• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ బిజినెస్‌ కోర్సులో అడ్మిషన్లు

 ఇంటర్‌ అర్హతతో అవకాశం



 

ఆర్ట్స్, సైన్స్‌.. గ్రాడ్యుయేషన్‌ ఏ సబ్జెక్టుల్లో చదివినా సరే, పీజీలో విద్యార్థులు కొందరు ఎంబీఏ చేస్తుంటారు. కానీ వారికి డిగ్రీ చదివే సమయంలోనే బిజినెస్‌ గురించి నేర్చుకునే అవకాశం వస్తే? ఒకేసారి రెండు ఇన్‌స్టిట్యూట్ల నుంచి పట్టాలు పుచ్చుకుంటే? తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే వీలుంటుంది.

నిజానికి నేటి పరిస్థితుల్లో విద్యార్థులు ఏ డిగ్రీ చదివినా.. బిజినెస్‌ సంబంధిత అంశాలపై అవగాహన ఉండటం వారికి కెరియర్‌లో సహకరిస్తుంది. అందులోనూ దేశంలో పేరున్న విద్యాసంస్థల ద్వారా చేయడం మరింత ఉపకరిస్తుంది. ఇటువంటి అవకాశమే ఐఐఎం బెంగళూరు కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఎక్కడి నుంచైనా బీబీఏ డీఈబీ (డిజిటల్‌ బిజినెస్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌) కోర్సు చేసే వీలు కల్పిస్తోంది. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా..


ఐఐఎం బెంగళూరు దేశంలోనే పేరెన్నికగన్న సంస్థ. ఇది అందిస్తున్న బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇన్‌ డిజిటల్‌ బిజినెస్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ కోర్సు విద్యార్థులకు డిజిటల్‌ టెక్నాలజీ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ వంటి అంశాల గురించి నేర్పిస్తుంది. దీని కరిక్యులమ్‌ డిజిటల్‌ స్ట్రాటజీ, ఆంత్రప్రెన్యూరల్‌ ప్రాక్టీసెస్‌ మీద ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందుకోసం లైవ్‌ సెషన్లు, మెంటర్‌షిప్, ప్రాజెక్టుల వంటి వాటి ద్వారా ప్రాక్టికల్‌ అనుభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అన్ని రకాల నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులకు.. బిజినెస్, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లపై అవగాహన కలిగించేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుంది. తాము ప్రస్తుతం చదువుతున్న డిగ్రీని కొనసాగిస్తూనే, ఉన్న చోట నుంచే ఆన్‌లైన్‌లో దీన్ని చదివే వీలుంది. దీని ద్వారా విద్యార్థులకు సమయం ఆదా అవుతుంది. తమ కెరియర్‌ అవకాశాలను మెరుగుపరుచుకునేలా నెట్‌వర్కింగ్‌ చేసే వీలు దొరుకుతుంది. ఇది డిజిటల్, ఇన్‌-పర్సన్‌ ఇంటరాక్షన్స్‌ కలిగి ఉన్న కోర్సు.


ఈ కోర్సులో తాజా పరిస్థితులకు తగిన విధంగా కరిక్యులమ్‌ ఉండటమే కాకుండా.. మాడ్యులర్‌ సర్టిఫికేషన్స్‌ అవకాశం ఉంది. మొదటి ఏడాది పూర్తి చేస్తే సర్టిఫికేషన్, రెండో ఏడాది పూర్తి చేస్తే డిప్లొమా, మూడేళ్లు పూర్తి చేస్తే గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. పూర్తిగా ఆన్‌లైన్‌ కోర్సు కావడం వల్ల విద్యార్థులు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు నేర్పిస్తూనే ప్రాజెక్ట్‌ ఆధారిత అభ్యాసం ఉంటుంది. పరిశ్రమలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా విద్యార్థులకు మంచి ఎక్స్‌పోజర్‌ ఉంటుంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూనే కెరియర్‌కు కావాల్సిన నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. నిరంతరం నేర్చుకునే అవకాశం, నెట్‌వర్కింగ్‌ అవకాశాలు, ఇన్నోవేటివ్‌ ఆలోచనాధోరణిని అభివృద్ధి చేసుకోవడానికి వీలు కలుగుతుంది.  


మంచి అవకాశం: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులకు పట్టాతోపాటు నైపుణ్యం చాలా ముఖ్యం. ఏ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పట్టా అందుకున్నాం అనేది కూడా ముఖ్యం. అందుకే విద్యార్థులంతా ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీల వైపు చూస్తున్నారు. కానీ అందరికీ అక్కడ సీట్లు దొరకవు కదా! ఫీజు కూడా అధికంగా ఉంటుంది. ఇటువంటి వారికి ప్రస్తుతం ఐఐఎంబీ అందిస్తున్నది చాలా మంచి అవకాశం. ఉద్యోగాలకు ప్రయత్నం చేసేటప్పుడు బయోడేటాలో ఐఐఎంబీ పేరు ఉండటం అదనంగా మేలు చేకూరుస్తుంది. విద్యార్థులు రెండు డిగ్రీలు ఒకేసారి చదివేందుకు యూజీసీ వీలు కల్పించడం వల్ల రెగ్యులర్‌ కోర్సులు చేస్తున్నవారు ఆన్‌లైన్‌లో దీనిలో చేరవచ్చు. ప్రస్తుతం డిజిటల్‌ బిజినెస్‌ కోర్సులకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. దీనివల్ల ఎంప్లాయిబిలిటీ పెరుగుతుంది. ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు, ఇది దేశంలోనే రెండో స్థానంలో ఉన్న ఐఐఎం. దీని కోర్సు వల్ల విద్యార్థులకు వ్యాపార రంగంపై అవగాహన పెరుగుతుంది. భవిష్యత్తులో ఎంబీఏ చేసే ఆలోచనలు ఉంటే అది మరింత సులభం అవుతుంది. అలాగే కొందరు బీటెక్‌ చేశాక ఎంబీఏలో చేరుతూ ఉంటారు. ఇలాంటి వారికి బీటెక్‌తోపాటు బీబీఏ చేయడం అనేది మంచి కాంబినేషన్‌. ఇటీవల్‌ ఐఐటీ మద్రాస్‌లో ఇలాగే డేటాసైన్స్‌ కోర్సు అందిస్తే 20 వేల మంది విద్యార్థులు చేరారు. 

బీబీఏ చేయడం వల్ల ప్రస్తుతం చదువుతున్న డిగ్రీకి కూడా అదనపు సబ్జెక్టు తోడవుతూ, విషయావగాహన పెరుగుతుంది. స్పెషలైజేషన్లు బాగుంటాయి. బీకామ్‌ చదివేవారు బీబీఏ చేయడం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. భవిష్యత్తులో క్యాట్‌ రాయాలి అనుకునే విద్యార్థులకు సైతం ఇది ఉపకరిస్తుంది. స్టార్టప్స్‌ ఏర్పాటు చేయాలి అని ఆశించే వారికి ఇదో మేలిమి అవకాశం. విదేశాలకు వెళ్లినా కానీ.. ఐఐఎంబీ నుంచి బీబీఏ డిగ్రీ ఉందంటే వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి. అక్కడ కేవలం పుస్తక పరిజ్ఞానం కాకుండా పరిశ్రమలో అనుభవజ్ఞులైన నిపుణులు బోధిస్తూ ఉండటం వల్ల విద్యార్థులు నేర్చుకునే విషయాల్లో వైవిధ్యం ఉంటుంది. రికార్డు చేసుకున్న లెక్చర్లు ఎప్పుడైనా వినొచ్చు. ప్రొఫెసర్ల ద్వారా వచ్చే కాంటాక్టులు, అనుభవం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. అన్ని రకాల కోర్సులు చదివేవారికీ.. ఇదో చక్కని అవకాశం.      


   ఎందుకు?   

పరిశ్రమల భవిష్యత్తును మార్చడంలో, వాటిని అభివృద్ధి బాటలో నడిపించడంలో డిజిటల్‌ బిజినెస్, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ముఖ్యపాత్ర పోషిస్తాయి. విద్యార్థులకు వీటి ద్వారా మెరుగైన అవకాశాలు కల్పించవచ్చనే ఉద్దేశంతో ఐఐఎం బెంగళూరు వీటిని నేర్పించేలా కోర్సును రూపొందించింది. మూడేళ్ల ఈ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో వారు బిజినెస్‌ స్ట్రాటజీలు మెరుగుపరిచేందుకు ప్రయత్నించవచ్చు. తద్వారా ఏ రంగానికి వెళ్లినా సరే వ్యాపారం ఎలా సాగించాలనే అవగాహనతో పని   చేయవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 15, 2024

వెబ్‌సైట్‌: https://dbe.iimb.ac.in/

అర్హతలు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులైతే కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌ పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులు కనీసం 55 శాతం మార్కులు తెచ్చుకుని ఉండాలి. ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన వారికి సీటు లభిస్తుంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌ 

కెరియర్‌ కౌన్సెలర్‌


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

Posted Date: 13-06-2024


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌