• facebook
  • whatsapp
  • telegram

ఏవియేషన్‌లో.. ఎన్ని ఉద్యోగాలో!

కోర్సులు, కొలువుల వివరాలు

విమానాలంటే చాలామందికి చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంటుంది. అంత ఎత్తున గాల్లో ఎగురుతూ ఉద్యోగాలు చేయడం కూడా థ్రిల్లింగ్‌ అనుభవం. విమానయాన పరిశ్రమలో గొప్ప లక్షణం ఉంది. పదోతరగతి పాసైన వారి నుంచి ఇంజినీరింగ్‌ పట్టభద్రుల వరకూ అందరికీ అవకాశాలు ఇవ్వగలదీ ఇండస్ట్రీ. అయితే ప్రతి కొలువుకూ ప్రత్యేకమైన నైపుణ్యాలు, శిక్షణ అవసరం అవుతాయి. అసలు ఏవియేషన్‌ పరిశ్రమలో ఎన్నిరకాలైన ఉద్యోగాలున్నాయో, వేటికి ఏ అర్హతలు ఉండాలో ఒకసారి చూద్దామా..

ప్రపంచంలో అతిపెద్ద విమానయాన పరిశ్రమల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. గత మూడేళ్లుగా అన్ని విభాగాల్లోనూ ప్రగతి సాధిస్తూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రీగా పేరుగాంచింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం, అధునాతన ఎయిర్‌పోర్టుల వంటి వాటివల్ల ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. భారత ప్రభుత్వం 2026 నాటికి ఏవియేషన్‌ డెవలప్‌మెంట్‌ కోసం మన దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించింది. అందువల్ల రానురానూ ఎదిగే ఈ రంగంలో కెరియర్‌ ప్లాన్‌ చేసుకోవడం వ్యక్తిగత ఉన్నతికి బాటలు వేస్తుంది. చదువు, ఇతర అర్హతలను బట్టి ఇందులో వివిధ రకాల అవకాశాలున్నాయి.

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ బృందంలో ఉన్న వారు విమానాల రాకపోకలను పర్యవేక్షిస్తారు. ప్రయాణాల్లో అడ్డంకులు లేకుండా చూసుకోవడం వీరి విధి. ఎయిర్‌పోర్ట్‌లో విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ వంటివన్నీ సక్రమంగా జరిగేలా బాధ్యత వహిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రతకు కృషి చేస్తారు.

అర్హతలు: నిరంతరంగా ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చినా ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం, ప్రయాణికుల రక్షణ పట్ల బాధ్యతగా ఉండటం వీరికి ఉండాల్సిన ప్రధాన అర్హతలు. ఇందులో ‘జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ కంట్రోలర్‌’ ఎంట్రీ లెవెల్‌ జాబ్‌. బీఎస్సీ లేదా బీఈ పట్టా ఉండటం, సైన్స్‌ లేదా మ్యాథ్స్‌ సబ్జెక్టులు చదివి ఉండటం కెరియర్‌లో మరింత ఉపకరిస్తుంది.

ఏరోస్పేస్‌ ఇంజినీర్‌

ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌.. ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్‌్ ఇంజినీరింగ్‌ల కలయిక. వీరు ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్‌ డిజైనింగ్, కొత్త టెక్నాలజీల అభివృద్ధిలో పాలుపంచుకుంటారు. పైలెట్లకు ఏవియేషన్, నేవిగేషన్‌లో సూచనలు ఇవ్వడం, నావిగేషన్, కమ్యూనికేషన్, ప్రొపల్షన్స్, కంబస్టన్, రోబోటిక్స్‌లో నూతన టెక్నాలజీపై దృష్టి పెట్టడం, ఎయిర్‌క్రాఫ్ట్‌ కాంపొనెంట్స్‌ను అభివృద్ధి చేయడం వంటి విధులుంటాయి. 

అర్హతలు: ఏరోస్పేస్‌ ఇంజినీర్లు స్ట్రక్చరల్‌ డిజైన్, ఏరోడైనమిక్స్, నావిగేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌ వంటి వాటిలో పూర్తిస్థాయి శిక్షణ తీసుకుని ఉండాలి. వీరు సాధారణంగా అండర్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పూర్తి చేసి పీజీ, పీహెచ్‌డీ వంటివి చేస్తుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల్లో రిసెర్చ్‌ - డెవలప్‌మెంట్‌ విభాగాల్లో విధులు నిర్వహించే వీలుంటుంది.

ఫ్లైట్‌ అటెండెంట్‌/ ఎయిర్‌హోస్టెస్‌

ప్రయాణికులు విమానంలోకి ఎక్కిన దగ్గర్నుంచి.. గమ్యస్థానంలో క్షేమంగా దిగేవరకూ వారి మంచిచెడులు, అవసరాలు చూసుకోవడంలో క్యాబిన్‌ క్రూ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తారు. వారికి కావాల్సినవి ఇవ్వడం దగ్గర్నుంచి అత్యవసర పరిస్థితుల్లో వారిని జాగ్రత్తగా చూసుకోవడం వరకూ అన్నీ ఫ్లైట్‌ అటెండెంట్స్‌ చేస్తారు. వీరు అధికశాతం కమర్షియల్‌ ఎయిర్‌లైన్స్‌ నడిపే పౌర విమానాల్లో పనిచేస్తుంటారు. బిజినెస్‌ జెట్స్, మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్స్‌లో కూడా అవకాశాలుంటాయి. 

అర్హతలు: చాలా కంపెనీలు ఇంటర్‌ తర్వాత ఆరు నెలల నుంచి ఏడాదిపాటు ప్రత్యేక శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులను ఈ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. హాస్పిటాలిటీ, ట్రావెల్‌- టూరిజంలో ఏదైనా డిగ్రీ ఉండటం ఉద్యోగావకాశాలను మరింత మెరుగుపరుస్తుంది. చక్కని కమ్యూనికేషన్‌ స్కిల్స్, పలు భాషలు తెలిసి ఉండటం, ప్రాథమిక కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండటం ఇంకా పనికొస్తుంది. 

వీటిలో చేరేందుకు కనీసం 18 లేదా 21 ఏళ్ల వయసు, 5 అడుగులకు తగ్గని ఎత్తు ఉండాలి. మీల్‌ కార్ట్స్‌ మోయగలిగే, ఎమర్జన్సీ డోర్‌ను తెరవగలిగే సామర్థ్యం అవసరం. బయటకు కనిపించే విధంగా టాటూలు లేకుండా, మానసికంగానూ శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.

ఎయిర్‌పోర్ట్‌ మేనేజర్‌

ఈ మేనేజర్లు ఎయిర్‌పోర్ట్‌లో రోజువారీ వ్యవహారాలు సక్రమంగా సాగేలా చూసుకుంటారు. రక్షణ పనులు గమనించడం, కాంట్రాక్ట్స్‌ వంటివి పర్యవేక్షించడం, ఎయిర్‌పోర్టులో నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూసుకోవడం వీరి విధి. ఇవేకాక నియామకాలు జరిపించడం, రోజువారీ వ్యవహారాలకు ప్రోటోకాల్స్‌ తయారుచేయడం, ఎయిర్‌పోర్ట్‌ లోపల వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూడటం, ఏఏఐ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులుంటాయి. 

అర్హతలు: ఈ ఉద్యోగం ఆశించే వారు ఏవియేషన్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ చేసి ఉండాలి. బీఈ వంటి డిగ్రీల్లో ఏవియేషన్, ఫిజిక్స్, ఎరోడైనమిక్స్, మేనేజ్‌మెంట్‌ వగైరా సబ్జెక్టులు చేసి ఉండటం ఉపకరిస్తుంది. స్టాఫ్, సెక్యూరిటీ సూపర్‌విజన్‌ వంటి విధులుంటాయి.

మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌ 

ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ టెక్నీషియన్స్‌ ఏవియేషన్‌ తాలూకా రక్షణ, మెయింటెనెన్స్‌ బాధ్యతలు చూస్తుంటారు. తరచూ విమానాన్ని పరీక్షించడం, అవసరాన్ని బట్టి మరమ్మతులు చేస్తుంటారు. వీరికి మెకానిక్స్‌ లేదా ఏవియానిక్స్‌లో స్పెషలైజేషన్‌ ఉండాలి. కమర్షియల్‌ ఎయిర్‌లైన్స్, మెయింటెనెన్స్‌ డిపార్ట్‌మెంట్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ సర్వీస్‌ ఇచ్చే కంపెనీలు, ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ - విడిభాగాల మాన్యుఫాక్చరర్స్‌ వద్ద ఉద్యోగావకాశాలుంటాయి. 

అర్హతలు: ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌గా పనిచేసేందుకు డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) అనుమతించిన సంస్థ నుంచి ఏఎంఈ (ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌) చేసి ఉండాలి. ఇందులో చేరడానికి ఏఎంఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. 

కోర్సులు

ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌లో బీబీఏ, డిప్లొమా, గ్రౌండ్‌ స్టాఫ్‌ అండ్‌ కాబిన్‌ క్రూ ట్రైనింగ్, డిప్లొమా ఇన్‌ ఏవియేషన్‌ హాస్పిటాలిటీ, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్, బీఎస్సీ ఏవియేషన్, సర్టిఫికెట్‌ - డిప్లొమా - డిగ్రీ ఇన్‌ ఎయిర్‌ హోస్టెస్‌ ట్రైనింగ్, డిప్లొమా ఇన్‌ ఎయిర్‌ఫేర్‌ అండ్‌ టికెటింగ్‌ మేనేజ్‌మెంట్‌.. వంటి పలు విధాలైన కోర్సులు చేసి ఈ రంగంలో ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.

ప్రముఖ శిక్షణ సంస్థలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్‌ - న్యూదిల్లీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటిక్‌ సైన్స్‌ - జంషెడ్‌పుర్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ - పుణె, ఎ.జె.ఏవియేషన్‌ అకాడమీ - బెంగళూరు, ఇండియన్‌ ఏవియేషన్‌ అకాడమీ - ముంబయి, రాజీవ్‌గాంధీ ఏవియేషన్‌ అకాడమీ - హైదరాబాద్‌... వంటి పలు ప్రముఖ సంస్థలు విమానయాన సంబంధిత కోర్సులు అందిస్తున్నాయి.

ఉద్యోగ సంస్థలు

ఈ కోర్సులు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులను జెట్‌ ఎయిర్‌వేస్, ఎయిర్‌ ఛార్టర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎయిర్‌ ఇండియా, ఏవియేషన్‌ ఇండియా, స్పైస్‌ జెట్, గో ఎయిర్‌ ఎయిర్‌లైన్స్, ఇండిగో, ఎయిర్‌ ఛార్టర్స్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్, డెక్కన్‌ ఎయిర్‌ వంటి పలు సంస్థలు ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ సాధారణ డిగ్రీతో సంచలనం

‣ జేఈఈ మేటి ర్యాంకుకు మార్గాలివే!

‣ నాటో ప్లస్‌లో భారత్‌ చేరుతుందా?

‣ ఆర్థిక వృద్ధికి ఉపాధి మంత్రం

‣ వృత్తి విద్యకు ఒకేషనల్‌ కోర్సులు

‣ డిప్లొమాతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు

‣ నేర దర్యాప్తులో కీలకం.. క్రిమినాలజీ

Posted Date: 28-06-2023


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌