• facebook
  • whatsapp
  • telegram

నేర దర్యాప్తులో కీలకం.. క్రిమినాలజీ

కొత్త కెరియర్‌ సమగ్ర వివరాలు

నేర పరిశోధన, దర్యాప్తులపై ఆసక్తి ఉన్నవారికి సరైన సబ్జెక్టు- క్రిమినాలజీ. ఇప్పుడిప్పుడే మనదేశంలో దీనిపై అవగాహన  పెరుగుతోంది. ఈ కోర్సులు పూర్తి చేసుకున్నవారు క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్, సైబర్‌ క్రైమ్‌ విభాగాల్లో కొలువులు పొందొచ్చు. నిత్యం సవాళ్లతో సరికొత్తగా అనిపించే ఈ కెరియర్‌ గురించి మరిన్ని వివరాలు పరిశీలిస్తే..

నేర దర్యాప్తులో.. నేరాలను, నేరగాళ్లను అంచనా వేయడంలో క్రిమినాలజీ పాత్ర కీలకం. ఈ నిపుణులు తమ అనుభవాన్నీ, ఆలోచనలనూ రంగరించి పోలీసులకు సాయం చేస్తారు. నేరం జరిగినప్పుడు బాధితులకు సాంత్వన చేకూర్చడంలో, నేరగాళ్లకు శిక్ష పడటంలో వీరి సేవలు అవసరం. ఈ కోర్సులు చదవడం చక్కటి అవకాశాలకు నాంది పలుకుతుంది. ఈ కోర్సుల్లో చేరినవారు క్రిమినాలజీతోపాటు లా, రిసెర్చ్‌ మెథడ్స్, సోషియాలజీ, సైకాలజీ.. తదితర సబ్జెక్టులనూ అధ్యయనం చేస్తారు.

ఏటా పెరుగుతోన్న నేరాలు క్రిమినాలజీ నిపుణులకు అవకాశాలు పెంచుతున్నాయి. అందులోనూ డిజిటల్‌ ఫార్మాట్‌లో ఈ అవసరం మరీ ఎక్కువ ఉంది. ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ యూజీ క్రిమినాలజీ కోర్సుల్లో చేరవచ్చు. క్రిమినాలజీ/ సైకాలజీ/ సోషియాలజీ గ్రాడ్యుయేట్లు పీజీలో రాణించగలరు.

ఈ కోర్సులు చదివిన వారు ప్రభుత్వాలు, పోలీసు శాఖ, ప్రైవేటు సంస్థలు, ఎన్‌జీవోలతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది.

క్రిమినాలజీలో క్రిమినల్‌ బిహేవియర్, లీగల్‌ ఫీల్డ్స్, సైకాలజీ, స్టాటిస్టిక్స్, ఆంత్రొపాలజీ.. ఇవన్నీ కలిసి ఉంటాయి. ఈ విద్యార్థులు సంబంధిత సబ్జెక్టులన్నీ నేర్చుకుంటారు. వీరు ప్రధానంగా..  

* నేరాలకు పాల్పడే వారి వ్యక్తిత్వాలను అంచనా వేయడం  

* నేరాలకు కారణాలను అన్వేషించడం 

* వ్యక్తులు - సమాజం మీద ఈ నేరాల ప్రభావాన్ని గుర్తించడం 

* నేరాలను అదుపుచేసే పద్ధతులను సూచించడం.. వంటి విధులు నిర్వహిస్తారు. 

నిజానికి ఇది కాస్త కొత్త సబ్జెక్టు. గత 200 ఏళ్లుగా మాత్రమే ప్రపంచవ్యాప్తంగా దీనిపై లోతైన అధ్యయనం జరుగుతోంది.

ఇవీ సంస్థలు

క్రిమినాలజీలో ఎక్కువ సంస్థలు పీజీలో కోర్సులు అందిస్తున్నాయి. యూజీ స్థాయిలో పరిమిత సంస్థల్లోనే ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఏదైనా యూజీతో రెండేళ్ల ఎంఏ/ ఎమ్మెస్సీ క్రిమినాలజీ కోర్సులో చేరవచ్చు. కొన్ని సంస్థలు సీయూసెట్‌ పీజీతో అవకాశం కల్పిస్తున్నాయి. నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, మద్రాస్‌ యూనివర్సిటీ, లఖ్‌నవూ యూనివర్సిటీ, పుణె యూనివర్సిటీ, గురుగోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ అండ్‌ క్రిమినాలజీ.. తదితర సంస్థలు ఈ కోర్సులో పేరొందాయి. పీజీ తర్వాత పీహెచ్‌డీ పూర్తి చేసుకోవచ్చు.

చదివేవారు.. 

క్రిమినాలజీ చదివేవారికి సమాజం, మనుషుల పట్ల ఆసక్తి ఉండాలి. సైకాలజీ, సోషియాలజీపై కనీస అవగాహన అవసరం. నిజానికి ఇది కాస్త ఛాలెంజింగ్‌ సబ్జెక్టు. ఇబ్బందికరమైన, మనసు చలించే విధమైన వాతావరణంలో పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల స్వతహాగా ఆసక్తి, స్థిరమైన మానసిక ఆరోగ్యం ఉన్నవారే దీన్ని ఎంచుకోవడం మంచిది.

ఎందుకు అవసరం

అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నప్పుడు, జరగకూడని నష్టం జరుగుతున్నప్పుడు.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు క్రిమినాలజీ అవసరం పడుతుంది. నేరం వెనుక ఆర్థిక, మానసిక, సామాజిక కారణాలు ఏంటో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

‣ క్రిమినాలజిస్టులు నేరస్థుడి దృష్టితో ఆలోచించి కేసును పరిష్కరించడంలో సాయపడతారు. అయితే పూర్తిగా కేసును పరిష్కరించడం వారి పని కాదు. ఆ వ్యవస్థకు తామొక బలమైన వనరుగా ఉపయోగపడతారు. 

నేరాల నియంత్రణ, నిరోధం, చట్టం - పాలసీ తయారీ వ్యవస్థలతో వీరు అనుసంధానమై పనిచేస్తారు.

కోర్సులు

క్రిమినాలజీలో డిప్లొమా, పీజీ డిప్లొమా, బీఎస్సీ, ఎంఏ, ఎమ్మెస్సీ చదివే వీలుంది. అధికశాతం దీనికి అనుబంధంగా పోలీస్‌సైన్స్, క్రిమినల్‌ అడ్మినిస్ట్రేషన్, పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్, జస్టిస్, క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్, ఫోరెన్సిక్‌ సైన్స్‌ సబ్జెక్టులు ఉంటాయి. ఈ కోర్సులో చేరిన విద్యార్థులు సబ్జెక్టుతోపాటు క్రిటికల్‌ థింకింగ్, అనలిటికల్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై దృష్టిపెట్టాలి.

ఉద్యోగావకాశాలు

కొన్ని బహుళ జాతి సంస్థలు క్రిమినాలజీ చదివిన వారిని ఫ్రాడ్‌ అనలిస్ట్, ప్రివెన్షన్‌ ఆఫీసర్, సైబర్‌ క్రైం అనలిస్ట్, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ రిసెర్చర్స్, సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌గా నియమించుకుంటున్నాయి. ఇవికాక వివిధ ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగాలు సంపాదించవచ్చు. అయితే ఇది మన దేశంలో ఇటీవలే ఎదుగుతున్న రంగం. అందువల్ల అవకాశాలు కాస్త తక్కువనే చెప్పాలి. కానీ అదే సమయంలో పోటీ కూడా తక్కువ ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అందువల్ల నైపుణ్యం సాధిస్తే సులభంగా రాణించే వీలుంటుంది. ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీలు, మానవ హక్కుల ఏజెన్సీలు, పోలీసు, ఇతర నేర దర్యాప్తు సంస్థలు.. వీటన్నింటిలోకీ ప్రవేశించే వీలుంటుంది. కొందరు క్రిమినాలజీ గ్రాడ్యుయేట్స్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ టెక్నీషియన్స్‌గా కెరియర్‌ మొదలుపెడతారు. వీరు క్రైం సీన్స్‌లో సాక్ష్యాలు వెతికి, ల్యాబ్స్‌లో వాటిని అనలైజ్‌ చేస్తారు. మొత్తంగా క్రిమినాలజిస్ట్, క్రైమ్‌ అనలిస్ట్, క్రిమినాలజీ అధ్యాపకులు, ఫోరెన్సిక్‌ సైకాలజిస్ట్‌గా వివిధ కొలువుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

ఎలా ఉంటాయంటే..

మనదేశంలో నేరాల రేటు అధికం. అలాగే పునరావాసం అనే అంశానికి ప్రాధాన్యం పెరుగుతోంది. నేరాల్లేని దేశాన్ని తయారు చేయాలంటే క్రిమినాలజిస్టులకు అధికంగా ఉద్యోగాలు సృష్టించడం అవసరం. 

క్రిమినాలజిస్ట్‌: క్రిమినల్‌ ఏవిధంగా ఆలోచిస్తున్నాడు.. అతని నేరం తీరు ఎలా ఉంది అనేది ప్రధానంగా తెలిసేది వీరి వల్లనే. వీరు నేరుగా క్రిమినల్స్‌తో మాట్లాడటం ద్వారా, వారిని గమనించడం ద్వారా వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు.

క్రైమ్‌ అనలిస్ట్‌: సాక్ష్యాలు, వేలిముద్రలు, ఇతర క్రైమ్‌ సీన్‌ వస్తువులను విశ్లేషించడం వీరి విధి. అధికారుల అనుమతులు, విధి విధానాలకు తగిన విధంగా పనిచేయాలి. నిజానికి నేరాన్ని రుజువు చేయడంలో సాక్ష్యాలది కీలకపాత్ర. ఈ విషయంలో క్రైమ్‌  అనలిస్ట్‌లు అత్యంత అప్రమత్తంగా ఉంటూ తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. తాము గుర్తించిన అంశాలు అన్నింటినీ విశ్లేషించి చివరిగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల వీరికి బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు అవసరం.

క్రిమినాలజీ అధ్యాపకులు: టీచింగ్, రిసెర్చ్‌ మీద ఆసక్తి ఉన్న వారికి.. క్రిమినాలజీని మరింత లోతుగా అధ్యయనం చేసి ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉన్నవారికి ఇది సరైన ఎంపిక. తమ రిసెర్చ్‌లతో పేపర్స్‌ను పబ్లిష్‌ చేయడం, సబ్జెక్టు ఉన్నతికి కృషి చేయడం చేయవచ్చు.

ఫోరెన్సిక్‌ సైకాలజిస్ట్‌: వీరు నేరగాళ్ల మనస్తత్వాన్ని అంచనా వేేయడంలో నిపుణులు. వారికేమైనా మానసిక సమస్యలు, అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయా... ఏ కారణంతో నేరానికి పాల్పడ్డారు, అందువల్ల ఏ విధంగా కేసును డీల్‌ చేయాలి, అతని మీద మొత్తంగా వ్యవస్థకు ఒక అంచనా ఇవ్వడంలో వీరి పాత్ర కీలకం. 

డిజిటల్‌ ఫోరెన్సిక్‌ అనలిస్ట్‌: డిజిటల్‌ సాక్ష్యాలను సేకరించడం, విశ్లేషించడం, భద్రపరచడంలో వీరు ముఖ్య పాత్ర పోషిస్తారు. రోజురోజుకూ సైబర్‌క్రైమ్‌ పెరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ టీమ్స్‌కి డిజిటల్‌ అనలిస్ట్‌ అవసరం చాలా ఉంటుంది. వీరికి కంప్యూటర్‌ పరిజ్ఞానంతోపాటు నేర దర్యాప్తులో అవగాహన ఉండాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ‘పది’తో ప్రభుత్వోద్యోగాలెన్నో!

‣ సబ్జెక్టులపై పట్టు.. అధిక సాధన!

‣ ‘నీట్‌’ చక్రవర్తి ప్రథమ ర్యాంకర్‌ అనుసరించిన వ్యూహం

‣ ఐటీబీపీలో హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు

‣ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 153 నాన్‌ టీచింగ్‌ ఖాళీలు

‣ సత్వర ఉపాధికి డిప్లొమా మార్గం

‣ టీహెచ్‌డీసీఐఎల్‌లో 181 జూనియర్‌ ఇంజినీర్‌ కొలువులు

Posted Date: 21-06-2023


 

కోర్సులు