• facebook
  • whatsapp
  • telegram

వృత్తి విద్యకు ఒకేషనల్‌ కోర్సులు

‣ పదో తరగతితో ప్రవేశాలు

అదనపు శిక్షణ అవసరం లేని ఒకేషనల్‌ కోర్సులు కెరియర్‌లో స్థిరపడటానికి చిన్న నైపుణ్యాలూ దారిచూపుతాయి. చిన్న వయసులోనే ఎందులోనైనా ప్రావీణ్యం పొంది, రాణించాలనుకునేవారు ఒకేషనల్‌ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ‘పనిచేయడం ద్వారా నేర్చుకోవటం’ వీటి ప్రత్యేకత! అందువల్ల కోర్సు పూర్తయిన వెంటనే ప్రత్యేక శిక్షణ  అవసరం లేకుండా నేరుగా బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఒకేషనల్‌ విద్య అనంతరం డిప్లొమా, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరవచ్చు లేదా అందులోనే ఉన్నత విద్య బి.వోక్‌., ఎం.వోక్‌. చదువుకోవచ్చు.

తక్కువ వ్యవధిలో ఉపాధిని ఆశించేవారు ఒకేషనల్‌ బాట పట్టవచ్చు. చదువు పూర్తయిన వెంటనే నిలదొక్కుకునేలా ఈ కోర్సులు రూపొందించారు. కోరుకున్న విభాగంలో ప్రత్యేక ప్రావీణ్యం పొందవచ్చు. వివిధ రంగాల అవసరాలను తీర్చి, నైపుణ్యం ఉన్న మానవ వనరుల కొరతను అధిగమించడానికి ఒకేషనల్‌ చదువులకు మెరుగులద్దారు. ఈ కోర్సుల్లో సుమారు 40 శాతం థియరీ, 60 శాతం ప్రాక్టికల్‌ ద్వారా నేర్చుకుంటారు. తెలుసుకోవడం కంటే పని చేయడం ద్వారా నేర్చుకోవడం, అనువర్తనం (అప్లికేషన్‌)కు ప్రాధాన్యం ఎక్కువ. అందువల్ల విద్యార్థులు కోరుకున్న రంగానికి చెందిన కోర్సులను ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ విధానంలో చదువుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల వ్యవధితో పలు విభాగాల్లో 20కు పైగా ఒకేషనల్‌ కోర్సులు అందిస్తున్నారు. ఆసక్తి, నైపుణ్యాలను అనుసరించి వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు. కోర్సులో ఉన్నప్పుడే సంబంధిత పరిశ్రమలో ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యేలా చూస్తారు. దీంతో ఎలాంటి అదనపు శిక్షణ లేకుండా ఉద్యోగానికి సిద్ధం కావచ్చు. పదో తరగతి మార్కులు/ గ్రేడ్‌ పాయింట్లతో ప్రవేశం లభిస్తుంది. 

ఇవీ కోర్సులు

అగ్రికల్చరల్‌: క్రాప్‌ ప్రొడక్షన్, లైవ్‌ స్టాక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డైరీ టెక్నాలజీ, ఫిషరీస్, సెరీకల్చర్‌.

బిజినెస్‌ అండ్‌ కామర్స్‌: అకౌంటింగ్‌ అండ్‌ ట్యాక్సేషన్, ఆఫీస్‌ అసిస్టెంట్‌షిప్, ఇన్సూరెన్స్‌ అండ్‌ మార్కెటింగ్, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌. 

ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ: ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్, కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నీషియన్, ఎలక్ట్రికల్‌ టెక్నాలజీ. 

హోమ్‌ సైన్స్‌: మెకానికల్‌ టెక్నాలజీ, కమర్షియల్‌ గార్మెంట్స్‌ టెక్నాలజీ, ప్రీస్కూల్‌ టీచర్‌ ట్రైనింగ్, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్, ఫార్మా టెక్నాలజీ.  

ఓపెన్‌ స్కూలింగ్‌తో..

కాలేజీకి వెళ్లి ఒకేషనల్‌ కోర్సులు చదవడం వీలుకానివారు కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వయంప్రతిపత్తి సంస్థ.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ అందించే ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాముల్లో చేరవచ్చు. పదో తరగతి విద్యార్హతతో ఇక్కడ పలు ఒకేషనల్‌ కోర్సులు ఉన్నాయి. వీటిని సీనియర్‌ సెకెండరీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ స్థాయిలో వివిధ విభాగాల్లో అందిస్తున్నారు. 

సీనియర్‌ సెకెండరీ స్థాయిలో: ఆయుర్వేద అండ్‌ యోగా: ఆయుర్వేద అసిస్టెంట్, పంచకర్మ అసిస్టెంట్, యోగా అసిస్టెంట్‌; ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌: వెబ్‌ డెవలప్‌మెంట్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసెంబ్లీ అండ్‌ మెయింటెనెన్స్, సీఆర్‌ఎం డొమెస్టిక్‌ వాయిస్‌; ప్లాంట్‌ ప్రొటెక్షన్, సాయిల్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఉన్నాయి. 

సర్టిఫికెట్‌ లేదా డిప్లొమాలో: సెక్రటేరియల్‌ ప్రాక్టీస్, టైప్‌ రైటింగ్, స్టెనోగ్రఫీ, డెస్క్‌టాప్‌ పబ్లిషింగ్, వెబ్‌ డిజైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, డేటా ఎంట్రీ ఆపరేషన్స్, ఐటీ ఎసెన్షియల్స్‌ పీసీ హార్డ్‌వేర్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్, వెబ్‌ డెవలప్‌మెంట్, సీఆర్‌ఎం డొమెస్టిక్‌ వాయిస్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసెంబ్లీ అండ్‌ మెయింటెనెన్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, హౌస్‌ వైరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ అప్ల్లయన్స్‌ రిపేరింగ్, మోటార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ రివైండింగ్, టీవీ రిపేరింగ్, కన్‌స్ట్రక్షన్‌ సూపర్‌విజన్, ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్, రేడియో అండ్‌ టీవీ టెక్నీషియన్, ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్, ఫర్నిచర్‌ అండ్‌ క్యాబినెట్‌ మేకింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, కేర్‌ ఎల్డర్లీ, కమ్యూనిటీ హెల్త్, హోమియోపతిక్‌ డిస్పెన్సింగ్, హౌస్‌ కీపింగ్, క్యాటరింగ్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్, హోటల్‌ ఫ్రంట్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్, ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌ ప్రిజర్వేషన్, ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్, టాయ్‌ మేకింగ్‌ అండ్‌ జాయ్‌ఫుల్‌ లెర్నింగ్, లైబ్రరీ సైన్స్, ఫుడ్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ ఆపరేషన్స్, హౌస్‌ కీపింగ్‌ అండ్‌ మెయింటెనెన్స్, ఫ్రంట్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్, బ్యాకరీ అండ్‌ కన్ఫెక్షనరీ... తదితర కోర్సులు ఉన్నాయి.  

ఉన్నత విద్య

ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు డిగ్రీ కళాశాలలు అందిస్తోన్న బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ స్టడీస్‌ (బీఓక్‌) కోర్సుల్లో చేరిపోవచ్చు. ఈ విభాగంలో ఉన్నత చదువులకు మాస్టర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ (ఎంఓక్‌) కోర్సులూ ఉన్నాయి. విదేశాల మాదిరి ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ ఒకేషనల్‌ చదువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. వీటిలో చేరుతోన్న విద్యార్థుల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. డిగ్రీ స్థాయిలో ఒకేషనల్‌ వద్దనుకుంటే బ్రిడ్జ్‌ కోర్సులు పూర్తిచేసుకుని డిప్లొమా, అగ్రికల్చర్, బీఎస్సీ తదితర విభాగాల్లోకి వెళ్లిపోవచ్చు. పాలిటెక్నిక్‌లో అయితే నేరుగా ద్వితీయ సంవత్సరం కోర్సులో చేరిపోవచ్చు.  

జాతీయ స్థాయిలో..

నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ అంత్రప్రెన్యూర్‌షిప్‌ ఒకేషనల్‌ విద్యకు దిక్సూచిలా వ్యవహరిస్తోంది. యూజీసీతో కలిసి ఎన్‌ఎస్‌డీసీ దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో ఒకేషనల్‌ కోర్సులు స్కిల్‌ బేస్డ్‌ విధానంలో అందిస్తోంది. కమ్యూనిటీ కళాశాలల్లో సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులు ఉంటాయి. ఇందులో భాగంగా 6 నెలల సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసుకుంటే నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ లెవెల్‌ 4 స్థాయి సొంతమవుతుంది. ఏడాది వ్యవధి ఉండే డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్నవారికి లెవెల్‌ 5, రెండేళ్ల అడ్వాన్స్‌డ్‌ డిప్లొమాతో లెవెల్‌ 6, మూడేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ పూర్తిచేసుకుంటే లెవెల్‌ 7 స్థాయికి చేరుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలన్నీ దాదాపు ఏదో ఒక ఒకేషనల్‌ కోర్సును అందిస్తున్నాయి. 

యూజీలో..

మూడేళ్ల ఒకేషనల్‌ కోర్సుల్లో భాగంగా విద్యార్థులు ఆసక్తిని బట్టి ..బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బయో మెడికల్‌ సైన్సెస్, ఇండస్ట్రియల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఐటీ, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అండ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, మోడర్న్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ప్రింటింగ్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్‌ అండ్‌ డేటా అనాలిసిస్‌.. తదితర కోర్సులు ఎంచుకోవచ్చు. డిగ్రీ కళాశాలల పరిధిలోని పరిశ్రమలు, స్థానిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రాంతాల వారీ అవసరమైన కోర్సులు అందిస్తున్నారు. అందువల్ల చదువు పూర్తయిన వెంటనే వాటిలో ఉపాధి దక్కుతుంది. ఉన్నత విద్యను ఆశించేవారు యూజీలోని అంశాలనే పీజీ స్థాయిలో మరింత విస్తృతంగా చదువుకోవచ్చు. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ నేర దర్యాప్తులో కీలకం.. క్రిమినాలజీ

‣ ఎన్‌హెచ్‌పీసీలో 388 కొలువులు

‣ ‘పది’తో ప్రభుత్వోద్యోగాలెన్నో!

‣ సబ్జెక్టులపై పట్టు.. అధిక సాధన!

‣ ‘నీట్‌’ చక్రవర్తి ప్రథమ ర్యాంకర్‌ అనుసరించిన వ్యూహం

Posted Date: 23-06-2023


 

టెన్త్ తర్వాత

మరిన్ని