• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! 


 

పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నాయనే నిరాశ.. పోటీ పరీక్షలు రాస్తున్నా కొలువు సాధించలేకపోతున్నామన్న అసంతృప్తి... ఇలా దిగులుపడుతుండే విద్యార్థులూ, ఉద్యోగార్థులూ ఎందరో. వీరిలో కొందరైతే ఆశలు వదులుకుని తమ ప్రయత్నాలను మధ్యలోనే ఆపేస్తుంటారు కూడా. అలా చేయటం వల్ల నష్టపోవటం తప్ప సాధించేదేమీ ఉండదు! 

అనుకున్నది చేయలేనేమోననే భయమే ముందడుగు వేయనీయదు. దాన్ని అధిగమించాలంటే సాధించాలనే పట్టుదల దృఢంగా ఉండాలి. అప్పుడే కొత్తగా ప్రయత్నాలను మొదలుపెట్టగలుగుతారు. గతంలో ఏయే పద్ధతులను పాటించారో గుర్తుచేసుకుని.. ఈసారి వాటికి భిన్నమైన మార్గాల్లో కృషిచేయడం మొదలుపెట్టాలి. 

ఎవరైనా సరే సానుకూల ఫలితాలను అందుకోవాలనే ఉద్దేశంతోనే పనులను ప్రారంభిస్తారు. కానీ కొన్నిసార్లు ఫలితాలు అందుకు భిన్నంగానూ ఉండొచ్చు. అలాంటప్పుడు ముందుగా కారణాలను విశ్లేషించుకోవాలి. గతంలో బద్ధకంతో ముఖ్యమైన కొన్నింటిని వాయిదా వేసి ఉండొచ్చు. కష్టంగా ఉన్నాయని మరికొన్నింటిని చదవకుండానూ వదిలేయొచ్చు. ప్రశాంతంగా విశ్లేషించుకోవడం వల్ల ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడగలుగుతారు. 

‣ సాధారణంగా అనుకూలంగా ఉన్న పద్ధతుల్లోనే చదవడానికి అందరూ ఇష్టపడతారు. ఏ కాస్త అసౌకర్యంగా అనిపించినా ఆ పద్ధతిని అనుసరించడానికి ఇష్టపడరు. కానీ ఈ పరిధి నుంచి బయటకు వచ్చి ప్రయత్నించడం మొదలుపెట్టాలి. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా అనుకున్నది సాధిస్తారు.  కానీ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడి సానుకూల ఫలితాలు సాధించడంలోనే అసలైన ప్రతిభ దాగుంటుంది. 

‣ వైఫల్యాలు ఎదురైన వెంటనే రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నాలు మొదలుపెట్టడం ఎవరికైనా సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటప్పుడు చిన్న విరామం తీసుకుని తిరిగి ప్రారంభించొచ్చు. ఆ సమయంలో స్ఫూర్తిని నింపే పుస్తకాలు చదవడం, వీడియోలు చూడటం.. మంచిది. సివిల్స్‌ అభ్యర్థులనే ఉదాహరణగా తీసుకుంటే.. నాలుగైదుసార్లు విఫలమైనా చివరి ప్రయత్నంలో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించినవాళ్లూ ఉన్నారు. వీళ్లంతా మొదటిసారి విఫలమైనప్పుడు తమ ప్రయత్నాలను అంతటితోనే ఆపేయలేదుగా. ఓర్పు, సానుకూల దృక్పథంతో ఆఖరివరకూ ప్రయత్నించి విజయాన్ని సాధించగలిగారు. 

సాధారణంగా ప్రతికూల ఫలితాలు రాగానే ఆలోచనలన్నీ వైఫల్యం చుట్టూనే తిరుగుతుంటాయి. ఇలాంటప్పుడు పూర్తిగా దాని అధీనంలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. లక్ష్యం మీద నుంచి దృష్టి మరలకుండా చూసుకోవాలి. ఈ క్రమంలో నేర్చుకున్న విషయాలేవీ నిరుపయోగం కావు. భవిష్యత్తులో అవి అనుభవ పాఠాలుగా ఉపయోగపడతాయి.  

చేసిన పొరపాట్లను గుర్తించకుండా బాధపడుతూ కూర్చుంటే అక్కడే ఆగిపోతారు. జరిగిన తప్పులకు బాధ్యత వహించి అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. అలాగే ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలు చేస్తూ నిరుత్సాహపరిచే స్నేహితులు, వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే జరిగిన నష్టం ఒకవైపు.. విమర్శలు మరోవైపు బాధిస్తుంటే అడుగు ముందుకు వేయడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. 

ఫలితాలు ప్రతికూలంగా రావడం తప్పు కాదు. తిరిగి ప్రయత్నించకపోవడమే అసలైన పొరపాటు. ఆత్మవిమర్శ చేసుకుని ఎక్కడెక్కడ పొరపాట్లు చేశారో గ్రహించాలి. సరైన ప్రణాళిక వేసుకుని.. దాన్ని కచ్చితంగా అమలుచేస్తూ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండాలి.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

Posted Date : 08-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం