• facebook
  • twitter
  • whatsapp
  • telegram

క్లర్కు నుంచి కలెక్టర్‌ వరకూ..

ఎన్నో కొలువులకు సాధారణ డిగ్రీ చాలు



ఐఏఎస్, ఐపీఎస్‌.. ఆర్డీవో, ఎమ్మార్వో.. సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌.. సూపర్‌వైజర్, స్టేషన్‌ మాస్టర్‌.. లెఫ్టినెంట్, ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ .. పీవో, ఏవో... ఇవే కాదు- క్లర్కు నుంచి   కలెక్టర్‌ వరకూ ఎన్నో ఉద్యోగాలకు సాధారణ డిగ్రీ సరిపోతుంది. మూడేళ్ల కోర్సులో ఉన్నప్పుడే కెరియర్‌ లక్ష్యాన్నిబట్టి పోటీ పరీక్షల సన్నద్ధత కొనసాగిస్తే డిగ్రీ పట్టా, కలల కొలువూ సొంతమవుతాయి! 


పెద్ద ఉద్యోగాలన్నీ మేటి సంస్థల్లో, అత్యున్నత కోర్సులు చదివితేనే సాధ్యమనే భావన ఎక్కువ మందిలో ఉంటుంది. అసాధారణ తెలివితేటలతోనే విజయం వరిస్తుందని, మేటి ఉద్యోగాలేవీ.. సాధారణ చదువులు, సగటు మార్కులతో దక్కవనే అభిప్రాయమూ చాలామందిలో జీర్ణించుకుపోయింది. అయితే ఇది అపోహ మాత్రమేనని విజేతల ప్రస్థానాన్ని గమనిస్తే తెలుస్తుంది. వారి విజయం వెనుక.. సుప్రసిద్ధ విద్యాసంస్థలు, తెలివితేటల కంటే నిరంతర కృషి, పట్టుదల, సాధించాలనే తపన, ఆశావహ దృక్పథాలే కీలకమని బోధపడుతుంది. 


విద్యార్థులంతా గొప్ప కెరియర్‌లో స్థిరపడాలని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. కానీ ఆచరణలో కొందరే ముందుంటారు. అందువల్ల కెరియర్‌ లక్ష్యం ఏదైనప్పటికీ డిగ్రీ మొదటి ఏడాది నుంచే సన్నద్ధత ప్రారంభం కావాలి. ఇలా చేస్తే కోర్సు పూర్తయిన తర్వాత ఒకటి రెండు ప్రయత్నాల్లోనే విజయబావుటా ఎగరేయవచ్చు. 


చివరి ఏడాదిలోనో, కోర్సు పూర్తయిన తర్వాతో లక్ష్యానికి సంబంధించి నిర్ణయానికి వద్దామనుకుంటే వెనక్కితగ్గినట్లే. ముందస్తు వ్యూహం చాలా అవసరం. స్పష్టమైన కెరియర్‌ లక్ష్యం లేకపోతే భవిష్యత్తులో.. సమ వయస్కులతో కాకుండా జూనియర్లతో పోటీ పడాలి. విలువైన సమయంతోపాటు డబ్బూ ఖర్చవుతుంది. కెరియర్‌ విషయంలో స్పష్టతకు రాలేనివారూ, సందేహాలు ఉన్నవారూ నిపుణుల సహాయం తీసుకోవచ్చు. మీ గురించి బాగా అవగాహన ఉన్నవారిని మెంటర్‌గా భావించి, వాళ్ల పర్యవేక్షణలో ముందుకు సాగవచ్చు. 


   ఆసక్తి ఉంటేనే...  

కెరియర్‌ ఎంపికలో ఆసక్తి, అభిరుచులకు ప్రాధాన్యమివ్వాలి. ప్రావీణ్యం ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. గొప్ప పేరు సొంతమవుతుందని.. ఏ మాత్రం ఆసక్తి లేని ఉద్యోగాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంటే ఆ కొలువు దక్కదు. తరచూ లక్ష్యాలను మార్చుకోవడం వల్ల ఉపయోగమూ ఉండదు. అందువల్ల కనీసం ముప్పై ఏళ్లు ప్రయాణం చేయడానికి సిద్ధపడే వృత్తి/ఉద్యోగాన్ని ఎంచుకోవాలి. అందులో రాణించగలమనే విశ్వాసం ఉన్నప్పుడే విజయానికి తొలి అడుగు పడుతుంది. ముందుగానే స్పష్టమైన నిర్ణయానికి రావడం వల్ల అవసరమైన వనరులు సమకూర్చుకోవడం, సన్నద్ధత సాధ్యమవుతాయి.


  కరిక్యులమ్‌ దాటి...   

పాఠ్యపుస్తకాలు మాత్రమే భవిష్యత్తు ఆశయాలను పూర్తిగా నెరవేర్చలేవు. అందువల్ల ఆ పరిధి దాటి ఎవరికి వారు కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించాలి. యాక్టివ్‌ లెర్నింగ్‌ స్కిల్‌ సెట్‌ ఉండాలి. ఎంచుకున్న కెరియర్‌కు చదువుతోన్న కోర్సుతో సంబంధం లేనప్పుడు అందులో రాణించడానికి కొంత సమయం వెచ్చించాలి. ఉదాహరణకు బ్యాంకు పీవో ఉద్యోగాన్ని సంపాదించాలనుకున్నప్పుడు ఆ పరీక్షల్లో అడిగే ప్రశ్నాంశాల్లో చాలావరకు అకడమిక్‌ పుస్తకాల్లో ఉండవు. విడిగా నేర్చుకోవాలి. సివిల్స్‌/ గ్రూప్స్‌ లాంటి ఆశయాలు ఉన్నప్పుడు చదువుతోన్న డిగ్రీలోని అంశాలు పాక్షికంగానే ఉపయోగపడతాయి. 


పోటీ పరీక్షలకు అవసరమైన ప్రాథమికాంశాలపై డిగ్రీలో ఉన్నప్పుడే దృష్టి సారించాలి. పత్రికా పఠనం, వ్యాసరచన, చర్చల్లో పాల్గొనడం, విస్తృతంగా చదవడం, రాయడం.. అలవాటు చేసుకోవాలి. అందువల్ల లక్ష్యం ఏదైనప్పటికీ అవసరమయ్యే వనరులు గుర్తించి, డిగ్రీతో సమాంతరంగా వాటిని అధ్యయనం చేయాలి. అలాగే చదువుతున్న కోర్సును ఏమాత్రమూ నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఎందుకంటే డిగ్రీ పట్టా లేకుండా ఎంత పరిజ్ఞానం పొందినప్పటికీ అది అక్కరకు రాదు. డిగ్రీ సర్టిఫికెట్‌ పాస్‌పోర్టు అయితే లక్ష్యం వీసా లాంటిది. మొదటిది సొంతమైనప్పుడే రెండోది దక్కుతుంది.  


   ప్రాజెక్టులు   

ఏ కోర్సు విద్యార్థులైనా, కెరియర్‌ ఆశయం ఏదైనా ప్రాజెక్ట్‌ వర్కుకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల ఎంచుకున్న అంశాల్లో అవగాహన పెరుగుతుంది. స్పష్టత, పరిణతి అదనంగా లభిస్తాయి. దీంతో భవిష్యత్తులో ఎలాంటి నివేదికలు రూపొందించడానికైనా విధివిధానాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేయనవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి గతానుభవం దోహదపడుతుంది. 


  వ్యక్తిత్వ వికాసం  

యూజీ విద్యార్థులు చదువుతోపాటు వ్యక్తిత్వ వికాసంపైనా దృష్టి పెట్టాలి. అంతర్లీనంగా ఉన్న బిడియాలను పోగొట్టుకోవాలి. లోపాలను అధిగమించడానికి ప్రయత్నించాలి. సంశయించేవారికీ, సిగ్గుపడేవారికీ అవకాశాలు దూరమవుతాయి. నలుగురిలో మాట్లాడటం మీ ఇబ్బంది అయితే.. బృంద చర్చలు, ఉపన్యాసాలు, వక్తృత్వ 

పోటీల్లో పాల్గొనడం.. లాంటివాటితో నెమ్మదిగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. కళాశాలలో జరిగే కార్యక్రమాల బాధ్యతలు తీసుకోవడం ద్వారా నిర్వహణ, నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు. స్థానిక క్లబ్బుల్లో సభ్యులుగా చేరి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. సందేహాలేమైనా ఉంటే ఫ్యాకల్టీ సభ్యులను అడగడానికి మొహమాటపడకూడదు. కొత్త విషయాలు తెలుసుకోవడానికీ, ఆలోచనలు పంచుకోవడానికీ ఉపాధ్యాయులు బాగా ఉపయోగపడతారు. నచ్చిన గురువుల మార్గదర్శకత్వంలో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చు.  


   ఎక్స్చేంజి ప్రోగ్రాములు  

నిర్ణీత వ్యవధితో ఒక కళాశాల విద్యార్థులు మరో కళాశాలలో చదువుకోవడం ఎక్స్చేంజి ప్రోగ్రాములతో సాధ్యమవుతుంది. ఇలాంటి సౌకర్యాలు కళాశాలలో ఉంటే ఉపయోగించుకోవాలి. కొత్త ప్రాంతాల అనుభవం, కొత్త వ్యక్తుల పరిచయం ఇలాంటి కార్యక్రమాల ద్వారా సాధ్యమవుతాయి. పరిణతి పెరిగి, పరిధి విస్తరిస్తుంది. 


  ఇంటర్న్‌షిప్పులు  

కొన్ని వారాలు లేదా నెలల వ్యవధితో నచ్చిన సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేయడం మంచిది. ముఖ్యంగా కోర్సులు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు ఆశించేవారు ఇంటర్న్‌షిప్‌ల ద్వారా అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు. కళాశాల నుంచి ఈ అవకాశం దక్కనివారు ఇంటర్న్‌షిప్‌ అందించే సంస్థల సహకారంతో ముందడుగేయవచ్చు. ప్రతి వేసవిలోనూ ఇంటర్న్‌షిప్‌ చేయడానికి ప్రయత్నించాలి. కొన్నిసార్లు ఇంటర్న్‌ అందించే సంస్థలోనే ఉద్యోగం పొందవచ్చు.


  వ్యాపకం   

ప్రతి మనిషికీ ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. కొన్నిసార్లు అదే తీరిక లేని వృత్తిగా మారవచ్చు. ప్రతి ఒక్కరూ జీవిత లక్ష్యాలతో సంబంధం లేకుండా ఏదో ఒక వ్యాపకాన్ని పెంచుకోవాలి. ఒత్తిడి నుంచి విముక్తికీ, మానసికోల్లాసానికీ ఇదెంతగానో ఉపయోగపడుతుంది. చిత్రలేఖనం, సంగీతం, రచన, సమాజసేవ... హాబీ ఏదైనా కావచ్చు. స్వీయానుభవాలు, నిత్యపరిశీలనలను బ్లాగ్‌లో రాసుకుంటూ రాత నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు, ఇతరులనూ ప్రభావితం చేయవచ్చు. దేనిపైనా ఆసక్తి లేనివారు విదేశీ భాషను సరదాగా నేర్చుకోవచ్చు. ఏదో ఒక రోజు అదే కొత్త అవకాశాలకు దారి చూపుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ముందు వరుసలో ఉండేలా చేస్తుంది. అందువల్ల ప్రతి మనిషికీ కెరియర్‌ లక్ష్యంతోపాటు ఏదో ఒక వ్యాపకం అవసరం. ఒత్తిడి తగ్గించుకోవడం, ఎలాంటి ఒత్తిడీ లేకుండా నేర్చుకోవడం ఈ రెండూ.. హాబీలతో నెరవేరుతాయి.


   సాంకేతికత   

ఇప్పుడు ప్రతి రంగంలోనూ సాంకేతికత అనివార్యమైంది. అందువల్ల చదువుతోన్న కోర్సులతో సంబంధం లేకుండా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి. సాధారణ డిగ్రీలు చదువుతున్నవారు కంప్యూటర్లకు సంబంధించి ప్రాథమిక అంశాలు నేర్పే డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (డీసీఏ) లేదా పీజీడీసీఏ కోర్సుల్లో చేరవచ్చు. ఆసక్తి ఉన్నవారు కంప్యూటర్‌ లాంగ్వేజ్‌లు, కొత్త సాంకేతికాంశాలనూ అధ్యయనం చేయవచ్చు. వీటిని ఉచితంగా నేర్పడానికి ఆన్‌లైన్‌లో ఎన్నో వేదికలున్నాయి.


  స్వచ్ఛంద సేవ  

కొన్ని సంస్థలు సమాజానికి ఉపయోగపడే పనుల నిమిత్తం వాలంటీర్ల కోసం ఎదురుచూస్తుంటాయి. కుదిరితే వాటిలో చేరడమూ మంచిదే. ఇవి.. వారం, నెల, మూడు నెలల వ్యవధితో ఉంటాయి. ఈ స్వచ్ఛంద సేవతో సంతృప్తి లభించడంతోపాటు, ఆ విభాగంపై అవగాహన పెరుగుతుంది. చేసిన పనికి భవిష్యత్తులో గుర్తింపూ దక్కొచ్చు. ప్రజలతో మమేకమయ్యే ఉద్యోగాలు ఆశించేవారు నచ్చిన విభాగం, అంశంలో వాలంటీర్‌గా పనిచేయటానికి ప్రయత్నించాలి. దీంతో సామాజిక పరిస్థితులపై అవగాహన పెరుగుతుంది. 


  సర్టిఫికేషన్లు  

కార్పొరేట్‌ ఉద్యోగాలు పొందడానికి సర్టిఫికేషన్లే అస్త్రాలు. వీటిని డిగ్రీలో ఉన్నప్పుడే పొందగలగాలి. విద్యార్హతలు, నేపథ్యంతో సంబంధం లేకుండా నచ్చిన కోర్సులను పూర్తిచేసుకునే సౌకర్యం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. వివిధ సంస్థలు నేర్చుకున్న అంశంలో పరీక్ష నిర్వహించి, సర్టిఫికెట్లు అందిస్తున్నాయి. ఇలాంటివన్నీ మెరుగైన కెరియర్‌ నిర్మాణానికి దోహదపడతాయి. 


   కమ్యూనికేషన్‌  

లక్ష్యం ఏదైనప్పటికీ, ఏ రంగంలో భవిష్యత్తు కోరుకున్నప్పటికీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తప్పనిసరి. ఇందుకోసం ప్రధానంగా ఆంగ్లాన్ని అర్థం చేసుకోవడం, స్పష్టంగా రాయడం, తగిన ఉచ్చారణతో మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి. డిగ్రీ ప్రథమ సంవత్సరం నుంచే ఆంగ్ల భాషలో పట్టు సాధించడానికి కృషి చేయాలి. ఇంగ్లిష్‌ వార్తలు వినడం, ఆ భాషలో పుస్తకాలు, వ్యాసాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఎక్కడికీ వెళ్లకుండా ఉచితంగా ఇంగ్లిష్‌ నేర్పే యాప్‌లూ ఉన్నాయిప్పుడు.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

Posted Date : 15-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం