• facebook
  • whatsapp
  • telegram

‘పీహెచ్‌పీ’తో పక్కా ఉద్యోగం

డెవలపర్లకు ఏటా పెరుగుతున్న డిమాండ్‌
 


 

సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లోకి ప్రవేశించాలంటే ఏళ్లతరబడి శ్రమ పడాల్సిన పనిలేదు. సరైన శిక్షణ, ప్రణాళిక ఉంటే నెలల వ్యవధిలో నచ్చిన ఉద్యోగం సంపాదించవచ్చు. ఆ అవకాశం సులభంగా కల్పిస్తోంది పీహెచ్‌పీ. మరి దీని గురించి ఇంకా తెలుసుకుందామా..


పీహెచ్‌పీ కొత్తగా వచ్చిందేమీ కాదు.. ఎప్పటినుంచో ఉన్నదే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా ఆకర్షిస్తోంది. తెలుసా.. ప్రస్తుతం ఉన్న మొత్తం వెబ్‌ అప్లికేషన్లలో దాదాపు 79.8 శాతం అప్లికేషన్‌లను పీహెచ్‌పీ ఉపయోగించే తయారుచేశారు! అంటే వీటి సంఖ్య దాదాపు 2 కోట్లు. 2020 నుంచి పీహెచ్‌పీ డెవలపర్లకు డిమాండ్‌ పెరిగింది. కంపెనీలు వీరిని ఎక్కువగా నియమించుకుంటున్నాయి. 2023 చివరినాటికి గత ఏడాది కంటే వీరి నియామకాలు 20 శాతం పెరుగుతాయని అంచనా.


ఏమిటిది?

పీహెచ్‌పీ అంటే ‘హైపర్‌టెక్స్ట్‌ ప్రీప్రాసెసర్‌’. వెబ్‌ డెవలప్‌మెంట్‌లో ఉపయోగించే సర్వర్‌ సైడ్‌ - స్క్రిప్టింగ్‌ లాంగ్వేజ్‌ ఇది. దీన్ని హెచ్‌టీఎంఎల్‌ కోడ్స్‌ కోసం కూడా ఉపయోగిస్తుంటారు. దీని సింటాక్స్‌ చాలావరకూ హెచ్‌టీఎంల్‌ మాదిరిగానే ఉంటుంది. 

ఇది ఓపెన్‌ సోర్స్‌ లాంగ్వేజ్‌ కావడం వల్ల అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. సులభంగా నేర్చుకోదగిన భాష. మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రాక్స్యూఎల్, ఒరాకిల్‌ వంటి అనేక విధాలైన డేటాబేస్‌లను సపోర్ట్‌ చేస్తుంది. హెచ్‌టీఎంల్, జావాస్క్రిప్ట్‌ వంటి వివిధ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌తో అనుసంధానం చేయడానికి వీలుపడుతుంది. 

ఇది ఇండిపెండెంట్‌. ప్లాట్‌పామ్‌ అంటే పీహెచ్‌పీ ఉపయోగించి డెవలప్‌ చేసిన అప్లికేషన్స్‌ను ఏ ప్లాట్‌ఫామ్‌లో అయినా రన్‌ చేయవచ్చు. 

ఇది చాలాకాలం నుంచి మార్కెట్‌లో ఉండటం వల్ల ఈ డెవలపర్ల ‘కమ్యూనికే’ పెద్దది. అవకాశాలకు, సందేహాల నివృత్తికి కొదవలేదు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉండటం వల్ల కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోగలదు. నూతన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు తెచ్చిపెట్టగలదు.


కావాల్సిన నైపుణ్యాలు

పీహెచ్‌పీ వెబ్‌ డెవలప్‌మెంట్, డేటాబేస్‌ డెవలప్‌మెంట్‌లో ఎన్నో అవకాశాలున్నాయి. దీన్ని ఆన్‌లైన్‌లో నేర్చుకునేలా రకరకాలైన కోర్సులున్నాయి. దీంతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్యా పరిష్కారం, ఇతర సాఫ్ట్‌ స్కిల్స్‌ ఉన్నవారు ఈ కెరియర్‌లో త్వరితగతిన రాణించగలరు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ బూట్‌ క్యాంప్స్, ప్రోగామ్స్, కోర్సుల ద్వారా పీహెచ్‌పీ డెవలప్‌మెంట్‌ నేర్చుకోవచ్చు. 

ఈ కెరియర్‌లోకి ప్రవేశించాలంటే కాలేజీ డిగ్రీల కంటే టెక్నికల్‌ అనుభవానికే ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. 

జావా - పీహెచ్‌పీ కలిసి పనిచేస్తాయి. అందువల్ల పీహెచ్‌పీ డెవలపర్లకు జావా తెలిసి ఉండటం ఉపకరిస్తుంది. 

పీహెచ్‌పీ డెవలపర్లలో - వెబ్‌ డెవలపర్, గ్రాఫిక్‌ డిజైనర్, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌.. వంటి రకాలున్నాయి.


కోర్సులు

పీహెచ్‌పీని వారాల నుంచి నెలల వ్యవధిలో సాధన చేయవచ్చు. పూర్తిగా పరిచయం లేనివారు నేర్చుకునేలా.. పీహెచ్‌పీ ఫర్‌ బిగినర్స్‌ (యుడెమీ), వెబ్‌ అప్లికేషన్స్‌ ఫర్‌ ఎవ్రీబడీ (కోర్సెరా), పీహెచ్‌పీ ఫండమెంటల్స్‌ (ప్లూరల్‌సైట్‌), పీహెచ్‌పీ విత్‌ లారవెల్‌ ఫర్‌ బిగినర్స్‌ (యుడెమీ) వంటి ప్రముఖ కోర్సులు ఉన్నాయి. ఈ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ నుంచి సర్టిఫికేషన్స్‌తో పీహెచ్‌పీ అండ్‌ మైఎస్‌క్యూఎల్, మోడర్న్‌ పీహెచ్‌పీ వెబ్‌ డెవలప్‌మెంట్, కంప్లీట్‌ పీహెచ్‌పీ కాన్సెప్ట్స్‌.. ఇలా వివిధ ప్రోగ్రామ్స్‌ చేసే వీలుంది.


ఉద్యోగాలు

దీంతో లభించే ఉద్యోగాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డెవలపర్‌ గురించి. వీరు సర్వర్‌సైడ్‌  వెబ్‌ డెవలప్‌మెంట్‌ను పీహెచ్‌పీ ఉపయోగించి నిర్వహిస్తారు. 

పీహెచ్‌పీలో నేర్చుకునే స్కిల్స్‌ కేవలం దీనికి మాత్రమే పరిమితం కాదు, ఐటీలో ఎక్కడ పనిచేయాలన్నా ఇవి ఉపయోగపడతాయి. కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్, సిస్టమ్స్‌ అనాలిసిస్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌.. ఇలా ప్రతి అంశంలోనూ వీటిని వినియోగించుకోవచ్చు.

తొలుత పీహెచ్‌పీ డెవలపర్‌గా ప్రారంభించి ఆపైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, జావా డెవలపర్, కంప్యూటర్‌ ప్రోగ్రామర్, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ మేనేజర్‌.. ఇలా వివిధ బాధ్యతల్లోకి వెళ్లొచ్చు. 

ఇందులో కనీస పరిజ్ఞానంతోనే కెరియర్‌ మొదలుపెట్టొచ్చు.


ఇంకా..

ఫేస్‌బుక్‌ను పూర్తిగా పీహెచ్‌పీ ఆధారంగా తయారుచేశారు. వికీపీడియా, వర్డ్‌ప్రెస్, యాహూ వంటి అనేక ప్రముఖ సైట్లు దీనిపై ఆధారపడి పనిచేస్తున్నాయి. 

ఇది నేర్చుకోవాలి అనుకునేవారికి హెచ్‌టీఎంఎల్‌పై ప్రాథమిక నైపుణ్యం, సీఎస్‌ఎస్‌లో కనీస పరిజ్ఞానం, బేసిక్‌ ప్రోగ్రామింగ్‌ ప్రాథమిక అంశాలైన ఊప్స్, ఆరేస్, ఫంక్షన్స్‌ వంటి వాటిపై అవగాహన ఉండాలి. 

పీహెచ్‌పీ నిపుణులకు వెబ్‌ ప్రాసెసస్‌ను మేనేజ్‌ చేయడం, స్క్రిప్టింగ్‌ ఎర్రర్స్‌ను గుర్తించడం - తొలగించడం, మెనూ డ్రైవెన్‌ సిస్టమ్స్‌ను తయారుచేయడం.. ఇలాంటి విధులుంటాయి.


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ నర్సింగ్‌ కోర్సు.. అవకాశాలు అనేకం

‣ సీజీపీడీటీఎంలో 553 ఉద్యోగాలు

‣ డేటా సైన్స్‌లో ప్రత్యేకతలివిగో!

‣ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీం

‣ దినసరి కూలీ.. డాక్టరేట్‌ సాధించింది

‣ సీఎస్‌ఈకి ఎందుకీ క్రేజ్‌!

‣ సహకరించుకుంటేనే ‘బృందా’వనం!

Posted Date: 19-07-2023


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌