• facebook
  • whatsapp
  • telegram

అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

డీఎస్సీ - ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్ష సన్నద్ధత వ్యూహాంఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల నియామకాల కోసం మెగా డీఎస్సీకి రంగం సిద్ధమయింది. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనిలో మెరుగైన ర్యాంకు పొందేందుకు ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకుందాం!  


మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రకటన విడుదలైంది. ఏదైనా కారణాలవల్ల గతంలో దీన్ని రాయలేకపోయినవారు మళ్లీ రాసుకునేందుకూ, స్కోరు మెరుగుపరుచుకునేందుకూ అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే మంచి స్కోరు సాధించినవారు టెట్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. మంచి స్కోరు రానివాళ్లు, ఇప్పటివరకు హాజరుకానివారు టెట్‌ రాయాలి.


కీలకమైన డీఎస్సీలో మంచి ర్యాంకు పొందేందుకు కొన్ని అంశాలను గమనించాలి:


కరెంట్‌ అఫైర్స్‌: స్కూల్‌ అసిస్టెంట్స్, ఎస్‌జీటీలకు ఉమ్మడిగా ఉన్న సిలబస్‌ అంశాల్లో కరెంట్‌ అఫైర్స్‌ ముఖ్యమైనది. మొత్తం 80 మార్కుల్లో 10 మార్కులు ఈ భాగం నుంచి పొందవచ్చు. సాధారణంగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఈ విభాగంలో బలహీనంగా ఉంటారు. కొంతమంది జనరల్‌ నాలెడ్జి (జీకే)ని మాత్రమే చూసి కరెంట్‌ అఫైర్స్‌ను పరిగణించరు. మరికొంతమంది కరెంట్‌ అఫైర్స్‌ని చదివి దాన్ని జీకేగా భావిస్తారు. ఈ రెండు విభాగాల మధ్య ఉన్న తేడాను గుర్తించి మెరుగ్గా తయారైతే కచ్చితంగా ర్యాంకు సాధనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మిగతా సబ్జెక్టులను డీఈడీ, బీఈడీల్లో అందరూ చదువుతారు. కానీ ఈ విభాగాన్ని ప్రత్యేక దృష్టితో చదివేవారికి మాత్రమే పట్టు దొరికే అవకాశం ఉంది. కొంతమంది గ్రూప్స్‌ ప్రిపరేషన్‌లో ఈ విభాగంపై గట్టి పట్టు సాధించి ఉంటారు. వారికి అదనపు ప్రయోజనం ఈ విభాగం ద్వారా సమకూరుతుంది. అందువల్ల గ్రూప్స్‌ ప్రిపరేషన్‌ లేని అభ్యర్థులు దీనికి ప్రత్యేక సమయాన్ని వెచ్చించి చదువుకోవాలి.

గత ఆరు నెలల సమాచారాన్ని చదువుకుంటూ నవంబర్‌ 15 వరకు జరిగే కరెంట్‌ అఫైర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జీకే లాంటి విషయాలపై ప్రాథమిక అవగాహన ఉన్నా సరిపోతుంది. దినపత్రికల అధ్యయనం మేలైన నిర్ణయం అవుతుంది. 

విద్యా దృక్పథాలు: ఈ విభాగంలో ఐదు మార్కులు వస్తాయి. ఇది కూడా స్కూల్‌ అసిస్టెంట్స్, ఎస్‌జీటీలకు ఉమ్మడి అంశం. స్కూల్‌ అసిస్టెంట్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు విద్యా దృక్పథాల విషయంలో కేవలం బీఈడీ పుస్తకంపైనే ఆధారపడకుండా కొద్దిగా విస్తృతŸస్థాయిలో సొంత ఆలోచనతో చదవాలి. గతంలో టెట్లో కూడా అభ్యర్థుల సొంత ఆలోచనలను పరిశీలించే ప్రశ్నలు అడిగారు. అలాంటి వాటికి కూడా సిద్ధపడితే పరిధి దాటి వచ్చే ప్రశ్నలను ఎదుర్కోవటం సులభం అవుతుంది తద్వారా ర్యాంకు మెరుగవుతుంది. డీఈడీ అభ్యర్థులు మరీ అంత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. డీఈడీలో నేర్చుకున్న అంశాలకు లోబడి సిద్ధమైతే సాధారణ పరిస్థితిలో సరిపోతుంది.

కేవలం బిట్ల రూపంలో సిలబస్‌ అంశాలను చదవకూడదు. అలాగే పాఠ్యపుస్తకాల సమాచారం మాత్రమే చదివితే సరిపోదు. పాఠ్యపుస్తకాలు చదువుతూ సంబంధిత అంశంపై ఎటువంటి ప్రశ్నలు రావచ్చో ఆలోచించాలి. ఆపై వీలైనన్ని బిట్లను సాధన చేయాలి.

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం: ఈ విభాగం కింద మరో ఐదు మార్కులు రాణించే అవకాశాన్ని పరీక్షలో కల్పించారు. ఇది కూడా స్కూల్‌ అసిస్టెంట్స్, ఎస్‌జీటీలకు ఉమ్మడి విభాగం అని చెప్పవచ్చు. తరగతి గదిలో మనోవైజ్ఞానిక శాస్త్రం రీత్యా ఉపకరించే అనువర్తనాలకు ప్రాధాన్యం ఉంటుంది. మొత్తం పదిలో రెండో మూడో సైద్ధాంతిక ఆధారిత ప్రశ్నలు ఉండవచ్చు. తరగతి గది సన్నివేశ ఆధారంగా విద్యార్థి మానసిక స్థితులు, ఉపాధ్యాయుని పాత్ర, సమస్యలు- పరిష్కారాలు అనే కోణంలో అంశాలు అధ్యయనం చేయాలి. డీఈడీలో చదివిన  అంశాలను ఎస్‌జీటీ అభ్యర్థులు ప్రధానంగా పరిగణించాలి. స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులు బీఈడీ పుస్తకంపై ఆధారపడుతూనే ఆలోచన పరిధిని విస్తృతీకరించుకోవాలి.


   కంటెంట్‌   


ఎస్‌జీటీ 

80 మార్కుల్లో 45 మార్కుల ప్రాధాన్యం కంటెంట్‌కు ఇచ్చారు. తెలుగు, ఇంగ్లిష్‌ భాషలతో పాటు గణితం, సాంఘిక శాస్త్రం, సైన్స్‌ విభాగాల్లో ఒక్కొక్క దాని నుంచి 9 మార్కులు పొందవచ్చు. 

ఈ ఐదు కంటెంట్‌ విభాగాల్లో తయారయ్యేందుకు ప్రధానంగా 3 నుంచి 8 వతరగతి పాఠశాల పాఠ్యపుస్తకాలపై ఆధారపడాలి. ఏదైనా చాప్టర్‌లోని అంశాలు 9, 10 తరగతుల్లో కూడా ఉంటే ఎనిమిదో తరగతి వరకు చదివి ఆపకుండా 9, 10 తరగతుల్లో  ఉన్న విషయ పరిజ్ఞానాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. గతంలో కొన్ని డీఎస్సీల్లో పేపర్‌ సెట్టర్స్‌ ఈ టెక్నిక్‌ను పాటించారు. అందుకని ఇప్పుడు జాగ్రత్తపడితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఏదైనా చాప్టర్లోని అంశం ఎనిమిదో తరగతి వరకే పరిమితమై ఉంటే అంతటితో ఆపితే సరిపోతుంది. ప్రధానంగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాలపై ఆధారపడాలి. వాటిపై పూర్తి పట్టు వచ్చినప్పుడు అదనపు సమాచారం కోసం ప్రైవేటు పుస్తకాలపై ఆధారపడవచ్చు. కొంతమంది గతంలో పాత పాఠ్యపుస్తకాలు ప్రిపేరైవుంటారు. అలాంటివారు ప్రస్తుతం కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్న తరగతుల వరకు తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. కొత్త పాఠ్య పుస్తకాలు రాని తరగతికి పాత పుస్తకాలు చదవాలి.


స్కూల్‌ అసిస్టెంట్స్‌

మొత్తం 80 మార్కుల్లో 44 మార్కులు కంటెంట్‌కు కేటాయించారు. అంటే ఈ విభాగంపై పట్టు సాధించలేని అభ్యర్థులు ఉద్యోగం పొందలేరని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రతిభా పాటవాలున్న అభ్యర్థుల్లో చాలామంది కంటెంట్‌లో సమాన ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ర్యాంకు సాధించే అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాల్లో కూడా రాణించగలుగుతారు. అందువల్ల మొదట కంటెంట్‌ను విస్తృతంగా అధ్యయనం చేసి దాంతోపాటు ఈ మూడు విభాగాలు కూడా ప్రత్యేక ప్రాధాన్యంతో చదవటమే సరైన వ్యూహమవుతుంది.

6 నుంచి 10వ తరగతుల వరకు సంబంధిత సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధించాలి. పదో తరగతిలోని కొన్ని సబ్జెక్టులు ఇంటర్మీడియట్‌ స్థాయిలో చదువుకోవటం కూడా అవసరమే. ఎందుకంటే- విద్యార్థిని భవిష్యత్తు తరగతులకు సిద్ధపరచడం అనేది ఉపాధ్యాయుని ప్రాథమిక బాధ్యత. ఆ స్థాయిలో అభ్యర్థులు ఉన్నారా లేదా అని పరిశీలించేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని ఎదుర్కునేవారే అంతిమ ర్యాంకులో నిలబడతారు.


  మెథడ్స్‌    


ఎస్‌జీటీ 

మొత్తం 80 మార్కుల్లో 15 మార్కులు మెథడ్స్‌కి కేటాయించారు. సిలబస్‌లో ఉన్న ఐదు సబ్జెక్టులకు ఒక్కొక్క దానికి మూడు మార్కులు కేటాయించారు. డీఎడ్‌ పాఠ్యపుస్తకాలు ప్రధానంగా అధ్యయనం చేయాలి. ప్రాథమిక తరగతులకు ఉద్దేశించిన మెథడ్స్‌పైనే ప్రత్యేకమైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్‌ భాషలకు సంబంధించి అనేక ఉమ్మడి అంశాలున్నందున ఉమ్మడిగా తయారైతే సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. సమగ్ర అవగాహనా పెరుగుతుంది. ఇలాగే గణితం, సైన్సు, సోషల్‌ సబ్జెక్టులకు కూడా ఉమ్మడిగా సన్నద్ధమవటం ద్వారా మంచి మార్కులు రావటంతో పాటు సమగ్ర అవగాహన కూడా పెరుగుతుంది. ముఖ్యంగా గణిత, సైన్స్‌ సబ్జెక్టుల్లో అనుసంధానం మెరుగైన ఫలితాలకు దారి తీస్తుంది

గణితం, సాంఘిక శాస్త్రం, సైన్సులకు సంబంధించి డీఈడీ పుస్తకాల్లో స్పష్టంగా ఇచ్చిన సమాచారంపై బలమైన పట్టు సాధించాలి. అనువర్తన ధోరణితో అధ్యయనం చేస్తే మంచి మార్కుల సాధన సులభమే.


స్కూల్‌ అసిస్టెంట్స్‌ 

మొత్తం 80 మార్కుల్లో 16 మార్కులు మెథడ్స్‌కే కేటాయించారు. బీఈడీ పాఠ్యపుస్తక ఆధారంగా సంబంధిత సబ్జెక్టులోని మెథడ్స్‌ సిలబస్‌పై పట్టు సాధించాలి. పాఠశాల నిర్వహణ అంశాలు కూడా ప్రశ్నల రూపంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాఠశాల నిర్వహణ అంశాలపై స్థూల అవగాహన పెంచుకోండి. కంటెంట్‌ని ప్రాక్టికల్‌గా బోధన పద్ధతుల్లో వినియోగించే పరిస్థితులు అధ్యయనం చేస్తే అలాంటి నేపథ్యంతో వచ్చే ప్రశ్నలను తేలిగ్గా ఎదుర్కోవచ్చు. టెట్‌ పరీక్షల్లో అడుగుతున్న సమగ్ర అవగాహన సంబంధిత ప్రశ్నలనూ సాధన చేయాలి. - కొడాలి భవానీ శంకర్‌


 

మరింత సమాచారం... మీ కోసం!

‣జాగ్రఫీదే హవా!

‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

Posted Date : 02-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు