• facebook
  • whatsapp
  • telegram

గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

మెరుగైన స్కోరు సాధనకు సూచనలుత్వరలోనే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. 21-10-24 నుంచి 27-10-24 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయి అని ముందస్తుగా ప్రకటించారు. అంటే సన్నద్ధతకు సుమారు 110 రోజులు లభిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యవధిని సద్వినియోగం చేసుకుని గరిష్ఠ మార్కులతో గ్రూప్‌-1 విజేతగా మారేలా చేసే ప్రిపరేషన్‌ వ్యూహం ముఖ్యం. ఇంటర్వ్యూ దశ కూడా లేనందున మెయిన్స్‌లో వచ్చే మార్కులే తుది ఫలితాలను నిర్దేశిస్తాయి. అందుకని మెయిన్స్‌లో ఎంత బాగా రాణిస్తే అంత మంచి ర్యాంకు సాధ్యమవుతుంది.  


మెయిన్స్‌లో జనరల్‌ ఇంగ్ల్లిష్‌ పేపర్‌లో అర్హత సాధిస్తే సరిపోతుంది. అయితే అర్హత పరీక్షే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. గతంలో అనేక సందర్భాల్లో వందల మంది ఈ పరీక్షలో క్వాలిఫై కాలేక మంచి అవకాశాన్ని కోల్పోయారు. ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులు వారానికి కనీసం రెండు మూడు గంటల సమయాన్నో, ప్రతిరోజూ అరగంటో జనరల్‌ ఇంగ్లిష్‌కు సంబంధించి టెన్త్‌ క్లాస్‌ స్థాయి ప్రిపరేషన్‌ అవసరం. ‘చివరి వారంలో చూసుకుందాంలే’ అంటూ దీని సన్నద్ధత వాయిదా వేస్తే మాత్రం నష్టం కలిగించే అంశమే. 


   ఛాయిస్‌లో తికమక    


సాధారణంగా గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో ఛాయిస్‌ విధానంలో రాసే అవకాశం ఉంటుంది. అందువల్ల చాప్టర్ల వారీగా కొన్ని అంశాలను వదిలి వేసుకుంటూ కొన్ని అంశాలపైనే ప్రధానంగా ఫోకస్‌ పెట్టి చదివే పద్ధతిని మెజారిటీ అభ్యర్థులు అనుసరిస్తారు. అయితే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం ప్రతి సెక్షన్లోనూ ఒక ప్రశ్నకి ఛాయిస్‌ ఉండదని తెలుస్తోంది. ప్రతి ప్రశ్నలోనూ మొదటి చాప్టర్‌కా, మరేదైనా చాప్టర్‌కా అనే విషయంలో తికమక ఉంది. అందువల్ల మొత్తం సిలబస్‌ చదవాలనే ఒత్తిడిలో చాలామంది ఉన్నారు. దానివల్ల ప్రిపరేషన్‌ నాణ్యత కచ్చితంగా తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొంత రిస్కు కూడా చేయాల్సి ఉంటుంది. ఛాయిస్‌ విధానంలో అన్ని చాప్టర్లూ చదువుతూనే ఒక సెక్షన్‌పై ఓవర్‌ వ్యూ అవగాహన పెంచుకోగలిగితే కొంతవరకు ఈ సమస్య గట్టెక్కవచ్చు. అందుకని ఇదమిత్థంగా ఫలానా చాప్టర్‌లోనే ఛాయిస్‌ తీసుకుందామనే ఆలోచన లేకుండా చదవాలి. ముఖ్యంగా డేటా ఇంటర్‌ప్రెటేషన్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దాదాపు 95% సిలబస్‌ కవర్‌ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.


   జనరల్‌ ఎస్సే  


జనరల్‌ ఎస్సేలో మూడు సెక్షన్లకు మూడు వ్యాసాలు రాయాలి. సరైన అనుభవం, మార్గదర్శకత్వం లేనందున ఈ విభాగానికి ప్రత్యేక ప్రిపరేషన్‌ అక్కర్లేదనే భావన చాలామందిలో కనిపిస్తోంది. సిలబస్‌లోని ఇండియన్‌ పాలిటిక్స్, ఇండియన్‌ ఎకానమీ, అభివృద్ధి, భారతదేశ చరిత్ర- సంస్కృతి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలను మిగతా పేపర్లలో చదువుతాం కాబట్టి అదే సమాచారాన్ని పేపర్‌-1కి కూడా రాయొచ్చనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కంటెంట్‌ విషయంలో ఈ ఆలోచన సరిపోతుంది గానీ ప్రజెంటేషన్‌ విషయంలో సరికాదు. వ్యాస లక్షణాలను పరిగణిస్తూ రాసినప్పుడే మార్కులు వస్తాయని గ్రహించాలి. అందువల్ల వ్యాస లక్షణాలతో ఈ విభాగాల సిలబస్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయటం అత్యంత అవసరం. ‘కంటెంట్‌ ఉంది కదా- నేరుగా పరీక్ష హాలుకు వెళ్లిపోదాం’ అనుకుంటే మాత్రం కచ్చితంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.


అయితే సిలబస్‌ను స్థూలంగా పరిశీలిస్తే.. భారత వర్తమాన సామాజిక సమస్యలు, విద్యా, మానవ అభివృద్ధి మొదలైనవి కూడా ఉన్నాయి. నిజానికి ఇవి పైన చెప్పిన అంశాల కంటే సులభంగా రాయవచ్చు. అదేవిధంగా భావ వ్యక్తీకరణకు అధిక అవకాశం ఉంటుంది. పైగా ఇతర అభ్యర్థులు రాయని వ్యాసాలు రాసే అవకాశం ఉన్నందున ఎగ్జామినర్‌ ఫ్రెష్‌గా భావించే అవకాశమూ ఉంటుంది. మంచి మార్కులు కూడా పొందవచ్చు. ప్రతి వ్యాసాన్నీ వెయ్యి పదాలకు అటు ఇటుగా రాయటం అధిక మార్కులు వచ్చేందుకు దోహదపడుతుంది. పద నిబంధన పాటించుకుంటే నష్టపోయే అవకాశం కూడా ఉంది. వెయ్యి పదాల్లో ఒక వ్యాసం రాయటం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎంతో సాధన, కంటెంట్, భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడే ఇది సాధ్యం. అందువల్ల లభిస్తున్న సమయంలో రైటింగ్‌ ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.

 
   పద నిబంధన పాటిస్తూ..  


మిగతా 5 పేపర్లలో అతిపెద్ద సమస్య- పద నిబంధనను పాటిస్తూ విషయాన్ని సమగ్రంగా వివరించగలగటం. ఇది ఒక రకంగా కత్తి మీద సామే. ఎందుకంటే ఎగ్జామినర్‌ని సంతృప్తిపరిచే విధంగా సమాధానం రాసే క్రమంలో చాలామంది సమయం సరిపోక కొన్ని ప్రశ్నలను వదిలివేయటం తరచూ జరుగుతుంటుంది. అందువల్ల పద నిబంధనకు పరిమితం అవుతూనే సమాచారం ఎలా ప్రజెంట్‌ చేయాలి అనే విషయంలో సాధన అవసరం. అప్పుడే సాధక బాధ]కాలు అర్థమై పరిష్కారాలు దొరుకుతాయి. అందువల్ల ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు అయినా ప్రాక్టీస్‌ చేయాలి. ప్రస్తుత సమయాన్ని ఈ కోణంలో కూడా వినియోగించుకోవాలి.


‣ జనరల్‌ స్టడీస్‌లోని మిగతా ఐదు పేపర్లకు సమాధానాలు రాసేటప్పుడు ప్రతి ప్రశ్నకు ఇచ్చిన ట్యాగ్‌ ఏమిటో పరిశీలించుకోవాలి. అందుకు అనుగుణంగానే సమాధానం రాయాలి. ప్రతి ట్యాగ్‌కూ నిర్దిష్ట సమాధానాన్ని ఎగ్జామినర్‌ నిర్ణయించుకుంటాడు. దానికనుగుణంగా సమాధానం ఉన్నప్పుడే మార్కులు పడతాయి. అందువల్ల కంటెంట్‌ను చదవడంతో పాటు ఆ కంటెంట్‌పై వివిధ రకాలైన ట్యాగ్‌లతో ప్రశ్నలను తయారుచేసుకుని సమాధానాన్ని రాస్తుండాలి. ఇలా చేసినప్పుడే సంపూర్ణంగా సమాధానం సంతృప్తి పరుస్తుంది, మార్కులను ధారాళంగా ఇస్తుంది. 


   ఏ విభాగం ఎలా?  


డేటా ఇంటర్‌ప్రెటేషన్‌: ఈ సెక్షన్లో ప్రతి ప్రశ్నకూ రెండు మార్కులు కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రశ్న చూడగానే సమాధానాన్ని రాయవచ్చు. అయితే కేవలం సమాధానం రాయడంతో రెండు మార్కులు పడిపోవు. కచ్చితంగా రెండు మార్కులు పొందేందుకు స్టెప్స్‌ వారీగా సమాధానం రాయాలి. ఈ విషయాన్ని గమనించి సిలబస్‌లోని టాపిక్స్‌కు స్టెప్పుల వారీగా సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ విభాగంలో గట్టిగా సాధన చేస్తే 50కి 50 మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా ఆర్ట్స్‌ అభ్యర్థులు ఈ విభాగంలో ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ చేయాలి. లేకుంటే మ్యాథ్స్‌ అభ్యర్థులతో పోటీ పడలేక మార్కుల్ని కోల్పోయే అవకాశం ఉంది.


ఎకానమీ: దీనిలో రాణించాలంటే.. అనువర్తన విధానంలో తాజా అంశాలను అనుసంధానం చేసుకోవటం చాలా అవసరం. ఎప్పటివో పుస్తకాలు, మెటీరియల్‌ మీద ఆధారపడకుండా తాజా అంశాలు.. తాజా పరిణామాలపై దృష్టి పెట్టాలి. ఈ విధంగా ప్రిపరేషన్‌ను మెరుగుపరుచుకున్నప్పుడే ఎగ్జామినర్‌ ఆలోచనలను అందుకోగలుగుతారు. తద్వారా ఆధునిక సమస్యలపై ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా సమాధానాలు ఇవ్వగలుగుతారు. సాధారణంగా సివిల్స్‌ అభ్యర్థుల్లో ఈ లక్షణం ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఇతర అభ్యర్థులు కూడా ఈ ధోరణిని అనుసరించటం మేలు. 


సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: దీనిలో ప్రధానంగా మానవాళికి సమకూర్చే ప్రయోజనాలు, ఎదురయ్యే సమస్యలు అనే కోణంలో అధ్యయనం చేయాలి. ఇలా చేయటం అదనపు మార్కులకు దారి తీస్తుంది. అందువల్ల తాజా అప్‌డేట్స్‌తో మెయిన్స్‌ మెటీరియల్‌ను మెరుగుపర్చుకుంటే అదనపు మార్కులు వస్తాయి. గతంలో ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు రాయటంలో అభ్యర్థులు  సమయం సరిపోక తీవ్ర ఒత్తిడి గురయ్యారు. ఎందుకంటే సమాధానం తెలిసినట్లే ఉంటుంది. తీరా రాయబోతే అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందువల్ల సమయ నిర్వహణను సమర్థంగా పాటిస్తూ సమాధానాలు రాసే సాధన చాలా ముఖ్యం. 


పేపర్‌ 2, పేపర్‌ 6లలో చదవాల్సిన కంటెంట్‌ చాలా ఉంది. అయితే కొంత సమాచారం ప్రిలిమినరీ స్థాయిలో చదివినందున కొంత సౌలభ్యం కూడా ఉంది. ముఖ్యంగా జాగ్రఫీ విభాగంలో ప్రశ్నలు రాసేటప్పుడు కంటెంట్‌ను జాగ్రత్తగా ప్రజెంట్‌ చేయకపోతే మంచి ఫలితాలను ఆశించలేము. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తాయనేది కచ్చితంగా నిర్ణయించలేదు. మన ప్రిలిమినరీ పరీక్ష చూస్తే తెలంగాణ ఉద్యమానికీ, సంస్కృతికీ సంబంధించిన ప్రశ్నలు చాలా లోతుగా ఉన్నాయి. అదే ధోరణిలో ప్రశ్నలు వస్తే అందుకు తగ్గట్టుగా సమాధానాలు రాసే విధంగా సరైన వ్యూహంతో సాగాల్సిన అవసరం ఉంది.


- కొడాలి భవానీ శంకర్‌
 


మరింత సమాచారం... మీ కోసం!

‣అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

‣జాగ్రఫీదే హవా!

‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

Posted Date : 02-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు