• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు పీహెచ్‌డీ తప్పనిసరి కాదు

తాజాగా యూజీసీ ఉత్తర్వుల జారీ

విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగ నియామకాలకు పీహెచ్‌డీ అర్హత తప్పనిసరి కాదని యూజీసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌), స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సెట్‌).. ఉన్నత విద్యాసంస్థల్లో నేరుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా నియమితులయ్యేందుకు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణతను కనీస అర్హతగా గుర్తించనున్నారు. ఈ నిబంధనలు ఈ జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రభావం గురించి నిపుణుల మాటల్లో..

ఒకప్పుడు అంటే 30, 40 ఏళ్ల క్రితం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ అర్హతతో విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు లభించేవి. ఆ తర్వాత వీటికి బాగా పోటీ పెరిగిపోవడంతో కొంతకాలానికి ఎంఫిల్‌ అర్హతతో నియామకాలు చేపట్టేవారు. అలా కొన్నాళ్లు గడిచాక.. పీహెచ్‌డీ అర్హత ఉన్నవారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం ప్రారంభించారు. అనంతరం పీహెచ్‌డీ ఉన్న విద్యార్థుల సంఖ్య తక్కువైపోవడంతో యూజీసీ నెట్‌ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటూ వచ్చారు.     

అప్పట్లో నెట్‌ క్వాలిఫై అయిన వారి సంఖ్య తక్కువగా ఉండేది, కానీ తర్వాత ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తూ ఉండటంతో దీనిలో ఉత్తీర్ణులైనవారి సంఖ్య కూడా పెరిగి పెద్దయెత్తున పోటీ నెలకొంది. దీంతో 2018 నుంచి విశ్వవిద్యాలయాల్లో ఎంట్రీ లెవెల్‌ టీచింగ్‌ పోస్టులకు పీహెచ్‌డీని కనీస అర్హతగా యూజీసీ నిర్దేశించింది. అయితే అప్పటి ఉద్యోగార్థులు ఈ నిర్ణయంపై పునరాలోచించాలని యూజీసీని కోరారు. ‘ఇప్పటికిప్పుడు పీహెచ్‌డీ అర్హత కావాలంటే మేమంతా ఉద్యోగావకాశాలు కోల్పోతామని, కనీసం సమయం ఇవ్వాల’ని కోరడంతో.. వీరికి యూజీసీ 2023 జులై 1 వరకూ ఐదేళ్లపాటు అవకాశం కల్పించింది. అప్పటివరకూ పీహెచ్‌డీ లేకుండానే నియామకాలు చేపడతామని, ఈలోగా పూర్తిచేయాలని చెప్పింది.

అయితే ఇప్పుడు గడువు తీరిపోయినప్పటికీ అభ్యర్థులు పీహెచ్‌డీ తప్పనిసరి అనే నిర్ణయానికి అనుకూలంగా లేరు. ఎందుకంటే చాలా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేవు. అందువల్ల పీహెచ్‌డీ చేయదలచిన విద్యార్థులకు మార్గం చూపించే గైడ్స్‌ లేరు. ఈ కారణంగా ఈ నిర్ణయంపై తిరిగి ఆలోచించాలనీ, పీహెచ్‌డీ అందుకోవాలంటే చాలా సమయం పడుతుండటం వల్ల నెట్‌ అర్హత ఉన్న తమకు అవకాశం ఇవ్వాలనీ అభ్యర్థులు కోరారు. కనీసం మరో అయిదేళ్లు గడువు పొడిగించాలని విన్నవించారు. దీంతో యూజీసీ ఈ ఉద్యోగాలకు నెట్‌ను కనీస అర్హతగా పరిగణిస్తూ, పీహెచ్‌డీ ఉన్నా లేకపోయినా పర్వాలేదని నిర్ణయించింది. 

ఇప్పుడు విద్యార్థులు నెట్, పీహెచ్‌డీ- రెండింటితోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పీహెచ్‌డీ అర్హత ఉందని చూపేవారు.. యూజీసీ నిబంధనలకు అనుగుణమైన చోట, అన్ని పరిమితులకూ లోబడి చేసిన పీహెచ్‌డీ కలిగి ఉండాలి. అప్పుడే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అంటే ఇప్పుడు నెట్‌ తప్పనిసరి, లేని పక్షంలో పీహెచ్‌డీ ఉన్నా పర్లేదని చెబుతున్నారు.

పర్యవసానాలేంటి?

పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు రిక్రూటర్లు పీహెచ్‌డీ, నెట్‌ రెండు అర్హతలూ ఉన్నవారిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటర్వ్యూల సమయంలో వందమంది ఒకే అర్హత ఉన్నవారు ఉంటే.. అదనపు అర్హతలు ఉన్న పదిమందిని పిలిచే అవకాశం ఉంటుంది. అలాగే రిక్రూట్‌మెంట్ల సమయంలో స్కోర్‌ షీట్‌ తయారుచేస్తారు. ఇందులో నిబంధనల ప్రకారం పీహెచ్‌డీ ఉన్నవారికి 30 మార్కులు కేటాయిస్తున్నారు. కేవలం నెట్‌ అర్హతతో ఉద్యోగానికి ప్రయత్నించేవారికి ఈ 30 మార్కులు లభించే వీలుండదు. మొత్తంగా వచ్చే స్కోర్లలో పీహెచ్‌డీ ఉన్నవారు లేనివారికంటే అధిక మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. 

టాపర్లనే ఇంటర్వ్యూలకు పిలుస్తారు కాబట్టి పీహెచ్‌డీ లేని విద్యార్థులు వెనుకబడే ప్రమాదం ఉంది. యూజీసీ రెగ్యులేషన్స్‌ మార్చినప్పటికీ ఈ షీట్‌ను వారు మార్చలేదు, అది అలాగే ఉంది. ఇటువంటి సమయాల్లో పీహెచ్‌డీ లేని వారికి ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయి.

ఇప్పుడు కాకపోయినా.. కొన్ని రోజులకు మళ్లీ పీహెచ్‌డీ కచ్చితంగా ఉండాలనే నిబంధన పెట్టే అవకాశం కూడా లేకపోలేదు.

ఏది ఏమైనా యూనివర్సిటీల్లో బోధన వృత్తి చేపట్టదలచిన విద్యార్థులకు పీహెచ్‌డీ అర్హత చాలా ముఖ్యం. ఇంకో విషయం ఏమిటంటే.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు నెట్‌ అర్హత సరిపోయినా.. అసిసోయేట్‌ ప్రొఫెసర్‌ కావాలంటే కచ్చితంగా పీహెచ్‌డీ కావాలి. ఇది గమనించక విద్యార్థులు నెట్‌ అర్హతతో ఉద్యోగంలో చేరిపోయి.. తర్వాత ప్రమోషన్లు రాక, ఉద్యోగాల్లో చేరాక పీహెచ్‌డీ చేసే వీలు లేక అక్కడితో ఆగిపోతుంటారు. ఇది వారి కెరియర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందువల్ల ఉద్యోగాల్లో చేరే ముందే పీహెచ్‌డీతో చేరడం మంచిది. 

నిజానికి ఇప్పుడు ప్రైవేటు వర్సిటీలు పెరిగాక పీహెచ్‌డీ ఉన్నవారు చాలా మంది మార్కెట్లో అందుబాటులో ఉన్నారు. అందువల్ల యూజీసీ రెగ్యులేషన్స్‌ మారినా.. రిక్రూట్‌మెంట్లు చేసే ఏజెన్సీలు పీహెచ్‌డీ, నెట్‌ రెండూ ఉన్నవారికి అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఈ నిబంధనలను పైపైన చూసి పీహెచ్‌డీని తేలిగ్గా తీసుకోకూడదు. అలాగే ‘నెట్‌ కనీస అర్హత, పీహెచ్‌డీ కావాల్సిన అర్హత’ అని చెప్పొచ్చు. అందువల్ల నెట్‌ ఉంది కదా అని పీహెచ్‌డీ అవసరం లేదనుకోకూడదు. పీహెచ్‌డీ కూడా ఉంటేనే అధిక అవకాశాలు అందుకోగలమనే విషయాన్ని గుర్తించాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ మేటి సంస్థల్లోకి.. ‘క్లాట్‌’ దారి

‣ సెక్యూరిటీ ప్రెస్‌లో 108 కొలువులు

‣ బైపీసీతో బంగారు భవిష్యత్తు!

‣ చక్కర సంస్థలో తియ్యని కోర్సులు!

‣ ‘పది’తో 1558 కేంద్ర కొలువుల భర్తీ

‣ పక్కా ప్రణాళికతోనే లక్ష్య సాధన

Posted Date : 11-07-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌