• facebook
  • whatsapp
  • telegram

పక్కా ప్రణాళికతోనే లక్ష్య సాధన

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రెండో ర్యాంకర్‌ రమేశ్‌ సూర్యతేజ

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండో ర్యాంకు సాధించి.. తెలుగు విద్యార్థుల సత్తా చాటాడు - చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వేణుగోపాలపురానికి చెందిన రమేశ్‌ సూర్యతేజ. ఐఐటీ సీటు సాధించాలని ఏవిధంగా నిర్దేశించుకున్నాడో, లక్ష్య సాధనకు తన ప్రణాళిక, కృషి ఏమిటో వివరించాడు! ఈ విశేషాలు అతడి మాటల్లోనే..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో టాప్‌ 20లోపు నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. రెండో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకోసం గత అయిదేళ్లుగా రోజువారీ శ్రమ చేస్తూ వచ్చాను. నా ర్యాంకు వెనుక అధ్యాపకుల శిక్షణ, వందలకొద్దీ మోడల్‌ పరీక్షలు రాసిన అనుభవం ఉంది.  

గణితంలో పట్టు సాధిస్తూ..

అమ్మానాన్నా రమేశ్, కృష్ణవేణి ఇద్దరూ గణిత ఉపాధ్యాయులే. వారి శిక్షణ మూలంగా నాలుగు, అయిదు తరగతుల్లోనే బేసిక్స్‌లో పట్టు వచ్చింది. సైనిక్‌స్కూలు ప్రవేశపరీక్షల్లో రెండోర్యాంకు సాధించి, ఆరు, ఏడో తరగతులను చిత్తూరు జిల్లా కలికిరి సైనిక్‌స్కూలులో చదివాను. ప్రతిష్ఠాత్మక ఐఐటీలో చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు, సోదరుడు పూర్ణ తేజ చేస్తున్న కృషి చూసి, నేను కూడా టాప్‌ ఐఐటీలో చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నా అన్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో 801ర్యాంకు సాధించి..వారణాశి ఐఐటీలో చేరడం స్ఫూర్తినిచ్చింది.

ఎనిమిదో తరగతి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేరాను. అప్పటినుంచే ఐఐటీ ప్రవేశపరీక్ష కోసం సంబంధించిన పుస్తకాలను చదువుతూ వచ్చాను. ఈక్రమంలో ఇంటర్‌లో కూడా త్వరగా సిలబస్‌ పూర్తి చేసుకొని, ఐఐటీ ప్రవేశపరీక్షకు రోజుకు 12- 13 గంటల పాటు చదువుతూ, పలురకాల మోడల్‌ ప్రశ్నపత్రాలను రాశా. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా పోటీపరీక్షకు సిద్ధం అయ్యాను. అయితే ఆన్‌లైన్‌ తరగతుల కన్నా.. ప్రత్యక్ష తరగతులంటేనే నాకు ఇష్టం. సెల్‌ఫోన్‌ వినియోగం చాలా తక్కువ. అయినా అంతర్జాలంలో పోటీపరీక్షకు సంబంధించిన విషయాలను చదవడం, మోడల్‌ పేపర్లను రాసుకొని వాటికి జవాబులు రాసి, సొంతంగా దిద్దుకొని వచ్చే మార్కులను గమనించేవాడిని. ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే టాప్‌ ర్యాంకు వస్తుందో ముందే అంచనాకు వచ్చాను. జేఈఈ మెయిన్స్‌లో 300 మార్కులకు సెషన్‌-1లో 280, సెషన్‌-2లో 290 మార్కులు వచ్చాయి. సెషన్‌-2లో వంద పర్సంటైల్‌ మార్కులతో ఆలిండియా 28వ ర్యాంకు సాధించగలిగాను.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పోటీపరీక్షకు రెండునెలల ముందునుంచి వారానికి మూడు గ్రాండ్‌టెస్టులు రాశాను. ప్రతి పరీక్షలో 300 మార్కులకుపైగా రావడంతో 30లోపు ర్యాంకు వస్తుందని ఊహించాను. మరింతగా కష్టపడితే 20లోపుగా ర్యాంకు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఈవిధంగా ప్రణాళికతో కష్టపడి, ఇష్టపడి చదవడం వల్ల 360 మార్కులకు 336 మార్కులు సాధించగలిగాను.

అడ్వాన్స్‌డ్‌ ప్రశ్నలకు తగ్గట్టుగా..

జేఈఈ మెయిన్స్‌కు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఎక్కువగా చదవాలి. పరీక్షలో ప్రశ్నలన్నీ అందులోనుంచే వస్తాయి కాబట్టి, పుస్తకంలో ఏ ఒక్క పాయింట్‌ కూడా తప్పిపోకుండా పూర్తిగా చదవాలి. కానీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో వచ్చే ప్రశ్నలు మరీ లోతుగా ఉంటాయి. అందుకు తగ్గ విధంగా సాధన చేయడం, కాన్సెప్టులపై పూర్తి అవగాహనతో ఉండటం, క్రమం తప్పకుండా ప్రతిరోజూ 12-14 గంటలపాటు హార్డ్‌వర్క్‌ చేయటం చాలా అవసరం. 

మోడల్‌ పరీక్షలు..

పరీక్షలో వచ్చే ప్రశ్నలకు ఎంత వ్యవధిలో జవాబు రాయాలో తెలియాలంటే, మోడల్‌ ప్రశ్నపత్రాలు వీలైనంత ఎక్కువగా సాధన చేయాలి.  పాత ప్రశ్నపత్రాలు రాస్తూ.. ఏ ప్రశ్నకు తప్పు జవాబు రాశానో గుర్తించి, మలివిడతలో పునరావృతం కాకుండా చూసుకునేవాడిని. తప్పులకు కారణాలు విశ్లేషించుకుని, ఎర్రర్‌ బుక్‌లో రాసేవాడిని.

గణితంలో వివిధ రకాలైన ప్రశ్నలను బాగా సాధన చేశాను. నిర్దిష్ట సమయం పెట్టుకొని వేగంగా మోడల్‌ ప్రశ్నపత్రాలు రాయడం వల్ల సమయం ఆదా అవడం గమనించాను.

భౌతికశాస్త్ర పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే తరగతుల్లో శ్రద్ధగా వినాలి. అవగాహన పెంచుకుంటే మరచిపోయే అవకాశం ఉండదు. ఇందుకోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఎక్కువగా చదివాను. మొదట్లో థియరీ ఆధారిత ప్రశ్నలు నేర్చుకోవడంపై శ్రద్ధ పెడితే తర్వాత కాలిక్యులేషన్‌ సంబంధిత ప్రశ్నలు నేర్చుకోవడం సులువవుతుంది.

రసాయనశాస్త్రం మెమరీ ఆధారితం కావడంతో చాలాసార్లు రివిజన్‌ చేశాను. పరీక్ష ముందు వరకు ప్రణాళికతో చదవడం వల్ల 45 నిమిషాల్లోనే పరీక్ష రాసేసి, మిగతా సమయాన్ని ఇతర విభాగాలకు కేటాయించా. ఇలా చేయడం వల్ల ఎంతో సమయం ఆదా అయింది.

మంచి ర్యాంకు సాధించి బాంబే ఐఐటీలో చేరాలన్న నా తొలి లక్ష్యం పూర్తయింది. అక్కడ కూడా ఇదేవిధంగా ప్రణాళిక, క్రమశిక్షణలతో చదివి, ప్రపంచంలోని పెద్ద సాంకేతిక కంపెనీకి సీఈవో కావాలన్నది నా తదుపరి లక్ష్యం. 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ‘పది’తో 1558 కేంద్ర కొలువుల భర్తీ

‣ టెస్ట్‌ సిరీస్‌ల సాధనే గెలుపు మార్గం!

‣ బీటెక్‌తో ఆర్మీలో కొలువులు

‣ క్లర్కు కొలువు సాధనకు ఉమ్మడి వ్యూహం!

‣ వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలే కీలకం

Posted Date : 05-07-2023

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌