• facebook
  • whatsapp
  • telegram

నాటో ప్లస్‌లో భారత్‌ చేరుతుందా?

అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు కొన్నేళ్లుగా చైనా నుంచి గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై వాషింగ్టన్‌ ఆధిపత్యానికి బీజింగ్‌ క్రమంగా గండి కొడుతోంది. దాంతో డ్రాగన్‌కు కళ్ళెంవేసే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా కాంగ్రెస్‌ సెలెక్ట్‌ కమిటీ ఒకటి ఇటీవల విప్లవాత్మక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇండియాను చేర్చుకోవడం ద్వారా ‘నాటో ప్లస్‌’ కూటమిని బలోపేతం చేయాలని అది సూచించింది. ఇండో-పసిఫిక్‌లో డ్రాగన్‌ దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు అది దోహదపడుతుందన్నది ఆ కమిటీ అభిప్రాయం.

స్వతంత్రతకు ముప్పు

నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో) అనేది సైనిక కూటమి. ఇందులో ప్రస్తుతం 31 సభ్యదేశాలు ఉన్నాయి. నాటోతో పాటు అమెరికా మిత్రపక్షాలైన ఆస్ట్రేలియా, జపాన్‌, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్‌, న్యూజిలాండ్‌ల కలయికతో ఏర్పాటైందే ‘నాటో ప్లస్‌’. అంతర్జాతీయంగా రక్షణ సహకారాన్ని పెంచుకోవడం దీని ప్రధాన లక్ష్యం. నాటో ప్లస్‌లో భారత్‌ ఉండాలని అమెరికా దీర్ఘకాలంగా కోరుకుంటోంది. ఈ కూటమిలో చేరడం వల్ల భారత్‌కు కొన్ని ప్రయోజనాలు చేకూరతాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా సైనికపరమైన అండదండలు పెరుగుతాయి. అమెరికా సహా కూటమిలోని సభ్యదేశాల నుంచి అత్యాధునిక సైనిక సాంకేతికతల బదిలీ సులభమవుతుంది. సభ్యదేశాల నుంచి నిఘా సమాచార మార్పిడి వేగవంతమవుతుంది. అయితే, నాటో ప్లస్‌లో చేరికకు దిల్లీ ఎన్నడూ ఉత్సుకత ప్రదర్శించలేదు. అందులో చేరితే ఇండియా వ్యూహాత్మక స్వతంత్రత దెబ్బతినే ప్రమాదముంది. ఇన్నేళ్లుగా అనుసరిస్తున్న అలీన విధానానికి తెరపడుతుంది. రష్యాతో ఉన్న పటిష్ఠ బంధం బీటలువారుతుంది. రక్షణ రంగంలో మాస్కోపై దిల్లీ ఆధారపడకూడదని, వాటి మధ్య దూరం పెరగాలని వాషింగ్టన్‌ బలంగా కోరుకొంటోంది. నాటో ప్లస్‌లో ఇండియా చేరితే ఆ లక్ష్యం నెరవేరినట్లవుతుంది. అందులో భాగస్వామిగా ఉంటే అమెరికా చేతిలో పావులా ఇండియా మారాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పైగా సొంత ప్రయోజనాలను పక్కనపెట్టి కొన్ని ఘర్షణల్లో తలదూర్చాల్సి వస్తుంది. నాటో వంటి కూటముల్లో వాషింగ్టన్‌ గుత్తాధిపత్యం తమకు ఇబ్బందికరంగా మారుతుండటంపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలను దిల్లీ విస్మరించకూడదు. ఇప్పటివరకు భారత గడ్డపై విదేశీ సైనిక స్థావరమేదీ లేదు. నాటో ప్లస్‌లో చేరితే అమెరికా ఇక్కడ తన స్థావరాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ సంక్షోభం వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఇప్పటిలా భారత్‌ స్వతంత్ర విధానాలను అనుసరించలేదు. చైనాతో సంబంధాల విషయంలోనూ స్వతంత్రతను కోల్పోవాల్సి వస్తుంది.

నాటో ప్లస్‌లో చేరకపోయినా వాషింగ్టన్‌తో ఇండియా రక్షణ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉంది. బలమైన సైనికశక్తి ఇండియా సొంతం. ఇండో-పసిఫిక్‌, ఆసియాల్లో బీజింగ్‌కు ఎదురు నిలవాలంటే దిల్లీతో మైత్రి తమకు అత్యంత ఆవశ్యకమని వాషింగ్టన్‌కు ఇప్పటికే బోధపడింది. అందుకే మనతో మైత్రిని బలోపేతం చేసుకోవడానికి అమెరికా ప్రాధాన్యమిస్తోంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాలకు వెన్నెముకలాంటి ‘ఇనీషియేటివ్‌ ఆన్‌ క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌’పై ఇరు దేశాలు ఈ ఏడాది ఆరంభంలో సంతకాలు చేశాయి.

ఉమ్మడి పరిశోధనలు

అమెరికా నుంచి భారత్‌కు అత్యాధునిక సాంకేతికతల విక్రయాన్ని త్వరితగతిన అనుమతించేలా 2018లో ఒప్పందం కుదిరింది. రాబోయే కొన్నేళ్లపాటు రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించుకునేలా ప్రతిష్ఠాత్మక కార్యాచరణను ఈ నెలలోనే ఖరారు చేసుకున్నాయి. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతికతల ఆవిష్కరణల దిశగా సంయుక్త పరిశోధనలు, ఉమ్మడి ఉత్పత్తి ప్రక్రియలు ఊపందుకొనేందుకు అది మార్గం సుగమం చేయనుంది. రెండు వారాల్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళనున్నారు. తేజస్‌ ఎంకే-2 యుద్ధవిమానాల కోసం జనరల్‌ ఎలెక్ట్రిక్‌ సంస్థ నుంచి సాంకేతికత బదిలీ ద్వారా ఇండియాలోనే ఇంజిన్ల ఉత్పత్తి, 300కోట్ల డాలర్ల వ్యయంతో అమెరికా నుంచి ఎంక్యూ-9బి సాయుధ డ్రోన్ల కొనుగోలు వంటి కీలక ఒప్పందాలను ఈ పర్యటన సందర్భంగా ప్రకటించే అవకాశాలున్నాయి. నాటో ప్లస్‌లో చేరకున్నా, దిల్లీని అమెరికా విస్మరించబోదని చెప్పేందుకు ఈ పరిణామాలే నిదర్శనాలు.

- మండ నవీన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆర్థిక వృద్ధికి ఉపాధి మంత్రం

‣ వృత్తి విద్యకు ఒకేషనల్‌ కోర్సులు

‣ డిప్లొమాతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు

‣ నేర దర్యాప్తులో కీలకం.. క్రిమినాలజీ

Posted Date: 23-06-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం