35,000 వరకు మొదటి నెల నుంచే జీతం పొందవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టులతో నియామకాలు చేపడతారు. రైల్వే భద్రత విభాగంలోనూ పదితో సేవలు అందించవచ్చు. రెండు/మూడేళ్లకు ఒకసారి ప్రకటనలు ఆశించవచ్చు. 


  పోస్టల్‌  

తపాలా శాఖలో పోస్టుమ్యాన్, మెయిల్‌ గార్డు ఉద్యోగాలకు పరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. వీటికి ఎంపికైనవారికి రూ.21,700 మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ఆలవెన్సులతో రూ.35,000 అందుకోవచ్చు. రెండుమూడేళ్లకు ఒకసారి   ప్రకటన ఆశించవచ్చు. 

గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌): ఇందులో బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), మెయిల్‌ డెలివరర్‌ (ఎండీ), ప్యాకర్‌ పోస్టులను పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తున్నారు. ఏటా ఈ ప్రకటనలు వెలువడుతున్నాయి. అవకాశం వచ్చినవారు శాఖాపరమైన పరీక్షలతో పోస్టుమెన్, మెయిల్‌ గార్డు, క్లర్క్‌... మొదలైన పదోన్నతులు పొందవచ్చు.  


  ఆర్‌బీఐ  

రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆఫీస్‌ అటెండెంట్‌ విభాగంలో ప్యూన్, దర్వాజ్, మజ్దూర్‌ పోస్టులను భర్తీ చేస్తుంది. వయసు 18-25 ఏళ్లలోపు ఉండాలి. పరీక్షతో నియామకాలుంటాయి. ఉద్యోగంలో చేరిన వారు సీనియర్‌ ఆఫీస్‌ అటెండెంట్‌గా పదోన్నతి పొందవచ్చు. డిగ్రీ పూర్తయితే శాఖాపరమైన పరీక్షలతో అసిస్టెంట్‌ స్థాయి దక్కుతుంది. 

ఐటీబీపీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌.. తదితర కేంద్రీయ ఆర్మ్‌డ్‌ దళాలు కానిస్టేబుల్‌ హోదాలో కుక్, వాషర్‌మన్, బార్బర్, వాటర్‌ క్యారియర్, సఫాయి కర్మచారి తదితర పోస్టులను విడిగా భర్తీ చేస్తున్నాయి. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. శారీరక సామర్థ్య, రాత, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి.  

 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో లేబర్‌ పోస్టులు, బ్యాంకులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్‌ పోస్టులకు పదో తరగతి సరిపోతుంది. 

 రాష్ట్ర అటవీ శాఖల్లో బంగ్లా వాచర్‌ పోస్టులకు పదితో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్టుల ప్రతిభతో నియామకాలు చేపడతారు. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. పురుషులకు 163 సెం.మీ., స్త్రీలకు 150 సెం.మీ. ఎత్తు అవసరం.

కండక్టర్‌: ఏపీఎస్‌/టీఎస్‌ ఆర్‌టీసీల్లో కండక్టర్‌ పోస్టులను ఖాళీలు ఉన్నప్పుడు పదో తరగతి మార్కుల మెరిట్‌తో భర్తీ చేస్తారు. 

డ్రైవర్‌: పదో తరగతి విద్యార్హతతోపాటు హెవీ వెహికల్‌ మోటార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ.. మొదలైనవాటిలో డ్రైవర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. ఆర్టీసీ బస్‌  డ్రైవర్‌ ఉద్యోగానికీ ఈ లైసెన్స్‌ ఉన్నవారు ప్రకటన వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. 


  ఈ అంశాల్లో ప్రశ్నలు   

పదో తరగతి విద్యార్హతతో వివిధ రంగాలు/ విభాగాల్లో పోస్టులకు నిర్వహించే పరీక్షల్లో జనరల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్, జనరల్‌ ఇంగ్లిష్, బేసిక్‌ అరిథ్‌మెటిక్, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్, బేసిక్‌ రీజనింగ్, జనరల్‌ సైన్స్‌... విభాగాల్లో ప్రశ్నలుంటాయి. హైస్కూల్‌ మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్‌ పాఠ్యాంశాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అందువల్ల ముందు వాటిని శ్రద్ధగా చదవడం తప్పనిసరి. అనంతరం పాత ప్రశ్నపత్రాలు పరిశీలించి, పరీక్షపై అవగాహన పెంచుకోవాలి. 
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

Posted Date: 11-07-2024


 

టెన్త్ తర్వాత

మరిన్ని