• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సబ్జెక్టులపై పట్టు.. అధిక సాధన!

ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష టాప్‌ ర్యాంకర్‌ ఉమేష్‌ వరుణ్‌ మెలకువలు

రెండు తెలుగు రాష్ట్రాల ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షల్లో సత్తా చూపించి, టాప్‌ ర్యాంకులు సాధించాడు చల్లా ఉమేష్‌ వరుణ్‌. జేఈఈలోనూ జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు తెచ్చుకున్నాడు. ఈ పరీక్షల్లో తన విజయానికి దోహదపడ్డ అంశాల గురించి అతడి మాటల్లోనే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మా ఊరు. అమ్మానాన్నలు చల్లా విశ్వేశ్వరరావు, దేవకీదేవి. ఏపీఈఏపీసెట్‌లో ప్రథమ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్‌లో మూడో ర్యాంకు తెచ్చుకున్నా. జేఈఈ మెయిన్స్‌లో 263 ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఆలిండియా 179వ ర్యాంకు సాధించాను. 

ఇంటర్‌ (ఎంపీసీ)లో 983 మార్కులు వచ్చాయి. ఒకటి నుంచి నాలుగు తరగతులు నెల్లూరు రవీంద్రభారతి పాఠశాలలో, అయిదో తరగతి చిలకలూరిపేట విజేత పాఠశాలలో, ఆరు నుంచి ఇంటర్‌ వరకు గుంటూరు భాష్యం విద్యాసంస్థల్లో చదివా.  

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరుగైన ర్యాంకు సాధించాలంటే.. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులపై లోతైన అవగాహన ఉండాలి. జేఈఈలో నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. జవాబులు కచ్చితంగా గుర్తించాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు శ్రద్ధగా సన్నద్ధమయితే ఏపీఈఏపీసెట్, తెలంగాణ ఎంసెట్‌లలో ర్యాంకులు సునాయాసంగా తెచ్చుకోవచ్చు. 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు భాష్యం విద్యాసంస్థల్లో శిక్షణ పొందాను. ప్రాథమిక స్థాయిలో బేసిక్స్‌ తెలుస్తాయి. ఇంటర్‌లో ఎక్కువగా ఐఐటీ ప్రవేశపరీక్ష మీద దృష్టిపెట్టి చదివించారు. నిత్యం 10-12 గంటలు చదివాను. ఈ పరీక్ష రాసే అభ్యర్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

కళాశాల అధ్యాపకులు చెప్పిందే ఎక్కువగా చదివాను. వారు సూచించిన పుస్తకాలు అధ్యయనం చేశాను. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై పూర్తి పట్టు వచ్చేలా చెప్పారు. పాత ప్రశ్నపత్రాలు సాధన చేశాను. మాక్‌ టెస్టులు నిర్వహించారు. ఇవి బాగా ఉపయోగపడ్డాయి. ఆన్‌లైన్‌లో ప్రాక్టీస్‌ చేయలేదు.

ఏపీ ఈఏపీసెట్‌ రాసేవారు గణితంపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. ఇందులోనే ఎక్కువ మార్కులకు ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి.

ఎంసెట్‌ రాసే అభ్యర్థులు తెలియని ప్రశ్నలవద్ద ఆగిపోతుంటారు. ముందుగా తెలిసిన ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. వదిలేసిన ప్రశ్నలకు చివరలో జవాబులు రాయాలి. 

సబ్జెక్టు నిపుణులు నాకేమైనా సందేహాలు వస్తే నివృత్తి చేసేవారు. మాక్‌ టెస్ట్‌లు రాయడంవల్ల భయంపోయింది. ఆరో తరగతి నుంచి కోచింగ్‌ తీసుకోవడంవల్ల సబ్జెక్టులపై పట్టు వచ్చింది. 

నిర్దిష్ట సమయంలో పరీక్ష రాయాలంటే.. ప్రశ్నపత్రం మొత్తం చదవాలి. ముందుగా తెలిసిన ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. తెలియని ప్రశ్నల వద్ద ఆలోచిస్తూ ఉండిపోవద్దు. ఆ ప్రశ్నలను రాయటం వాయిదా వేయాలి. దీనివల్ల సమయం వృథా అవ్వదు. 

చివరగా తెలియని ప్రశ్నలకు ఆలోచించి జవాబులు రాయాలి.  

ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను సాధన చేసి సబ్జెక్టులపై పట్టు పెంచుకుంటే ఒత్తిడి ఉండదు. ప్రిపరేషన్‌ సమయంలోనే తప్పులను సరిచేసుకోవాలి. 

పాఠ్యపుస్తకాలను చదవాలి. ఎక్కువ సమయం సాధన చేయాలి. దీనివల్ల పరీక్షల ఒత్తిడి దూరం అవుతుంది.

అభ్యర్థులు ఇంటర్‌ సిలబస్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులపై పట్టు పెంచుకోవటానికి ప్రయత్నించాలి. ఫిజిక్స్‌లో హెచ్‌పీ వర్మ రాసిన వాల్యూమ్‌-1, వాల్యూమ్‌-2 పుస్తకాలు ఉపయోగపడతాయి. 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు శ్రద్ధగా సన్నద్ధమయితే ఏపీఈఏపీసెట్, తెలంగాణ ఎంసెట్‌లలో ర్యాంకులు సునాయాసంగా తెచ్చుకోవచ్చు. 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ‘పది’తో ప్రభుత్వోద్యోగాలెన్నో!

‣ ‘నీట్‌’ చక్రవర్తి ప్రథమ ర్యాంకర్‌ అనుసరించిన వ్యూహం

‣ ఐటీబీపీలో హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు

‣ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 153 నాన్‌ టీచింగ్‌ ఖాళీలు

‣ సత్వర ఉపాధికి డిప్లొమా మార్గం

‣ టీహెచ్‌డీసీఐఎల్‌లో 181 జూనియర్‌ ఇంజినీర్‌ కొలువులు

Posted Date : 21-06-2023 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం