• facebook
  • whatsapp
  • telegram

నేరాల లోగుట్టు విప్పే... ఫోరెన్సిక్‌ సైన్స్‌

నేరాలు గుట్టు విప్పే కోర్సులు

నమ్మకాలన్నీ నిజాలు కావు.. ఊహలన్నీ వాస్తవాలు కాలేవు.. ఆత్మహత్య అనుకున్నది హత్య కావచ్చు. ప్రమాదవశాత్తూ జరిగిందని భావించిన సంఘటనలో కుట్ర కోణం దాగుండవచ్చు. కర్మాగారం కాలి బూడిదవ్వడం వెనుక ఇన్సూరెన్స్‌ కాసుల కోసం కక్కుర్తి కారణం కావచ్చు. ఇంతకీ ఏది నిజం? ఎలా తెలుసు కోవాలి? ఇలాంటి సందేహాలకు శాస్త్రీయంగా సమాధానం చెప్తుంది.. ఫోరెన్సిక్‌ సైన్స్‌. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతోన్న పరిణామాల కారణంగా ఈ సబ్జెక్టు నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సుల్లో చేరి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు! 

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? హత్య జరిగిందా? హథ్రస్‌ బాధితురాలిని హత్య మాత్రమే చేశారా? అత్యాచారమూ జరిగిందా? ఇటీవలి కాలంలో దేశంలో తీవ్ర దుమారానికి ఈ రెండు సంఘటనలూ కారణమయ్యాయి. అయితే ఈ పరిణామాల వెనుక ఉన్న అనుమానాలు.. నిజమో, కాదో నిర్ధారణ జరిగింది. వీటిని ఫోరెన్సిక్‌ నిపుణులు శాస్త్రీయంగా శోధించారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. వీటి వెనుక ఉన్న నిజాలను ఫోరెన్సిక్‌ నిపుణులు తమ పరిధిలో నిగ్గు తేలుస్తున్నారు. 

హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినవారికీ, చోరీ చేసి దొంగలెత్తుకుపోయారని నాటకాలాడేవారికీ, ఆస్తులను తగలెట్టి ఆదుకోండి మహాప్రభో అంటూ అర్థించేవారికీ, నకిలీ పత్రాలతో నిలువునా దోచుకుంటున్నవారికీ ఫోరెన్సిక్‌ నిపుణులు చెక్‌ పెడుతున్నారు. ఆధునికత, సాంకేతికతలను అస్త్రాలుగా మలుచుకుని, హైటెక్‌ రీతిలో హత్యలు, అత్యాచారాలు, సైబర్‌ దాడులు చేసేవాళ్లు పెరిగారు. భారత్‌తో సహా, ప్రపంచవ్యాప్తంగా నేరాలు, ఆర్థిక మోసాలు ఎక్కువయ్యాయి. వీటికి బాధ్యులైనవారిని గుర్తించి, చట్టం ముందు నిలబెట్టడానికి సాధారణ నైపుణ్యం సరిపోవడం లేదు. ఆధారాలు అన్వేషించి, అసలు దోషుల గుట్టు విప్పడానికి ఆవిర్భవించిందే ఫోరెన్సిక్‌ సైన్స్‌. 

ఇది కేవలం హంతకులను గుర్తించే శాస్త్రమే కాదు. మోసగాళ్లను పట్టించే దివ్యాస్త్రం కూడా. ముడుపులు తీసుకున్నవారినీ, మార్ఫింగ్‌ మోసగాళ్లనూ, వన్యమృగాల వేటగాళ్లనూ, పసిమొగ్గలపై పైశాచికాన్ని ప్రదర్శించినవారినీ .. ఇలా అన్ని రకాల కేటుగాళ్లనూ కచ్చితత్వంతో పట్టుకుంటుంది. దీంతో ఈ రంగంలో కెరియర్‌ అవకాశాలు విస్తరిస్తున్నాయి. ఇందుకోసం వివిధ స్థాయుల్లో ఎన్నో స్పెషలైజేషన్లతో భిన్న సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి.
 

అవకాశాలిక్కడ..

ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీలు, ఆసుపత్రులు, ల్యాబొరేటరీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు ఫోరెన్సిక్‌ నిపుణులను డాక్యుమెంట్‌ రైటర్లుగా నియమించుకుంటున్నాయి. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఇంటలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), పోలీస్‌ శాఖల్లో ఉద్యోగాలుంటాయి. యాంటీ టెర్రరిస్ట్‌ ఆపరేషన్, మాస్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్, కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ తదితర విభాగాల్లో కొలువులు పొందవచ్చు. 
 

పేరున్న సంస్థలివీ...

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ నెలకొల్పారు. ఈ సంస్థ ఎంఏ క్రిమినాలజీ, ఎమ్మెస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులు అందిస్తోంది. క్రిమినాలజీ కోర్సులో గ్రాడ్యుయేట్లు ఎవరైనా చేరవచ్చు. ఈ సంస్థ ఏడాది వ్యవధితో పీజీ డిప్లొమా ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫ్‌ సైబర్‌ క్రైమ్‌ అండ్‌ లా, పీజీ డిప్లొమా ఇన్‌ విక్టిమాలజీ అండ్‌ విక్టిమ్‌ అసిస్టెన్స్, పీజీ డిప్లొమా ఇన్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఇటీవలి కాలంలో అందిస్తోంది. గ్రాడ్యుయేట్లు ఎవరైనా చేరవచ్చు. ఎమ్మెస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌కి మాత్రం సైన్స్‌ గ్రాడ్యుయేట్లే అర్హులు.

గుజరాత్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఈ విభాగంలో వివిధ కోర్సులను అందిస్తోంది. 

యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, పంజాబ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ లఖ్‌నవూ, ఉస్మానియా యూనివర్సిటీ, బుందేల్‌ఖండ్‌ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్, ముంబయి, గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్, ఔరంగాబాద్‌; యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్, డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ యూనివర్సిటీ, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్, మైసూరు (ఫోరెన్సిక్‌ స్పీచ్‌ సైన్సెస్, ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌), గురు గోవింద్‌సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, పంజాబ్‌ యూనివర్సిటీ ...తదితర సంస్థలు ఫోరెన్సిక్‌ కోర్సులకు పేరొందాయి. ఇవి పీజీ, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా స్థాయుల్లో కోర్సులు నడుపుతున్నాయి.
 

రాణించాలంటే ఇవి కావాలి 

సమాచారాన్ని విశ్లేషించడం

లోతుగా ఆలోచించడం

వాస్తవానికి దగ్గరగా ఊహించడం

తర్కం, సునిశిత పరిశీలన 

కమ్యూనికేషన్‌ సామర్థ్యం 

బృంద సభ్యులుగా మెలగడం

యూజీ నుంచి పీహెచ్‌డీ వరకూ...

ఫోరెన్సిక్‌ సైన్స్‌పై ఆసక్తి ఉన్న ఇంటర్‌ మ్యాథ్స్, సైన్స్‌ విద్యార్థులు బీఎస్సీలో దీన్ని ఒక సబ్జెక్టుగా చదువుకోవచ్చు. అయితే తక్కువ సంఖ్యలో సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. యూజీలో సైన్స్, మ్యాథ్స్‌ కోర్సులు చదివినవారు పీజీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులో చేరవచ్చు. ఇందుకోసం జాతీయ స్థాయిలో కొన్ని ప్రత్యేకమైన సంస్థలూ ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులు అమలవుతున్నాయి. పీజీ అనంతరం పీహెచ్‌డీలో చేరవచ్చు. చాలా సంస్థలు సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. స్పెషలైజేషన్లు సైతం ఉన్నాయి. 

ఎమ్మెస్సీ- డిజిటల్‌ ఫోరెన్సిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఎమ్మెస్సీ - హోం ల్యాండ్‌ సెక్యూరిటీ అండ్‌ యాంటీ టెర్రరిజం, ఎంబీఏ ఫైనాన్స్‌ (ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌), ఎంటెక్‌ - సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్సిడెంట్‌ రెస్పాన్స్, పీజీ డిప్లొమా - ఫోరెన్సిక్‌ టాక్సికాలజీ, ఫోరెన్సిక్‌ డాక్యుమెంట్‌ ఎగ్జామినేషన్, ఫింగర్‌ ప్రింట్‌ సైన్స్, క్రిమినాలజీ, ఫోరెన్సిక్‌ మేనేజ్‌మెంట్, ఫోరెన్సిక్‌ అకౌంటింగ్, ఫోరెన్సిక్‌ అడొంటాలజీ, ఫోరెన్సిక్‌ నర్సింగ్‌... తదితర కోర్సులను ఎన్నో సంస్థల్లో బోధిస్తున్నారు. అభ్యర్థులు ఆసక్తి, పూర్వ విద్యా నేపథ్యం ప్రకారం తమకు అనువైన కోర్సులో చేరవచ్చు.
 

హోదాలు.. విధులు 
 

ఫోరెన్సిక్‌ బాలిస్టిక్‌ ఎక్స్‌పర్ట్స్‌: గన్, పిస్టళ్లలో ఉపయోగించిన బుల్లెట్‌ రకం, అది ఎక్కడ తయారైంది, ఎంత దూరం నుంచి కాల్చారు, ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయి.. తదితర వివరాలన్నీ వీరు కచ్చితత్వంతో చెప్పగలరు. 

ఫోరెన్సిక్‌ డీఎన్‌ఏ ఎనలిస్ట్‌: వీరు ప్రమాదం జరిగిన ప్రాంతంలో లభించిన వేలిముద్రలు, రక్తం, వస్తువులను ఆధారంగా చేసుకుని దానికి కారణమైన వ్యక్తి డీఎన్‌ఏ తెలుసుకుంటారు. అది ఎవరితో సరిపోతుందో తేలుస్తారు.  

డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్స్‌: ఫోరెన్సిక్‌ సైన్స్‌కు సాంకేతికతను జోడించి డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్టులు సైబర్‌ నేరాల మోసగాళ్లను గుర్తిస్తారు. హ్యాకర్లనుంచి దొంగతనానికి గురైన డేటాను రాబడతారు. వీరిని ఫోరెన్సిక్‌ కంప్యూటర్‌ ఇన్వెస్టిగేటర్లంటారు.

క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేటర్‌: నేరం జరిగిన తీరును గమనించి అదెలా జరిగిందో నమూనాను తయారుచేస్తారు. ఆధారాలకోసం ప్రయత్నిస్తారు. లభించినవి సేకరించి, ప్రయోగశాల పరిశీలనకు పంపుతారు. 

వైల్డ్‌ లైఫ్‌ ఫోరెన్సిక్‌ స్పెషలిస్టు: అనుమానాస్పదంగా మృతిచెందిన వన్యమృగాల తీరుతెన్నులను వీరు అధ్యయనం చేస్తారు. అక్కడ లభించిన ఆధారాలతో కారకులు ఎవరై వుంటారో గుర్తిస్తారు.

ఫోరెన్సిక్‌ అకౌంటెంట్లు: ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌ ద్వారా ఆర్థిక నేరగాళ్లను తెలుసుకోవడం, ఆర్థిక నేరాలను గుర్తించడం సాధ్యమవుతుంది. వివాదాల్లో ఉన్న కంపెనీల ఆర్థిక లావాదేవీలను సులువుగా అర్థమయ్యేలా కోర్టుముందు వీరు ఉంచుతారు. ఆర్థిక ఒప్పంద పత్రాలు (బాండ్స్‌), నిబంధనలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తారు. ప్రస్తుతం ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. అకౌంట్స్, లా నేపథ్యం ఉన్నవారు ఈ విభాగంలో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. వీరికి ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు, లీగల్‌ ఫర్మ్‌ల్లో ఉద్యోగాలుంటాయి.

ఫోరెన్సిక్‌ టాక్సికాలజిస్ట్‌: కొందరు విష ప్రభావంతో చనిపోతారు. అయితే వారే సేవించారా, ఎవరైనా తెలీకుండా ఆహారంలో కలిపారా వీళ్లు నిర్ధారిస్తారు. అలాగే డ్రగ్స్‌ మొదలైనవి తీసుకుంటే ఆ మాదకద్రవ్యం పేరు, మోతాదు గుర్తిస్తారు. 

ఫోరెన్సిక్‌ సైకాలజిస్ట్‌: వీరు నేరారోపణ ఎదుర్కొంటున్నవారి మానసిక స్థాయిని విశ్లేషిస్తారు. విచారణ ఎదుర్కోగలిగేలా ఉన్నారా, లేదా గమనిస్తారు. మానసిక రోగులు, సైకోలు హత్యలో భాగమైనప్పుడు ఈ నిపుణుల సేవలే కీలకం.

ఫోరెన్సిక్‌ లింగ్విస్ట్‌లు: నేరం జరిగినచోట పత్రాలు, వాయిస్‌ వివరాలు ఏవైనా లభిస్తే వాటిని గమనిస్తారు. దస్తూరీని పరీక్షించి ఆ పత్రాలను ఎవరు రాశారో గుర్తిస్తారు. ఫోరెన్సిక్‌ స్పీచ్‌ సైన్స్‌తో అక్కడ లభించిన ఆడియో టేపుల్లో గొంతును విశ్లేషించవచ్చు.

ఫోరెన్సిక్‌ పాథాలజిస్ట్‌: పోస్టుమార్టం ద్వారా అనుమానాస్పద మరణాల వెనుక మర్మాలను విప్పుతారు. ప్రమాదవశాత్తు మరణించారా, సహజంగానే చనిపోయారా, హత్య జరిగిందా, ఆత్మహత్య చేసుకున్నారా... కచ్చితత్వంతో వీరు చెప్పగలరు.

ఫోరెన్సిక్‌ అడొంటాలజీ: బాధితుల ఒంటిపై గాట్లు ఏమైనా ఉంటే వాటికి కారకులను వీళ్లు పరిశీలిస్తారు. జంతువుల కారణంగా జరిగిందా లేదంటే మనుషులే పళ్లతో కరిచారా, గోళ్లతో రక్కారా తదితర విషయాలను వెలుగులోకి తెస్తారు. 
 

చదువుకున్న కోర్సును బట్టి హోదాలు లభిస్తాయి. ఫోరెన్సిక్‌ క్రైమ్‌ ల్యాబొరేటరీ అనలిస్ట్, ఫోరెన్సిక్‌ ఇంజినీర్, ఫోరెన్సిక్‌ ఆర్కిటెక్ట్స్, ఫోరెన్సిక్‌ వెటర్నరీ సర్జన్, ఫోరెన్సిక్‌ ఆంత్రపాలజిస్ట్‌.. తదితర హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తారు.


ఏఐఎఫ్‌సెట్‌ 2022 ప్రవేశాలు 

Posted Date: 07-12-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌