• facebook
  • whatsapp
  • telegram

ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

జాబ్ స్కిల్స్‌ - 2024 వివరాలుప్రతి సమస్యకూ ఒక సమాధానం ఉంటుంది. ప్రతి సవాలుకూ ఓ పరిష్కారం, ప్రతి అన్వేషణకూ ఒక ముగింపు ఉంటాయి. అలాగే ఉద్యోగ సాధన అసాధ్యమేమీ కాదు. అధిరోహించలేని మేరు పర్వతమో, పరుగెత్తి అందుకోలేనంత సుదూరమో, కనుగొనలేనంత చిదంబర రహస్యమో కూడా కాదు. కేవలం దృష్టి పెట్టి.. గురిపెట్టి బాణం వదలాలంతే. సర్వశక్తులూ కేంద్రీకరించి సత్తువ చూపాలంతే! 


ఇంజినీరింగ్, లైఫ్‌ సైన్సెస్, మేనేజ్‌మెంట్‌.. ఇలా స్ట్రీమ్‌ ఏదైనా ఐటీ, కార్పొరేట్‌ రంగంలో కొలువు కొట్టాలంటే కేవలం 15 మెట్లెక్కితే చాలని తెలిస్తే ఆశ్చర్యపోతారు. కానీ అలవర్చుకోవలసిన నైపుణ్యాలు పదిహేనే. అలా అని ఇవన్నీ బొత్తిగా కొత్తవేమీ కాదు. కొన్ని తెలిసినవి ఉంటాయి. మరికొన్నింటిలో ఇప్పటికే ఆరితేరి ఉండవచ్చు. ఇంకొన్నింటిలో మాత్రం అస్పష్టత ఉండవచ్చు. ఏ కొద్దిపాటివో అసలు తెలిసి ఉండకపోవచ్చు. కానీ అన్నీ ఆకళింపు చేసుకొని ఈ నైపుణ్యాల్లో ‘అందె వేసిన చెయ్యి’ అనిపించుకోవడం అసాధ్యం మాత్రం కాదు.


క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఫ్రెషర్లను ఎంపిక చేసుకునే టెక్నికల్, సాఫ్ట్‌ స్కిల్స్‌ చుట్టూనే ఈ 15 నైపుణ్యాలూ అల్లుకొని ఉంటాయి. ఆశ్చర్యకరంగా అభ్యర్థి సబ్జెక్టు- కోర్‌ డొమైన్‌ స్కిల్స్‌ కాకుండా నేర్చుకోవలసినవన్నీ వ్యక్తిత్వ వికాస పాఠాలే. సంకల్పిస్తే ఎక్కడానికి అనుకూల సోపానాలే!


సొంత సబ్జెక్టులో పునాది

దీన్నే డొమైన్‌ నాలెడ్జ్‌ అంటున్నారు. అభ్యర్థి ఏ సబ్జెక్టునైతే తన అభిరుచి మేరకు ఎంచుకొని ఏళ్ల తరబడి అధ్యయనం చేశాడో- ఆ సబ్జెక్టుపై అతనికి పట్టు ఉండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. చదివిన సబ్జెక్టు నైపుణ్యాలు పుణికి పుచ్చుకున్న అభ్యర్థికి ఉద్యోగం ఇస్తే పని వాతావరణంలో ఇట్టే ఇమిడిపోయి రాణించాలని కంపెనీలు భావిస్తాయి. ఏ డొమైన్‌ ఆధారంగా పనిచేసే కంపెనీలు ఆ సబ్జెక్టు గ్రాడ్యుయేట్‌ లేదా పోస్టు గ్రాడ్యుయేట్‌ని ఎంపిక చేసేందుకు వస్తాయి కాబట్టి ఆ సబ్జెక్టులో మౌలికాంశాలు పటిష్ఠంగా ఉన్నవారినే కోరుకుంటాయి.

ఐటీ కంపెనీలకు కంప్యూటర్స్‌ ఫండమెంటల్స్‌లో మంచి పునాది ఉన్నవారికి ఉద్యోగమిస్తే ఉపకరిస్తారు. మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ రంగంలో సేవలందిస్తున్న కంపెనీలు మేనేజ్‌మెంట్స్‌ స్కిల్స్‌ అలవర్చుకున్న వారికోసం గాలిస్తుంటాయి. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు ఈ సబ్జెక్టుల్లో బలంగా ఉన్నవారినే ఎంపిక చేసుకుంటాయి. అందుకే అభ్యర్థిలో బలమైన డొమైన్‌ పరిజ్ఞానం ఉంటే ప్రాంగణ ఎంపికల్లో తిరుగే ఉండదు. 


కమ్యూనికేషనే వజ్రాయుధం

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు సబ్జెక్టులో చెడుగుడు ఆడే సామర్థ్యం ఉన్నా నోరు విప్పి చెప్పలేకపోతే ప్రయోజనం ఏమిటి? అభ్యర్థి సబ్జెక్టుకు భావ వ్యక్తీకరణ (కమ్యూనికేషన్‌) జత కలిస్తేనే అది శక్తిమంతమైన ఆయుధం అయ్యేది. క్యాంపస్‌ ప్లేస్‌ మెంట్స్‌లో హెచ్‌.ఆర్‌. ఇంటర్వ్యూ నుంచి కంపెనీలో చేరాక ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు సహ ఉద్యోగులతో, తన హోదాకంటే పై స్థాయి ఉద్యోగులతో వ్యవహరించేటప్పుడు వారధిగా నిలిచేది కమ్యూనికేషనే. ఈ నైపుణ్యం ఎంత బలంగా ఉంటే.. అంత భిన్నంగా, ప్రత్యేకంగా మిగతావారి నుంచి అభ్యర్థిని వేరుచేసి నిలబెడుతుంది.

కంపెనీల్లో రాణింపజేసేది మౌఖిక వ్యక్తీకరణతో పాటు రాతపూర్వక వ్యక్తీకరణ. ఇది శక్తిమంతమైన సాధనంగా నిలుస్తుంది. కార్పొరేట్‌ వర్క్‌ కల్చర్‌లో డిజిటల్‌ కమ్యూనికేషన్‌ అనివార్యం. ఉద్యోగి తనకు అప్పగించిన పని, తను పూర్తి చేయగలిగిన పని, తనకు పనిలో ఎదురైన సవాళ్లు, అందుకు తాను సూచిస్తున్న పరిష్కార మార్గాలు, తన తర్వాత మళ్లీ అదే తరహాలో పనిచేసేవారికి తాను అందించే సులభతర మార్గాలు పొందుపరుస్తూ మెయిల్‌ పంపితే.. అటువంటి అభ్యర్థి కమ్యూనికేషన్‌ స్కిల్‌ని కంపెనీ గుర్తించకుండా ఉంటుందా? నిజానికి కంపెనీలకు కావలసింది ఇలాంటి కమ్యూనికేషన్‌ ఉన్నవారే.


బృంద గానం విజయద్వారం

ఫ్రెషర్లు కంపెనీలోకి ప్రవేశించాక ఏదో ఒక బృందంలో పనిచేయాల్సి ఉంటుంది. బృందంలో సభ్యుడిగా రాణించడమే టీమ్‌వర్క్‌ స్ఫూర్తికి సంకేతం. ఉద్యోగి వ్యక్తిగత నైపుణ్యాలు వర్థిల్లాలంటే బృంద లక్ష్యాల్లో భాగస్వాములవ్వాలి. కంపెనీ ప్రతి టీమ్‌కి పనిరీత్యా ఒకటో, అంతకుమించో వివిధ లక్ష్యాలను నిర్దేశిస్తుంది. వాటిని అందుకునేందుకు బృంద సభ్యునిగా పూర్తి సామర్థ్యంతో సహకారం అందించాలి. బృంద సభ్యులపట్ల తమ ఇష్టాయిష్టాలను పక్కన పెట్టాలి. టీమ్‌లో ఎవరెంత పని చేస్తున్నారన్న తులాభారం వేస్తూ సభ్యుల పరిమితులనూ గౌరవించాలి. కంపెనీ నిర్దేశించిన బృంద లక్ష్యాన్ని ప్రతి సభ్యుడూ తన లక్ష్యంగా మార్చుకోవాలే తప్ప వ్యక్తిగత లక్ష్యాలతో పనిచేయకూడదు. ఈ విధమైన బృంద నైపుణ్యం.. తీసుకోబోయే అభ్యర్థిలో ఉందో లేదో కంపెనీ హెచ్‌.ఆర్‌. అధికారులు పరిశీలిస్తారు. 


ఇట్టే ఇమిడిపోయే మనస్తత్వం

నదీ- సాగర సంగమ ప్రదేశాన్ని ఎప్పుడైనా గమనించారా? ఎక్కడెక్కడో ప్రయాణించి, కొండలు, గుట్టలు అడవులు దాటి వచ్చిన నదిని ఏ అరమరికలూ లేకుండా సాగరం స్వాగతిస్తుంది. నది నిశ్శబ్దంగా, నిర్మలంగా సాగరంలో విలీనమవుతుంది.

చేర్చుకునే అభ్యర్థులు కంపెనీకి ప్రయోజనం కలిగించే ఏ మార్పునైనా స్వాగతించేట్టుండాలే తప్ప నిరోధించేవారు కాకూడదు. కంపెనీకి ఏది మేలు చేస్తుందో పైస్థాయి యాజమాన్యం నిర్ణయిస్తే దాన్ని అనుసరించేందుకు ఉద్యోగులు సదా సిద్ధంగా ఉండాలి. సాంకేతికపరంగా వచ్చే ఏమార్పునయినా ఉద్యోగి ఆకళింపు చేసుకొని ఆహ్వానించగలగాలి. ఈ నైపుణ్యమే ‘అడాప్టబిలిటీ’. ఇది లేని ఉద్యోగులు కంపెనీకి భారమవుతారు. అందుకే సెలక్షన్స్‌ సమయంలోనే ఈ స్కిల్‌ అభ్యర్థిలో ఉందా? లేదా? అన్నది గుర్తించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. 

ఈ నైపుణ్యం అలవర్చుకోలేనంత కష్టమైనదేమీ కాదు. సాధారణంగా కొత్త మార్పును ఎందుకు నిరోధిస్తారు? ప్రస్తుతం తాము వాడుతున్న టెక్నాలజీతో సౌకర్యవంతంగా ఉన్నందున (కంఫర్ట్‌ జోన్‌) మరో కొత్తది నేర్చుకోవాలంటే మళ్లీ శ్రమపడాలన్నదే నిరోధించడానికి వెనుక ఉన్న ప్రధాన కారణం. అయితే యాజమాన్యం అమలు చేస్తున్న టెక్నాలజీని ఆపే శక్తి ఉద్యోగికి ఉందా? అంటే ‘లేదు’ అన్నదే సమాధానం. అలాంటప్పుడు నేర్చుకోవడం తప్ప మరో మార్గం లేదు. కాబట్టి కొత్తదాన్ని స్వాగతించి సాధనకు సిద్ధపడితే అడాప్టబిలిటీ స్కిల్‌ సొంతం చేసుకోవచ్చు.


ఇష్టంగా.. కస్టమర్‌ సర్వీస్‌

ఏ కస్టమరూ సాధారణంగా ఫ్రెషర్‌కు నేరుగా కనిపించరు. అయితే ‘కస్టమర్ల కారణంగానే కంపెనీలు నిలబడతాయి, ఉద్యోగాలు ఇవ్వగలుగుతా’యన్న స్పృహ తాజా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. వినియోగదారుల అవసరాలే సంస్థల లక్ష్యాలు అవుతాయన్న అవగాహనతో ఆ దిశగా శక్తివంచన లేకుండా కృషి చేయాలి. కంపెనీ సేవలు వినియోగించుకునే కస్టమర్లను బాహ్య కస్టమర్లుగా, కంపెనీలో ఒక విభాగం, మరో విభాగం మధ్య జరిగే సేవలను వినియోగించుకునేవారిని అంతర్గత కస్టమర్లుగా పరిగణిస్తారు. ఏదైనా సరే- ఒక ఉద్యోగి సేవలు ఎవరికి ఉపయోగపడుతున్నాయో వారిని కస్టమర్‌గా భావించి వారిని నాణ్యతతో తృప్తి కలిగించేందుకు కృషి చేయగలిగితే ఆ ఉద్యోగి కస్టమర్‌ సర్వీస్‌ పట్ల అవగాహన ఉన్నట్లుగా కంపెనీలు భావిస్తాయి. 


నాయకత్వ పరిమళాలు

ఎల్లకాలం బృందంలో ఒకరిగా పనిచేయడమే కాదు, భవిష్యత్తులో టీమ్‌ లీదర్‌గా ఎదగగల సామర్థ్యం ఫ్రెషర్లలో ఉంటే కంపెనీలు అటువంటివారిని ఎగరేసుకుపోతాయి. బృంద లక్ష్యాలను త్వరగా ఆకళింపు చేసుకోవడం, వాటి సాధనకు వేగంగా పనిచేయడం, అవసరమైతే కాస్త ఎక్కువ సమయం పనిచేయడం, మధ్యలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్లగలిగే చొరవ, బృందంలో తన పని తాను చేసుకుపోవడమే కాకుండా, వెనుకబడుతున్న సభ్యులను గుర్తించి వారికి చేయూత ఇవ్వడం, ప్రభావవంతమైన భావవ్యక్తీకరణ.. ఇవన్నీ ఉన్నవారిని కంపెనీలు గుర్తిస్తాయి. వారిలోని నాయకత్వ లక్షణాలు మరింత వికసించేలా ప్రోత్సహిస్తాయి. ఈ దిశగా శ్రమించిన వారికి కంపెనీలు పెద్దపెద్ద ప్రాజెక్టులు అప్పగించేందుకు వెనుకాడవు.


ఇప్పటివరకు కార్పొరేట్, ఐటీ ఉద్యోగ సాధనలో ఆరు మెట్లు ఎక్కాం. మరో తొమ్మిది మెట్లెక్కితే కోరుకున్న కెరియర్‌ ఎదురొచ్చి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటుంది. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Posted Date: 07-02-2024


 

ఇతరాలు

మరిన్ని