• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

రూ. 88 లక్షల ప్యాకేజీ సాధించిన వరంగల్‌ నిట్ విద్యార్థి రవిషా
 


విద్యార్థులకు చదివిన టెక్నాలజీలో లోతైన పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్ల భాషపై గట్టి పట్టు లేకపోయినా పెద్ద ఇబ్బంది రాదని చెబుతున్నారు వరంగల్‌ నిట్‌ విద్యార్థి రవిషా. ఇటీవల ఈ విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకున్న ఈయన.. ఏడాదికి రూ.88 లక్షల ప్యాకేజీతో ప్రాంగణ ఎంపికల్లోనే ఓ బహుళజాతి సంస్థలో కొలువు సంపాదించారు. ఇది తనకెలా సాధ్యమైందో తెలుసుకుందామా..



‘మా స్వస్థలం పంజాబ్‌ రాష్ట్రంలోని లూథియానా. నాన్న చిన్నపాటి వ్యాపారి, అమ్మ గృహిణి. నాకో చెల్లి, తమ్ముడు ఉన్నారు. బాగా పేద కుటుంబం. చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద పాఠశాలలు, కళాశాలల్లో ఏమీ చదవలేదు. పదోతరగతిలో 87 శాతం మార్కులొచ్చాయి. 12వ తరగతి పూర్తయ్యాక.. జేఈఈ పరీక్ష కోసం రెండేళ్లపాటు ఇంట్లోనే ఉండి సొంతంగా సన్నద్ధమయ్యా. అదేసమయంలో నాన్నకు మా ముగ్గుర్నీ చదివించడం భారం కావడంతో ఉన్న కొద్దిపాటి స్థలం అమ్మేశారు. అప్పుడే అనుకున్నా ఎలా అయినా ఈసారి మంచి కళాశాలలో సీటు సంపాదించాలని. నా ఆశను నిజం చేస్తూ జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకుతో వరంగల్‌ నిట్లో ఈసీఈ బ్రాంచ్‌ సీటు దొరికింది.


   స్థిరమైన లక్ష్యంతో..   


నేను తీసుకున్న బ్రాంచ్‌ ప్రకారం ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్‌ కావాలి. కానీ నేను బీటెక్‌లో చేరిననాటి నుంచి సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నా. అందుకే కోడింగ్‌ బాగా సాధన చేశా. రోజుకు కనీసం ఒకటి, రెండు సమస్యలు పరిష్కరించేవాడిని. మార్కెట్లో ట్రెండింగ్‌ టెక్నాలజీల మీద దృష్టి సారించాను. కంపెనీలు ఫ్రంట్ ఎండ్, బ్యాకెండ్‌లో వాడే టెక్నాలజీల గురించి అవగాహన పెంచుకున్నాను. అదే సమయంలో ‘రియాక్ట్‌’ ప్రోగ్రామింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించా. మంచి జీపీఏ తెచ్చుకునేందుకు ప్రయత్నించాను. సీనియర్ల, అధ్యాపకుల సలహాలూ సూచనలూ తీసుకున్నాను. అలా కొలువుకు కావాల్సిన పరిజ్ఞానాన్ని సంపాదించడంలో సఫలమయ్యాను. 


నిజానికి అత్యధిక ప్యాకేజీలను ఎక్కువగా కొల్లగొట్టేది కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులే. కానీ వారిని వెనక్కి నెట్టి ఈసీఈ చదివిన నేను, ఈ అమెరికన్‌ కంపెనీకి సెలక్ట్‌ అయ్యాను. దీనికి కారణం లోతైన సాంకేతిక పరిజ్ఞానమే.


ప్రాంగణ నియామకాల్లో నాకు మూడు రకాల ఇంటర్వ్యూలు జరిగాయి. మొదట ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ఓటీ) విద్యార్థులను వడబోసేందుకు కోడింగ్‌ గురించి ప్రశ్నలిచ్చారు. ఇందులో ఎంపికయ్యాక మరో రెండు రౌండ్ల ముఖాముఖి ఎదుర్కొన్నా. ఎక్కువగా టెక్నికల్‌ అంశాలపై పరీక్షించారు. హెచ్‌ఆర్‌ రౌండ్లో మాత్రం ‘నాలుగేళ్ల తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు’? అని అడిగితే, ‘నేను ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా నిలవాలనుకుంటున్నా, ఇందుకు ప్రతిరోజూ నా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తా’నని సమాధానం చెప్పా. 


‣ ఇక వేతనం విషయానికొస్తే కంపెనీలు విద్యార్థులను కోడింగ్‌పై ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఆ సమస్యను పరిష్కరించేందుకు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నామో, సమాధానం ఇచ్చామో చూసి తగిన వేతనాలు ఆఫర్‌ చేస్తారని భావిస్తున్నా. భాష విషయంలో ఎప్పుడూ దిగులు చెందాల్సిన అవసరం లేదు. కంపెనీవాళ్లు మనం చెప్పేది వాళ్లకు స్పష్టంగా అర్థమవుతుందా అన్నదే చూస్తారు. ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానం, సమస్యా పరిష్కారంపై ఉన్న పట్టునే పరీక్షిస్తారు. నేను జూనియర్లకు ఇచ్చే సలహా ఒక్కటే. ఎవరో ఏదో చెబితే నమ్మొద్దు. నిరంతరం శ్రమించాలి. మనం పడే కష్టమే మనల్ని అత్యుత్తమంగా నిలుపుతుంది. 


- గుండు పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

‣ క్లర్కు నుంచి కలెక్టర్‌ వరకూ..!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

Posted Date : 15-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం