• facebook
  • whatsapp
  • telegram

స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

ఐటీ కెరియర్‌ సక్సెస్‌కు సూచనలు



ప్రాంగణ నియామకాల్లో ఎంపిక కాని చాలా మంది విద్యార్థులకు ప్లాన్‌-బి.. స్టార్టప్‌ సంస్థలు! ఉన్నత శ్రేణి కంపెనీల కంటే ఇవి అభ్యర్థుల నుంచి ఆశించే అంశాలు కాస్త విభిన్నంగా ఉంటాయి. అవేంటో ఒకసారి పరిశీలిస్తే..


గత ఏడాదితో పోలిస్తే ఈసారి అంతగా ప్రాంగణ ఎంపికలు జరగలేదనే గణాంకాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఇవి చూసి అభ్యర్థుల్లో అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆశలు మరీ అడుగంటుతున్నాయి. అయితే అంత కంగారు అవసరమా అంటే.. లేదని అంటున్నారు నిపుణులు. జాబ్‌ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు మామూలే. భారీ సంస్థలు ఎంపికలు తగ్గించినప్పుడు స్టార్టప్‌లలో ప్రయత్నించడం ఒక ముఖ్యమైన ఎత్తుగడగా వారు చెబుతున్నారు. మరి ఇందుకు ఏం చేయాలో.. ఈ సంస్థల్లో ఉద్యోగ ప్రయాణం ఎలా మొదలుపెట్టొచ్చో చూసేద్దాం. 


భారత్‌లో స్టార్టప్‌ల వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే వీటి వ్యాపారం బిలియన్లలోకి చేరుకుంది. నిజానికి మిగతా దేశాలతో పోలిస్తే మనవద్ద వీటి ప్రాధాన్యం సైతం అధికం. వీటి పనితీరు గురించి లోతుగా అధ్యయనం చేయడం ద్వారా ఇందులో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.


కొందరు అభ్యర్థులు ఉన్నతశ్రేణి సంస్థల్లో పెద్ద ఉద్యోగాలు చేయడం కంటే అంకుర సంస్థల్లో సాధారణ వేతనాలకు పనిచేయడాన్నే ఎంచుకుంటున్నారు. దీనికో ప్రత్యేక కారణం ఉంది. స్టార్టప్స్‌లో అయితే ఒక సంస్థను ఆది నుంచి ఎలా నిర్మించాలి అనేది నేరుగా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఎటువంటి రిసోర్సు లేని చోట మార్కెట్‌లోకి చొచ్చుకెళ్లడం,  సమస్యలను పరిష్కరించడం.. ఇవన్నీ నేరుగా తెలుస్తాయి. భవిష్యత్తులో తాము సొంతంగా ఏదైనా సంస్థను ప్రారంభిస్తే ఈ అనుభవం పనికొస్తుందని వీరు భావిస్తున్నారు.


స్టార్టప్‌లలో ఉద్యోగాన్ని వెతికేటప్పుడు ఈ కింది అంశాలను పాటించవచ్చు.  

నచ్చిన కంపెనీల జాబితా తయారుచేయడం - ఇందులో నచ్చిన రంగం, ఎంచుకున్న ఉద్యోగం, ఏ స్థాయిలో చేరాలి అనుకుంటున్నారు.. ఇలా అన్నీ ఆలోచించి రాసుకోవాలి. లింక్డిన్‌ వంటి నమ్మికైన సైట్ల ద్వారా ఈ కంపెనీల వివరాలు తెలుసుకోవచ్చు.సెర్చ్‌ చేయడానికి ముందు ‘స్టార్టప్‌’ అని చేర్చడం ద్వారా వీటి గురించిన వివరాలు లభిస్తాయి. ఇప్పటికే ఇటువంటి సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారిని ఎవరినైనా సంప్రదించడం, మీ గురించి కంపెనీలు, యూనివర్సిటీకి తెలియజేయడం ద్వారా కూడా ప్రయత్నాలు కొనసాగించవచ్చు. కొన్నిసార్లు ఆ స్టార్టప్‌ సంస్థకు మనకు తగిన ఉద్యోగ ఖాళీ లేకపోయినా.. ప్రొఫైల్‌ నచ్చితే మన కోసం ప్రత్యేకంగా సృష్టిస్తారు కూడా. అటువంటి వాటికీ ప్రయత్నించవచ్చు. 

జాబ్‌ - స్టాటస్‌ ట్రాకర్‌ తయారీ: గుర్తించిన కంపెనీల వివరాలు, అందులో ఉద్యోగాలు, కంపెనీ స్థాయి, ఇంటర్వ్యూ విధానం, ఎంపిక ప్రక్రియ, మిగిలిన వివరాలు.. ఇవన్నీ ఎప్పటికప్పుడు చూసుకునేలా ఎక్సెల్, వేరే ఇతర ఫార్మాట్‌లో అయినా దగ్గర ఉంచుకోవాలి. కుదిరితే రిఫరల్స్‌ ఏవైనా దొరుకు తాయేమో ప్రయత్నించాలి. 

స్టార్టప్‌ ఈవెంట్స్‌: కొన్ని ప్రధాన నగరాల్లో స్టార్టప్‌ సంస్థలు హబ్‌లుగా ఏర్పడి ఈవెంట్లు నిర్వహిస్తుంటాయి. వీటికి హాజరయితే పరిచయాలు పెరుగుతాయి. తద్వారా రిఫరెన్సులను పెంచుకుని అవకాశాలను వేగంగా అందుకోవచ్చు.


ఆశించేది ఏమిటి?

ఇప్పటికే వేళ్లూనుకున్న సంస్థలతో పోలిస్తే.. స్టార్టప్‌లు అభ్యర్థుల ఆశించే నైపుణ్యాలు, విధానాలు విభిన్నంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందామా.. 

1. అడాప్టబిలిటీ: స్టార్టప్స్‌లో వ్యాపారం తీరు, ఎదిగే విధానం ఒకే తీరుగా ఉండదు. అత్యధిక స్థాయిలో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. ఇటువంటి వాటికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా కంపెనీతో ఉంటూ, స్థిరమైన మనోబలంతో నిలబడేవారు కావాలి. అలాంటి వారి కోసం సంస్థలు వెతుకుతుంటాయి. కొత్త వాతావరణానికి - పనులకు వేగంగా అలవాటుపడటం, విభిన్నమైన పాత్రల్లో పనిచేయగలగడం, వివిధ టాస్కులను సమయానికి పూర్తి చేయడం, నేర్చుకోవడానికి, మార్పునకు సిద్ధంగా ఉండటం.. ఇవన్నీ ఆశిస్తాయి.

2. ఆంత్రప్రెన్యూరల్‌ ఆలోచనాధోరణి: స్టార్టప్‌లు ప్రధానంగా నడిచేదే ఆవిష్కరణ, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అనే రెండు చక్రాల మీదే! ఇందుకోసం ఇవి సృజనాత్మకత, సమస్యా పరిష్కార నైపుణ్యాలు, ప్రొయాక్టివ్‌ ఆటిట్యూడ్, రిస్కులు తీసుకునే ధైర్యం, తమ విధివిధానాలు - ఆలోచనలతో ప్రభావం చూపగలిగే బలమైన వ్యక్తిత్వం ఉన్న వారి పట్ల ఆసక్తి చూపుతాయి.

3. కొలాబరేషన్‌ - టీమ్‌వర్క్‌: స్టార్టప్‌లు తమ లక్ష్యాలను చేరుకునేందుకు బృందంగా పనిచేయడం తప్పనిసరి. క్రాస్‌ ఫంక్షనల్‌ టీమ్స్‌లో పనిచేయగలగడం, ఏ విషయాన్ని అయినా చక్కగా సంభాషించగలగడం, ఒకరితో ఒకరు కలిసి పనిచేసే సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించే వారిని కోరుకుంటాయి. టీమ్‌ ప్లేయర్‌గా ఉంటూనే బలమైన ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌ ఉన్న వారిని ఈ కంపెనీలు ఎంచుకుంటాయి.

4. వేగంగా అధిగమించడం: స్టార్టప్‌లు తరచూ వివిధ రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాయి. వీటికి త్వరితగతిన పరిష్కారాలు వెతకడంతోపాటు పాజిటివ్‌ ఆలోచనాధోరణితో ఉండటం, ఆ ఇబ్బందుల ప్రభావం నుంచి వీలైనంత త్వరగా బయటపడటం.. గ్రోత్‌ మైండ్‌సెట్‌ కలిగి ఉండటం.. సవాళ్లు ఎదురయ్యే సమయాల్లో బలంగా నిలబడటం.. ఇవన్నీ ఇందులో చేరే అభ్యర్థులకు ఉండాల్సిన లక్షణాలు.

5. లక్ష్యం: ఈ సంస్థలు సాధారణంగా స్థిరమైన లక్ష్యం, విజన్‌తో నడుస్తుంటాయి. వాటి అంతిమ లక్ష్యం పట్ల నిబద్ధత ఉన్న వారిని ఎంచుకోవడానికి ఇష్టపడతాయి. కుతూహలం, స్పష్టమైన ఆసక్తి, నిరంతరం నేర్చుకునే మనస్తత్వం ఉన్న అభ్యర్థులు ఇతరుల కంటే మెరుగ్గా ఈ అవకాశాలు అందుకోగలరు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Posted Date: 06-02-2024


 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం