• facebook
  • whatsapp
  • telegram

సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

జాబ్‌ స్కిల్స్‌ 2024    
 


ప్రశ్న!... జ్ఞానానికి గీటురాయి. అవగాహనకు చిహ్నం. చైతన్యానికి ప్రతీక! దీనిలోనే మన విజయావకాశాలు నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే ఐటీ నియామకాల సందర్భంగా తరచూ అడిగే మౌలిక ప్రశ్నలపై దృష్టి సారిద్దాం.  ఐటీ రంగంలో ప్రవేశించాలంటే కంప్యూటర్‌ విజ్ఞానమే పరిచయ పత్రం. తిరుగులేని కోర్సులు చేసినా ఉద్యోగాల దగ్గరకు వచ్చేసరికి ప్రాథమిక అంశాలను దాటాల్సిందే. ఎంట్రీ లెవెల్‌ జాబ్‌లైనా.... ఎగ్జయిటింగ్‌ ప్యాకేజీ అందించే పొజిషన్లయినా ప్రారంభం కావాల్సింది ఇక్కడినుంచే. అందుకే అభ్యర్థుల కనీస నైపుణ్యాలను పరీక్షించేందుకు నియామక అధికారులు ఏ ప్రశ్నలను సంధిస్తుంటారు.



    నిమిషానికి ఎన్ని పదాలు టైప్‌ చేయగలుగుతారు?  


సిస్టమ్‌పై పనిచేస్తున్నప్పుడు టైపింగ్‌ సామర్థ్యం ముఖ్యం. రిసెప్షనిస్ట్, ట్రాన్స్‌స్కైబర్‌ వంటి బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు టైపింగ్‌ వేగం ముఖ్య ప్రాతిపదిక. సాధారణంగా కీబోర్డుపై తగిన అనుభవమున్న టైపిస్ట్‌ నిమిషానికి 65 నుంచి 75 పదాలు టైప్‌ చేయగలుగుతాడు. దీన్ని దృష్టిలో వుంచుకొని అభ్యర్థి టైపింగ్‌ వేగాన్ని తెలుసుకోవాలనుకుంటారు.  


సమాధానం ఇలా ఉండొచ్చు: ‘గతంలో నేను చేసిన ఉద్యోగ బాధ్యతల్లో వేగంగా టైప్‌ చేయడం ఒకటి. అందువల్ల నా టైపింగ్‌ స్పీడ్‌ బాగా పెంచుకోగలిగాను. ఇప్పుడు నిమిషానికి 70 పదాల వరకూ టైప్‌ చేయగలను. నాకు కేటాయించే సిస్టమ్, ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను బట్టి వేగాన్ని ఇంకా మెరుగుపరచుకోగలను’. 


     రోజంతా కంప్యూటర్‌పై పనిచేయగలరా?    


నేటి పని వాతావరణంలో ఏ తరహా పొజిషనయినా సిస్టమ్‌తోనే పని. కొన్ని ఉద్యోగాల్లో ఆఫీసుకి వెళ్లిన దగ్గరినుంచీ కంప్యూటర్‌పైనే పని. పనివేళలు ముగిసేవరకూ అలాగే ఓపిగ్గా సిస్టమ్‌ను అంటిపెట్టుకొని పనిచేయాల్సి రావచ్చు. ఇటువంటి పొజిషన్ల ఎంపికలు చేసేటప్పుడు హెచ్‌.ఆర్‌. అధికారి తప్పక ఈ ప్రశ్న అడుగుతారు.  


సముచితమైన జవాబు: ‘కాలేజీ రోజులనుంచీ డెస్క్‌టాప్‌పై పనిచేయడం అలవాటు. సిస్టమ్‌పై విసుగు లేకుండా పనిచేయడం అలవాటు చేసుకున్నాను. సీటింగ్‌ కాస్త సౌకర్యవంతంగా వుంటే- అప్పుడప్పుడూ శరీరానికి రిలీఫ్‌ ఇస్తూ ఎన్ని గంటలయినా విసుగు లేకుండా పనిచేయగలను’.  


    మైక్రోసాఫ్ట్‌ ఎక్సెల్‌..ఆ తరహా స్ప్రెడ్‌షీట్‌ సాఫ్ట్‌వేర్‌తో పరిచయం ఉందా?   


విభిన్నరకాల ఉద్యోగ బాధ్యతలకు స్ప్రెడ్‌షీట్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగం తప్పనిసరి. ఈ తరహా ఉద్యోగ ప్రకటనలోనే దీన్ని పేర్కొంటారు. ఆపై ఇంటర్వ్యూలో తప్పక ఈ ప్రస్తావన తీసుకొస్తారు. అత్యంత ప్రాథమికమైన ఈ నైపుణ్యంపై ప్రశ్నకు అభ్యర్థి సిద్ధంగా ఉండాలి.  


మెరుగైన జవాబు: ‘అవును. ఎక్సెల్‌ సాఫ్ట్‌వేర్‌పై మూడేళ్లు సేల్స్‌మన్‌ జాబ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. క్లయింట్ల డేటా, ముఖ్య సమాచారాన్ని ఎక్సెల్‌ షీట్లలో భద్రపరచడం నా అలవాటు. సమావేశాల్లో ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు ఇదెంతో దోహదకారిగా నిలిచేది. సేల్స్‌మన్‌గా నా కృషిని తెలిపే గణాంకాలను ఎప్పటికప్పుడు ఎక్సెల్‌ షీట్లలో పొందుపరుస్తూ ఉంటాను’.


    సోషల్‌ మీడియా నిర్వహణలో వృత్తిపరమైన అనుభవం ఉందా?   

21వ శతాబ్దంలో సోషల్‌ మీడియా ప్రభావశీలంగా అవతరించాక కంపెనీలు వీటి నిర్వహణ కోసం వృత్తి నిపుణులను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో ఈతరహా పొజిషన్‌కు దరఖాస్తు చేసినవారిని ఇటువంటి ప్రశ్న అడగవచ్చు.  

మెప్పించే జవాబు: ‘సోషల్‌ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, లింక్‌డిన్‌లపై గత ఉద్యోగంలో పనిచేసిన అనుభవం ఉంది. ఈ వేదికలపై ప్రకటనల రూపకల్పన, ఒరిజినల్‌ కంటెంట్, ప్రకటనల ద్వారా కంపెనీని ముందుకు తీసుకెళ్లే 
పద్ధతులను పాటించాను. గ్రాఫిక్‌ డిజైన్‌పై అవగాహన ఉంది. సంస్థ అమ్మకాలను పెంచేందుకూ, ప్రొడక్ట్‌కు క్రేజ్‌ తీసుకొచ్చేందుకూ అనుసరించాల్సిన వ్యూహాలను నేర్చుకున్నాను’.


    మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ సాఫ్ట్‌వేర్‌లో మీ అనుభవం?   

కంప్యూటర్‌పై పని చేయాల్సిన ఏ పొజిషన్‌ కయినా ఇది ప్రాథమిక ప్రశ్న. ఎంఎస్‌ వర్డ్‌ అప్లికేషన్‌ తెలియకపోతే కంప్యూటర్‌ ప్రపంచంలో అడుగు ముందుకుపడదు. దీనిలో అనుభవం తెలుసుకునేందుకే ఈ ప్రశ్న వేస్తారు. 

సమాధానం: ‘నేను స్కూల్లో ఉన్నప్పుడు పరిచయమైన ఎంఎస్‌ వర్డ్‌ను అప్పటి నుంచి నిత్యం ఏదో ఒక అవసరం కోసం ఉపయోగిస్తూనే ఉన్నాను. కేవలం లెటర్స్, ఇతర సమాచారం టైప్‌ చేసేందుకే కాక ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఛార్టులు, టేబుల్స్‌ రూపకల్పన చేయవచ్చు. ఇంకా ఎక్సెల్‌తో పాటు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్స్‌ అప్లికేషన్స్‌ను కూడా విరివిగా వినియోగిస్తున్నాను’.  


    వెబ్‌సైట్, బ్లాగ్‌ నిర్మాణంలో అనుభవం ఉందా?   

కంపెనీ గురించి జనబాహుళ్యానికి తెలిపేందుకు వెబ్‌సైట్స్, బ్లాగులు కీలకంగా మారిన తరుణంలో ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంది. తీసుకునే పొజిషన్‌ ఏదైనా వీటిపై అవగాహనో, పనిచేసిన అనుభవమో ఉంటే అదనపు ప్రయోజనంగా కంపెనీలు భావిస్తున్నాయి. వెబ్‌సైట్, బ్లాగుల రూపకల్పనకు అవసరమైన హెచ్‌.టి.ఎం.ఎల్‌. లేదా సి.ఎస్‌.ఎస్‌.లపై తగిన అవగాహన ఉందని చెప్పడం ద్వారా ఉద్యోగార్థి తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకోవచ్చు. 

ఇలా స్పందించవచ్చు: ‘బ్లాగ్‌ రైటర్‌గా హెచ్‌టీఎంఎల్‌ టూల్స్‌పై తగిన ప్రాథమిక అవగాహన, అనుభవం నాకున్నాయని చెప్పగలను. నా పూర్వ ఉద్యోగంలో ఈ టూల్స్‌ని ఉపయోగించి వెబ్‌సైట్‌ రూపొందించాను కూడా. వీటిలో అడ్వాన్స్‌ టూల్స్‌ వినియోగంపై శిక్షణ ఇస్తే వేగంగా నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. అలాగే బ్లాగ్స్‌ రూపకల్పన, రచన, నిర్వహణలపై కూడా ప్రాథమిక అవగాహన ఉంది. కంపెనీకి అవసరమైన ఈ బాధ్యతను తగిన శిక్షణతో నిర్వర్తించగలనన్న నమ్మకంతో ఉన్నాను’. 

 
    పీసీ, మ్యాక్‌లలో దేన్ని మీరు ఇష్టపడతారు?  

కంప్యూటర్‌ వినియోగ జగత్తులో వాడుతున్న ఈ రెండు రకాల్లో దేనిపై అభ్యర్థికి అవగాహన ఉందో తెలుసుకునేందుకే ఈ ప్రశ్న. అయితే ఇంటర్వ్యూకు వెళ్లబోయేముందే ఆ కంపెనీ వినియోగిస్తున్నదేదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే రెండింటిపై అనుభవం ఉంటే అదే విషయాన్ని చెప్పవచ్చు. అలాకాక కేవలం పీసీ పైనే అనుభవం ఉంటే దాన్ని చెప్తూ కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంపై ఉత్సుకత ఉందనీ, మ్యాక్‌పై పనిచేయాల్సివస్తే దాన్నీ వేగంగా నేర్చుకుంటాననీ చెప్పవచ్చు. 

మెరుగైన సమాధానం: ‘వాస్తవానికి నాకు పీసీపైనే పనిచేసిన అనుభవం ఎక్కువ. అయితే ఒకసారి అవసరమై మ్యాక్‌ సిస్టమ్‌పై పనిచేసి దాని ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌పై అవగాహన తెచ్చుకున్నా. గ్రాఫిక్స్, విజువల్స్‌కు మ్యాక్‌ వినియోగంలో ఉన్న సదుపాయాలు గ్రహించా. మీ కంపెనీలో మ్యాక్‌ వాడుతున్నట్లు తెలుసుకున్నాను. ఒకవేళ దానిపైనే పనిచేయాలంటే వెంటనే అన్ని టూల్స్‌ వినియోగాన్నీ లోతుగా నేర్చుకుంటాను’.


    మీకు ఏవిధమైన మొబైల్‌ టెక్నాలజీపై వృత్తిపరమైన అనుభవం ఉంది?    

టెక్నాలజీ లోకంలో యాప్స్‌ రారాజుల్లా వెలుగొందుతున్న నేపథ్యంలో మొబైల్‌ సాంకేతిక పరిజ్ఞానంపై అభ్యర్థికి ఉన్న ఆసక్తినీ, అనుభవాన్నీ తెలుసుకునేందుకు ఇలా అడుగుతారు. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారునిగా ఇప్పటివరకు వాడిన యాప్స్‌పై అనుభవాలను తెలుసుకోవాలనుకుంటారు. అభ్యర్థి తనకు పరిచయమున్న యాప్స్‌ను వివరించే ప్రయత్నం చేయాలి. తాను ఆశించే పొజిషన్‌కు వర్తించే యాప్స్‌ను వినియోగించివుంటే ఆ అనుభవం పంచుకోవాలి. 

ఇలా చెప్పవచ్చు: ‘దైనందిన జీవితంలో నాకు ఉపయోగపడే యాప్స్‌ను ఇష్టపడతా. ఉదాహరణకు టైమ్‌ మేనేజ్‌మెంట్‌ యాప్స్‌ను బాగా వినియోగిస్తా. దీనివల్ల రోజంతా ప్రొడక్టివ్‌గా ఉండొచ్చు. ఏపనికి ఎంత సమయం అవసరమో ఈ యాప్‌లో షెడ్యూల్‌ చేసుకుంటా. అలాగే స్టాక్‌ మార్కెట్‌పై నాకున్న ఆసక్తి రీత్యా వివిధ యాప్స్‌ ఫాలో అవుతూ ట్రెండ్స్‌ తెలుసుకుంటూ ఉంటా’.


    కొత్త కంప్యూటర్‌ సిస్టమ్‌ను త్వరగా అలవాటు చేసుకోగలరా?   

కొత్త కంప్యూటర్‌ సిస్టమ్‌పై కూర్చున్నప్పుడు దాని అనుపానులు తెలుసుకునేందుకు శ్రద్ధ, ఓపిక ఉండాలి. ఏకబిగిన గంటల తరబడి అన్ని విషయాలూ నేర్చుకోగలగాలి. తెలియనివి నెట్‌లో వెతికి తెలుసుకోవడం అదనపు ప్రయోజనం. అంతేతప్ప ప్రతి విషయానికీ, అవరోధానికీ చికాకుపడి ‘హార్డ్‌వేర్‌ టెక్నీషియన్‌ కావాలి’, ‘సాఫ్ట్‌వేర్‌ అసిస్టెంట్స్‌ కావాలి’ అంటూ పని ఆపేసేవారిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రశ్న అడుగుతుంటారు. 

మెరుగైన జవాబు: ‘కొత్త సిస్టమ్స్‌ విషయంలో చురుగ్గా ఉంటాను. కొత్తవాటిని నియంత్రణలోకి తీసుకోవడం నాలో ఉత్సాహాన్ని రేపుతుంది. సాధ్యమైనంతవరకు ఏ అవరోధం ఎదురైనా స్వయంగా పరిష్కరించుకుంటా. కొత్త సాఫ్ట్‌వేర్స్‌ గురించి తెలుసుకోవడం, వాటిపై పనిచేయడం ఆసక్తిగా ఉంటుంది. అడోబ్‌ ఫొటోషాప్‌ సాఫ్ట్‌వేర్‌ని యూట్యూబ్‌లో ఫాలో అయ్యి స్వయంగా నేర్చుకున్నా’.


    కంప్యూటర్‌ పరంగా మీరు ఏదైనా సమస్యను పరిష్కరించారా?   

కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు ఏదో ఒక సాంకేతిక సమస్య ఉత్పన్నం కావొచ్చు. వాటి పరిష్కారానికి వేరే విభాగాలు ఉన్నప్పటికీ సిస్టమ్స్‌పై పనిచేసే ఉద్యోగికి కనీస అవగాహన, పరిష్కరించాలన్న ఉత్సాహం ఉండాలని సంస్థలు భావిస్తాయి. అందుకే ఈ తరహా ప్రశ్న. అభ్యర్థి తనకా ఉత్సాహం ఉందంటూ ఒకటి, రెండు ఉదాహరణలు ఇవ్వడం సముచితం. అవి సమస్యను పరిష్కరించడంలో తన చొరవను ప్రతిబింబించేలా చూసుకోవాలి. 


ఆకట్టుకునేలా జవాబు: ‘సిస్టమ్‌ పరంగా, సాఫ్ట్‌వేర్‌ పరంగా ఎదురయ్యే సమస్యల పట్ల నాకు కనీస అవగాహన ఉంది. నా పరిధిలో పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటా. ఈమధ్య హఠాత్తుగా నా సిస్టమ్‌లో ఫైల్స్‌ ఉన్నట్టుండి మాయమయ్యాయి. దీనిపై ఎంతో మథనపడి నేను సభ్యుడిగా ఉన్న వివిధ ప్రొఫెషనల్‌ గ్రూపులను సంప్రదించి కొత్త రకం వైరస్‌ కారణంగా అలా జరిగివుండొచ్చని గుర్తించాను. వెంటనే దానికి తగిన యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టల్‌ చేసుకుని ఫైల్స్‌ను రిట్రీవ్‌ చేసుకోగలిగాను’.


ఇలాంటి ప్రశ్నలు అడిగి, జవాబులు రాబట్టడం వెనుక ఉద్దేశం ప్రధానంగా ఒక్కటే. పని పట్ల శ్రద్ధ, పనిలో సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కరించుకునే దృక్పథం, కొత్త విషయాలు తెలుసుకొని నేర్చుకోవాలన్న జిజ్ఞాస అభ్యర్థిలో ఉన్నాయో లేదోనని పరీక్షించడమే. దీన్ని గ్రహించి ‘విలువైన’ ఉద్యోగిగా రూపొందేందుకు ఏమేం నేర్చుకోవాలో వాటిని సాధన చేస్తూ ఇంటర్వ్యూలో అడిగే ప్రతి ప్రశ్ననూ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనవచ్చు.


- యస్‌.వి. సురేష్, సంపాదకుడు, ఉద్యోగ సోపానం

 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

‣ క్లర్కు నుంచి కలెక్టర్‌ వరకూ..!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

Posted Date: 16-07-2024


 

ఇంటర్వ్యూ