• facebook
  • whatsapp
  • telegram

కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు

అర్హత: పదో తరగతి
 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్సెస్సీ) నిర్వహించే మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) నాన్‌ టెక్నికల్, హవల్దార్‌ పోస్టులకు ప్రకటన వెలువడింది. పదో తరగతి విద్యార్హతతో పోటీ పడవచ్చు. పరీక్షతో నియామకాలుంటాయి. మొదటి నెల నుంచే సుమారు రూ.35,000 వేతనం అందుకోవచ్చు. 8326 ఖాళీలు ఉన్నాయి. మరి మీరు సిద్ధమేనా! 


జాతీయ స్థాయిలో దాదాపు ఏటా వెలువడుతోన్న ఉద్యోగ ప్రకటనల్లో ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ అండ్‌ హవల్దార్‌ ఒకటి. ఖాళీలు వేలల్లో, విద్యార్హత పదో తరగతే కావడంతో ఎక్కువమంది పోటీ పడుతున్నారు. అభ్యర్థులు తెలుగు మాధ్యమంలో ఉండే ప్రశ్నపత్రాన్నీ ఎంచుకోవచ్చు. ఉద్యోగాన్ని ఆశిస్తున్నవారు ఎక్కువ మందే ఉన్నప్పటికీ పరీక్ష మరీ అంత కష్టం కాదు. దీన్ని లక్ష్యంగా చేసుకున్నవారు నిబద్ధతతో కృషిచేస్తే మొదటి ప్రయత్నంలోనే మెరిసిపోవచ్చు. 


మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, హవల్దార్‌ రెండూ లెవెల్‌-1 ఉద్యోగాలే. వీరికి రూ.18,000 మూలవేతనం అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులతో వీరు రూ.35,000 జీతం అందుకోవచ్చు. అనుభవం, శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ నాన్‌ టెక్నికల్‌ పోస్టుల్లో చేరినవారు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ కార్యాలయాలు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ సంస్థల్లో విధులు నిర్వహిస్తారు. హవల్దార్‌గా ఎంపికైనవారు కేంద్ర రెవెన్యూ, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా పనిచేస్తారు. కేంద్రంలోని పరోక్ష పన్నుల విభాగాలు, నార్కోటిక్‌ బ్యూరోలో సేవలందిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్షలో ప్రతిభ, ధ్రువపత్రాల పరిశీలనతో ఎంటీఎస్‌ పోస్టులు భర్తీ చేస్తారు. హవల్దార్‌ పోస్టులకు పీఈటీ, పీఎస్‌టీ అదనం.



  రెండు సెషన్లుగా..  

పరీక్షను 2 సెషన్లుగా విభజించారు. రెండు సెషన్లలోనూ ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. మొత్తం 270 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఒక్కో సెషన్‌ వ్యవధి 45 నిమిషాలు. సెషన్‌-1లో న్యూమరికల్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ ఎబిలిటీలో 20, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నుంచి 20 మొత్తం 40 ప్రశ్నలు వస్తాయి. వీటికి రుణాత్మక మార్కులు లేవు. సెషన్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌లో 25, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 25 మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ సెషన్‌లో తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్షలో అర్హత సాధించడానికి ప్రతి సెషన్‌లోనూ జనరల్‌ అభ్యర్థులు 30, ఓబీసీ/ఈడబ్ల్యుఎస్‌లు 25, ఇతర విభాగాలవారు 20 శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కుల పొందినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్లు అనుసరించి ఉద్యోగంలోకి తీసుకుంటారు. 

పీఈటీ: హవల్దార్‌ పోస్టులకు ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో, మహిళలు ఒక కిలోమీటర్‌ని 20 నిమిషాల్లో చేరుకోవాలి. 

పీఎస్‌టీ: పురుషులు 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరిగి 81 సెం.మీ. తక్కువ కాకుండా ఉండాలి. మహిళలు 152 సెం.మీ. ఎత్తు, 48 కి.గ్రా. బరువు అవసరం.


  ముఖ్య సమాచారం   

ఖాళీలు: 8326. వీటిలో.. ఎంటీఎస్‌ 4887, హవల్దార్‌ 3439. 

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.

వయసు: ఆగస్టు 1, 2024 నాటికి ఎంటీఎస్‌ పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఆగస్టు 2, 1999 - ఆగస్టు 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు. హవల్దార్, ఎంటీఎస్‌లో కొన్ని పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల వారు అర్హులు. వీటికి ఆగస్టు 2, 1997 - ఆగస్టు 1, 2006 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని పోస్టులకూ ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు: జులై 31.

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు. 

పరీక్షలు: అక్టోబరు-నవంబరులో.  

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి,   విజయనగరం , విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌. 

వెబ్‌సైట్‌: https://ssc.gov.in/


  సన్నద్ధత సూత్రాలు   

ముందు నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ వివరాలు శ్రద్ధగా పరిశీలించండి. వాటినే బాగా చదవండి. పరీక్షను అక్టోబరు-నవంబరులో నిర్వహిస్తారు. అందువల్ల ఇప్పటి నుంచి సిద్ధపడినా 85 కంటే తక్కువ కాకుండా సుమారు 145 రోజులు మీ చేతిలో ఉన్నట్లే. ఈ వ్యవధి సిలబస్‌ మొత్తం పూర్తి చేసుకోవడానికి సరిపోతుంది.  

 ఆచరణ సాధ్యమయ్యేలా కాల ప్రణాళిక రూపొందించుకోవాలి. దాన్ని తప్పనిసరిగా అమల్లోకి తీసుకురావాలి. నెల రోజుల తర్వాత సమీక్షించుకుని, మార్పులు చేసుకోవాలి. వెనుకబడుతోన్న విభాగాలకు మరికొంత అదనపు సమయం కేటాయించాలి. 

 సిలబస్‌లో పేర్కొన్న అంశాల ప్రకారం ముందుగా 8,9,10 తరగతుల మ్యాథ్స్, ఇంగ్లిష్, సోషల్‌ పుస్తకాలు బాగా చదవాలి. 

అన్ని విభాగాలకూ సమాన ప్రాధాన్యం ఉంది కాబట్టి అవగాహన లేని/ వెనుకబడిన వాటికి అదనపు సమయం వెచ్చించుకోవాలి.  

వేగం, కచ్చితత్వం కోసం మెంటల్‌ మ్యాథ్స్‌ నైపుణ్యాలు పెంచుకోవడం తప్పనిసరి. 

చదవడం పూర్తయిన తర్వాత పాత ప్రశ్నపత్రాలు సునిశితంగా పరిశీలించాలి. వాటిని బాగా సాధన చేయాలి. ప్రశ్నల స్థాయి, అంశాలవారీ పరీక్షలో ప్రాధాన్యం గ్రహించి తుది సన్నద్ధతను మెరుగుపరచుకోవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.  

కనీసం 20 మాక్‌ టెస్టులు రాయాలి. ఒక్కో పరీక్ష పూర్తయిన తర్వాత.. విభాగాలు, అంశాల వారీ ఎక్కడ తప్పు చేస్తున్నారో గమనించి వాటిని ప్రత్యేక శ్రద్ధతో చదివి, అందులో మరిన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. 

‣ చివరి వారం లేదా పది రోజులను పునశ్చరణకు కేటాయించండి. 


  పరీక్ష రోజు..   

ప్రతి ప్రశ్నకూ సమాధానం గుర్తించాలనే లక్ష్యం బదులుగా సరైన జవాబు గుర్తించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే సులువైనవి, జవాబు కోసం తక్కువ సమయం తీసుకునేవాటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. దీంతో విశ్వాసం పెరుగుతంది. ఆ తర్వాత కొంచెం ప్రయత్నిస్తే సాధ్యమయ్యేవాటిని చూడాలి. ఎక్కువ సమయం తీసుకునేవి, కొంచెం కఠినమైన  వాటిని చివరలోనే ప్రయత్నించండి. 

‣ ప్రశ్న పూర్తిగా చదివిన తర్వాతే సమాధానం గుర్తించండి.

సెషన్‌-1లో ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేనందున బాగా ఆలోచించి ఏదో ఒక ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. సెషన్‌-2లో తెలియని ప్రశ్నలను వదిలేయండి.


   ప్రశ్నలు ఇలా...   

  

అన్ని ప్రశ్నలూ పదో తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థి ఎదుర్కునేలా ఉంటాయి. అభ్యర్థి అవగాహనను తెలుసుకునేలా.. తేలిక, సాధారణ స్థాయిలోనే అడుగుతారు. సగటు విద్యార్థి ఎక్కువ ప్రశ్నలకు సులువుగానే సమాధానాలు గుర్తించవచ్చు.

న్యూమరికల్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ ఎబిలిటీ: అంకెలతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు. పూర్ణ సంఖ్యలు, శాతాలు, సగటు, భిన్నాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వడ్డీ, డిస్కౌంట్, కొలతలు, క.సా.గు., గ.సా.భా., అంకెల మధ్య సంబంధాలు, బోడ్మాస్, స్క్వేర్, స్క్వేర్‌ రూట్‌.. మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోనివే. అందువల్ల ముందు వాటినే బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.

రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌: ఆల్ఫా న్యూమరిక్‌ సిరీస్, కోడింగ్‌- డీకోడింగ్, ఎనాలజీ, డైరెక్షన్లు, పోలికలు, తేడాలు, పరిశీలనలు, సంబంధాలు, వయసును లెక్కించడం, క్యాలెండర్, క్లాక్‌... మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించడం ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు. తర్కంతో ముడిపడే తేలిక ప్రశ్నలే ఉంటాయి. బాగా ఆలోచిస్తే.. సమాధానం గ్రహించగలరు.

జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానం చాలు. హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, కళలు, సంస్కృతి విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి హైస్కూల్‌ సోషల్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌:  అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌.. తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించడం కష్టమేమీ కాదు. 
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Posted Date : 08-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌