• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌ సన్నద్ధత!

సిలబస్‌, ప్రిపరేషన్‌ వివరాలు

1,056 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులుఎందరో విద్యార్థులు కలలు కనే ఉన్నతస్థాయి పరీక్ష.. సివిల్స్‌. దేశంలోని అత్యుత్తమ సర్వీసుల్లో స్థానం పొందటానికి ఇది వీలు కల్పిస్తుంది. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) - 2024 నోటిఫికేషన్‌ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇటీవలే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సివిల్‌ సర్వీసుల్లోని 1,056 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మీకు ఆసక్తి ఉంటే.. డిగ్రీ అర్హతతో మార్చి 5లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.


ప్రస్తుత నోటిఫికేషన్లో 21 సర్వీసులను ప్రకటించారు. ఎప్పటిలాగానే ప్రిలిమినరీ, మెయిన్, పర్సనాలిటీ టెస్ట్‌ అనే అంచెల్లో ఈ  పరీక్షను నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌ను మే 26న దేశవ్యాప్తంగా 80 కేంద్రాల్లో నిర్వహిస్తారు. 


ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2. ప్రతీ పేపర్‌కు 200 మార్కులు. పేపర్‌-1లో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు. పేపర్‌-2లో 80 ప్రశ్నలు.. ప్రతీ సరైన సమాధానానికీ 2 1/2 మార్కులు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. తప్పు సమాధానానికి  0.33 శాతం మార్కు తగ్గిస్తారు.


ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పేపర్‌-2 అర్హత పరీక్ష మాత్రమే. దీంట్లో కనీసార్హత మార్కులు 33 శాతం అంటే 200లకు 67 సాధిస్తే సరిపోతుంది. ఈ మార్కులు సాధించనివారిని అనర్హులుగా ప్రకటిస్తారు. కటాఫ్‌ మార్కులు దాటితేనే.. పేపర్‌-1ను పరిగణనలోకి తీసుకుంటారు. పేపర్‌-1లో సాధించిన అత్యధిక స్కోరు, రిజర్వేషన్‌ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని మెరిట్‌ లిస్ట్‌ను రూపొందిస్తారు. 


వివిధ సబ్జెక్టుల్లో పునాది స్థాయి నుంచి అధ్యయనం ఆరంభించాలి. సిలబస్‌నూ, పరీక్ష ధోరణనీ అర్థంచేసుకోవాలి.


పేపర్‌-1 సిలబస్‌

1. కరెంట్‌ ఈవెంట్స్‌: జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాముఖ్యమున్నవి.

2. హిస్టరీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ నేషనల్‌ మూవ్‌మెంట్‌

3. జాగ్రఫీ: ఫిజికల్, సోషల్, ఎకనామిక్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ద వరల్డ్‌ 

4. ఇండియన్‌ పాలిటీ అండ్‌ గవర్నెన్స్‌: కాన్‌స్టిట్యూషన్, పొలిటికల్‌ సిస్టమ్, పంచాయతీ రాజ్, పబ్లిక్‌ పాలసీ, రైట్స్‌ ఇష్యూస్‌

5. ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌: సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్, పావర్టీ, ఇన్‌క్లూషన్, డెమోగ్రాఫిక్స్, సోషల్‌ సెక్టర్‌ ఇనీషియేటివ్‌.. మొదలైనవి

6. ఎన్విరాన్‌మెంటల్‌ ఎకాలజీ: బయో డైవర్సిటీ, క్లయిమేట్‌ ఛేంజ్‌ (సబ్జెక్ట్‌ స్పెషలైజేషన్‌ అవసరం లేదు)

7. జనరల్‌ సైన్స్‌: అప్లైడ్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ సైన్స్‌ సిలబస్‌ చాలా జనరల్‌గా ఉంటుంది. ఒక నిర్దిష్ట విభాగం కింద ఏమేం వస్తాయనేది అర్థం చేసుకోవడం కష్టం. అయితే ఈ మార్గాల్లో ప్రయత్నించొచ్చు. 

పరీక్షలో గతంలో వచ్చిన ప్రశ్నలను శ్రద్ధగా గమనించాలి. 

వాటి ఆధారంగా ప్రతి విభాగం నుంచీ ఎన్ని ప్రశ్నలు అడిగే అవకాశముందో ఊహించాలి.

ప్రశ్నల రకాలు: ఆబ్జెక్టివ్‌ విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయని మనందరికీ తెలుసు. ఈ ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాల నుంచి ఒకదాన్ని ఎంచుకోవాలి. లేదా ఎక్కువ సమాధానాలు ఇచ్చి ఎన్ని సరైనవని అడుగుతారు. బహుళ సమాధానాలతో చాలా ప్రశ్నలే ఉంటాయి. 

ప్రతి విభాగం నుంచి ఇచ్చే ప్రశ్నలు: ప్రతి విభాగం నుంచీ ఇన్ని ప్రశ్నలు వస్తాయని చెప్పలేం. అయితే గత కొన్నేళ్ల ప్రశ్నపత్రాలను విశ్లేషించి కొంత ఊహించవచ్చు.


రెండో పేపర్‌కు వ్యూహం

జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2నే ‘సీశాట్‌’ అంటుంటారు. ఈ పేపర్‌లో 80 ప్రశ్నలు ఉంటాయి. 

పేపర్‌-2 (200 మార్కులు) వ్యవధి 2 గంటలు. 

కాంప్రహెన్షన్‌ 

ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌ ఇన్‌క్లూడింగ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ

డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ

బేసిక్‌ న్యూమరసీ (నంబర్స్‌-రిలేషన్‌షిప్స్, ఆర్డర్స్‌ ఆఫ్‌ మ్యాగ్నిట్యూడ్‌). డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ (చార్ట్స్, గ్రాఫ్స్, టేబుల్స్, డేటా సఫిషియన్సీ). పదో తరగతి స్థాయి. 

కొన్ని సంవత్సరాలుగా ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్, డెసిషన్‌ మేకింగ్‌ మీద ప్రశ్నలు అడగలేదు. ఈ ప్రశ్నలకు ఒకటికంటే ఎక్కువ సమాధానాలు ఉంటాయి. అందువల్ల యూపీఎస్సీ ఈ విభాగాల నుంచి ప్రశ్నలు ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారనుకోవచ్చు. 

ఈ పేపర్‌ను అశ్రద్ధ చేయకూడదు. అలాగే తక్కువ అంచనా వేయకూడదు. ఇది అర్హత పరీక్ష. దీంట్లో విఫలమై పరీక్షనుంచి నిష్క్రమించినవాళ్లూ ఉన్నారు. ఈ పేపర్‌లో విఫలమయ్యే విధ్యార్థుల సంఖ్యా పెరుగుతోంది. 

లెక్కలంటే భయం, హ్యుమానిటీస్‌పై ఆసక్తి ఉన్నవారి కంటే.. గణితంపై పట్టు ఉన్నవాళ్లు మంచి మార్కులు సంపాదించగలుగుతారు. పాత ప్రశ్నపత్రాల నుంచి లాజికల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలను సాధన చేసి సామర్థ్యాన్ని సొంతంగా పరీక్షించుకోవాలి. ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగినట్లయితే తర్వాత వారి దృష్టిని కాంప్రహెన్షన్‌ వైపు మళ్లించవచ్చు. 

గణితంలో బలహీనంగా ఉన్నవాళ్లు ఈ పేపర్‌పై మరింత దృష్టి పెట్టాలి. షార్ట్‌కట్‌ టెక్నిక్‌ల గురించి తెలుసుకోవాలి. ఈ ఫ్రశ్నలను నిర్లక్ష్యం చేయడం, సన్నద్ధతను వాయిదా వేయడం లాంటివి చేయకూడదు. 

నేపథ్యం ఏదైనాసరే తప్పనిసరిగా కాంప్రహెన్సివ్‌ టెస్టులను సాధన చేయాలి. వీటిల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించేలా ప్రయత్నించాలి. 

ఈ పేపర్‌ కోసం ముందుగానే సన్నద్ధతను ప్రారంభించాలి. చివరి నిమిషం వరకూ ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఈ పేపర్‌ రాయడానికి అవసరమైన నైపుణ్యాలను రాత్రికి రాత్రే సంపాదించే అవకాశం ఉండదు. సన్నద్ధం కావడం ఎలా? 

సిలబస్‌లో ఉన్న సబ్జెక్టుల్లోని ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవటంపై ముందుగా దృష్టి కేంద్రీకరించాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని చాలామంది అభ్యర్థులకు సిలబస్‌లో పేర్కొన్న అంశాలు కొత్తగానే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువమంది పదో తరగతి తర్వాత ఇంజినీరింగ్‌/ సైన్సెస్‌/ కామర్స్‌ చదివినవాళ్లే ఉంటున్నారు. సిలబస్‌లోని అంశాలన్నీ కొత్తవే కావడం వల్ల.. ప్రాథమిక అంశాలకు సంబంధించి బలమైన పునాదిని నిర్మించుకోవాలి. తర్వాత గత కొన్ని సంవత్సరాల నుంచీ అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ప్రశ్నల శైలి ఎలా మారుతోందో గమనించాలి. ప్రశ్నలు ఎలా అడుగుతున్నదీ అర్థం చేసుకున్నాక ప్రతి విభాగంలోని వర్తమానాంశాలపై దృష్టి పెట్టాలి. 

టైమ్‌టేబుల్‌ను రూపొందించుకోవాలి. మీరు ఇప్పటికే ఈ పని చేసి ఉంటారనుకుందాం. ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి మార్చుకోవాలి. తరచూ చదివే తీరును సమీక్షించుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలి. 

రెండో దశలో ఒక విభాగాన్ని ఎంచుకుని దాని అధ్యయనం పూర్తిచేయాలి. ఉదాహరణకు ఇండియన్‌ పాలిటీ. దీంట్లో పరీక్ష పెట్టుకుని.. స్కోరు చూసుకోవాలి. 75 శాతం కంటే ఎక్కువ మార్కులు వస్తే భరోసాతో ఉండొచ్చు. కొంతకాలం తర్వాత మళ్లీ పరీక్ష పెట్టుకుని ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకోవాలి. తర్వాత కూడా 75 శాతం మార్కులు వచ్చినట్లయితే మరో విభాగం చదువుకోవచ్చు. ఉదాహరణకు ఎకనామిక్స్‌. దీంట్లోనూ స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. అవసరమైన మార్పులూ, చేర్పులూ చేసుకోవాలి. 

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సిలబస్‌లోని విభాగాలన్నీ కవర్‌ అయ్యే గ్రాండ్‌ టెస్టులు రాసుకోవాలి. వీటిల్లో నెగెటివ్‌ మార్కులు తీసేసిన తర్వాత కనీసం 65 శాతం స్కోరు సంపాదించాలి. అభ్యర్థులకు ఇవి తక్కువ మార్కులుగానే కనిపించొచ్చు. కానీ నిలకడగా ఇవే మార్కులు వస్తున్నాయంటే.. మీరు విజయానికి చేరువలో ఉన్నట్టే.  


ప్రిలిమినరీ ఎందుకు భిన్నం?     

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ రాసిన ఏ అభ్యర్థిని అడిగినా ఇది భిన్నంగా ఉందనే చెబుతాడు. పరీక్షలో ఎందుకు విఫలమయ్యారని అడిగితే.. ‘చాలా తక్కువ మార్కుల తేడాతో ఫెయిల్‌ అయ్యాను’ అనే జవాబు వస్తుంది. ఇంతకీ ఈ ప్రశ్నలు అభ్యర్థులకు అనూహ్యంగా ఎలా ఉంటున్నాయి?

ప్రస్తుతమున్న పరీక్ష విధానంలో మూలాలను ఎస్‌.కె. ఖన్నా కమిటీ (2009) రూపొందించింది. జనరల్‌ స్టడీస్‌కు రెండు కామన్‌ పేపర్లు సమాన వెయిటేజీతో ఉండాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. మొదటి పేపర్‌లో జనరల్‌ స్టడీస్, రెండో పేపర్‌లో రీజనింగ్‌ అండ్‌ ఇంగ్లిష్‌ ఉంటాయి. మెరిట్‌ను నిర్ధరించడంలో రెండు పేపర్లలో సాధించిన మార్కులనూ పరిగణనలోకి తీసుకునేవారు. దీన్ని అమలుచేసిన తర్వాత ఇది పట్టణ ప్రాంత ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులకు మాత్రమే ఉపయుక్తంగా ఉందని తేలింది. జనరల్‌ స్టడీస్‌లో బలహీనంగా ఉన్నప్పటికీ.. పేపర్‌-2 బాగా రాసిన విద్యార్థులు పరీక్ష పాసయ్యారు. సివిల్‌ సర్వీసెస్‌ ఉద్దేశాన్నే ఇది దెబ్బతీసింది. విద్యార్థుల నుంచి వ్యతిరేకత ఎదురవటంతో ఈ పేపర్‌ను అర్హత పేపర్‌గా మార్చారు. ఆ విధంగా రెండో పేపర్‌ 2015 నుంచీ అర్హత పేపరైంది. సుమారు 70 శాతం మంది అభ్యర్థులు కనీస మార్కులు సాధించి పేపర్‌-2లో అర్హత సాధిస్తున్నారు. సుమారు 6 లక్షల మంది అభ్యర్థుల నుంచి 10 వేలు - 13 వేలమంది అభ్యర్థులను ఎంపిక చేయడం ఇప్పుడు యూపీఎస్సీ లక్ష్యమైంది. 


1. ఎన్నికలు, పరీక్షల షెడ్యూలు ఒకేసారి ఉండటం వల్ల పరీక్షలు వాయిదా పడుతుందా?

జ: యూపీఎస్సీకి ప్రణాళికకు కట్టుబడి ఉంటుందనే రికార్డు ఉంది. కాబట్టి క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం ముందుగా చెప్పిన సమయానికే పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల మాదిరిగా ఇవి కూడా వాయిదా పడతాయని అనుకోకూడదు. స్థానిక విషయాల ప్రభావం వల్ల రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంటుంది. కొవిడ్‌ లాంటి తీవ్ర అనూహ్య పరిస్థితుల్లో తప్ప.. యూపీఎస్సీ షెడ్యూల్‌ ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. 


2. ఎన్నికల ఏడాది కదా.. ప్రభుత్వ పథకాలపై ఎక్కువ ప్రశ్నలు వస్తాయా?  

జ: జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ చర్చిస్తుంటారు. ఇది విద్యాసంబంధమైన పరీక్ష కావడం వల్ల ఎన్నికలతో పని లేదు. ప్రశ్నపత్రం రూపొందించేవాళ్లు ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రభావితం కావచ్చు. కాబట్టి తార్కికంగా ఆలోచిస్తే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 


3. పేపర్‌-1లోని ప్రశ్నల శైలి మారే అవకాశం ఉందా? 

జ: సాధ్యమైనంత వరకూ అంచనాలకు అందని విధంగా ప్రశ్నపత్రాన్ని ఇవ్వడానికే యూపీఎస్సీ ప్రయత్నిస్తుంది. పేపర్‌-1లో ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. గెస్, ఎలిమినేషన్‌ టెక్నిక్కులేవీ పనిచేయని విధంగా ప్రశ్నలు వస్తాయి. 2022, 2023 సంవత్సరాల్లో ప్రశ్నలు అడిగిన తీరులో ఉన్న వ్యత్యాసమే ఇందుకు ఉదాహరణ. కాబట్టి మార్పునకు అవకాశం ఉంది. కాన్సెప్టుల విషయంలో స్పష్టమైన అవగాహన ఉంటే ఇబ్బందేమీ ఉండదు.  


4. అందుబాటులో ఉన్న సమయం సరిపోతుందా? 

జ: ఈ ప్రశ్నను అభ్యర్థులు ప్రతి సంవత్సరం అడుగుతూనే ఉంటారు. అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి సన్నద్ధతను నిర్వహించటం తప్పనిసరి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Posted Date : 20-02-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు