‣ ఐఎఫ్‌ఎస్ ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ శ్రీకాంత్
ఈమధ్య వరుసగా తెలుగు విద్యార్థులు దేశ వ్యాప్తంగా జరిగే వివిధ పోటీ, ప్రవేశ పరీక్షల్లో టాప్ ర్యాంకులతో అదరగొడుతున్నారు. తాజాగా యూపీఎస్సీ విడుదల చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) పరీక్షల ఫలితాల్లో బాపట్ల విద్యార్థి కొల్లూరు వెంకట శ్రీకాంత్ మొదటి ర్యాంకు సాధించి మరోసారి తెలుగు విద్యార్థుల సత్తా చాటాడు. నాలుగేళ్ల సన్నద్ధతతో తన కలల ఉద్యోగాన్ని సొంతం చేసుకున్న ఇతడు.. ఇందుకు పాటించిన వ్యూహం, విధి విధానాలను ఇలా పంచుకుంటున్నాడు..
ఇంటర్ వరకూ బాపట్లలోనే చదివాను. ఆపైన నోయిడాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తిచేశాను. అప్పటివరకూ నాకు ఆలిండియా సర్వీసుల గురించి పెద్దగా అవగాహన లేదు. చదువు పూర్తయ్యాక తర్వాతేంటని ఆలోచిస్తున్నప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలన్న ఆసక్తి కలిగింది. దాంతో డిగ్రీ అందుకున్న వెంటనే సన్నద్ధత మొదలుపెట్టాను. మొదటిసారిగా 2020లో సివిల్స్ రాసినప్పుడు ప్రిలిమ్స్ పాసయ్యా. కానీ మెయిన్స్ దాటలేకపోయాను. అయినా సరే తొలి ప్రయత్నంలోనే కొంతమేరకు విజయం సాధించడం చాలా ప్రోత్సాహాన్నిచ్చింది. రెండోసారి 2021లో మళ్లీ ప్రయత్నించినప్పుడు ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయా.
నా పోటీ ప్రయాణంలో అది అత్యంత కష్టమైన సమయం. ఇక రాయలేనేమో అనుకుని చాలా బాధపడ్డా. మళ్లీ కొన్ని రోజులకు నేనే ధైర్యం తెచ్చుకుని గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా పకడ్బందీగా ప్రిపేరయ్యా.
2022 పరీక్ష సమయానికి నాకు ఐఎఫ్‌ఎస్ బాగా నచ్చుతోందని అర్థమైంది. అందుకే ఇక పూర్తిగా దానిపైనే దృష్టిపెట్టాను. ఇదివరకటివి కాకుండా పూర్తిగా వేరే ఆప్షనల్స్ తీసుకుని బాగా ప్రిపేరయ్యా. మంచి ర్యాంకు వస్తుందని తెలుసుగానీ మొదటి ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. ఫలితాలు రాగానే ఆనందంతోపాటు ఆశ్చర్యం కూడా కలిగింది.
రోజూ ఇలా..
అలా అని ఈ ర్యాంకు కోసం నేను విశ్రాంతి లేకుండా శ్రమించానని చెప్పను. సగటు విద్యార్థుల కంటే చాలా భిన్నంగా సాగింది నా ప్రయాణం. రోజూ పొద్దున్న 8 గంటలకు లేచేవాడిని. ఏ టైమ్‌కి లేచినా కచ్చితంగా ఓ అరగంట ధ్యానం తప్పకుండా చేసేవాడిని. టిఫిన్ చేశాక మధ్యాహ్న భోజనం వరకూ కదలకుండా చదివేవాడిని. భోజనం సమయం తర్వాత ఓ గంట రిలాక్స్ అయ్యేందుకు సమయం తీసుకునేవాడిని. మళ్లీ 3 గంటలకు చదవడానికి కూర్చుంటే సాయంత్రం 6, 7 గంటల వరకూ కదలకుండా చదివేవాడిని. ఆ తర్వాత ఇక ఎక్సర్‌సైజ్‌లు చేయడం, జాగింగ్‌కి వెళ్లడం, అలా నాకు నచ్చిన ఏదో ఒక రకం కసరత్తులు ఉండేవి. డిన్నర్ తర్వాత ఓ గంటా రెండు గంటలు చదివినా.. తర్వాత రాత్రి 10, 11 గంటల వరకూ యూట్యూబ్ అదీ చూస్తూ రిలాక్స్ అయ్యేవాడిని. ఇంతే.. ఇంతకుమించి సాధారణ రోజుల్లో ఎక్కువ చదువు కోసం కేటాయించింది లేదు.
పరీక్షలకు మూడు, నాలుగు నెలల ముందు నుంచీ, పరీక్షలు అవుతున్న సమయంలో మాత్రం పొద్దున్న కూర్చుంటే రాత్రి ఏ పది గంటలకో పుస్తకం ముందు నుంచి లేచేవాడిని. కేవలం పొద్దున్నపూట చేసే ధ్యానం మాత్రమే షెడ్యూల్‌లో ఉండేది. మిగతా ఏ విధమైన అవాంతరాలూ లేకుండా చదివాను. కొన్నిసార్లు అస్సలు చదవలేకపోతుంటాం, ఏకాగ్రత కుదరదు. అలాంటి సమయాల్లో ఒకరోజు బ్రేక్ తీసుకునేవాడిని. వెంటనే మళ్లీ చదవడం మొదలుపెట్టేవాడిని. ఏరోజుకు ఆరోజే టార్గెట్ పెట్టుకుని దాన్ని పూర్తిచేసేలా చూసుకున్నాను.
సన్నద్ధత
కరెంట్ అఫైర్స్ కోసం ఎక్కువగా మ్యాగజీన్లు, రోజూ రాత్రి పడుకునే ముందు ఆరోజు ముఖ్యమైన విషయాలు ఏం ఉన్నాయనేది ఇన్‌సైట్స్ చూసుకునేవాడిని. మర్చిపోకుండా మళ్లీ మళ్లీ చదువుతూ ఉండేవాడిని. మొత్తం సిలబస్ అంతటికీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఒకసారి పూర్తిగా చదివాను. ఆ తర్వాత వాటి జోలికి వెళ్లలేదు. టెస్ట్ సిరీస్‌లు రాస్తూ బిట్ల ద్వారానే ప్రాక్టీస్ చేసేవాడిని. ఏదైనా టాపిక్ సందేహం వస్తే మళ్లీ రివైజ్ చేసేవాడిని. పాఠ్యపుస్తకాల కంటే సిరీస్‌ల ద్వారానే నా ప్రిపరేషన్ ఎక్కువగా కొనసాగింది. అందరికీ వర్తిస్తుందో లేదో గానీ నా వరకూ ఈ వ్యూహం బాగా పనిచేసింది.
‣ మొదటి నుంచి కూడా ఎక్కడా కోచింగ్‌కు వెళ్లలేదు. అలా వెళ్తే టైం వేస్ట్ అయిపోతుందని నా భావన. అందుకే సొంతంగానే రాశాను. దీంతోపాటు సీఏపీఎఫ్ ఎగ్జామ్ కూడా రాశాను. అందులో కూడా 74 ర్యాంకు వచ్చింది.
‣ ఎంత బాగా చదివినప్పటికీ పరీక్షలో కూల్‌గా జవాబులు ఇవ్వలేకపోతే వృథా. నేను రెండోసారి ఎగ్జామ్ రాసినప్పుడు ఈ తప్పు చేశాను. అలా చేయకూడదు. తెలిసినవే తప్పుచేస్తే జాబ్ వచ్చే అవకాశాలు చాలా కోల్పోతారు.
‣ ఇంటర్వ్యూకు వెళ్లేముందు నాలుగైదు మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. ఇది చాలా అవసరం. విద్యార్థులంతా కచ్చితంగా వీటికి వెళ్తేనే లోటుపాట్లు ఏంటనేది తెలుసుకోగలరు. మాట్లాడే తీరు, జవాబు చెప్పే విధానం, అన్నీ సాధన చేయాలి. ఎంత బాగా సాధన చేస్తే అంత ధైర్యంగా జవాబులు ఇవ్వగలమనే విషయాన్ని మర్చిపోకూడదు.
‣ రాసిన తప్పు జవాబులన్నీ ‘సిన్ బుక్’లో మళ్లీ విడమర్చి టాపిక్‌ల వారీగా రాసుకునేవాడిని. దాని వల్ల ఆ బిట్ మళ్లీ తప్పు చేయకుండా ఉండేలా ప్రాక్టీస్ అయ్యేది.
‣ బిట్లు ఎంత బాగా చదవాలంటే అవన్నీ లాంగ్‌టర్మ్ మెమరీలోకి వెళ్లిపోవాలి.
‣ నా ఆప్షనల్ సబ్జెక్టులు జియాలజీ, ఫారెస్ట్రీ. వీటిని దాదాపు 8 నెలలపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. చాలా బాగా చదివాను. బహుశా నాకు ఫస్ట్ ర్యాంక్ రావడానికి వీటిలో వచ్చిన మార్కులే కారణం కావొచ్చు.
‣ చాలామంది విద్యార్థులు ‘ప్రిలిమ్స్ దాటితే మెయిన్స్ చూసుకోవచ్చులే’ అనుకుంటారు. కానీ ఐఎఫ్‌ఎస్ వరకూ మెయిన్స్ కంటే ప్రిలిమ్స్ కష్టం. దాన్ని దాటితే మెయిన్స్ ఒకింత సులభంగానే ఎదుర్కోవచ్చు. అందువల్ల సివిల్ సర్వీసెస్‌తో పోలిస్తే ఈ ఎగ్జామ్‌కి కొంత వ్యూహం మార్చాలి.
‣ ప్రకృతి అంటే ఇష్టం ఉన్నవారికి ఐఎఫ్‌ఎస్ చాలా బాగుంటుంది. నేను వాతావరణ మార్పులు, బయోడైవర్సిటీ, ఆటవిక తెగల అభివృద్ధిపై పనిచేయాలి అనుకుంటున్నా. ఇది ఒకరకంగా అందరూ తక్కువ అంచనా వేసే (అండర్‌రేటెడ్) సర్వీస్. అభ్యర్థులకు అంతగా అవగాహన కూడా ఉండటం లేదు. కానీ ఇందులో జీతభత్యాలతోపాటు వృత్తిరీత్యా వచ్చే సంతృప్తి చాలా గొప్పది. అందుకే విద్యార్థులు ఈ సర్వీస్‌ను క్రాక్ చేయడం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నా.
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ క్లర్కు కొలువు సాధనకు ఉమ్మడి వ్యూహం!
‣ వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలే కీలకం
‣ కృత్రిమ మేధ ప్రత్యేకతలివిగో!
‣ ఇంటర్వ్యూలో విజయానికి మార్గాలు
‣ క్రీడా శిక్షణ కోర్సుల్లోకి ఆహ్వానం