• facebook
  • whatsapp
  • telegram

ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

* డిజిటల్‌ టెక్నాలజీ వివరాలు

ఇప్పుడు టెక్నాలజీ తాకని రంగం అంటూ ఏదైనా ఉందా? లేదు! అన్నిటా అంతటా తానై దినదినాభివృద్ధి చెందుతోంది. వివిధ రంగాల్లో సమూల మార్పులకు కారణమవుతోంది. ఇదేవిధంగా విద్యారంగంలోనూ అభివృద్ధికి దోహదం చేసే మార్పులు, విధానాలకు ఇది నాంది పలుకుతోంది. అందుకే ప్రస్తుతం టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌ (టీఈఎల్‌) ఒక ముఖ్యమైన విద్యావిధానంగా రూపుదిద్దుకుంటోంది. అసలు ఇది ఏంటో, ఎందుకు ముఖ్యమైనదో, విద్యార్థులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఈ  క్రమంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో మనమూ చూద్దామా!


ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ దాదాపు అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తోంది, ఇందులో విద్యారంగం ముఖ్యమైనది. నిరంతరం మార్పులు జరుగుతుండే సమాజంలో, పరిజ్ఞానం వేగంగా పరిణతి చెందుతున్న తరుణంలో టెక్నాలజీ అవసరం అవుతోంది. ఒక విద్యార్థి నేర్చుకునే విధానాన్ని మెరుగు చేసే ఏ టెక్‌ విధానాన్ని అయినా సరే టీఈఎల్‌గా అభివర్ణిస్తున్నారు. ఇందులో అనలాగ్, డిజిటల్‌ విధానాలు ఉంటున్నాయి. అయితే విద్యారంగాన్ని అధికంగా డిజిటల్‌ టెక్నాలజీ ప్రభావితం చేస్తున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. 

విద్యార్థులు మరింత సమర్థంగా నేర్చుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించడమే టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌. రోజురోజూకు మెరుగవుతున్న ఏఐ ఆధునికతతో విద్యార్థుల  చదువు తీరులో ప్రస్తుతం అనేక మార్పులు వచ్చాయి. ఇవి మెరుగైన విద్యాబోధనకు దోహదం చేస్తాయి. ఈ మధ్య అధికంగా వినియోగంలోకి వచ్చిన ఎడ్యుకేషన్‌ యాప్స్‌ను కూడా దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. 

కరోనా మహమ్మారి వచ్చిపోయిన తర్వాత జరిగిన చాలా మార్పుల్లో ఈ-లెర్నింగ్‌ ప్రధానమైనది. దీని ద్వారా విద్య మరింత ఎక్కువమందికి చేరువ కావడమే కాకుండా వారికి విభిన్నమైన అవకాశాలను అందిస్తోంది.


ఎందుకీ ప్రాముఖ్యం?

కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌ల రాకతో విద్యార్థులు పాఠాలు నేర్చుకునే తీరు మారిపోయింది. వీటి సాయంతో విద్యార్థులు మరిన్ని కొత్త నైపుణ్యాలను సులభంగా నేర్చుకోవచ్చు. ఇంకా.. 

  విద్యార్థులు సంప్రదాయ పద్ధతిని దాటి నేర్చుకునే అవకాశం ఉంటుంది. రిమోట్, హైబ్రిడ్‌ లెర్నింగ్‌కు ప్రాధాన్యం పెరగడం కూడా ఒక కారణం.  

  విద్యార్థులు వారి స్థాయికి తగిన విధంగా నేర్చుకోవచ్చు. అందరితోపాటు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. బట్టీ పట్టకుండా అర్థమయ్యేలా చదువుకోవచ్చు. 

  ఏ విద్యార్థి అయినా, ఎక్కడి నుంచైనా నేర్చుకునేందుకు  వీలుంటుంది.

  సబ్జెక్టులోని థియరిటికల్, ప్రాక్టికల్‌ విషయాలను,   ఫార్ములాలను సులువుగా గ్రహించవచ్చు. 

  విద్యా సంబంధిత మెటీరియల్‌ వేగంగా, సులభంగా ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. అధిక స్థాయిలో వనరులు అందుబాటులో ఉంటాయి.

  డిజిటల్‌ బుక్స్, ఇతర కంటెంట్‌ను వినియోగించుకోవచ్చు. కేవలం సంప్రదాయ పాఠ్యపుస్తకాలపైనే ఆధారపడాల్సిన అవసరం ఉండదు. 

  విద్యాసంస్థలు ఏవి ఎక్కడ ఉన్నా వాటి మధ్య నాలెడ్జ్‌ షేరింగ్, సంబంధాలు ఉంటాయి. 

  సమాచారం, గణాంకాలు ఎప్పటికప్పుడు తాజాగా ఉంచవచ్చు. పాత డేటాను ఎప్పుడోగానీ మార్చేందుకు వీల్లేకుండా ఉండదు.

  మిగతా ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలుసుకునే వీలు కలుగుతుంది.

  అన్నింటికంటే మించి ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీపై అవగాహన అందరికీ తప్పనిసరి అయిపోయింది. ఇటువంటి సమయంలో విద్యాభ్యాసం సమయం నుంచే కనీస స్థాయిలో ఉపయోగించడం నేర్చుకోవడం మంచిది అనే భావనలో విద్యార్థులు ఉంటున్నారు.ఉదాహరణలు పరిశీలిస్తే..

ఈ-బుక్స్‌: డిజిటల్‌ బుక్స్‌ సాధారణ పుస్తకాలతో ఉండే ఇబ్బందులను అధిగమించేలా చేస్తాయి. ఎంత కంటెంట్‌ అయినా చోటు ఉండటంతోపాటు దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్‌డేట్‌ చేసుకునే వీలు ఉంటుంది.  


స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్స్, ట్యాబ్లెట్స్‌: ఒకప్పుడు కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లకు తరగతి గదిలో ప్రవేశం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఇంటరాక్టివ్‌ లెర్నింగ్‌కు ఇవి ప్రధానమైన సాధనాలుగా మారిపోయాయి.


ఆన్‌లైన్‌ కోర్సులు: సంప్రదాయ డిగ్రీల్లో నేర్చుకోలేని అంశాలను ఆన్‌లైన్‌ కోర్సుల ద్వారా అభ్యసించే అవకాశం ఉంది. ఇవి అధిక శాతం ఉచితంగా లభించడంతోపాటు వీటిలోని కంటెంట్‌ను విస్తృతంగా ఉపయోగించుకునే వీలుంటుంది. 


ఇంటరాక్టివ్‌ గ్రూప్స్‌: చాలా విద్యాసంస్థల్లో ఇంటరాక్టివ్‌ గ్రూప్స్‌ ఉంటున్నాయి. ఇవి విద్యాసంస్థతో ఎక్కడ నుంచైనా కాంటాక్ట్‌లో ఉండేందుకు దోహదపడతాయి. ఇలా ఉండటం వల్ల విద్యార్థులు డిజిటల్‌గా విస్తృతంగా నేర్చుకోగలరు.ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెక్నాలజీ టూల్స్‌లో ఏం ఉన్నాయనేది చూస్తే..

ఇన్ఫర్మేషన్‌ ఎక్స్చేంజ్‌ ప్లాట్‌ఫామ్స్‌ 

స్టూడెంట్, టీచర్‌ కొలాబరేషన్‌ కోసం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ 

‣ డిజిటల్‌ నోట్‌బుక్స్‌ 

ఇంటరాక్టివ్‌ డిజిటల్‌ వైట్‌బోర్డ్స్‌ 

వీడియో కాన్ఫరెన్సుల ద్వారా తరగతులు 

‣ ఆడియో, పాడ్‌కాస్ట్‌ 

క్వశ్చనేర్స్‌..  ప్రధానంగా ఉంటున్నాయి. 


అప్రమత్తంగా...: అయితే టెక్నాలజీ ఎంత మేలు చేస్తున్నప్పటికీ దీనితో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. ప్రతివిషయానికీ అంతర్జాలం, పరికరాల మీద ఆధారపడటం వల్ల ఇవి విద్యార్థుల సమస్యా పరిష్కార నైపుణ్యాలను దెబ్బతీయగలవు. అలాగే ఒంటరితనానికి గురికావడం, అధిక ధరలను చెల్లించి గ్యాడ్జెట్లను కొనుగోలు చేయలేక ఒత్తిడికి లోనుకావడం, మాటిమాటికీ ఫోకస్‌ కోల్పోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వీటి బారిన పడకుండా జాగ్రత్తలు వహిస్తూ చదువుకుంటే.. ‘టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌’ చక్కని ఫలితాలను ఇవ్వగలదు!


విద్యార్థులకు..

ఆసక్తితో నేర్చుకోవడం ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంది. స్టూడెంట్‌ ఎంగేజ్‌మెంట్‌ విద్యార్థుల ప్రదర్శనను మెరుగు చేస్తుంది. వారి డీమోటివేషన్‌కు ఇది విరుగుడు వంటిది. టీఈఎల్‌తో ఈ ఎంగేజ్‌మెంట్‌ను మరింత పెంచవచ్చు. మొదట్లో గ్యాడ్జెట్స్‌ను విద్యార్థులు నేర్చుకునే ప్రక్రియకు అవరోధంగా భావించేవారు. అయితే ప్రస్తుతం ఆ తీరు మారింది. అయినప్పటికే విచక్షణతో కూడిన వినియోగం మాత్రమే విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఉపయోగపడుతుందనే విషయాన్ని గమనించాలి.  

చాలావరకూ తరగతి గదులు, ఉద్యోగాలు పూర్తిస్థాయిలో టెక్‌ సంబంధితమైనవిగా మారిపోయాయి. కొత్త టెక్నిక్స్‌ను నేర్చుకోవడంలోనూ స్టడీ ప్లాన్స్‌ను విజయవంతంగా అమలు చేయడంలోనూ విద్యార్థులు మెరుగైన ప్రదర్శన కనపరిచేలా చేయడంలోనూ టెక్నాలజీ టూల్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.


మరింత సమాచారం... మీ కోసం!

‣ కోస్టుగార్డులో 260 నావిక్‌ ఉద్యోగాలు

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Posted Date: 13-02-2024


 

నైపుణ్యాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం