• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంటర్వ్యూలో విజయానికి మార్గాలు

తికమక ప్రశ్నలకు దీటైన సమాధానాలు

అభ్యర్థులు చాలా ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. అప్పుడు అడిగే రకరకాల ప్రశ్నలకు ఎంతో మర్యాదగా సమాధానాలూ చెబుతుంటారు. అయితే కొన్ని రకాల ప్రశ్నలు మాత్రం తికమక పెట్టేస్తాయి. ఎలా స్పందించాలో తెలియక ఇబ్బందిపడేలానూ చేస్తాయి. అవేమిటో చూద్దామా..

ఇంటర్వ్యూల్లో సాధారణంగా ‘ఏం చదువుకున్నారు? కోర్సు పూర్తయి ఎంతకాలమైంది? ఉద్యోగానుభవం ఉందా? ఎక్కడ పనిచేశారు? జీతం ఎంత? ఉద్యోగం ఎందుకు మారాలనుకుంటున్నారు? మీ గురించి మీరు చెప్పండి, రాబోయే ఐదేళ్లలో మిమ్మల్ని మీరు ఏ స్థానంలో చూసుకోవాలనుకుంటున్నారు..’ లాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. అప్పుడప్పుడూ కొన్ని ఇబ్బందిపెట్టే ప్రశ్నలూ ఎదురవుతుంటాయి. అలాంటివాటిలో ఒకటే.. ‘మీ బలహీనతలు ఏమిటి?’. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడమంటే పెద్ద సవాలే. ఎందుకంటే.. ఒక పక్క నిజాయతీగా సమాధానం చెప్పాలి. మరోపక్క మీ మీద ప్రతికూల అభిప్రాయం కలగకుండానూ చూసుకోవాలి. అంటే ఈ ప్రశ్నకు ఎంతో జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. ఇలాంటప్పుడు కొన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. 

మీ బలహీనత గురించి చెప్పండి అనగానే.. ‘నేను నలుగురితో కలిసి పనిచేయలేను. ఇతరుల సాయం తీసుకోవడానికి మొహమాటపడతాను. సమయ నిర్వహణ సామర్థ్యం లేదు. ఎదుటివారికి వెంటనే ‘నో’ చెప్పలేను. వృత్తి, వ్యక్తిగత జీవితాలను బ్యాలన్స్‌ చేయలేను. ఆత్మవిశ్వాసం కాస్త తక్కువ. డెడ్‌లైన్ల గురించి ఆలోచిస్తూ విపరీతమైన ఒత్తిడికీ, కుంగుబాటుకూ గురవుతుంటాను’  ఇలా చిట్టా మొత్తం విప్పేయకూడదు. మీ నిజాయతీని నిరూపించుకోవాలనే తాపత్రయంతో ఇలా చెప్పేయడం ఎంతమాత్రం సరి కాదు. మీరు చేయబోయే ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి బలహీనతలు ఉన్నాయో చెబితే సరిపోతుంది. 

కొంతమందయితే ఈ ప్రశ్నకు సమాధానాన్ని దాటవేయాలనీ ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడమూ సరికాదు. అలాగే నాకెలాంటి బలహీనతలూ లేవని ఠక్కున అబద్ధమూ చెప్పకూడదు. వాస్తవంగా మీకున్న బలహీనత గురించే చెప్పాలి. అయితే అదే సమయంలో అది మీరు చేయబోయే ఉద్యోగానికి ఎలాంటి ఆటంకాన్నీ కలిగించదనే హామీనీ ఇవ్వగలగాలి. 

ఆ బలహీనతను అధిగమించడానికి ఇప్పటివరకూ మీరు ఏంచేశారు, ఏం చేయబోతున్నారనే విషయాన్నీ స్పష్టంగా చెప్పాలి. 

‘టైమ్‌ మేనేజ్‌మెంట్‌ సరిగాలేక చాలాసార్లు ఇబ్బందిపడ్డాను. దీన్ని మార్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. అందుకే ముఖ్యమైన పనులను ముందుగా పూర్తిచేస్తున్నాను. డెడ్‌లైన్‌ పెట్టుకుని ఆ టైమ్‌లోపలే పని పూర్తయ్యేలా ప్రయత్నిస్తున్నాను’.. ఇలా బలహీనతను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాల గురించి సానుకూలంగా చెప్పగలగాలి. అంటే చెప్పే సమాధానంలో మీ సానుకూల దృక్పథమే ప్రతిబింబించాలి. 

బలహీనతను అధిగమించే క్రమంలో చాలాసార్లు విఫలమైనట్టుగానూ చెప్పకూడదు. ఎందుకంటే మీ సమాధానంలో ఎక్కడా నిరాశకు తావుండకూడు. మీ స్పందన ఎప్పుడూ సానుకూలంగానే ఉండాలి. అలాగే బలహీనతలను బలాలుగా మార్చుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాల గురించీ వివరించొచ్చు.  

బలహీనత గురించి చెప్పిన తర్వాత మీకుండే ఒకటి, రెండు బలాల గురించీ చెప్పొచ్చు. అవి మీ విధులను సమర్థంగా నిర్వర్తించడానికి ఏ విధంగా తోడ్పడతాయో వివరించొచ్చు. 

అయితే బలాల గురించి చెప్పినప్పుడు మరీ గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా ఉండకూడదు. ‘చాలా కష్టపడి పనిచేస్తాను’, ‘నా దగ్గర పనిచేసే ఉద్యోగులు చిన్న పొరపాటు చేసినా అసలు సహించలేను’ .. ఇలా చెబితే మీ గురించి మీరు పనిగట్టుకుని మరీ ప్రచారం చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కృత్రిమ మేధ ప్రత్యేకతలివిగో!

‣ క్రీడా శిక్షణ కోర్సుల్లోకి ఆహ్వానం

‣ ఏవియేషన్‌లో.. ఎన్ని ఉద్యోగాలో!

‣ పోటీ పరీక్షలకు మార్గదర్శకాలు

‣ సాధారణ డిగ్రీతో సంచలనం

‣ జేఈఈ మేటి ర్యాంకుకు మార్గాలివే!

‣ నాటో ప్లస్‌లో భారత్‌ చేరుతుందా?

Posted Date : 30-06-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.