• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక వృద్ధికి ఉపాధి మంత్రం

భారత్‌ గత ఆర్థిక సంవత్సరం 7.2శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. 2023-24లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.5శాతం మేర వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. పొరుగున ఉన్న చైనాకు ఇది సాధ్యపడటం లేదు. ప్రధాన దేశాలన్నింటిలో భారత్‌ అత్యధిక వృద్ధి రేటును సాధించడం హర్షణీయం. అలాగని మన ముందున్న సవాళ్లను విస్మరించలేం.

అధిక ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌ యుద్ధం, కొవిడ్‌ తెచ్చిపెట్టిన అపార రుణభారం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నాయి. ఈ ప్రభావం భారత్‌పైనా ఉంటోంది. ఇది స్వల్పకాలిక సవాలు. వాతావరణ మార్పులు, సైబర్‌ దాడులు, క్రిప్టో కరెన్సీలు, ఆర్థిక రంగంలో సాంకేతికత తెస్తున్న మార్పులు దీర్ఘకాల భారీ సవాళ్లుగా నిలుస్తున్నాయి. ఈ కారణాలవల్ల 2022లో 3.4శాతం తగ్గిన ప్రపంచ జీడీపీ 2023లో 2.8శాతం మేర తరుగుపడుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌-19కు ముందే మందగించింది. ఉపాధి, పెట్టుబడులు, వినియోగం పడిపోయి స్థూల దేశీయోత్పత్తి తగ్గిపోయింది. 2016-17లో 8.3శాతంగా ఉన్న ఇండియా జీడీపీ వృద్ధి రేటు 2019-20లో 3.9శాతానికి జారిపోయింది. 2017-18లో నిరుద్యోగిత ఆరు శాతానికి పెరిగి, వేతనాల్లో వాస్తవ వృద్ధి పడిపోయింది.

ఎగుమతుల పెరుగుదల కీలకం

కొవిడ్‌ తరవాత భారత్‌లో సంఘటిత, అసంఘటిత రంగాలు నెమ్మదిగా కోలుకోసాగాయి. అయితే, అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు పూర్తిగా పుంజుకోలేదు. బడా సంస్థలు కొవిడ్‌ ప్రభావాన్ని తట్టుకొని నిలబడ్డాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) మాత్రం గత రెండేళ్లలో ఆదాయాలు కోల్పోయాయి. వాటి నిర్వాహకులు, కార్మికులు తీవ్ర కష్టనష్టాలకు గురయ్యారు. వలస కూలీలు రోడ్డున పడ్డారు. 2019లో 42.9శాతంగా ఉన్న కార్మిక భాగస్వామ్య రేటు 2022లో 39శాతానికి తగ్గింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసేందుకు ఎదురుచూస్తున్న వారి సంఖ్య కొవిడ్‌ ముందునాటికన్నా ఎక్కువగా ఉంది. ఇవన్నీ, ఉపాధి అవకాశాలు ఇంకా పుంజుకోలేదనడానికి నిదర్శనాలు.

భారత్‌ తక్షణమే వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలి. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉత్పత్తి సాధనాల వ్యయం, చిన్న కమతాలు, సాగులో అరకొర యాంత్రీకరణ, పరోక్ష నిరుద్యోగంతో కునారిల్లుతున్న వ్యవసాయ రంగాన్ని రూపాంతరం చెందించాలని 2022-23 ఆర్థిక సర్వే సిఫార్సు చేసింది. రాయితీలు, సేకరణ, నీటి పారుదలకు సంబంధించిన విధానాలు ప్రధానంగా వరి, గోధుమ పంటల కేంద్రితంగా సాగుతున్నాయి. ఇకపై అధిక విలువగల పంటలకు ప్రాధాన్యమివ్వాలి. చిన్న, యువ, మహిళా రైతులను ప్రోత్సహించాలి. అధిక కార్మికశక్తిని వినియోగించే పరిశ్రమలకు ఊతమివ్వాలి. వాటి ద్వారా ఎగుమతులను పెంచాలి. ఇందుకు ఎంఎస్‌ఎంఈ రంగం ఎంతగానో తోడ్పడుతుంది. పారిశ్రామిక, సేవా రంగాలు అత్యధికంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. ఈ రెండు రంగాలే జోడు గుర్రాలుగా భారత ఆర్థిక వ్యవస్థ దౌడు తీయగలదని నీతి ఆయోగ్‌ పేర్కొంది. నేడు సేవారంగంలో అంతర్జాతీయ బ్రాండ్లుగా వెలిగిపోతున్న అమెజాన్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ తదితర కంపెనీలు అమెరికాలో ప్రారంభమై దేశదేశాలకు విస్తరించాయి. నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు, మార్కెటింగ్‌కు తోడు వినియోగదారుణ్ని రాజుగా పరిగణించడం ద్వారా అమెరికా సంస్థలు ఘన విజయం సాధిస్తున్నాయి. ఈ లక్షణం ఐరోపా, ఆసియా, భారత్‌, జపాన్‌ కంపెనీల్లో కనిపించడం లేదు. 77శాతం ఖాతాదారులు తాము మేలైన సేవలు అందించే కంపెనీలను ఇష్టపడతామని ఒక సర్వేలో చెప్పారు. వినియోగదారుల్లో 57శాతం ఉత్పత్తుల నాణ్యతకు, మరో 57శాతం సాంకేతికత, నవీకరణలకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆ సర్వేలో తేలింది. భారత్‌ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన సేవల ద్వారా ఎగుమతులను వృద్ధి చేసుకోవాలి. మనది ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం. రాగల మూడు దశాబ్దాల్లో ప్రపంచంలో అదనంగా వచ్చిచేరే కార్మిక బలగంలో 22శాతం భారత్‌ ద్వారానే సమకూరుతుంది. దేశంలో 2020-2050 మధ్య 15-64 వయోవర్గంలో అదనంగా 18.3 కోట్ల మంది చేరతారు. వీరందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే- భారత్‌కు యువజనాధిక్యత వల్ల లాభం చేకూరుతుంది. దీన్ని పెద్దయెత్తున సద్వినియోగం చేసుకునేలా ఎంఎస్‌ఎంఈ రంగాన్ని సిద్ధంచేస్తే ప్రజలకు ఉపాధి అవకాశాలు, ఆదాయాలు పెరుగుతాయి. సామాజిక, ప్రాంతీయ అంతరాలు తగ్గుతాయి.

తలసరి ఆదాయంలో తీసికట్టు

తూర్పు ఆసియాతో పోలిస్తే భారత్‌లో పాఠశాలలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని కొన్నేళ్ల క్రితం సింగపూర్‌ ఉప ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ లోపాన్ని సరిదిద్దితే నిపుణ మానవ వనరులను తయారు చేసుకోవడం సాధ్యమవుతుందని ఆయన సలహా ఇచ్చారు. జీ-20 అధ్యక్ష హోదాలో భారత్‌ ఈ దిశగా సమర్థ చర్యలకు ఉపక్రమించాలి. బలమైన ప్రభుత్వ వ్యవస్థ, న్యాయపాలన, జవాబుదారీతనం ఉన్న దేశాలు సర్వతోముఖ విజయాలు సాధిస్తాయని చరిత్రకారుడు ఫ్రాన్సిస్‌ ఫుకుయామా సూత్రీకరించారు. భారత్‌ ఈ లక్షణాలను అందిపుచ్చుకొంటే, 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు విశ్లేషించారు. అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ 2030 నాటికి మూడో స్థానానికి ఎగబాకనుంది. తలసరి ఆదాయం విషయంలో మాత్రం తీసికట్టుగానే ఉంది. 197 దేశాల్లో తలసరి ఆదాయపరంగా భారత్‌ 142వ స్థానంతో సరిపెట్టుకొంటోంది. మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందరికీ దరిచేరినప్పుడే దేశ జనుల తలసరి ఆదాయాలు పెరుగుతాయి.

తగ్గాల్సిన రుణ భారం

ఎగుమతులు, పెట్టుబడులు పెరిగినప్పుడు జీడీపీ అధిక వృద్ధి రేటు నమోదు చేస్తుంది. భారత్‌ ప్రైవేటు పెట్టుబడులను పెంచుకోవడం చాలా ముఖ్యం. బహుళజాతి కంపెనీలు చైనా నుంచి ఉత్పత్తి కార్యకలాపాలను ఇతర దేశాలకు మళ్ళించాలని యోచిస్తున్నాయి. ఈ తరుణంలో ఆ సంస్థల పెట్టుబడులను భారత్‌ ఆహ్వానించగలగాలి. అవి ఇక్కడ తయారు చేసే ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రోత్సాహకర విధానాలను చేపట్టాలి. అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో కీలక భాగస్వామి కావడానికి సిద్ధంగా ఉన్నానని సంపన్న, పారిశ్రామిక దేశాలకు భారత్‌ సందేశమివ్వాలి. దానికన్నా మందు ద్రవ్యోల్బణ కట్టడి, కరెంటు, విత్త లోటులను అధిగమించడం, రుణ భారాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులూ మెరుగుపడాలి. భారత్‌లో మొత్తం ప్రభుత్వ వ్యయంలో 60శాతం రాష్ట్రాల ద్వారానే ఖర్చవుతోంది. విద్య, వైద్యానికి 70శాతం, ప్రభుత్వ ఉద్యోగులపై 79శాతం వ్యయం రాష్ట్రాల ద్వారానే జరుగుతోంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ వృత్తి విద్యకు ఒకేషనల్‌ కోర్సులు

‣ డిప్లొమాతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు

‣ నేర దర్యాప్తులో కీలకం.. క్రిమినాలజీ

‣ ఎన్‌హెచ్‌పీసీలో 388 కొలువులు

‣ ‘పది’తో ప్రభుత్వోద్యోగాలెన్నో!

‣ సబ్జెక్టులపై పట్టు.. అధిక సాధన!

‣ ‘నీట్‌’ చక్రవర్తి ప్రథమ ర్యాంకర్‌ అనుసరించిన వ్యూహం

Posted Date: 23-06-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం