• facebook
  • whatsapp
  • telegram

వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలే కీలకం

ఐఎస్‌ఎం వైస్‌ రెక్టార్‌ డాక్టర్‌ ఫణిభూషణ్‌

నీట్‌లో మెరుగైన ర్యాంకు రాని ఎందరో విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంబీబీఎస్‌ విద్య కోసం ఏటా విదేశాలకు వెళుతున్నారు. అయితే జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) 2021 నవంబర్‌ 18న విడుదల చేసిన గెజిట్‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటి మూలంగా ఇప్పటికే విదేశాల్లో చదువుతున్నవారిలో, కొత్తగా ప్రణాళిక వేసుకుంటున్నవారిలో కొంత అనిశ్చితి, గందరగోళం ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కిర్గిస్తాన్‌లోని ఇంటర్నేషనల్‌ హైయర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (ఐఎస్‌ఎం) యూనివర్సిటీ వైస్‌ రెక్టార్‌ డాక్టర్‌ ఫణిభూషణ్‌ హైదరాబాద్‌ వచ్చారు. ఆయన తెలుగువారే. విదేశీ వైద్యవిద్య.. ఎన్‌ఎంసీ నిబంధనల గురించి ఆయనతో ‘చదువు’ ముఖాముఖీ..  

విదేశాల్లో వైద్యవిద్యను చదవాలనుకునేవారికి ఎన్‌ఎంసీ నిబంధనలు అనుకూలమైనవేనా?  

ఈ నిబంధనలు వైద్య విద్య ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ప్రవేశపెట్టినవే. వీటికి అనుగుణంగా నిబంధనల మార్పు కొన్ని దేశాల వైద్యవిశ్వవిద్యాలయాల్లో ఇంకా జరగలేదన్నది వాస్తవం. కిర్గిజ్‌లోని భారతీయ ఎంబసీ మన దేశ వైద్యవిద్యలో జరుగుతున్న మార్పుల్ని కిర్గిజ్‌ ప్రభుత్వానికీ, ఆరోగ్యశాఖకూ ఎప్పటికప్పుడు తెలియజేస్తూవుండటం వల్ల వెంటనే అవి అమలవుతున్నాయి. 54 నెలల వ్యవధిని మించి మెడిసిన్‌ కోర్సు, 12 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌.. దాంతో పాటు కిర్గిస్తాన్‌లో ప్రాక్టీస్‌ చేసుకోవడానికి వీలుగా లోకల్‌ రిజిస్ట్రేషన్‌ తు.చ. తప్పకుండా మా విద్యా సంస్థ అందిస్తోంది. క్లినికల్‌ బేస్‌డ్‌ ఇంటర్న్‌షిప్‌ చేసుకోవడానికి అనుమతి ఉన్న ఆస్పత్రుల జాబితాలో మా ఇంటర్నేషనల్‌ హైయర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (ఐఎస్‌ఎం) అనుబంధ హాస్పిటల్స్‌ నాలుగు ఉన్నాయి. వాటితో పాటుగా 17 నేషనల్‌ హాస్పిటల్స్‌ కూడా క్లినికల్‌ రొటేషన్‌ ఇంటర్న్‌షిప్‌ చేసుకోవచ్చు. 

ఐఎస్‌ఎం యూనివర్శిటీలో 60-70 శాతం మంది భారతీయ విద్యార్థులే. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా 200 మందికి తగ్గడం లేదు. బహుశా.. నేను వైస్‌ రెక్టార్‌ హోదాలో ఉండడం వల్లనేమో. విద్యాసంస్థలో ఇంటర్నేషనల్‌ ఎక్స్‌పోజర్‌ కావాలి కనుక అంతకు మించి విద్యార్థుల సంఖ్యను మేము అంగీకరించడం లేదు. 

విదేశీ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాల లోపంపై అభియోగాలున్నాయి..

తర దేశాల గురించి చెప్పలేను కానీ.. కిర్గిస్తాన్‌లో ఆ ఇబ్బంది లేదు. ప్రాక్టికల్స్‌ నేషనల్‌ హాస్పిటల్స్‌లోనే జరుగుతాయి. అక్కడ పేషెంట్లకు కొరత ఉండదు. విద్యార్థులకు మృత శరీరాలను చూపడం  పాత పద్ధతి. ఇప్పుడు అంతకంటే అడ్వాన్స్‌డ్‌ సిస్టం అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతోంది. ఎలక్ట్రానిక్‌ అనాటమీ టేబుల్‌లో డెడ్‌ బాడీ ప్రోగ్రామ్‌ మొత్తం ఉంటుంది. రక్తనాళాల లోపల ఏమి జరుగుతుందో, మెదడు లోపలి పొరల్లో ఎలా పనిచేస్తుందో త్రీడీ యానిమేటెడ్‌ రూపంలో చూపిస్తున్నారు. పుస్తకాలతో పాటు టాబ్లెట్, మొబైల్, లాప్‌టాప్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం ఎక్కువైంది. విద్యార్థులు కూడా వీటికే కనెక్ట్‌ అవుతున్నారు. మా విద్యాసంస్థలో అత్యాధునిక సిమ్యులేషన్‌ సెంటర్‌ ఉంది. ఇది సెంట్రల్‌ ఆసియాలోనే అతి పెద్దది. విద్యార్థుల నైపుణ్యం పెరగడానికీ, ఆధునిక పద్ధతుల్లో వైద్య విద్య నేర్చుకోవడానికీ ఈ సెంటర్‌ ఉపయోగపడుతుంది. ఇప్పుడు జాతీయ విద్యా కమిషన్‌ కూడా కాంపిటెన్సీ బేస్డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎంఈ) కరిక్యులమ్‌ను అమలు చేయమంటోంది. ఇదంతా అందులో భాగమే!

విదేశాల్లో చదవాలంటే నీట్‌ స్కోరు తప్పనిసరా? కనీస మార్కుల నిబంధన ఉందా?

భారతీయ విద్యార్థులు ఏ దేశంలో మెడిసిన్‌ చదివినా తిరిగి మాతృదేశంలోనే స్థిరపడాలనుకుంటారు. అలాంటప్పుడు భారత ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అది విద్యార్థుల భవిష్యత్‌ కోసమే. నీట్‌లో పాస్‌ మార్కులు తప్పనిసరి. ఇంటర్‌ బయొలాజికల్‌ సైన్స్‌లో కనీసం 50 శాతం మార్కులూ అవసరమే! పరిమితమైన సీట్లున్నందున మెరిట్‌ ఉన్న విద్యార్థులనే ఎంపిక చేస్తుంటాం. 

ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌ (ఎఫ్‌ఎంజీఈ)లో ఎంతమంది ఉత్తీర్ణులవున్నారు?

ప్రతీ వైద్య విద్యార్థీ ఇండియాలో ఎఫ్‌ఎంజీఈ పాస్‌ కావడం కోసమే మా కృషి! అందుకు క్యాంపస్‌లోనే భారతీయ ఫ్యాకల్టీ మెడికల్‌ సబ్జెక్టులు బోధిస్తున్నారు. ఫలితాల విషయానికొస్తే 60 శాతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నాం.

నెక్స్ట్‌ ఎగ్జామ్‌ పాలసీ వల్ల విదేశాల్లో వైద్య విద్య ప్రభ తగ్గుతుందా?

ప్రభుత్వం ఏ నిబంధన తీసుకువచ్చినా మెరుగైన వైద్య విద్య ద్వారా నాణ్యమైన డాక్టర్లను తయారుచేయడం కోసమే కదా! ఇంతవరకూ విదేశాలో మెడిసిన్‌ చదివేవారు మాత్రమే ఈ పరీక్ష రాస్తున్నారు. అక్కడ ప్రమాణాలు అంతగా లేవన్న కారణంగా ఈ పరీక్ష పెట్టారు. విదేశాల్లో చేరుతున్న విద్యార్థులు దీన్ని సవాలుగా తీసుకొని ఉత్తీర్ణులవుతున్నారు. ఇప్పుడు మన దేశంలో చదివిన విద్యార్థులకు కూడా అర్హత పరీక్ష ప్రవేశపెట్టారు. నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా ఇది మంచి పరిణామమే! 

జాతీయ విద్యా కమిషన్‌ నిర్దేశించిన నిబంధనలు 

1. విదేశాల్లో ఎంబీబీఎస్‌లో చేరేవారు స్థానిక ప్రభుత్వ గుర్తింపు పొందిన ఒకే యూనివర్సిటీలో ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే చదవాలి. 

2. ఆ కోర్సు వ్యవధి కనీసం 54 నెలలు, 12 నెలల ఇంటర్న్‌షిప్‌తో ఉండాలి. 

3. ఎంబీబీఎస్‌ కోర్సు చేసిన తర్వాత విద్యార్థులు నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (NExT) - గతంలో ఎఫ్‌ఎంజీఈ - ఉత్తీర్ణులైతేనే భారతదేశంలో ప్రాక్టీస్‌ చేసుకోగలుగుతారు.     

4. ఏ దేశంలో అందించే ఎంబీబీఎస్‌ డిగ్రీ ఆ దేశంలో అధికారికంగా రిజిస్టరై, సర్టిఫై చేసివుండాలి.  

5. కోర్సు కరిక్యులమ్‌లో అనాటమీ, సైకియాట్రీ, సర్జరీ అండ్‌ అలైడ్, మైక్రో బయాలజీ, పాథాలజీ, ఫిజియాలజీ, డెర్మటాలజీ లాంటి 19 ముఖ్యమైన వైద్య సబ్జెక్టులు తప్పనిసరి. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లర్కు కొలువు సాధనకు ఉమ్మడి వ్యూహం!

‣ కృత్రిమ మేధ ప్రత్యేకతలివిగో!

‣ ఇంటర్వ్యూలో విజయానికి మార్గాలు

‣ క్రీడా శిక్షణ కోర్సుల్లోకి ఆహ్వానం

‣ ఏవియేషన్‌లో.. ఎన్ని ఉద్యోగాలో!

Posted Date : 04-07-2023

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌