• facebook
  • whatsapp
  • telegram

భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!  

ఇంజినీరింగ్‌ ప్రవేశాలు


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ సందడి మొదలైంది. వెబ్‌ ఆప్షన్ల నమోదు వ్యవధి కొద్ది రోజుల్లో ముగుస్తోంది. ఈ సమయంలో కళాశాల ముఖ్యమా? చదవబోయే బ్రాంచి ముఖ్యమా? అనే ప్రశ్న చాలా మంది తల్లిదండ్రులనూ, విద్యార్థులనూ వేధిస్తోంది. భవితను నిర్దేశించే కీలకమైన ఈ ఎంపికšపై నిర్ణయానికి వచ్చేముందు.. ఏయే అంశాలను దృష్టిలో పెట్టుకోవాలంటే...


కొద్ది కాలంగా ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి కోర్సులపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తులో ఇన్ని వేలమందికి ఉద్యోగాలు దొరుకుతాయా? లేదా? అంటే చెప్పటం కష్టమే! ఎందుకంటే, అవసరానికి మించి ఒకే బ్రాంచిలో ఎక్కువమంది చదివితే, అందుకు తగ్గట్టుగా ఆ రంగంలో ఉద్యోగాలు అందుబాటులో లేకపోతే, చాలామంది నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉంటుంది. బీటెక్‌/ బీఈ పూర్తిచేసిన చాలామంది కొలువులు పొందలేకా, మరో పని చేయలేకా నిరుద్యోగులుగా మిగిలిపోతున్న పరిస్థితి ఇప్పటికే ఉంది.


ఇంజినీరింగ్‌ విద్యలో విషయ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు కూడా చాలా అవసరం. మన రెండు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ కళాశాలలు వందల్లో ఉన్నా వాటిలో నాణ్యమైనవి పదుల్లోనే. అందుకే ఏ కళాశాలను ఎంచుకోవాలి? ఏ బ్రాంచి తీసుకోవాలి అనే నిర్ణయం తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.


    నిజమైన ఆసక్తి ఉందా?   

విద్యార్థి తనకు ఏ బ్రాంచిపై నిజమైన ఆసక్తి ఉందో గ్రహించటం ముఖ్యం. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులూ, బంధు మిత్రులూ విద్యార్థులు ఏ బ్రాంచి చదవాలో నిర్ణయించేస్తున్నారు. రెండు, మూడు సంవత్సరాలు చదివిన తర్వాత ఆ బ్రాంచి నచ్చకపోవటం, ఆ కళాశాల నచ్చకపోవడం, అసలు ఇంజినీరింగ్‌ చదువే నచ్చకపోవటం లాంటి కారణాలు బయటకు వస్తున్నాయి. దీంతో కోర్సును మధ్యలోనే వదిలేయటమో, నాలుగేళ్లలో డిగ్రీ పూర్తి చేయలేక పది పదిహేను సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అవటమో జరుగుతూ... చివరికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోతున్నారు. 


ముందుగా ఇంజినీరింగ్‌ చదవటానికి అవసరమైన ప్రాథమిక పరిజ్ఞానం తనకు ఉందా? లేదా? అనేది విద్యార్థి అంచనా వేసుకోవాలి. ఆ తర్వాత తనకు ‘ఏ బ్రాంచిపై ఆసక్తి ఉంది? దీర్ఘకాలిక జీవిత ఆశయాలు ఏమిటి? భవిష్యత్తులో ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నాను’ అనేవి దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి.


     ప్లేస్‌మెంట్స్‌పైనే ఆధారపడొచ్చా?  

చాలామంది ఇంజినీరింగ్‌ విద్యపై ఆసక్తి కంటే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం పొందవచ్చన్న ఆశతోనే కాలేజీనీ, బ్రాంచినీ ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా సందర్భాలలో కళాశాలలు ప్రకటించే ప్రాంగణ నియామకాల సంఖ్యలు, వేతనాలు సత్యదూరంగా ఉంటున్నాయి. ప్రాంగణ నియామకాలను బట్టి మాత్రమే కళాశాలను ఎంచుకుంటే కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదమూ ఉంది. చాలామంది కంప్యూటర్‌ సైన్స్‌కి సంబంధించిన బ్రాంచి మాత్రమే చదవాలన్న కోరికతో ఏ కళాశాలలో సీటు వచ్చినా సరే, చేరిపోతున్నారు. అక్కడ సరైన బోధన, మౌలిక సదుపాయాలు లేని సందర్భాల్లో పరిజ్ఞానం, నైపుణ్యాలు లోపించి.. కేవలం డిగ్రీ పట్టాను పొందగల్గుతున్నారు. దానివల్ల ప్రయోజనం శూన్యమని వేరే చెప్పనక్కర్లేదు. 


చాలామంది తల్లిదండ్రులూ, విద్యార్థులూ త్వరగా ఉద్యోగం వచ్చే  బ్రాంచిని మాత్రమే ఎంచుకోవాలనుకోవడం వల్ల కొన్నింటిలో అవసరానికి మించిన డిమాండ్, మరోవైపు చాలా బ్రాంచీల్లో అడ్మిషన్లు లేని విచిత్ర పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ లాంటి ఇంజినీరింగ్‌ బ్రాంచీలు చదివినవారు అందుబాటులో లేని ప్రమాదం ఏర్పడుతుంది.


     మౌలిక సదుపాయాలు, బోధన    

ఒక కళాశాలపై ఆసక్తి ఉంటే- అందులో ఏ ర్యాంకు వరకు సీటు వచ్చే అవకాశం ఉందో గత సంవత్సరాల కౌన్సెలింగ్‌ల సరళిని బట్టి తెలుసుకోవాలి. కళాశాలను ఎంచుకోవడంలో ఏయే అంశాలను పరిశీలించాలంటే... 

ఆ ఇంజినీరింగ్‌ కాలేజీని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? అక్కడ గత సంవత్సరాల్లో ప్రవేశాలు, ప్రాంగణ నియామకాలు ఏ విధంగా ఉన్నాయి? మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయా? లైబ్రరీ, ల్యాబ్స్‌ ఎలా ఉన్నాయి? అక్కడి అధ్యాపకుల విద్యార్హతలు ఏమిటి? వారి పరిశోధన అనుభవం ఏమిటి? సగటు ఉద్యోగానుభవం ఎన్ని సంవత్సరాలు? 

ఆ కళాశాలకు న్యాక్‌ గ్రేడింగ్‌ ఉందా? ఉంటే ఎంత గ్రేడ్‌? ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకు ఉందా? ఉంటే ఎంత ర్యాంకు? అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులు ఉన్నాయా? స్వయం ప్రతిపత్తి ఉందా? ఆ కళాశాలలో ప్రోగ్రాంలకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రెడిటేషన్‌ గుర్తింపు ఉందా? పనిచేస్తున్న అధ్యాపకుల్లో డాక్టరేట్లు ఎందరు? అవి ఏయే యూనివర్సిటీల నుంచి లభించాయి? పరిశ్రమలతో ఎలాంటి సంబంధాలున్నాయి? విదేశాల్లో ఏయే విద్యాసంస్థలతో ఒప్పందాలు ఉన్నాయి?


     ప్రత్యక్షంగా సందర్శిస్తే మేలు  

వెబ్‌సైట్‌ను చూసి మాత్రమే కాకుండా ఆ కళాశాలను ప్రత్యక్షంగా సందర్శించటం చాలా ముఖ్యం. అక్కడి విద్యార్థులతో, అధ్యాపకులతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవాలి. అవకాశం ఉంటే ఆ కళాశాల పూర్వ విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయటం మేలు. కొన్ని చోట్ల మెరుగైన అధ్యాపకులు ఉన్నా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ లాంటి సంప్రదాయ బ్రాంచీల్లో మెరుగైన విద్యార్థులు అక్కడ పెద్దగా చేరటం లేదు. అదే సమయంలో ఉద్యోగానుభవం, విషయ పరిజ్ఞానం కనీస స్థాయిలో లేని అధ్యాపకులు ఉన్న కళాశాలల్లో కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీల్లో అడ్మిషన్లు ఎక్కువగా అవుతున్నాయి! 


    విభిన్న బ్రాంచిలపై అవగాహన   

ఇంజినీరింగ్‌లో ఉన్న అన్ని బ్రాంచీలపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకోవటం చాలా అవసరం. ఏ బ్రాంచిలో ఏయే సబ్జెక్టులు ఉన్నాయి? ఏది చదివితే మెరుగైన ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలుంటాయి?..ఈ విషయాలపై లోతైన అధ్యయనం చేసి, సరైన అవగాహన ఏర్పర్చుకోవాలి. ఎంచుకోబోయే బ్రాంచిలో జీవితకాలం కొనసాగాలి కాబట్టి ఎవరి ఒత్తిళ్లకూ లోనవకుండా సరైన నిర్ణయం తీసుకోవడం ప్రధానం. 



నైపుణ్యాలు, కష్టపడే తత్వం, సృజనాత్మకత ఉంటే ఏ రంగంలోనయినా రాణించవచ్చు. నాలుగేళ్ల డిగ్రీ చదివి ఉద్యోగం చేస్తారా? ఉన్నత విద్యను అభ్యసిస్తారా? దేశంలోనే స్థిరపడతారా? విదేశాలకు వెళతారా? అనే చాలా విషయాలు బ్రాంచి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. 


నాణ్యత ఉన్న కళాశాలలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచీలు చదివినా మంచి భవిష్యత్తుకు అవకాశం ఉంది. నాసిరకం కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌/ డేటా సైన్స్‌ చదివినా మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండవు. కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీలను ఎక్కువమంది చదువుతున్నారు కాబట్టి, అంతమందితో పోటీపడి రాణించి మెరుగైన ఉద్యోగం పొందటం కొంత కష్టంగానే ఉంటుంది. సంప్రదాయ బ్రాంచీలు చదివినవారికి ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలుంటాయి. ఆ బ్రాంచీల నుంచి పీజీలో డేటా సైన్స్‌/ మెషిన్‌ లెర్నింగ్‌లోకి వెళ్లవచ్చు కానీ, కంప్యూటర్‌ బ్రాంచీల నుంచి సంప్రదాయ బ్రాంచీల్లోకి వెళ్లడం అసాధ్యం అనే చెప్పవచ్చు. 


అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్‌నూ, సరైన వైద్యులనూ ఎంచుకోవడంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటామో, ఉన్నతవిద్యకు వెళ్లేప్పుడు మేటి కళాశాలనూ, తగిన బ్రాంచినీ ఎంచుకోవడంలోనూ అంతే జాగ్రత్తలు అవసరం. ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం విద్యార్థుల కెరియర్‌ను మాత్రమే కాకుండా వారి కుటుంబ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవడానికి సంకోచించకండి. 

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌

 కెరియర్‌ కౌన్సెలర్‌

హైదరాబాద్‌ కేంద్రీయ 

విశ్వవిద్యాలయం
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

Posted Date: 10-07-2024


 

ఇంటర్ తర్వాత

మరిన్ని