• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సహకరించుకుంటేనే ‘బృందా’వనం!

చిన్నపాటి మెలకువలతో మెరుగైన టీమ్‌ వర్క్‌

కాలేజీలో అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు చేసేటప్పుడు.. అది పూర్తయ్యాక ఉద్యోగంలో చేరాక.. ఎక్కడైనా సరే, బృందంతో కలిసి పనిచేయడం అవసరం. అలాంటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు, అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. మనం సొంతంగా నచ్చినట్టు నడుచుకోవడానికి, నలుగురితోనూ కలిసి నడవడానికి చాలా తేడా ఉంటుంది. ఇటువంటి సందర్భాలను విజయవంతంగా ఎదుర్కోవాలంటే, బృందంతో కలిసి సాఫీగా పనిచేసుకోవాలంటే ఉపయోగపడే మెలకువలేంటో చూద్దామా!

బృందంతో కలిసి పనిచేయడం ఎప్పుడూ సవాలే. ఏ టీమ్‌లో అయినా బహుశా ఏ ఇద్దరూ ఒకేలా ఆలోచించరేమో. పనితీరులోనూ, వేగంలోనూ చాలా తేడాలుంటాయి. అదే సమయంలో బలాలు, బలహీనతల్లోనూ వైరుధ్యాలుంటాయి. అయితే ఐదువేళ్లూ కలిస్తేనే పిడికిలి బలంగా బిగిసినట్టు.. నలుగురూ కలిస్తేనే బృందం బలపడుతుంది. రకరకాలైన మనస్తత్వాలు కలిగిన వారంతా ఒక్కటిగా వెళ్లగలిగితే అందరికీ అంతిమంగా లాభం చేకూరుతుంది. అందుకే ఆ టీమ్‌ స్పిరిట్‌ను ఎట్టి సందర్భంలోనూ కోల్పోకూడదు.

ఇంకా..

మనకు పూర్తిగా నియంత్రణ ఉన్న పనులు, బాధ్యతల గురించి మాత్రమే ఆలోచించడం ద్వారా అనవసర విషయాలపై శ్రద్ధ పెట్టి ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. ఇది మరింత ప్రొఫెషనలిజం దిశగా మన ప్రయాణాన్ని నడిపిస్తుంది. పని ప్రదేశం మారుతున్నప్పుడు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిపై దృష్టి పెట్టడం ద్వారా దొరికిన కాస్త ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే వర్క్‌ ప్లేస్‌లో ఉత్పాదకత పెరగడానికి.. టీమ్‌తో మరింత కనెక్ట్‌ అవ్వడానికి సోషల్‌ మీడియానూ ఉపయోగించుకోవచ్చు.

1. నేర్చుకోవడానికి సుముఖంగా..

కొత్తగా ఏదైనా బృందంలోకి వెళ్తున్నా, ఒకే టీమ్‌తో ఎక్కువ కాలం పనిచేసి ఇప్పుడు మారాల్సి వచ్చినా.. ఎంతోకొంత బెరుకు, ఇబ్బంది, మొహమాటం సహజం. ఒకేసారి అంతా తెలిసినట్టు సౌకర్యంగా ఉండలేకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో మార్పునకు మానసికంగా సిద్ధమవడం అవసరం. ‘ఇదివరకటిలా ఉండదు, ఇదంతా కొత్త’ అనే భావన ముందు కల్పించుకోవాలి. కొత్తచోటు కాబట్టి అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రయత్నించాలి. అప్పటికే ఎంత అనుభవం ఉన్నా.. కొత్తగా వెళ్లినప్పుడు నేర్చుకోవడానికి సుముఖంగా ఉండటమే మంచిది. హాయిగా రిలాక్స్‌ అవుతూ కొత్తదనాన్ని ఆస్వాదించడం ద్వారా టీమ్‌ను అర్థం చేసుకునే అవకాశం దక్కుతుంది.

2. గమనించడం ద్వారా..

ఎక్కడైనా సరే తెలుసుకోవడానికీ, నేర్చుకోవడానికీ చేసే ప్రయత్నం మంచి ఫలితాలనే ఇస్తుంది. కొంతకాలంపాటు బృందంలో సభ్యులను, బృంద లక్ష్యాలను, వాటిని అందుకోవడంలో ఎవరి పాత్ర ఏంటి అనేదాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించడం మంచిది. వీలైనంత గమనించడం ద్వారా వీటిని గుర్తించవచ్చు. అలాగే మీ గురించి వారు తెలుసుకునే అవకాశం ఇవ్వడం కూడా అవసరం. దీనివల్ల మీరు సానుకూలంగా, అరమరికలు లేకుండా ఉన్నారనే భావన ఎదుటివారికి కలుగుతుంది. మీకున్న ఇష్టాలు, ఆసక్తులు బృందంలో ఇంకెవరికైనా కూడా ఉంటే వాటిపై దృష్టి పెట్టడం ద్వారా వారితో కలిసిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. త్వరగా మిత్రులు అవ్వగలరు.

3. నిజాయతీగా..

బృందంతో నిజాయతీగా ఉండటం వల్ల మీకే కాదు.. పనికీ మంచిది. ఒకరి విషయాలు మరొకరి వద్ద మాట్లాడకపోవడం.. ఎవరైనా నమ్మి తమ అభిప్రాయాలు వెల్లడిస్తే వాటిని మనసులోనే ఉంచుకోవడం ద్వారా వారి నమ్మకాన్నీ, స్నేహాన్నీ గెలుచుకోగలం. నిజాయతీగా ఉన్నప్పుడే బంధాలు వికసిస్తాయనేది జీవితంలోనే కాదు, బృందంతోనూ పాటించాల్సిన సూత్రం. అధికారుల వద్ద, కంపెనీ నుంచి మెప్పు కోసం టీమ్‌ను ఇబ్బందిపెట్టడం సరికాదనే విషయాన్ని గమనించాలి.

4. కొత్తలో కొంత..

మొదటి నుంచే ఇతరులతో సాగించే సంభాషణల్లోనూ, సమావేశాల్లోనూ మరీ ఎక్కువ స్థిరంగా, దృఢంగా కనిపించకపోవడం ఉత్తమం. దానివల్ల మీది ‘మొండి పట్టుదల’ అనే ముద్ర పడే ప్రమాదం ఉంది. కొత్తలో కొన్ని విషయాలు మనకు వేరేవిధంగా అనిపించినా కొంతవరకూ ఎదుటివారికి స్పేస్‌ ఇవ్వడం మంచిది. కొంతకాలం ఆగి, తర్వాత మన అభిప్రాయాలను ఎంత దృఢంగా తెలియజేసినా.. ఈలోగా బృందంతో మంచి సంబంధాలు ఏర్పడటం వల్ల వారు సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో అపార్థాలకు తావుండదు. కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పరివారంతో చిన్న చిన్న తేడాలు వచ్చే ప్రమాదం లేకపోలేదు. అలాంటప్పుడు స్నేహపూర్వక వాతావరణంలో వాటిని చక్కదిద్దుకుంటే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు పొందవచ్చు.

5. మాట్లాడే స్వేచ్ఛ

బృందంలో పనిచేసేటప్పుడు ఎవరు దేన్ని ఎలా తీసుకుంటారో అనే భయంతో చాలామంది తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పరు. అలాకాకుండా మాట్లాడేటప్పుడు మనం కొంచెం ఫ్రీగా ఉన్నట్లు కనిపిస్తే ఇతరులు తమ ఆలోచనలను మనతో స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు. విభిన్నమైన అభిప్రాయాలను, విమర్శలను తీసుకోగలిగినప్పుడే బృందంలో ఇమిడిపోగలం అనే విషయాన్ని గుర్తించాలి. మంచైనా చెడైనా ముందు ఇతరులు చెప్పేదేంటో పూర్తిగా వినడం, ఆ తర్వాతే స్పందించడం, అది కూడా పని వాతావరణానికి సరిపోయే స్థాయిలో మాత్రమే కావడం అవసరం. అలా లేకపోతే మనతో ఎవరు ఏది చెప్పాలన్నా ఆలోచించి వెనకడుగేసే ప్రమాదం ఉంటుంది.

6. కొంత సరదా

మంచి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌.. ఉల్లాసంగా ఉండటం పని ప్రదేశాన్ని, చేసే పనిని ఉత్తేజితం చేస్తుంది. అందువల్ల ఎప్పుడూ సీరియస్‌గా పనిలో మునిగిపోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడూ టీమ్‌తో సరదాగా గడపడం వల్ల వారితో చక్కగా కలిసిపోవచ్చు. ఇలా సందర్భానుసారం రిలాక్స్‌ కావడంతో పనిలో మరింత వేగం పెరుగుతుంది. బృందంతోనూ చక్కని సంబంధాలు ఏర్పడతాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ సీఎస్‌ఈకి ఎందుకీ క్రేజ్‌!

‣ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు పీహెచ్‌డీ తప్పనిసరి కాదు

‣ విదేశీ వర్సిటీల్లో ఉచిత కోర్సులు

‣ మేటి సంస్థల్లోకి.. ‘క్లాట్‌’ దారి

‣ సెక్యూరిటీ ప్రెస్‌లో 108 కొలువులు

Posted Date : 12-07-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.