• facebook
  • whatsapp
  • telegram

ప్రతిభకు వీలు.. భవితకు మేలు!

కెరియర్‌కూ పనికొచ్చే సోషల్‌ మీడియా 

ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విటర్‌.. చేర్చుకుంటూ పోతే సోషల్‌ మీడియా వేదికలెన్నో. ప్రతీదీ కొత్త హంగులతో యువతను ఆకర్షిస్తున్నవే. మామూలుగానే విద్యార్థిని వీటివైపు  వెళ్లకుండా చేయటం కష్టం. స్కూళ్లు, కళాశాలలకు తాత్కాలికంగా గొళ్లెం పడటంతో వీటిపైనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. ప్రస్తుతానికి కాలక్షేపం సరే.. వాటికే నిరంతరం అంకితమైపోతే? ఇదీ తల్లిదండ్రుల భయం. కానీ విద్యార్థులు శక్తిమంతమైన సోషల్‌ మీడియాపై తెలివిగా దృష్టి పెట్టగలిగితే ఆ వేదికను అర్థవంతంగా మల్చుకుని తల్లిదండ్రులకూ తగిన భరోసా ఇవ్వొచ్చు!

సోషల్‌ మీడియా ప్రారంభం నుంచే ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోయింది. ప్రపంచాన్నంతా ఒకచోట చేర్చింది. బాధ, సంతోషం, చిన్న విజయం, అపజయం, ఆలోచన.. విషయం ఏదైనా ఇక్కడ పంచుకోవడం సర్వసాధారణమైంది. వినోదం, కాలక్షేపంతోపాటు సమాచారం ఈ వేదికలపై ఒకేచోట లభిస్తోంది. దీంతో తెలియకుండానే సమయమంతా గడిచిపోతుంటుంది. మామూలుగానే తల్లిదండ్రులు సమయ వృథా భయంతోనే వీటి నుంచి దూరంగా ఉండమని సూచిస్తుంటారు. ఇక ప్రస్తుత పరిస్థితిలో సామాజిక మాధ్యమం తప్పనిసరి వ్యాపకంగానూ మారి వాడకమూ గతంతో పోలిస్తే మరింత పెరిగింది. వెచ్చించే సమయం ఇంకా పెరిగింది. ఒక సంస్థ నివేదిక ప్రకారం లాక్‌డౌన్‌ ప్రారంభంలోనే సామాజిక మాధ్యమాల ట్రాఫిక్‌ బాగా పెరిగింది. దీని ప్రకారం నెలరోజులకే కనీసం 27 నుంచి 35 శాతం పెరిగింది. ఒక్కొక్కరూ కేటాయించే సమయమూ సాధారణం కంటే భారీగా పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. చాటింగ్‌లు, పోస్టింగ్‌లకే పరిమితమైతే వృథా చేసినట్టు. కెరియర్‌కు సహకరించేలా ఉపయోగించుకుంటే? వినోదంతోపాటు భవిష్యత్తుకీ మార్గం వేసుకున్నట్లే! 

 

చదువుకునే సాధనం

కాలక్షేపానికే కాకుండా తరగతి గదులుగానూ సామాజిక మాధ్యమాలు ఉపయోగపడుతున్నాయి. వయసు, తరగతితో సంబంధం లేకుండా వీటిని ఉపయోగించుకోవచ్చు. ప్రముఖ కళాశాలలు ఫేస్‌బుక్‌లో బ్రాడ్‌కాస్ట్‌ అప్‌డేట్‌లు, అలర్ట్‌లను పోస్ట్‌ చేస్తుంటాయి. ఆసక్తి ఉన్న కళాశాలల పేజీలోకి వెళ్లి వాటిని ఫాలో అవడం ద్వారా ఈ సమాచారాన్ని పొందొచ్చు. వివిధ అసైన్‌మెంట్లూ, విద్యార్థులు చేసిన వాటినీ వాటిలో ఉంచుతుంటారు. వాటిని ఎవరైనా చూడొచ్చు. లైవ్‌ స్ట్రీమ్‌లు, లెక్చర్లు, డిస్కషన్లను నిర్వహిస్తుంటాయి. వాటిలో పాల్గొనవచ్చు. లేదా కనీసం తాజా ధోరణులపై అవగాహననైనా పెంచుకోవచ్చు. ఇన్‌స్టా లాంటివాటిల్లో ఫొటో డిస్కషన్లు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన అంశాలపై వ్యాసాలను రాసి బ్లాగులో ఉంచొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థలు వెబినార్లను నిర్వహిస్తుంటాయి. వాటికి సంబంధించిన సమాచారం, లింకులూ ట్విటర్‌లోనూ లభిస్తాయి. ఇవన్నీ ప్రముఖుల నుంచి సూచనలు, వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడంతోపాటు ఆలోచనలను పంచుకునే వీలునూ కల్పిస్తాయి.

 

ఎక్కడ ఏమవుతోంది?

స్కూలు స్థాయి నుంచే జీకే, వర్తమాన వ్యవహారాలకు ప్రాముఖ్యం పెరుగుతోంది. ఇక పోటీపరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంటర్వ్యూల్లో వీటి ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ వార్తాపత్రికలు, వెబ్‌సైట్లు, టీవీల్లో ఉంచే ప్రతివార్తా విద్యార్థులకు ఉపయోగపడాలనేం లేదు. చాలావరకూ వార్తా సంస్థలు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలను ఉంచుతున్నాయి. ముఖ్యమైన అంశాలను వాటిల్లో ఉంచుతున్నాయి. వాటిని నేరుగా ఫాలో అవొచ్చు. లేదా కొందరు ప్రముఖ కౌన్సెలర్లు, లెక్చరర్లు వీటికి సంబంధించిన అంశాలను క్లుప్తంగా, బాగా ప్రాధాన్యమున్నవాటిని వివరంగా అందిస్తున్నారు. కొత్త టెక్నాలజీలు, ఉద్యోగ వివరాలు, ఎడ్యుటైన్‌మెంట్‌ అంశాల సమాచారమూ ఇక్కడ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటోంది.

 

సృజనాత్మకతకు మార్గం

ఎన్నో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికీ, ప్రదర్శించడానికీ వీలయ్యేది విద్యార్థి దశలోనే. నేర్చుకోవడానికి  కళాశాల అవకాశం కల్పిస్తే.. సామాజిక మాధ్యమాలు వాటిని ప్రదర్శించడానికి వేదికలవుతాయి. ప్రతిభ నచ్చినపుడు, ఒకే రకమైన అభిరుచి, ఆసక్తులు ఉన్నవారు ఫాలోవర్ల రూపంలో వచ్చి చేరతారు. ప్రశంసలు, విమర్శలు అందుకోవచ్చు. అది ఏదైనా ప్రతిభను మరింత మెరుగుపరచుకోవడానికి తోడ్పడుతాయి. ఇక్కడ ప్రతిభ అనగానే అది హాబీ, కళలు, విద్యా సంబంధమైనవి.. ఫలానా అనే లేకుండా ఏదైనా అవొచ్చు. కెరియర్‌గా మలచుకునేవాటిని భిన్నంగా, సృజనాత్మకంగా ప్రదర్శించడానికి ప్రయత్నించాలి. అలాగని అన్నీ కెరియర్‌ అంశాలకే పరిమితమవ్వాలనేం లేదు. వివిధ అంశాలకూ ప్రాధాన్యమివొచ్చు. ఎందుకంటే సంస్థలు కేవలం చదువు, తెలివితేటలకు మాత్రమే ప్రాధాన్యమివ్వవు. ఇతర అంశాలకూ, నైపుణ్యాలకూ ప్రాధాన్యమిస్తాయి. విభిన్న అంశాల పరిచయం విద్యార్థిలోని మల్టీటాలెంట్లను చూపించే మార్గమే కదా!

 

నెట్‌వర్కింగ్‌

సామాజిక మాధ్యమాల్లో ఎవరి ఖాతా అయినా పరిశీలించండి. వందల్లో, వేలల్లో స్నేహితుల జాబితా కనిపిస్తుంటుంది. ఒకే స్కూలు, ఒకే ఊరు, ఒకే ఆసక్తులు ఉన్నవారు, చుట్టాలు.. ఇలా అందరికీ ఇందులో చోటు ఉంటుంది. నిజానికి ఎన్ని ఎక్కువ పరిచయాలు ఉంటే అంత నెట్‌వర్క్‌ ఉన్నట్లే. అయితే కేవలం యాడ్‌ చేసుకుని వదిలేస్తే ప్రయోజనం ఉండదు. ఎవరికి తెలుసు? మీ స్కూల్లో మీతో చదివినవారి దగ్గర మీకు ఉపయోగపడే మంచి ఉద్యోగానికో, స్టార్టప్‌కు సంబంధించో సమాచారం ఉండొచ్చు. సాధారణంగా ఎక్కువ ఉద్యోగాల భర్తీ కూడా ఈవిధంగానే జరుగుతుందని నిపుణులూ చెబుతున్నారు. కాబట్టి, వయసు, చదువుతోనే కాకుండా ఆసక్తి ఉన్న రంగం, సంస్థల నిపుణులనూ ఆ జాబితాలో చేర్చుకునే  ప్రయత్నం చేయండి. వారితో మాట కలపండి. నేరుగా కొలువును ఇప్పించేయకపోయినా ఉద్యోగానికి అవసరమైన సన్నద్ధత, నైపుణ్యాలు, తాజా ధోరణులు, ఆశించే అంశాలు.. ఇలా ఏ చిన్న సలహా అయినా కెరియర్‌కు ఉపయోగపడే సానుకూల విషయమే.

 

ఉద్యోగావకాశాలు

ఉద్యోగం.. చదువు పూర్తయ్యాక దృష్టిపెట్టాల్సిన అంశమనే ఇప్పటికీ చాలామంది భావిస్తుంటారు. నిజమే.. ఏ కొద్దిమందో మినహా చాలామంది చదువు పూర్తయ్యాకే ఉద్యోగ దిశగా వెళతారు. ఇక్కడ చదువు పూర్తయ్యాక ఆ దిశగా వెళ్లడం అంటే పూర్తిగా దాని గురించి వదిలేయమని ఉద్దేశం కాదు. రంగానికి సంబంధించిన సమాచారం, ఉద్యోగ నియామకాల విషయంలో వస్తున్న మార్పులు వగైరా అంశాల గురించీ తెలుసుకుంటుండాలి. తీరా బరిలోకి దిగాక సన్నద్ధమవుదామన్న ధోరణి ఎప్పుడూ మంచిది కాదు. ముందు నుంచీ తెలుసుకుంటూ ఆ ప్రకారం తమను తాము మలచుకుంటూ వెళ్లడం అకస్మాత్తుగా ఎదురయ్యే కొత్త మార్పులను ఎదుర్కోవడానికీ తోడ్పడుతుంది. లింక్‌డిన్‌.. విద్యార్థికి ఈ విషయంగా చాలా సాయపడుతుంది. ఇక్కడ చాలామంది వృత్తి నిపుణులు అందుబాటులో ఉంటారు. విద్యార్థి తన సమాచారాన్ని అందులో ఉంచొచ్చు. వృత్తిపరమైన సలహాలు, సూచనలతోపాటు ఉద్యోగ భర్తీ విషయాల గురించీ తెలుసుకోవచ్చు.
చాలాసంస్థలు ఫేస్‌బుక్, ట్విటర్‌ల్లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని ఉంచుతున్నాయి. ఆసక్తి ఉన్న సంస్థలను అనుసరించడం ద్వారా వాటి సమాచారాన్ని పొందొచ్చు. ఆయా సంస్థల, సంబంధిత రంగాల తాజా ధోరణులను అర్థం చేసుకోవడానికీ ఇవి సాయపడతాయి.

 

వీటి విషయంలో జాగ్రత్త!

సోషల్‌ మీడియా ఎంత సానుకూలంగా ఉపయోగపడుతుందో.. ఒక్కోసారి వేసే తప్పటడుగు/ చేసే తప్పు అంత ప్రతికూలంగానూ మారుతుంది. విద్యార్థిలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ ప్రవర్తన పరంగా చేసే తప్పులు చేతి వరకూ వచ్చిన ఉద్యోగాన్ని చేజారేలా చేసే ప్రమాదముంది. కాబట్టి, పొరబాట్లు జరగకుండా చూసుకోవడం తప్పనిసరి.

స్నేహితులు, కుటుంబ సభ్యులు.. ఎవరైనా సరే పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోకూడదు. వేరే వారు మీ సోషల్‌ మీడియా ఖాతాను ఉపయోగించే అవకాశం ఇవ్వొద్దు.

షేర్‌ చేసే ఫొటోల విషయంలో జాగ్రత్త వహించాలి. ఉదాహరణకు- స్నేహితుడి పుట్టిన రోజుకు సంబంధించిన ఫొటోలు పెట్టొచ్చు. కానీ దానిలో ఆల్కహాల్‌కు సంబంధించినవి (చట్టబద్ధమైన వయసు ఉన్నప్పటికీ) ఉంటే పెట్టకపోవడం మంచిది. ఇది మీ పట్ల వ్యతిరేక అభిప్రాయాన్ని ఏర్పరచవచ్చు.
సోషల్‌ మీడియా అన్నాక భిన్నాభిప్రాయాలు ఏర్పడటం సాధారణం. ఒక్కోసారి ఇవి శ్రుతిమించుతుంటాయి కూడా. అది మీ ప్రవర్తనను నిర్ణయిస్తాయి. కాబట్టి, రాసే భాష విషయంలో జాగ్రత్త తప్పనిసరి. వ్యతిరేకతను తెలియజేయవచ్చు. దానినీ హుందాగా చెప్పగలగాలి. ఎదుటివారు ప్రేరేపించినా సంయమనం పాటించగలగాలి.

ఒకరిని కించపరిచేలా, దూషించేలా పోస్టులు, ఫొటోలను పెట్టొద్దు. అలాంటివాటిని షేర్‌ చేయడం, రీ ట్వీట్‌ చేయడం లాంటివి చేయొద్దు.

భాష విషయంలో జాగ్రత్త. రాసిన విషయంలో అన్వయ, వ్యాకరణ దోషాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

ఉపాధ్యాయుల గురించి వ్యంగ్య కామెంట్లు, తప్పులు చేసి తప్పించుకున్న వాటి గురించీ సోషల్‌మీడియాలో యథేచ్ఛగా పంచుకోడమూ చూస్తుంటాం. సరదాగా అనిపించొచ్చు కానీ, ఇలాంటివి కెరియర్‌ పరంగా నెగెటివ్‌ ప్రభావానికి కారణమవుతాయి.

Posted Date: 24-09-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌