• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మేటి ర్యాంకుకు మార్గాలివే!

అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్‌ చిద్విలాస్‌రెడ్డి సూచనలు

ఇంజినీర్‌ కావాలన్న లక్ష్యాన్ని ఎనిమిదో తరగతి నుంచే నిర్దేశించుకున్నాడు. తల్లిదండ్రులు రాజేశ్వర్‌ రెడ్డి, భాగ్యలక్ష్మిల ప్రోత్సాహం, అన్న ప్రేరణతో ఐఐటీలో చదవాలని నిర్ణయించుకున్నాడు. లక్షలమంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసినా.. అర్జునుడికి చెట్టుపై ఉన్న పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు.. మేటి ర్యాంకుపై దృష్టి కేంద్రీకరించి  జాతీయస్థాయిలో టాపర్‌గా విజయ పతాకం ఎగరేశాడు తెలంగాణా కుర్రాడు వావిలాల చిద్విలాస్‌ రెడ్డి. తన సన్నద్ధత విశేషాలను ఇలా పంచుకున్నాడు..

అఖిల భారత స్థాయిలో కచ్చితంగా ర్యాంకు వస్తుందని తెలుసు. ఎందుకంటే మా కళాశాల నిర్వహించే పరీక్షల్లో టాప్‌ త్రీలో ఉన్నా. కళాశాలలో బోధించే పాఠాలు, వారు ఇచ్చే పాఠ్యపుస్తకాలు, మెటీరియల్‌తోపాటు మరిన్ని పుస్తకాలు చదవడం, గణితశాస్త్రంపై పట్టు సాధించేందుకు ఏం చేయాలని ఆలోచించడం - ఇలా అన్నీ వరుసక్రమంలో చేయడంతో నాపై నాకు నమ్మకం పెరిగింది. 

మెయిన్స్‌కు సరిగ్గా నాలుగు నెలల ముందు గట్టిగా ప్రిపేరవ్వాలని నిర్ణయించుకున్నా. ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలు, జేఈఈ మెయిన్స్‌ పరీక్షలకు సమాంతరంగా సిద్ధమయ్యా. రోజుకు పదిగంటల పాటు కచ్చితంగా చదవాలనుకున్నా.. ప్రణాళిక ప్రకారం సిద్ధమయ్యాను. గత మెయిన్స్‌ ప్రశ్నపత్రాలను పరిశీలించి ఎలాంటి ప్రశ్నలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయని ఆలోచించా. ఆ ప్రశ్నలున్న పాఠాలను బాగా చదివి అర్థం చేసుకున్నా. 

దాదాపు ప్రతిరోజూ మెయిన్స్‌ పరీక్ష రాసేవాణ్ణి. 300కు 298, 299 మార్కులు వచ్చేవి. ఇంకొక్క మార్కు ఎలా తగ్గింది? ఎందుకు తగ్గిందని విశ్లేషించుకుని మిగిలిన పరీక్షలు రాసేవాడిని. నెలరోజుల్లో 300కు 300 మార్కులు వచ్చాయి. అప్పటి నుంచి ప్రతి పరీక్షా మెయిన్స్‌ పరీక్షగా భావించి సిద్ధమయ్యా. మెయిన్స్‌లో అనుకున్న ఫలితాలు వచ్చాక ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకున్నా. తర్వాత అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ప్రిపరేషన్‌ ప్రారంభించా. 

మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి చాలా వెబ్‌సైట్లలో ప్రత్యేకమైన ప్రశ్నపత్రాలుంటాయి. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రాక్టీస్‌ చేస్తూ ఉంటే.. వంద పర్సంటైల్‌ సాధించేందుకు అవకాశముంటుంది. 

మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఎవరైనా సరే.. ఎంతసేపు చదివారన్నది ప్రామాణికం కాదు. కొందరు పదిగంటలు చదవొచ్చు. మరికొందరు ఆరుగంటలు చదువుకోవచ్చు. ఎవరెంతసేపు చదువుకున్నా.. మనకు సబ్జెక్టులు ఎంతవరకూ అర్థమయ్యాయన్నది తెలుసుకోవాలి.

నరేంద్ర అవస్థి, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో పాటు తెలుగు అకాడమీ రసాయనశాస్త్ర పుస్తకాల్లో విస్తృత సమాచారం ఉంది. వీటిన్నింటినీ చదివి అర్థం చేసుకుంటే ఎలాంటి విద్యార్థులకైనా మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో 99 పర్సంటైల్‌ వచ్చేందుకు అవకాశాలున్నాయి. 

ప్రశ్నలు సాధన చేస్తున్నప్పుడు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఏకాగ్రత ఎక్కడ తప్పుతోందని విశ్లేషించుకున్నా.. సరైన ట్రాక్‌లో వెళ్లాలని నిర్ణయించుకున్నా.   

గణితంపై మమకారం పెంచుకుంటే.. 

జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలన్నా.. పర్సంటైల్‌ బాగా రావాలన్నా గణితశాస్త్రంపై మమకారం పెంచుకోవాలి. ఇంటర్‌ గణితశాస్త్రంలో ప్రతి అధ్యాయంపై దృష్టి కేంద్రీకరించాలి. మంచినీళ్లు తాగినంత సులభంగా ప్రశ్నలకు సమాధానాలను రాయాలి. ఇందుకోసం పాఠ్యపుస్తకాలు, అఖిలభారత సాంకేతిక విద్యామండలి పుస్తకాలు, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అందుబాటులో ఉంచిన మెటీరియల్‌ను శ్రద్ధగా చదువుకోవాలి. సందేహం వస్తే.. అధ్యాపకులను అడిగి వెంటనే అనుమానాలను తొలగించుకోవాలి. దీంతోపాటు ఏయే అధ్యాయాలు సులభంగా అర్థమవుతున్నాయి? ఏ అంశాలు కొంత కష్టంగా ఉన్నాయి? అని విభజించుకుని సులభంగా అర్థమవుతున్న అధ్యాయాలను మరింత వేగంగా అర్థం చేసుకోవాలి. అదనంగా మిగిలిన సమయాన్ని కాస్త కష్టం అనిపించే అంశాలపై దృష్టి పెట్టాలి. గణితశాస్త్రంలో ఉన్న సౌలభ్యం ఏంటంటే మార్కులు వందకు వంద వస్తాయి. దీంతోపాటు లెక్కలు చేయడంలో ప్రావీణ్యం ఉంటే.. భౌతిక రసాయన శాస్త్రాల్లోని లెక్కలూ, సమీకరణాలూ సులభంగా చేసేందుకు వెసులుబాటు లభిస్తుంది.

భౌతికశాస్త్ర థియరీపై దృష్టి 

భౌతికశాస్త్రం చదువుకుంటున్నా.. వేర్వేరు పుస్తకాల నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నా.. దాన్ని మనచుట్టూ జరిగే అంశాలకు అన్వయించుకోవాలి. చిన్న చిన్న అంశాలను అర్థం చేసుకుంటే.. చదువుకునేకొద్దీ మిగిలిన అధ్యాయాలు సులభంగా అర్థమవుతాయి. ప్రధానంగా థియరీ పార్ట్‌పై దృష్టి కేంద్రీకరించాలి. తెలుగు మాధ్యమ విద్యార్థులైతే తెలుగు అకాడమీ పుస్తకాలు, భౌతికశాస్త్రంపై ప్రత్యేకంగా విడుదల చేసినవీ చదివి అర్థం చేసుకుంటే పరీక్ష అంత కష్టంగా అనిపించదు. అధ్యాయాలుగా విభజించుకుని లెక్కలున్న విభాగాలు ఒకసారి, థియరీ మాత్రమే ఉన్న పాఠాలను మరోసారి చదువుకునేవాణ్ణి. ఇలా చేయడం వల్ల లెక్కలున్న భాగాలు వేగంగా పూర్తయ్యేవి. దీంతో థియరీపై ఎక్కువ దృష్టిపెట్టి క్షుణ్ణంగా అర్థం చేసుకునేవాణ్ణి. 

సమీకరణాలు గుర్తుపెట్టుకోవడం కాదు.. 

విద్యార్థులందరికీ రసాయనశాస్త్రమంటే సమీకరణాలు గుర్తుపెట్టుకోవడమన్న భావన ఉంది. అది సరికాదు. ఆ సమీకరణాలు ఎలా వచ్చాయో తెలుసుకోవాలి. కళాశాలలు ఇచ్చే స్టడీ మెటీరియల్‌తోపాటు ఎన్‌సీఈఆర్‌టీ, రిఫరెన్స్‌ పుస్తకాలు చదవాలి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ కొంతమందికి కష్టంగా అనిపిస్తే.. మరికొందరికి సులువు. సమీకరణాలు పెద్దగా ఉండడం, గుర్తుపెట్టుకోవాల్సి రావడంతో కెమిస్ట్రీ కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యాను. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలోని ప్రశ్నపత్రాలు, ఆన్‌లైన్‌లో లభ్యమయ్యే ప్రశ్నపత్రాలు, రసాయనశాస్త్ర ప్రాథమిక సూత్రాలు అన్నీ చదివి అర్థం చేసుకున్నా. కెమిస్ట్రీకి గణితం, ఫిజిక్స్‌ల కంటే తక్కువ సమయం తీసుకోవాలనుకున్నా. మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో దీన్ని ఆచరించా. 

జేఈఈ మెయిన్స్‌.. అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే గణితంపై పట్టు సాధించాలి. తర్వాత భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం బాగా సాధన చేయాలి. 

కనీసం పదేళ్ల ప్రశ్నపత్రాల్లోంచి సొంతంగా మనమే రెండు, మూడు ప్రశ్నపత్రాలను సిద్ధం చేసుకోవాలి. 

ప్రశ్నపత్రాన్ని శ్రద్ధగా చదవాలి. అలా అని ఒక్కో ప్రశ్నకు ఎక్కువ సమయం తీసుకోకూడదు. ప్రశ్న పూర్తిగా చదువుతుండగానే సమాధానం స్ఫురించాలి. హాస్టల్‌లో ఉన్నప్పుడు స్నేహితులు, సహ విద్యార్థులతో కలిసి చదువుకున్నా.. మనకంటూ ప్రత్యేకమైన సమయం కేటాయించుకోవాలి. 

మెయిన్స్‌లో అనుకున్న పర్సంటైల్‌ వచ్చాక రెండోసారి రాయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఇంకా బాగా సిద్ధమవ్వొచ్చు. నేను మెయిన్స్‌ పరీక్ష ఒకేసారి రాశా. 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ నాటో ప్లస్‌లో భారత్‌ చేరుతుందా?

‣ ఆర్థిక వృద్ధికి ఉపాధి మంత్రం

‣ వృత్తి విద్యకు ఒకేషనల్‌ కోర్సులు

‣ డిప్లొమాతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు

‣ నేర దర్యాప్తులో కీలకం.. క్రిమినాలజీ

Posted Date : 27-06-2023

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌