• facebook
  • whatsapp
  • telegram

ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

జాబ్‌ స్కిల్స్‌ 2024 వివరాలు



ఐటీ, కార్పొరేట్‌ సంస్థల్లో ప్రవేశానికీ, ఎదుగుదలకూ దోహదపడే నైపుణ్యాల్లో డొమైన్‌ పరిజ్ఞానం ఒక్కటి మాత్రం గ్రాడ్యుయేషన్‌లో విద్యార్థులు నేర్చుకుంటారు. మిగతావన్నీ సాధన చేసి అలవర్చుకునేవే. సబ్జెక్టు బలంతో పాటు ఈ నైపుణ్యాలు వెంట ఉంటే తిరుగులేని బలగం మీ తోడు ఉన్నట్టే! 


‘ఐటీ నియామకాల్లో స్తబ్ధత ఆవరించింది. ఆఫర్‌ లెటర్‌ పంపిన ఉద్యోగాలు ఆవిరి అవుతున్నాయి.. ఆర్థిక మాంద్య భయాలతో కంపెనీలు ముందే మేల్కొంటున్నాయి. కొత్త నియామకాల విషయంలో తత్తరబాటుతో వ్యవహరిస్తున్నాయి.. ప్రతి పదిమంది ఐటీ గ్రాడ్యుయేట్లలోనూ ఒకరినే కొలువు వరిస్తోంది..’ 


ఇలాంటి వార్తలూ, ప్రకటనలూ, పరిశ్రమ ప్రముఖుల వ్యాఖ్యలూ విన్నప్పుడు సహజంగానే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుంటున్న విద్యార్థుల్లో కలవరం కనిపిస్తోంది. కానీ కొన్ని నైపుణ్యాలు కైవసం చేసుకున్నవారిని కంపెనీలు ఎప్పుడూ కాదనలేవు. ఎంత గడ్డు పరిస్థితిలోనయినా అత్యుత్తమ అభ్యర్థి తారసపడితే కంపెనీలు అన్ని షరతులనూ తోసిరాజని లోపలికి తోవచూపుతాయి.


ఆఫర్‌ లెటర్‌తోనే ఆనందపడే రోజులు పోయాయి. ఐటీ, కార్పొరేట్‌ రంగంలో ఆఫర్‌ లెటర్‌ అంతిమంగా అపాయింట్‌మెంట్‌ ఆర్డరుగా మెయిల్‌ అందుకోవడానికి ఉద్యోగార్థి నుంచి మెరుగుపరుచుకోవాల్సిన నైపుణ్యాలుంటున్నాయి. ఈ చొరవ కొరవడిందో అంతే.. కంపెనీలు మొహం చాటేస్తున్నాయి. విద్యార్థి గ్రాడ్యుయేషన్‌ చేసిన సబ్జెక్టులపై పట్టు, ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణ, బృందంలో ఇమిడిపోయే మనస్తత్వం, నాయకత్వ లక్షణాలు, కస్టమర్‌ సర్వీస్‌ వంటివి అలవర్చుకోవడంతో పాటు దృష్టి పెట్టాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయి. సాంకేతిక నైపుణ్యాలను అభ్యర్థి సొంత డొమైన్‌ (సబ్జెక్ట్టు)లో పరిశీలిస్తున్నందున ఇవన్నీ సాంకేతికేతర నైపుణ్యాలే.


సమస్యా పరిష్కారం 

మార్కెట్‌లో ఒక అవకాశాన్ని తీర్చే ఉత్పత్తి /సేవ తీసుకువచ్చే కంపెనీలు రాణిస్తాయి. మొబైల్‌లోనే వినియోగదారుడు షాపింగ్‌ చేసే అవకాశం కల్పించి ఆర్డర్‌ చేయగానే ఇంటికే వస్తువులను తీసుకొచ్చి ఈ-కామర్స్‌ విప్లవాన్ని సృష్టించిన అమెజాన్‌

ఇండియా ఆదాయం ఏటా భారీగా పెరుగుతూనే ఉంది. అలాగే ఒక సమస్యకు పరిష్కారం కనుగొనడం ద్వారానూ కంపెనీలు విరాజిల్లుతాయి. 1980-90లలో స్విట్జర్లాండ్‌ నుంచి ఎరువు తెచ్చుకున్న టెక్నాలజీలో బరువైన క్వార్జ్‌ వాచీల స్థానంలో స్వల్ప పరిమాణం, తేలికగా స్లిమ్‌గా ఉండే వాచీ తయారీ అనేది పెద్ద సవాలు. దీన్ని అధిగమించి ఈ తరహా వాచీలను తీసుకువచ్చిన టైటాన్‌ ఎంత గొప్ప బ్రాండ్‌గా అలరారుతున్నదో తెలిసిందే. 

అందుకే కంపెనీలకు కావలసింది- సవాలును స్వీకరించగలవారు, మేధా మథనం చేసి తగిన పరిష్కారాలు కనుగొనగలిగేవారు, సమస్యా పరిష్కార ఆలోచనా దృక్పథం ఉన్నవారు. వీరినే కంపెనీలు అక్కున చేర్చుకుంటాయి.


నిర్ణాయక సామర్థ్యం 

అభ్యర్థిలో నిర్ణయం తీసుకునే శక్తి కూడా కంపెనీలకు అవసరం. ఫ్రెషర్‌గా ప్రవేశించి టీమ్‌లో ఒకరుగా పనిచేయాల్సి వచ్చినప్పుడు, ప్రతి అడుగులోనూ ఎవరూ చేయి పట్టి నడిపించరు. ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరిస్తూ స్వతంత్రంగా పనిచేయాల్సి ఉంటుంది. పనిరీత్యా ఎదురయ్యే సవాళ్లను కంపెనీ స్వరూపం, లక్ష్యాలు, తనకు అందించిన మార్గదర్శకాల మేర పరిష్కారాలు కనుగొనాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగార్థిలో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉందా? లేక మరెవరో నిర్ణయం తీసుకుంటే బాగుండుననుకుంటారా? తార్కికంగా ఆలోచించి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు జాప్యం జరగకుండా నిర్ణయం తీసుకోవడం, తీసుకున్న నిర్ణయ పర్యవసానాలకు బాధ్యత వహించే లక్షణం ఏ మేరకు ఉన్నాయో కంపెనీలు వివిధ రకాలుగా పరిశీలిస్తాయి. కేస్‌ స్టడీస్‌ ఇచ్చి పరిష్కరించమని కోరవచ్చు. ఊహాజనిత సమస్య ఇచ్చి ఛేదించాలనీ అడగవచ్చు. 


సృజనాత్మకత నైపుణ్యమే

కవులు, రచయితలకే కాదు- క్రియేటివిటీ ప్రతిచోటా ఉత్తమ ఫలితాలనిస్తుంది. పని వాతావరణంలో సృజనాత్మకతతో వ్యవహరించిన ఉద్యోగి ప్రొడక్టివ్‌గా నిలుస్తాడు. పని వాతావరణంలో మూసగా చేయడానికి కాలం చెల్లింది. ఇలా చేసే పనులను ఆటోమేషన్, ఏఐలు మింగేస్తున్నాయి. ఎక్కడైతే ఉద్యోగి నిజమైన ఆలోచనలు అవసరమో, ఎక్కడైతే ఉద్యోగి సృజనాత్మకత అవసరమో.. ఆ కొలువులు మాత్రమే భవిష్యత్తులో నిలబడతాయి. మిగతావి అదృశ్యమవుతాయని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేటాయించిన పనిని భిన్నంగా ఆలోచించి చేసే, ఎదురయ్యే సవాళ్లకు సృజనాత్మక పరిష్కారాలు చూడగలిగే ఉద్యోగి సేవలను కంపెనీలు విలువైనవిగా పరిగణిస్తాయి. అందుకే సృజనాత్మకత ఒక నైపుణ్యంగా, ఉద్యోగి జీవితంలో రాణింపజేసే సాధనంగా భాసిస్తోంది.


పదిమందిలో మాట్లాడగలగడం 

ఫ్రెషర్‌గా కంపెనీలోకి ప్రవేశించాక బృందంలో పనిచేసేందుకు కమ్యూనికేషన్‌ చాలా అవసరం. ముందు ముందు తన బృందంలోని వారితోనే కాక కంపెనీలోని అపరిచిత సీనియర్ల ముందూ మాట్లాడాల్సి రావచ్చు. ప్రస్తుతం కంఎనీల అంతర్గత సమావేశాలను వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు. వర్చువల్‌ వేదికలపైన లేదా సాధారణ సమావేశాల్లో సీనియర్లకు తను చేసిన పనిని వివరించడమో, ప్రెజెంటేషనో ఇవ్వవలసి రావచ్చు. ఇలాంటప్పుడు ఎదుటివారు ప్రసన్నులయ్యేలా క్లుప్త ప్రసంగాలు చేయడం నేర్చుకొని ఉండాలి. ఈ నైపుణ్యం గల ఉద్యోగులను కంపెనీలు గుర్తించి ముందుకు తీసుకువెళుతున్నాయి.


విమర్శనాత్మక ఆలోచన (క్రిటికల్‌ థింకింగ్‌) 

సమస్యా పరిష్కర్త కావాలంటే ఉద్యోగికి విమర్శనాత్మక ఆలోచనా దృక్పథం ఉండాలని నేటి కంపెనీలు భావిస్తున్నాయి. చదువుల్లో అసాధారణ తెలివితేటలతో మెరిసే గ్రేడ్లు లేకపోయినా భిన్నమైన ఆలోచనా సరళి గల అభ్యర్థిని గుర్తించి గౌరవిస్తాయి.

కేటాయించిన పని చేయడంలో కంపెనీలు నాణ్యతను ఆశిస్తాయి. నిర్దేశించిన సూచనలను అనుసరించి క్రమశిక్షణ గల ఉద్యోగి ఎవరైనా విధులు నిర్వహిస్తారు. కానీ ఇచ్చిన పనిపై కాస్త ఆలోచన చేసి అవసరమైన సందేహాలు లేవనెత్తి, నివృత్తి చేసుకొని, విశ్లేషించుకునేవారు వేరు. వీరు ఇలా చేయవలసిన పనిని అన్వయించుకొని, మదింపు వేసుకొని తుది నిర్ణయానికి వచ్చి సమర్థంగా పూర్తిచేయగలుగుతారు. వీరికోసమే కంపెనీలు అన్వేషిస్తుంటాయి.

ఈ విధమైన ఆలోచనా స్రవంతి గలవారిని విమర్శనాత్మక ఆలోచన గలవారిగా కంపెనీలు పరిగణిస్తున్నాయి. తమ ముందుకు వచ్చిన అభ్యర్థిలో క్రిటికల్‌ థింకింగ్‌ ఉందో లేదో పరిశీలించేందుకు కొన్ని కోణాల్లో ప్రశ్నలు అడుగుతాయి. అడిగే విషయాన్ని సావధానంగా చివరివరకూ వినడం, విన్నదానిపై సందేహ నివృత్తికి ప్రశ్నలు వేయడం, విశ్లేషణాత్మకంగా స్పందించడం, కాలేజీ ల్యాబ్స్‌లో, పాఠ్యపుస్తకంలో నేర్చుకున్నదాన్ని నిజజీవితంలో అన్వయిస్తూ చూడటం వంటి లక్షణాలు ఏ అభ్యర్థిలో కన్పించినా వారిని నియమించుకునేందుకు మంచి ప్యాకేజీతో ముందుకు వస్తాయి.


ప్రణాళిక, వృత్తిపర వైఖరి  

నేటి ఐటీ, కార్పొరేట్‌ కంపెనీలు మరో రెండు లక్షణాలను కోరుకుంటున్నాయి. ఉద్యోగంలో రాణించేందుకు ప్రణాళిక, ప్రొఫెషనల్‌ వ్యవహార సరళి అవసరమని సూచిస్తున్నాయి. చాలామంది ఫ్రెషర్లు నేరుగా కళాశాల ప్రాంగణం నుంచి కంపెనీల్లోకి వస్తున్నందున వారిలో కొంతమందిలో ఈ సమస్యను గుర్తిస్తున్నాయి. చిన్న వయసులోనే ఉద్యోగం సాధించడంతో రోజువారీ పనిలో నిర్లక్ష్య వైఖరి, ఉదాసీనత వంటి దుర్లక్షణాలను కంపెనీల హెచ్‌ఆర్‌ బాధ్యులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు.

బృందంలో భాగంగా పనిచేసేటప్పుడు సమష్టి ప్రణాళికను అనుసరించడం, కార్యాలయానికి సకాలంలో హాజరుకావడం దగ్గర నుంచి బృందంలో వర్చువల్‌/ సాధారణ సమావేశాల్లో పాల్గొనడం వరకు వృత్తిపరమైన వ్యవహార శైలిని అలవర్చుకోవాలి.

కాలేజీలో వాతావరణం వేరు, కంపెనీల్లో పని సంస్కృతి వేరు. కొన్ని ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించిన వ్యవధిలో సాధించేందుకు కంపెనీలలో సమష్టిగా కృషి జరుగుతుంటుంది. ఈ స్ఫూర్తిని గుర్తించి ఫ్రెషర్లూ ప్రొఫెషనల్‌ పనితీరును  వంటబట్టించుకొని కలిసిపోతేనే కంపెనీల్లో మనుగడ ఉంటుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Posted Date: 14-02-2024


 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం